బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-ఏమిటో ఎవరి గొడవ వాళ్ళది ,,,


   అప్పుడెప్పుడో ఒక టపా వ్రాశాను. మా అందరికీ ( రిటైరయి ఆరేడేళ్ళు అయిన) ఎప్పుడో పాతికేళ్ళక్రితం మేము చేసిన ఓవర్ టైముకి ఆరోజుల్లో తక్కువ ఇచ్చారూ, ఇప్పుడు వాటికి సంబంధించిన బకాయిలు ఇస్తారూ అని.ఆ టపా వ్రాసెనో లేదో,మా ఫ్రెండు రామూ, ‘అయితే మాకందరికీ You may throw a party to all bloggers after getting the arrears.’ అని ఓ వ్యాఖ్య కూడా పెట్టేశారు!ఆలూ లేదు,చూలూ లేదూ కొడుకు పేరు సోమలింగంట అన్నట్లుగా ఉంది! అయినా ఎప్పుడో పాతికేళ్ళక్రితం చేసినదానికి ఎరియర్స్ వస్తాయంటే, నమ్మడమంత బుధ్ధితక్కువ పని ఇంకోటి లేదు! అదీ గవర్నమెంటోళ్ళా? ఇవ్వాల్సినవే ఇవ్వకుండా నొక్కేస్తారు, ఇలాటి వ్యవహారాల్లోనా వాళ్ళు లొంగేది?
ఎవరి సరదాలు వాళ్ళవి, ఎవరి ఆశలు వాళ్ళవి.మా ఫ్రెండొకాయనైతే అప్పుడే నాతో అన్నారు కూడానూ, అదేదో భండారా ఫాక్టరీలో, ఈ ఎరియర్స్ కాలుక్లేట్ చేయడానికి ఓ ప్రత్యేక సెల్ కూడా ఓపెన్ చేశారని! అక్కడికేదో, రిటైరయిన పక్షులందరికీ, ఏదో రూపాన తృణమో పణమో కట్టబెట్టాలని గవర్నమెంటు వెయిట్ చేస్తున్నట్లుగా! అదిగో తోకా అంటే ఇదిగో పులీ అన్నట్లుగా, ఎవరి లెఖ్ఖలు వాళ్ళు చేసేసికున్నారు.ఆ ఎరియర్స్ వస్తే ఏం చేయాలీ, ఎన్నెన్నో కలలు కనెసికున్నారు. ఏదో లాటరీ టిక్కెట్టు కొన్నామనుకోండి, దాని రిజల్ట్ వచ్చేదాకా కావలిసినన్ని కలలు కనెసికోవచ్చు! ఒక్క నయాపైసా ఖర్చవదు కలలకి. కొంతమందైతే నిద్ర పడితేనే కానీ కలలు కనలేరు. కొంతమందికి మాములుగా మెళుకువగా ఉన్నా చాలు. ఏ కారుకిందా, బస్సుకిందా పడకుండా శాల్తీ గల్లంతవకుండా ఉండాలి అంతే!

   అదేదో ఎరియర్స్ వచ్చేస్తాయని నేను ఏమీ కలలేం కనలేదు. నిజం చెప్పాలంటే నేను అసలు ఎప్లికేషనే పంపలేదు! I had my own doubts ! పోనీ అలాగని ఎవరితోనైనా అందామా అనుకున్నా, వెధవ శకునపక్షీ అని తిడతారేమో అనో భయం.గుంపులో గోవిందా గా ఉంటే నష్టం లేదుగా.అదే పని చేశాను.అలాగని ఖాళీగా లేనండోయ్, కనిపించిన ప్రతీరిటైరయిన వాడికీ, ఈ ఫార్మెట్, ఫొటో కాపీ తీసి, చేయకలిగిన సేవేదో నేనూ చేశాను!చివరకి మొన్నో రోజున మా ఫ్రెండు
అదే పై టపా లో ఉన్న ‘విశాలహృదయం’ ఆయన, ఫోను చేసి చెప్పారు, ఫణిబాబు గారూ, ఫాక్టరీలనుండి, ఎప్లై చేసినవాళ్ళందరికీ జవాబొచ్చిందీ You are not entitled to those arrears as per Rule no… clause no…Subclause no…page no… vide Supreme Court decision in the Case between Government of India vs XYZ….అనీ ! అయిందా సంబడం!ఇవన్నీ మా ఇంటావిడతో చెప్తే అంటుందీ, ‘మీరెలాగూ పంపలేదుకదా అని, ఈ గొప్పలన్నీ చెప్పుకుంటున్నారూ, అ ఎప్లై చేసిన వాళ్ళకి వచ్చుంటే మీరిలాగ మాట్లాడేవారా?’అని.ఎవరి అభిప్రాయం వాళ్ళదీ.నేనదేమిటంటే, మనకు రావాలనే ఉంటే, మనం పోయిన తరువాతైనా ఫామిలీకి వస్తుంది. రాకూడదని ఉందనుకోండి, ఎంత మొత్తుకున్నా రాదు! ఈ దరిద్రపు ఫిలాసఫీ అందరికీ నచ్చకపోవచ్చు.ఏమిటో తిక్కశంకరయ్యండి బాబూ అన్నా అనొచ్చు! ఎవడి కంఫర్ట్ లెవెల్ వాడిదీ !!

   నిన్న సాయంత్రం మా ఇంటావిడ బట్టలు ఇస్త్రీకి ఇచ్చినవి తెద్దామని లాండ్రీకి వెళ్ళాను. అక్కడ వాడేమో ఒక్క అరగంటాగితే చాలు, చేసిచ్చేస్తానూ అనడం తో అక్కడే ఓ కుర్చీ వేసికుని కూర్చున్నాను. మొత్తం బట్టలకి బిల్లెలాగూ రెండొందలు దాటుతోందని, కొట్టువాడే కుర్చీలో కూర్చోనిచ్చాడు, అంతే కానీ, నామీదేదో ప్రేమాభిమానాల వలన కాదు!వాడు చెప్పిన అరగంటలో ఎక్కడ అవుతాయీ, ఏదో చెప్తారు కానీ, మా ఇంటావిడకి ఫోను చెసి చెప్పేశాను. ఈ సెల్ ఫోన్లలో ఇదో సౌకర్యం, మనం ఉఛ్వాస నిశ్వాసాలతో సహా ఓ ఇంటెరిం రిపోర్ట్ పంపొచ్చు.ఆవిడకేం లెండి, ఆవిడ బట్టలకే కదా వెళ్ళిందీ, సర్లెండి అంది. ఆ టైములోనైనా కంప్యూటరు దొరుకుతుంది కదా అని.అన్ని బట్టలూ తీసికునే రండీ అంటూ ఓ సలహా!
అక్కడ కూర్చున్నానా, పక్కనే ఆ ప్రాంతానికి చెందిన ఒ సీనియర్ సిటిజెన్ల క్లబ్బు ఉంది.మా ఆర్డ్నెన్స్ ఫాక్టరీ పక్షులేలెండి.

   ఒకాయనొచ్చి, ఈ లాండ్రీ షాపు వాడిదగ్గర తాళం చెవి తీసికుని, తాళం తీసి, ఆపసోపాలు పడుతూ, షట్టర్స్ పైకి తీశాడు.అన్ని తిప్పలు పడకపోతే, ఓ కుర్రాణ్ణి పెట్టుకోవచ్చుగా, రూం తెరిచి,ఓ చీపురేయడానికి.మళ్ళీ అలాటివాటికి ఖర్చు పెట్టడం వేస్టూ.అదే మరి ఎవరి గోల వాళ్ళదీ అంటే!తీరా తెరిస్తే, అందులో లైటు వెలగడం లేదు.పక్కనున్న అన్ని షాపుల్లోనూ లైట్లున్నాయి, వీళ్ళ క్లబ్బు తప్పించి.ఇంతట్లో ఇంకొకాయనొచ్చి,సెగట్రీ కరెంటు బిల్లు కట్టలేదేమో అంటాడు,ఇలా అన్నాయనకీ సెగట్రీ ఎగస్ పార్టీ వాడులేండి, ఛాన్సు దొరికితే అల్లరి పెట్టేయడమే!ఇంతలో ఇంకొకాయన వచ్చి, మనకి లైటు కనెక్షన్ గుళ్ళోంచి కదా, అక్కడేమైనా పోయిందేమో, అంటే కరెంటుకి విడిగా మీటరు కూడా లేదన్నమాట!అక్కడ సీనియర్ సిటిజెన్లని ఓ పబ్లిక్ సింపతీ ఓటీ!మొత్తానికి ఓ కుర్చీ వేసికుని ఫ్యూజు పోయిందేమో అని చూడడం, అక్కడినుంచి ప్రతీ వాడూ వచ్చి ఓ సారి స్విచ్చేయడమూనూ. అదేమైనా ఆలీబాబా అద్భుత దీపమా ఏమిటీ? ఓ ఎలెట్రీ వాడిని పిలిచి ఆ ఫ్యూజో ఏదో వేయించేసికుంటే గొడవుండేది కాదుగా! అబ్బే మనం ఎప్పుడో ఫాక్టరీల్లో సంపాదించిన విజ్ఞానమంతా సార్ధకం చేసికోవద్దూ? వీళ్ళంతా ఎప్పుడో గుప్తుల స్వర్ణయుగం కాలంలో టెక్నికల్ పనులు చేసేవారు లెండి!

   ఇంతలో మా లాండ్రీవాడు నా బట్టలిచ్చేశాడు, నేను కొంపకి వచ్చేశాను.లైటొచ్చిందో లేదో నాకు తెలియదు! అందుకే అంట ఎవడి గోల వాడిదీ అని!

Advertisements

4 Responses

 1. /మనం ఉఛ్వాస నిశ్వాసాలతో సహా ఓ ఇంటెరిం రిపోర్ట్ పంపొచ్చు/
  ఉచ్వాస నిశ్వాసాలటుంచి, కొత్తిమిర, కరేపాకు, పచ్చి మిరపకాయలు, మరింకేమైనా కూరలు పట్రా అనే ముఖ్యమైన సందేశాలు కూడా అందుకోవచ్చండి. నాకైతే అంతకన్నా ముఖ్యమైన అవసరం ఎప్పుడో గాని వుండదు. 🙂

  Like

 2. మనకు చెందవలసినది మనకు రాకా మానదు .
  ఆ వచ్చేది కూడా రావలసి వచ్చినప్పుడే వస్తుంది .
  ఒక్క క్షణం కూడా ముందుగా రాదు.
  మనకు చెందనిది మనకు ఎన్నడూ రాదు . వేచి లాభం లేదు.

  Like

 3. – అవును కొత్తగా వచ్చిన మేనేజరుకు ఇరవైలక్షలు పెర్ ఏనమ్ అంట కదా….
  -మా ఏరియాలో అప్పుడే మామిడిపళ్ళు వచ్చేసాయి.. డజను రెండువందలే.. నువ్వు మూడువందలు పెట్టికొన్నావా.. హ హాహా..
  – నిన్న ఐపియల్ చూసావా.. భలే ఇంట్రస్టింగుగా వుందే!!

  ఇది మా ఆఫీసులో ప్రస్తుతపు ఎవడిగోలవాడిది.. 🙂

  మీరు ఎప్పటిలాగే అద్భుతమైన సెటేర్లు వేసారు. పైన మోహన్ గారు చెప్పిన మాటలు ఇంకా అద్భుతం 🙂

  Like

 4. @Snkr,

  ఇంకా ముందు ముందు ఎలాటి సందేశాలొస్తాయో, ఎలాటివివ్వాల్సొస్తుందో !!

  @మోహన్ గారూ,

  ఫరవాలేదు.మనిద్దరిదీ ఒకటే దారి !!

  @శ్రీనివాసా,

  ఎవడి గోల వాడిదీ మరి !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: