బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– కారప్పొడి….


   ఈవేళ ప్రొద్దుటే, క్యాంటీన్ లో సరుకులు తెచ్చుకుందామని వెళ్తూ బస్ స్టాప్ కి చేరేలోపల, రోడ్డు క్రాస్ చేద్దామని వెయిట్ చేస్తూంటే,రెండు బైక్కులు ఒకళ్ళతో ఒకళ్ళు ఢీకొట్టుకుని, చెరో వైపుకీ పడ్డారు. ఒకడి కాలు విరిగింది, రెండో వాడు ఎత్తి పడేసినట్లు దూరంగా పడ్డాడు.నాకైతే కళ్ళు తిరిగిపోయాయి,మరీ అంత దగ్గరగా యాక్సిడెంటు చూశానేమో. అదృష్టంకొద్దీ ఆ సమయంలో, ప్రక్కనుండి, ఏ వాహనాలూ వెళ్ళడంలెదు. లేకపోతే, కిందపడ్డవాడు, నుజ్జునుజ్జైపోయేవాడు.ఒక బైక్కు వాడు రోడ్డుకి తిన్నగా వెళ్తున్నాడు, రెండో వాడు టర్న్ తీసికుని వచ్చాడు. ఇద్దరూ చాలా స్పీడు గానే వెళ్తున్నారు. చిత్రం ఏమిటంటే, తిన్నగా వెళ్తున్నవాడు, రెండో వాడిని చెంప దెబ్బ కొట్టడం.అసలు ఆ స్పీడెందుకూ అంట?అలాగని పెళ్ళివారి ఊరేగింపులా వెళ్ళమని కాదు, కొద్దిగా అటూ ఇటూ చూసుకుంటే, ఇలాటివి తప్పించుకోవచ్చేమో?

అయినా ఓ సైకిలైనా నడపడం రాని నాలాటివాడు జ్ఞానబోధలు చేస్తే వినేవాడెవడూ? ఒక్కరైనా విని బాగుపడతారేమో ఆశ!క్యాంటీనుకి వెళ్ళి, కొన్ని సరుకులు తీసికుని, మా ఇంటికి వెళ్ళి, అక్కడ పెట్టేసి, మేముండే ఫ్లాట్ కి ఆ ఎండలో 12.30 కి చేరాను.అప్పటికి, మా ఇంటావిడ పన్లన్నీ పూర్తిచేసికుని, గత పదిరోజులూ మిస్ అయిన టి.వి. కార్యక్రమాలు నెట్ లో చూసుకుంటోంది! ఎంత సంతోషమనిపించిందో, సీరియల్స్ చూస్తున్నందుకు కాదు, నెట్ లో వెతుక్కుని, వాటిని చూసి ఎంజాయ్ చేయడం! చెప్పానుగా ఇన్నాళ్ళూ డొమీనియన్ ప్రతిపత్తిలో ఉండి, ప్రతీ దానికీ నన్నడిగేది. ఇప్పుడో తనే నెట్ లో బ్రౌజ్ చేసేసికుని,కావలిసినవేవో చూసుకోవడం.ఎక్కడా ట్రైనింగవలేదు, ఇంటి బయటకు అడుగెట్టలేదు, అలాగని ఏవేవో పెద్ద పెద్ద డిగ్రిలు లేవు, చెప్పేదేమిటంటే, ఆసక్తీ, పట్టుదలా ఉంటే ఇలాటివన్నీ बाये हाथ का खॅल ! ఈ లక్షణాలన్నీ చూస్తూంటే కొద్దిగా భయం భయంగా ఉంది.ఇన్నాళ్ళూ, నేను చెప్పేవన్నీ నమ్మేది. అలాగా, అయ్యో అని ఎంతో బాధపడిపోతూ!

మనం కూడా అలాగే పెరిగిపెద్దయ్యామేమో?ఆరోజుల్లో ఇన్ని ప్రసారమాధ్యమాలూ, సమాచార సేకరణకి సదుపాయాలూ ఎక్కడుండేవీ? ఏదో పెద్దవాళ్ళు చెప్తే నిజమే కాబోసనుకుని, నమ్మేవాళ్ళం, అదే impression తో పెరిగి పెద్దయ్యాము. అందుకనేమో, చిన్నప్పటి అభిప్రాయాలు, అంత శులభంగా వదులుకోలేము. చిన్నప్పుడు మన తండ్రిగారు, కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానముండేదనుకోండి, మనం కూడా అదే వాతావరణం లో పెరగబట్టి, మనకూ ఆ పార్టీ అంటే అభిమానమూ,మన్నుంచి మన పిల్లలూ! ఊరికే ఉదాహరణకి కాంగ్రెస్ అన్నాను, అదికాకపోతే ఇంకో సింగినాదం. ఆరోజుల్లో చిన్నపిల్లల్ని పేకాటాడనిచ్చేవారు కాదు, కిళ్ళీ తిననిచ్చేవారుకాదు,సిగరెట్టూ బీడీ అయితే, ఏ పనిచేసేవారో, గుర్రబ్బండాడో కాల్చే వస్తువనుకునేవాళ్ళం! రొట్టెలు అంటే అదేనండీ బ్రెడ్డు, సాయిబులే తయారుచేస్తారనుకునేవాళ్ళం.అంతదాకా ఎందుకూ, జ్వరం వచ్చి లంఖణాలు చేసిన తరువాత,పెట్టే పథ్యం భోజనంలోనే కారప్పొడి వేసికోవాలనుకునేవాడిని.అలాగే బీరకాయ, పొట్లకాయ కూరలూనూ!

ఈ గొడవంతా ఎందుకు రాస్తున్నానంటే, మా ఇంటావిడ మొన్న తణుకు నుంచి వస్తూ, వాళ్ళింట్లో కరివేపాకు బాగా కాసేస్తోందని,వంటావిడ చేత ఓ సీసాడు కారప్పొడి చేయించి తెచ్చింది. అబ్బ ఎంత అద్భుతంగా తయారుచేశారండీ? ఈ మూడు రోజులనుండీ, రెండు పూటలా, దానితోనే లాగించేస్తున్నాను.ఒక్కసారి చిన్నప్పుడు తిన్న పథ్యం భోజనంలోకి వెళ్ళిపోయింది నా మనస్సంతా! మరీ ఇంత అన్ రొమాంటిక్కేమిటండి బాబూ,అని మా ఇంటావిడ అనుకున్నా సరే.మా అత్తగారికి కూడా ఫోనుకూడా చేసేసి, రొంబ థాంక్స్ అని చెప్పేశాను.అక్కడ జ్వరం, పథ్యం కాదు హైలైట్ చేయవలసినవి,చిన్నప్పటి మధుర జ్ఞాపకాలు.ఆరోజుల్లో జ్వరం లాటిది వస్తే ఎంత హడావిడి చేసేవారు తల్లితండ్రులు, స్కూలుకి వెళ్ళే బాధుండేది కాదు,ఎవరో ఒకరు పక్కనే ఉండేవారు, టెంపరేచరు తగ్గేదాకా ఓ తడిగుడ్డ నుదిటిమీద వేయడం, తల నొప్పొస్తే ఏ శొంఠికొమ్మో అరగదీసి పట్టేయడం,ఆరారగా ఏ బత్తాయిపండు రసమో త్రాగించడం, పక్కనుండే పిన్నిగారో, అత్తయ్య వరసావిడో వచ్చి ‘అయ్యోఅయ్యో బిడ్డ ఎలా తయారయ్యాడే..’ అంటూ మన మంచం పక్కనే కూర్చుని మాట్లాడుకోడం, మన జ్వరం తగ్గేదాకా, ఇంట్లో పిండివంటలమీద Unofficial ban పెట్టేయడం… అబ్బో అబ్బో ఎంత బావుండేదో.మొత్తానికి జ్వరం తగ్గగానే పథ్యం–Ultimate treat! వేడి వేడిగా అన్నం, దాంట్లొకి నెయ్యీ, కారప్పొడీ,చారూ,ఏ పొట్లకాయో,బీరకాయో కూరా, చివరగా అన్నంలోకి మజ్జిగ బదులు పాలూ! మనం పీకలదాకా తిని నిద్రపోకుండా కాపలా! ఏక్దం Royal treatment! రెణ్ణెల్లకోసారైనా జ్వరం వస్తే బావుండునూ అనిపించేది.మరి ఇలాటివి మధుర జ్ఞాపకాలు కావూ?
ప్రతీ నెలా వస్తే ఏదో రోగం అనుకుంటారు, ఏ హాస్పిటల్ లోనో పడేస్తారు, ఈ రొజుల్లోలాగ !!

Advertisements

7 Responses

 1. జరిగితే జ్వరమంత సుఖం లేదన్న మాట ఊరికే వచ్చిందా? 🙂 నిజమే, రోగం వచ్చిన వాళ్ళ మీద శ్రద్ధలు తగ్గుతూ వస్తున్నాయి.

  Like

 2. చేసే వాళ్ళుంటే రోగి ని మించిన భోగి లేరని అన్నారు మరి.
  మా అమ్మను అమ్మమ్మను గుర్తుకు తెచ్చారు.
  చాలా బాగుంది .

  Like

 3. జ్వరం అంటే బాగానే ఉండేది, కానీ రెండురోజులు శొంఠి కషాయం తాగాలంటే నే భయం వేసేది. మా నాన్నగారు ఎదురుగా కూర్చుని పూర్తిగా తాగేదాకా వదిలేవారు కాదు. రెండు రోజులకి తగ్గకపోతే మా ఊరు భీమవరం లో హోమియో డాక్టరు గారి దగ్గరకి వెళ్ళేవారం. అప్పుడు కానీ తగ్గేది కాదు జ్వరం. ఈ నాలుగురోజులు హాయిగా స్కూలు కి సెలవు. ఇంట్లో రాజభోగాలు. అన్నీ మళ్ళీ గుర్తుకు వచ్చాయి.
  మీ టపా గురించి చెప్పటానికేముంది. సూపరుగుంది .

  Like

 4. @శ్రీనివాస్

  థాంక్స్ !

  @మోహన్ గారూ,
  మీ అమ్మమ్మగారినీ, అమ్మగారినీ గుర్తుతెచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.

  @కొత్తపాళీ గారూ,

  మీలాటి పెద్ద రచయితలనుండి అటువంటి వ్యాఖ్య రావడం చాలా సంతోషమనిపించింది.

  @సుబ్రహ్మణ్యం గారూ,

  ధన్యవాదాలు.

  Like

 5. ఆ కరివేపాకు కారం అంటే నాకూ బాగా ఇష్టమండి. మొన్న జనవరి లో అమ్మమ్మ కి ఫోన్ చేసి, అన్నయ్య పార్సెల్ పంపిస్తున్నాడే కాస్త కారం పంపావా అని అడిగితే..నా చెయ్యి ఇంకా తగ్గలేదురా(మొన్నామధ్య చెయ్యి విరిగిందిలెండి) మీ అమ్మ కు చెప్పు అని…మొత్తానికి చేసి పంపించింది..అది రాగానే నోట్లో వేసుకొని..అష్టా చెమ్మ సినిమా లో భరణి గారిలా..అద్బుతహా..అనేసుకున్న..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: