బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-Value for money….


   ఈయనకెప్పుడూ పనేమీ లేదూ, తన స్వంత అభిప్రాయాల్ని ఇంకోళ్ళమీద రుద్దడానికి టపాలు వ్రాస్తూంటాడు అని అనుకుంటే నేనేమీ చేయలేను. అలాగని నా అభిప్రాయాలు చెప్పకుండానూ ఉండలేను,ఏం చేయను? ఇప్పటి తరం వారు
అనుకుంటారూ ఇదికూడా పేద్ద issue నా అని.ఇదివరకే ఒకసారి విన్నవించుకున్నాను, దురదృష్టవశాత్తూ, నాలాటి వాళ్ళు చాలా మంది లేరులెండి. అధవా ఉన్నా, ఇంకెంతకాలం?ఓ పది పదిహేనేళ్ళు గడిచాయంటే, అంతా ‘కొత్త నీరే’ !
అన్నీ తెలిసికూడా మరి వాటిగురించి వ్రాయడమెందుకూ అంటే చాదస్థం అనండి, లేకపోతే తిన్నది అరక్కపోవడం అనండి, మీ ఇష్టం!

ఈవేళ మా ఇంటికెదురుగా ఉండే, మెగామార్టు కి వెళ్ళాను.పోనీ అక్కడ, మా అగస్థ్యకీ, నవ్య కీ ఏమైనా డ్రెస్ తీసికుందామా అనుకుని, వాటి ఖరీదులు చూసి, మానేశాను.అదేదో, జేబులో డబ్బులు లేక కాదు, డబ్బులకేముందీ, క్రెడిట్ కార్డుల ధర్మమా అని, డబ్బులు ఈయడానికి 45 రోజులు టైమెలాగూ ఉంటుంది.ఒక్కొక్కదానికి ఖరీదుకీ, రూపానికీ సంబంధమే లేదు. ఏణ్ణర్ధం పిల్లాడికి షర్టు సైజెంతుంటుందీ,ఓ రెండు జానలు! దాని ఖరీదు 900 రూపాయలుట! పోనీ ఎంతో కొంత, తీసికుందామా అనుకున్నా, తీరా తీసికెళ్తే, ఒకటో రెండు సార్లు వేసికోడానికి సరిపోతుంది. ఆ తరువాత,పాత బట్టల మూటలోకే కదా.అలాగని మరీ పెద్ద సైజూ తీసికోలేమూ.బుళాఖీ లాటి డ్రెస్సులు వేస్తామా ఏమిటీ?

వచ్చిన గొడవల్లా ఏమిటీ అంటే,ఈరోజుల్లో జీతాలు అయిదంకెల్లోనూ, ఆరంకెల్లోనూ వస్తున్నాయి.పిల్లలతో గడపడానికి తల్లితండ్రులకి టైమే ఉండడం లేదు, ఆ వచ్చిన వీకెండ్ కాస్తా పిల్లలమీదే ఖర్చుపెట్టాలనిపిస్తుంది,అదేదో ‘కన్ఫెషన్’ లాటిది చేస్తే, చేసిన పాపాలన్నీ పోతాయిట. .ఇది కూడా ఓ ‘కన్ఫెషన్’ లాటిదే కదా!అలాగే, ఈ రోజుల్లో పిల్లలతో టెలివిజన్ చూడాలంటే భయం, దానితో ఏమౌతోందీ వాళ్ళకి కావల్సిందేదో వాళ్ళే చూస్తారూ అని టి.వి.రిమోట్లు వాళ్ళకి అప్పచెప్పేస్తారు.ఇంక అస్తమానూ, వాళ్ళు ప్రశ్నలడగడం, వారి సందేహాలు తీర్చడం తల్లితండ్రులు వదిలించుకున్నట్లే కదా! ప్రొద్దుటనుండీ, ఆఫీసుల్లో శ్రమపడి వచ్చిన తరువాత, తామూ ఏదో రిలాక్సవుదామనుకుంటారు,మళ్ళీ పిల్లలతో గడపడానికి టైమెక్కడిదీ?This is a mutually acceptable arrangement. వీళ్ళకి వాళ్ళ గొడవుండదూ, వాళ్ళకి వీళ్ల గొడవుండదూ. గొడవల్లా ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకే.ఏదో పిల్లల్ని, మనవల్నీ, మనవరాళ్ళనీ చూద్దామని, వారి ఆటపాటలు చూసి సంతొషిద్దామని వచ్చిన గ్రాండ్ పేరెంట్స్ కి కనిపించేదేమిటీ, కూతురు/కొడుకు, అల్లుడు/కోడలు చేతుల్లో సెల్ ఫోన్లూ,మనవళ్ళూ/ మనవరాళ్ళ చేతుల్లో రిమోట్లూ, ఐపాడ్లూ, మళ్ళీ అవేవో కన్సోల్ ట, ఇంటినిండా ఎక్కడచూసినా ఎలెక్ట్రానిక్ గాడ్జెట్లే. చెవుల్లో ఇయర్ ఫోన్లూ.ఎవరిని పలకరిస్తే ఏం తంటాయో తెలియదు. ఈ మధ్యలోనే,ఓ కుక్కు వచ్చి వంటలాటిది చేసేస్తుంది, ఇంకో ఆవిడొచ్చి ఇల్లంతా తుడుపూ, ఇంకోళ్ళు గిన్నెలు తోమేయడం.

కొంపనిండా మనుష్యులే. అయినా ఈ పెద్దాళ్ళకి ఒంటరితనమే!ఈమాత్రం దానికి అంతదూరం నుండి రావాల్సిన అవసరం ఉందా అనే పరిస్థితి.ఎవరి బాధలు వాళ్ళవి. ఎవరినీ తప్పుపట్టలేము.అన్నీ తెలిసినా ఏమీ చేయలెని నిస్సహాయత.పోనీ కూతురో కోడలో అంత శ్రమ పడి వస్తోందీ, వంటలో సహాయం చేద్దామా అనుకున్నా అబ్బే, ఈ ‘ముసలి’వంట తినే ఓపికెక్కడిదీ? ఏదో హోటల్ కి ఫోను చేసేయడమూ,ఏవేవో ఆర్డరు చేసి తెప్పించడమూ. ఇంక వీకెండ్లయితే ఏకంగా హొటల్ కే వెళ్ళడం. సరదాగా ఛేంజ్ కి హొటల్ కి వెళ్దామూ అని సమర్ధింపోటీ. ఛేంజేమిటీ, ప్రతీ రోజూ ఓ కుక్కే కదా వంట చేస్తుంట.ఇంట్లో కుక్కు చీరకట్టుకుంటుందీ, హొటల్లో షెఫ్ ఓ పాంటూ షర్టూ వేసికుని నెత్తిమీద ఓ టోపీ పెట్టుకుంటాడు, అంతే తేడా ! ఈ మాత్రం దానికి ఛేంజ్ అని సమర్ధింపెందుకూ? చేతిలో డబ్బులున్నాయి, వాటిని ఎంత తొందరగా ఖర్చుపెట్టేయాలా అనే కానీ,ఇంకో ఆలోచనుండదు.

చివరకు తేలేదేమిటయ్యా అంటే, ఈ రోజుల్లో ఇంట్లో పిల్లలు, ఎలెక్ట్రానిక్ గాడ్జెట్లతో పెరిగి పెద్దౌతున్నారు.కాలేజీ చదువైనప్పటినుండీ జీవనాధారం మళ్ళీ ఓ కంప్యూటరో, లాప్ టాప్పో.ఇంక వీళ్ళు మానవసంబంధాల మధురానుభూతులు ఎప్పుడు ఆస్వాదిస్తారండి బాబూ? మరి రేడియేషన్ కి expose అవుతున్నారో అని ఏడ్చి మొత్తుకోడం ఎందుకూ?

Advertisements

5 Responses

 1. నిజమేనండి. మనలాంటి పాతతరానికి చాలా బాధగానే ఉన్నా ఏమీచేయలేని నిస్సహాయత మనల్ని బాధిస్తూంటుంది.ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్లతో పెరిగి పెద్దయిన పిల్లలకు మానవతా విలువలు ఎలా వంటపడతాయి?

  Like

 2. మాస్టారూ.. ఎప్పట్లానే ఆలోచన రేకెత్తించే టపా రాశారు. మీ ప్రతి టపా జీవితంలో ఓ భిన్నమైన కోణాన్ని స్ప్రుశిస్తుంటుంది. ఆ కోణాలను చెప్పే వాళ్లిప్పుడు ఎక్కడున్నారు చెప్పండి.

  Like

 3. @నరసింహరావు గారూ,

  ఔను కదూ!

  @వెన్నెలరాజ్యం,

  జీవితంలోని వివిధ కోణాల్నీ స్పృశించాలని చాలా మందికి ఉంటుంది,వినేవాళ్ళెవరు? ఏదో మీ అందరూ చదువుతున్నారు కదా అని వ్రాసేస్తున్నాను!!!

  Like

 4. నమస్తే సార్,

  మంచి టాపిక్ లేవనెత్తారు. ఇలాంటివి చదవగానే నాకు వెంటనే ఉద్యోగం మానేయాలనిపిస్తుంది.
  ప్రపంచీకరణ ప్రభావం ఎంతగా ఉందంటే సూర్యుని కాంతి ని అరచేత్తో ఆపగలమేమో కాని ఈ మార్పు ని ఎదుర్కోవటం చాలా కష్టం.
  నా చిన్నప్పుడు పుస్తకాల్లో మధ్య తరగతి బడుగు జీవితాలు,భేషజాలకి పోయి కూర్చుని తిని ఆస్తులు కరగపెట్టిన వైనాలూ, ఒక్కడు సంపాదించి కుటుంబ భారమంతా మోయటం, ఆడపిల్లల పెళ్ళిళ్ళూ చేయటానికి పడే ఆపసోపాలూ ఇలాంటివి కథా వస్తువులుగా ఉండేవి.దీనికి ప్రత్యామ్నాయంగా ఆడ పిల్లల్నీ, మగ పిల్లల్నీ సమానంగా చదివించి ఉద్యోగాలు చేయించటం తో పిల్లలూ కాస్తో కూస్తో తల్లి తండ్రులూ ఆర్ధికంగా నిలదొక్కుకున్నారు. కాల క్రమేణా ఆడవారు కూడా ఉద్యోగ బాధ్యతలకీ, సమయం గురించీ భయపడకుండా అన్ని ఉద్యోగాలలో ప్రత్యేకించి మానేజీరియల్ స్థాయి లో పని చేయటం, కుటుంబానికి కేటాయించే సమయం తగ్గిపోవటం, ఇదికాకుండా ప్రపంచీకరణ లో వెల్లువెత్తుతున్న సాంకేతిక వస్తు వినియోగం మీరనే మార్పు కి చాలా వరకు కారణాలు. మార్పుని అంగీకరించక తప్పదు కదా. కానీ పెరుగుట విరుగుట కొరకేనని ఇలా మీలాంటి పెద్దలు చెప్పీ చెప్పీ కనీసం కొందరైనా ఈ సమస్య గురించి ఆలోచించటం మొదలెడతారని నా నమ్మకం.

  మీ బ్లాగ్ కంటే పెద్ద వ్యాఖ్య రాసినందుకు తిట్టుకోకండి.

  శ్రీరాగ

  Like

 5. శ్రీరాగ,

  వచ్చిన సమస్య ఇదే. ప్రతీవారికీ తెలుసు తాము చిన్న పిల్లల విషయంలో వ్యవహరిస్తున్నది రైటు కాదేమో అని. దానికి ఆల్టరేనిటివ్ పెద్దవారిని అడుగుదామా అంటే, ‘వీళ్ళకేం తెలుసూ’ అనే భావం. ఏదోలా టైము గడిచిపోతోందిలే అనే ఆల్సీ తనం !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: