బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–టైంపాస్..


   ఇదివరకు ఏమిటిలెండి, ఇప్పటికీ ఓ అలవాటుంది. ఎవరైనా gift pack చేసి ఏదైనా ఇస్తే, పై ఛంకీ wrapper జాగ్రత్తగా చింపి, మడత పెట్టి ఎక్కడో పేపర్ల కింద పెట్టడం. ఎంతో సిల్లీ గా అనిపిస్తుంది. అక్కడకి భవిష్యత్తులో మనం ఏదైనా గిఫ్ట్ ఇవ్వవలసి వచ్చినప్పుడు, దీనిని ఉపయోగించొచ్చని! మనకి wrap చేయడం ఛస్తే రాదు. మనం పెట్టిన మడతల ధర్మమా అని, ఆ ఛంకీ కాగితం, ముడతలు పడిపోతుంది. పోనీ దాన్ని ఏదో విధంగా సాపు చేసి,ప్యాక్ చేసిన తరువాత, సెల్లో టేప్ అంటించడం అంత కష్టమైన పని ఇంకోటుండదు! దాని చివరి భాగం ఎక్కడుందో బ్రహ్మకైనా తెలియదు. గోరు పెట్టి గిల్లుతూ,ఎలాగోలాగ, దాని కొస పట్టుకుని అంటించిన తరువాత,దాన్ని కట్ చేయడానికి మళ్ళీ ఓ కత్తెరోటి.కొట్టువాడైతే టక్కూ టక్కూ మంటూ కావలిసినంత కట్ చేసి, నీట్ గా అంటిస్తాడు.పోనీ అలాటిదేదైనా ఒకటి కొని ఇంట్లో పెడదామా అంటే, ప్రతీ రోజూ ఇంట్లో gift pack లు చేస్తామా ఏమిటీ? ఏదో నానా తిప్పలూ పడి చేశామా అంటే, ప్రతీ వాడూ అడిగేవాడే, ఇంట్లో చేసేసేరేమిటీ అని.దాని మొహం చూస్తేనే తెలుస్తుంది.ఇలాటివి ఎప్పుడు జరుగుతాయంటే, మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు వచ్చిన గిఫ్టులు, ఇంకోళ్ళకి అంటపెట్టాలనిపించినప్పుడు!ఏం చేస్తాం,ఇదివరకు రోజుల్లో పెళ్ళిళ్లకి ఓ అరడజను గడియారాలూ, ఓ అరడజను గణపతి బొమ్మలూ, మనవైపయితే సాయిబాబా బొమ్మలూ! ఎన్నని ఇంట్లో పెట్టుకుంటాము?

   ఇంకో వస్తువు స్టాప్లర్. దాని వాడకం తక్కువే. మా ఇంట్లో అయితే, ఎప్పుడైనా రిఫిల్ ప్యాక్కులు బ్రూ కానీ, పిల్లల బూస్టో, బోర్నవిటాయో కొన్నప్పుడు,కావలిసినంత సీసాలోకి తీసి, ఆ పెద్ద రీఫిల్ ప్యాక్కుకి స్టాప్లర్ తో సీల్ చేసేస్తే, గడ్డ కట్టకుండా ఉంటుందని. పూర్తి క్వాంటిటీ సీసాల్లోకి పొసేస్తే, అదేమిటో ఎప్పుడూ గడ్డ కట్టేస్తుంది. బహుశా, మనం వాడే చంచాల కి తడుండటం వల్లనేమో. ఏదైతేనెమి లెండి, ఈ స్టాప్లర్ ఉపయోగం అలాటప్పుడు ఎక్కువ.చెప్పొచ్చేదేమిటంటే, మనకి కావాలన్నప్పుడు, దాంట్లో పిన్నులుండవు! ఇంటినిండా ఆ పిన్నుల ప్యాకెట్లు కనిపించనప్పుడల్లా కొత్తది కొనేస్తూంటాము,వచ్చిన గొడవల్లా సమయానికి ఒక్క పాకెట్టూ కనిపించదు. ఏదో తిప్పలు పడి, కనిపించిందే అనుకోండి, ఆ పిన్నులు కాస్తా తుప్పు పట్టేసుంటాయి! ఈ కార్యక్రమం అంతా పూర్తిచేసి, ఎలాగోలాగ ఓ స్ట్రిప్ దోపుతాము.ప్రతీసారీ జరిగేదేమిటంటే, స్టాప్లర్ పనిచేస్తోందో లేదో చూడడానికి, దాన్ని నొక్కినప్పుడు invariable గా ఓ పిన్ను, మన చూపుడు వేల్లో టక్కున గుచ్చేసికుంటుంది!

   ఈ గాస్ స్టౌవులూ అవీ రానప్పుడు, ముఖ్యమైన వస్తువు అగ్గిపెట్టె.ఇంట్లో అందరికీ తెలిసే సిగరెట్లు కాల్చేవాడుంటే, తప్పకుండా అతని జేబులో ఓ అగ్గిపెట్టుండేది. అలా కాక ఏదో చాటుమాటుగా , ఏ కిళ్ళీ బడ్డీ వెనకాలో కాల్చేవాడైతే, ఆ కిళ్ళీకొట్టు ముందర ఓ డొక్కతాడు చివర అంటించుండేది. ఆ నిప్పుతో బీడీయో, సిగరెట్టో ముట్టించుకోడమే.ఇంక ఇంట్లో అయితే, ప్రతీ నెలా సామాన్లతో ఓ డజను అగ్గిపెట్లు కంపల్సరీ.అవేవో గుర్రం తలుండే WIMCO వి వచ్చేవి. తరువాత్తరువాత,గాస్ పొయ్యిలూ, వాటిని వెలిగించడానికి లైటర్లూ.ఒక్కొక్కప్పుడు ఎన్ని సార్లు నొక్కినా మాయదారి స్టౌవ్ వెలగదు. అదిగో అలాటప్పుడే ఈ అగ్గిపెట్టెలు రెస్క్యూకి వస్తూంటాయి. ఎక్కడున్నా లేకపోయినా, దేముడి మందిరం దగ్గర తప్పకుండా దొరుకుతుంది. పాతకాలం వాళ్ళు ఇంకా దేముడూ, దీపం అంటూ తాపత్రయ పడుతున్నారు కాబట్టి. ఈ రోజుల్లో బీ.పీ.ఓ ల ధర్మమా అని, ఆఫీసుకి టైమైపోతూందనండి, లేదా ఇంకో కారణం అనండి, దేముడికి దీపం కొద్దిగా రేషనయిపోతూంది.

   చిన్నప్పుడు ఇంకో అలవాటుండేది, సిగరెట్టు పాకెట్లలో ఉండే సిల్వర్ ఫాయిల్ ( ఊరికే పేరుకే సిల్వర్ అనేవారు, నిజమే అనుకునేవారం!) తీసి, పుస్తకాల్లో దాచుకోడం, వాటితో పాటు నెమలీకోటీ. ఎన్ని ఎక్కువగా దాస్తే అంత గొప్ప!ఇంక సిగరెట్టు పెట్టెలతో బొమ్మలు తయారుచేసేవారు, ఏనుగు, కుక్క పాప్యులర్ !ఇప్పుడంటే జిల్లెట్టు బ్లేడులూ, షేవర్లూ వచ్చాయి గానీ, ఇదివరకు పనామా, సెవెనోక్లాక్ బ్లేడులేగా. షేవింగు చేసికునేటప్పుడు, ఎక్కడో అక్కడ తెగడం ఖాయం. అలాటప్పుడు, రక్తం ఆగడానికి, కొత్త బ్లేడు చుట్టూరా ఉంటుందే, ఆ ఉల్లిపొర కాగితం ఓ చిన్న ముక్క చింపి, ఆ రక్తం కారే చోట అంటిస్తే, ఠక్కున ఆగిపోయేది!

   ఏమిటో ఈవేళ సాయంత్రం నుంచీ వర్షం ఇక్కడా. పనీ పాటూ లేక ఈ టపా.అలాగని నేనేదో సందేశాత్మక టపాలు వ్రాసేస్తున్నానని కాదూ,ఓసారి చెప్పేసికుంటే చేసిన పాపం పోతుందట ….

4 Responses

 1. ఈనాటికీ ముఖ్యమైన వస్తువు అగ్గిపెట్టే
  అగ్గిపెట్టె లేనిదే పూజెలా?
  పూజ కానిదే రోజెలా?

  Like

 2. >>>డొక్కతాడు….
  ఆహా….అసలు ఆ పదం విని ఎన్నా(న్నే)ళ్ళయ్యిందో! ఒక్కసారి నా చెవులకి సంగీతంలా వినపడిందంటే నమ్మండి!

  ఈ టపాతో నా చిన్నప్పటి విషయాలు చాలా గుర్తు చేశారు. నా చిన్నప్పుడు మా ఊళ్ళో ఒకాయన గోల్డ్ ఫ్లేక్ సిగరెట్లు కాల్చేవారు. అప్పట్లో మేము ఆడుకునే బెచ్చాల ఆటలో ఆ సిగరెట్ పెట్టె ముక్కలకి ఎక్కువ పాయింట్లు ఉండేవి. ఆయన రోడ్డు మీద కనబడగానే, ఆఖరి సిగరెట్ కాల్చేసి పెట్టె ఎప్పుడు పడేస్తారా అని ఎదురుచూస్తూ మా ముఠా అంతా ఆయన వెనకాలే తిరిగేవాళ్ళం :).

  భవదీయుడు
  వర్మ (అబ్బులు)

  Like

 3. Small little things, never available
  when thy are most needed.
  Overstocking, when available
  never can be used , when needed.
  Good POST from the expert
  in the material management.

  Like

 4. @రెహమాన్,

  నిజమే అగ్గిపెట్టె లేనిదే దీపంపెట్టడం కష్టమే.

  @అబ్బులూ,

  కోనసీమ లో పుట్టి పెరిగి, డొక్కతాడు ని మర్చిపోతే ఎలాగా?

  @మోహన్ గారూ,

  మీరు నన్ను మరీ “expert
  in the material management” అని ఎత్తేయకండి ! ఏదో గుర్తుకొచ్చినదేదో వ్రాస్తూంటాను. మీరందరూ ప్రోత్సహిస్తున్నారు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: