బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-दुनिया गोल है….


   1963 లో,అప్పటిదాకా, అమలాపురంలో చదువుకుని,చదువు అంటే మరీ పేద్ద అపోహ పడకండీ, ఏదో పొట్టపోసుకోవడానికి కావలిసిన ఓ డిగ్రీ లాటిది సంపాదించుకుని, అమ్మయ్యా ఓ గొడవొదిలిందిరా బాబూ అనుకుంటూ, ఛల్ మోహనరంగా అనుకుంటూ పూనా ఎగిరిపోయాను, తల్లితండ్రులిచ్చిన రెక్కలతో…అప్పటికింకా ఎంతా 18 ఏళ్ళు.మూతిమీద మీసమైనా పెరగలేదు.అమ్మచేత వారానికోసారి, తలంటు పోయించుకునే వయస్సూ,అంత దూరం వెళ్ళిపోతున్నానంటే,తల్లితండ్రులకి బెంగగా ఉండదూ మరి? నాన్నగారు రాజమండ్రీ లో రైలెక్కించేసి, కొవ్వూరు దాకా నాతో ప్రయాణం చేసి, అప్పటిదాకా ఎప్పుడూ చూడని ఆయన కళ్ళల్లో నీళ్ళూ,… మరి దగ్గర ఉన్నంతకాలం,అంతంత ఆప్యాయతా, అభిమానం చూపిస్తే ఏం పోయిందిట అని నా మనస్సులో ఓ flying thought..ఎప్పుడు చూసినా, క్రమశిక్షణా, చదువూ అంటూ పాఠాలే, అవన్నీ తప్పించుకోడానికే కదా, అసలు అంత దూరమైనా వెళ్ళిపోడానికి సిధ్ధపడిందీ! అవన్నీ ఆ రోజుల్లో చాలా మంది కొడుకులకి తమ తల్లితండ్రులమీద ఉండే అభిప్రాయం!

   అంత దూరంలో పాపం ఎలా నెగ్గుకొస్తాడో, నోట్లో వేలెడితే కొరకనైనా కొరకలేడూ,( అలాగని నాకు అప్పటినుండే పళ్ళు లేవనుకోకండి!)ప్రతీ తల్లీ తండ్రి కీ తమ పిల్లలమీదుండే అమూల్యాభిప్రాయం!ఒక విషయం అర్ధం అవదు, కూతురు అత్తవారింటికి వెళ్తూంటే అంతగా భయపడిపోరు, ఇంకో అయ్య చేతిలో పెడుతున్నామూ, తనే చూసుకుంటాడులెద్దూ అనే భావమా లేక, ఆడపిల్లలు మగపిల్లలకంటె తెలివైనవారూ, ఎలాటి పరిస్థితినైనా ఎదుర్కోగలరూ అనే నమ్మకమో, ఏమైతేనేం కొడుకు దూరం వెళ్ళేటప్పుడు, నానా విధాలైన అప్పగింతలూ,ఓ instruction list తప్పకుండా ఉండేవి. ఖాళీ కార్డు/ఇన్లాండ్ లెటర్ మీద ఎడ్రసు వ్రాసేసినవి ఇచ్చేవారు. వారానికి ఒకసారైనా క్షేమసమాచారాలతో ఓ ఉత్తరం వ్రాయరా నాయనా, మా ధ్యాసంతా నీమీదే బాబూ అంటూ. మరి ఆ రోజుల్లో ఈ టెలిఫోన్లూ అవీ ఉండేవి కావుగా.అన్ని అప్పగింతలు పెట్టినా సరే ఈ ప్రబుధ్ధుడు ఎప్పుడో గుర్తొచ్చినప్పుడే ఓ ఉత్తరం నాలుగు లైన్లు గీసేసి పడేయడం.ఆ తల్లితండ్రులు మాత్రం వారానికి ఓ రెండో మూడో ఉత్తరాలు, అక్కడ జరిగిన విశేషాలతో ఆవు ఈనిందనో, జున్ను చేసికొన్నామనో లాటి విశేషాలతో ఉత్తరాలూ. ఇక్కడ మన హీరో కొత్త బంగారులోకంలో జోరుగా హుషారుగా.. అంటూ పాటలూ.

   ఈ మైకం లోంచి ఎప్పుడు బయటపడతాడూ అంటే, తనుకూడా ఓ తండ్రి అయి, కూతురునో, కొడుకునో దూరప్రాంతాలకి పై చదువులకి పంపిన తరువాత. మా అమ్మాయి ఫరవా లేదు, పూణె లో ఇంజనీరింగు చదవడానికి వెళ్ళినా, మేము వరంగాం లో ఉంటున్నన్ని రోజులూ వారానికి కనీసం ఓ నాలుగో అయిదో ఉత్తరాలు వ్రాసేది.మాతో ఉన్నట్లే ఉండేది, జరిగిన ప్రతీ విషయమూ వ్రాసేది. ఇప్పటికీ ఆ ఉత్తరాలు దాచి ఉంచాను. తనకి పెళ్ళయి మొన్ననే పద్నాలుగేళ్ళు వెళ్ళాయి.ఇద్దరు పిల్లల తల్లి. ఇంక మా అబ్బాయంటారా, చిలక్కి చెప్పినట్లు చెప్పినా సరే, ఎప్పుడో డబ్బులవసరం వచ్చినప్పుడు తప్ప ఓ ఉత్తరం పత్రం ఉండేది కాదు. ఏమిట్రా వారానికో ఉత్తరం వ్రాయకూడదా అని వాళ్ళమ్మ అడిగితే, అస్తమానూ వ్రాయడానికి విశేషాలేమిటుంటాయీ అనేవాడు.ఆ తరువాత గుర్గాం వెళ్ళే సమయానికి, తనకి ఓ సెల్ ఫోను ఈయడం వలన, తను చేసినా చేయకపోయినా మేమే ఫోను చేసి క్షేమసమాచారాలు తెలిసికునే వాళ్లం. ఇంక మా కోడలు I I M A లో చదివినప్పుడు, వాళ్ళ అమ్మగారైతే అహ్మదాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకుని, ఆ రెండేళ్ళూ అక్కడే ఉన్నారు.

   ఈ గొడవంతా ఎందుకు రాస్తున్నానంటే, మా నవ్య ని, వాళ్ళ అమ్మమ్మగారి దగ్గర ఓ వారం గడపడానికి హైదరాబాద్ పంపారు. వీళ్లకి (అబ్బాయీ,కోడలు) అసలు తోచడం లేదూ, కూతురిమీద బెంగా, చెప్పుకోలేరూ, ఒప్పుకోడానికి సిగ్గూ, మొహమ్మాటం, నవ్య కి ఫోను చేస్తే తనకి మాట్లాడడానికే టైముండడం లేదూ. టైమా సింగినాదమా, ఫోను ఎత్తితే అలా ఉండూ, ఇలా ఉండూ, ఫలానా చెయ్యకూ ఫలానా చెయ్యీ.. ఇవే కదా. మనవరాలొచ్చింది కదా అని, అమ్మమ్మగారు ఓ వారం శలవు పెట్టి మరీ ఈవిడని నెత్తిమీద పెట్టుకుని చూసుకుంటున్నారు.మధ్యలో మళ్ళీ ఈ మమ్మీ డాడీ లేమిటీ అనుకుని ఫోను దగ్గరకే రావడం లేదు.
చివరకి ఈ బాధ భరించలేక,నిన్న సాయంత్రం సడెన్ గా అగస్థ్యని తీసికుని మేముండే ఇంటికి వచ్చేసి, భోజనం చేసి ఓ రెండు మూడు గంటలు గడిపి వెళ్ళారు. ఏమ్మా నవ్య మీద బెంగెట్టుకున్నారా ,ఇప్పుడు తెలుస్తోందా, పిల్లల గురించి తల్లితండ్రులకి ఎలా ఉంటుందో? అని అడిగితే ఒప్పుకోరే. వాళ్ళ మొహం చూస్తేనే తెలుస్తోంది.

   ఇలాటివి ప్రతీ కుటుంబం లోనూ ఉండేవే.అందుకే అన్నాను दुनिया गोल है…. అని! ‘ఈ జీవన తరంగాలలో…’ అనుకుంటూ ఘంటసాల గారి పాట పాడుకోడమే….

Advertisements

3 Responses

 1. ఈ టపాను అందంగా చెక్కారండి. చివర్లో మీరన్నట్టు మీ తర్వాత తరం వాడిని నాదీ అదే కథ. వయసు 23 యేళ్ళు. అన్నేళ్ళుండిన ఊరును వదిలి పూనాకు వెళుతున్న నేను. భాష కూడా రాదు, ఎలా నెగ్గుకొస్తాడో ఏమోనని రైల్వే స్టేషన్ లో నిస్సహాయంగా నిలబడ్డ నాన్న ముఖంలో భావం. ఇప్పుడు మూడేళ్ళ నా కూతురు నాకు దూరంగా ఉంటోంది. ఇదుగో ఇప్పుడే మా ఊరి నుండి ఫోను చేసి, నాన్నా ఇప్పుడే నడుచుకుంటూ ఊరొచ్చేసెయ్ అని అర్థింపు. दुनिया सच मॆ गोल ही है….

  Like

 2. మా అమ్మాయి కూడా వాళ్ల బామ్మ/అత్తల (పక్క పక్కనే ఇళ్ళు) వెళ్ళినప్పుడు నేను ఫోన్ చేస్తే అసలు దాన్ని వెదికి పట్టుకోడానికి నన్ను అరగంట లైన్లో ఉంచుతారు. పిల్లలతో కల్సి ఎక్కడో ఆడుతూ ఉంటుంది. అందుకని రాత్రి తొమ్మిదింటికి చేస్తాను. అసలు నా గొంతు వినపడగానే “నువ్వు వస్తున్నావా? రాకు, తాత గారు నన్ను డ్రాప్ చేస్తారులే” అంటుంది. సిబ్లింగ్స్ లేకపోతే ఇలాగే ఉంటుందేమో అని పశ్చాత్తాపం కల్గుతుంది ఇలాంటపుడే!

  నాకంటే వాళ్ళ నాన్న చాలా బెంగ పెట్టేసుకుని లోకలే అయినా రోజుకు పాతిక సార్లు ఫోన్ చేస్తుంటారు.

  Like

 3. @రవీ,

  ధన్యవాదాలు.

  @సుజాతా,

  పిల్లలు ఒక్కసారి బయటకు వెళ్తే చాలు,అమ్మా నాన్నా అసలు గుర్తుకే రారు !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: