బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-Exploitation


   మనం చూస్తూంటాము, సీజనొచ్చిందంటే అంటే పెళ్ళిళ్ళ సీజను, వేసంగి శలవలు వగైరా ప్రతీవాడూ తమ సర్వీసుల ఛార్జీలు పెంచేస్తాడు.వాళ్ళకీ తెలుసు,వాళ్ళెంత ధర పెంచినా తీసికునేవాళ్ళకి కొరతేమీ ఉండదని. మరి మన అవసరం అలాటిది, ఏం చేస్తాం? దీన్నే-Exploitation అంటారనుకుంటాను.మా ఇంటావిడ కి తణుకు వెళ్ళవలసిన అవసరం వచ్చింది.ఏదో ఇక్కడినుండి భాగ్యనగరం దాకా ట్రైనులో దొరికింది టిక్కెట్టు. కానీ అక్కడనుండి, అన్ని ట్రైనులూ Waiting list లే. మొత్తానికి, తణుకు దాకా, స్లీపర్ బస్సులో టిక్కెట్టు బుక్ చేయవలసివచ్చింది. పాపం వెళ్ళేటప్పుడూ, తిరిగి రావడానికీ కూడా బస్సే దిక్కైంది. బస్సువాడేమో, ముక్కుపిండి వసూలు చేశాడు.వాళ్ళకీ తెలుసు, అవసరం వచ్చినప్పుడు, ఎంత రేటైనా కొనడానికి ‘బక్రాలు’ దొరుకుతారని.

   పోనీ అలా అని, మన కార్యక్రమాలు ముందుగా తెలియచేస్తారా అంటే అదీ లేదు.వాళ్ళ సమస్యలు వాళ్ళకి ఉంటాయి.ఏవో ముహూర్తాలూ అవీనూ.బాగుపడేదెవరయ్యా అంటే ఈ బస్సుల వాళ్ళు.ట్రైనులో వెళ్ళాలంటే, తత్కాలే దిక్కు.పోనీ అదేమైనా సులభంగా వస్తుందా అంటే అదీ లేదు. ఆన్లైన్ లో ఛస్తే దొరకదు. తెల్లవారుఝామునే వెళ్ళి లైన్లో నుంచోవాలి. పోనీ సీనియర్ సిటిజెన్ లైన్లో నుంచుందామా అంటే, స్వంతానికి టిక్కెట్టు తీసికుంటేనే ఇస్తారుట.సవాలక్ష రూల్సూ. పోనీ వెళ్దామా అంటే, ఇచ్చే కన్సెషన్ ఇవ్వరూ.పైగా మామూలుకంటే ఎక్కువ ఖరీదూ.చెప్పొచ్చేదేమిటంటే,చివరకి ప్రభుత్వం వారు కూడా, ఏదో వంక పెట్టి రేట్లు పెంచేయడమే. గవర్నమెంటే అలా చేస్తూంటే, మనల్ని ఎవడడుగుతాడూ అనే భరోసా ఈ ట్రావెల్స్ వాళ్ళకి. ఇంకోటేమిటంటే, చాలా భాగం ట్రావెల్స్ వాళ్ళు ఎవడో ఒక నేత కి సంబంధించినవే. ఇంక వీళ్ళు రేట్లెంత పెంచినా అడిగేదెవడూ?

   ఇంతా చేసి, ట్రైనులో తత్కాల్ లో టికెట్ బుక్ చేసినా, ఈ శలవల్లో ట్రైన్లలో రష్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా?చివరకి తేలేదేమిటయ్యా అంటే ఖరీదెక్కువైనా, ఈ స్లీపర్ బస్సులే మెరుగూ అని.మరీ ట్రైన్లలో లాగ కుక్కేయరు.టాక్సీ వాళ్ళైతే, మన మొహాలు చూసి రేట్లు చెప్తారు.ఇది ప్రయాణాలకి సంబంధించినంతవరకూనూ.

   మా మనవడు మామూలుగా creche కి వెళ్తూంటాడు, ఇంకా స్కూలూ అవీ మొదలవలేదు కాబట్టి.నవ్య ప్రతీ రోజూ స్కూలు నుంచి సాయంత్రం 5.15 కి creche దగ్గర దిగుతుంది. వీలుని బట్టి మాలో ఎవరో ఒకరు వెళ్ళి పిల్లల్ని ఇంటికి తీసికొస్తూంటాము. పూర్తి రోజుండదు కాబట్టి, పార్ట్ పేమెంటే తీసికొనేవారు.నెలంతటికీ కట్టఖ్ఖర్లేకుండా, రోజుకి ఇంత అని.తను అక్కడుండేది ఎంతా, పదిహేను నిమిషాలు. అయినా సరే రోజుల్లెఖ్ఖనే తీసికునేవారు.దానికే 150 రూపాయల చొప్పున. మొన్న సడెన్ గా 250 అన్నారుట.నెలకైతే ఆరువేలు! వాళ్ళకీ తెలుసు, పిల్లలకి వేసంగి శలవలూ, తల్లితండ్రులకి ఆఫీసులూ. పిల్లల్ని మన దగ్గర వదలక ఎక్కడికి వెళ్తారులే అని.అడగడానికి వీలులేదు. పైగా ఏమైనా అర్గ్యూ చేస్తే, పిల్లల్ని సరీగ్గా చూడరేమో అని భయం!ఈ డే కేర్ సెంటర్లు మోస్ట్ అనార్గనైజ్డ్ సెక్టరులోకి వస్తాయి. వాళ్ళు వసూలు చేసే ఫీజులమీద ఎవడికీ కంట్రొల్ అనేది లేదు. అవసరం మనది కాబట్టి, వాళ్ళెంత చెప్తే అంత ధారపోయడం.

   ఇదివరకటి రోజుల్లోలాగ కాదుకదా. పోనీ అంతంత ఖర్చులు పెట్టి డే కెర్ సెంటరుకి పంపకపోతేనేం అనడానికీ లేదు. చిచ్చర పిడుగుల్లాటి పిల్లలు, ఈ వయస్సొచ్చిన గ్రాండ్ పేరెంట్స్ మాట ఎక్కడ వింటారు?మా సొసైటీ లో ఒక తాతా, మామ్మల పరిస్థితి చూసినప్పుడల్లా చాలా బాధేస్తుంది. వాళ్ళకి మా నవ్య వయస్సు మనవరాలొకత్తుంది. వాళ్ల అమ్మా నాన్నా ఆఫిసుకెళ్ళడం తరవాయి,రోజంతా చంక దిగదు. వారూ మరీ చిన్నవాళ్ళేం కాదు,75 సంవత్సరాలుంటాయి. చెప్పలేక పోవడం వారి తప్పంటారా, లేక వయస్సొచ్చిన వారి తిప్పలు గుర్తించకపోవడం ఆ తల్లితండ్రుల తప్పంటారా? మేము మాత్రం ఆ విషయంలో అదృష్టవంతులమే. ఎప్పుడైనా మరీ అవసరం వస్తే తప్ప, పిల్లల బాగోగులు వాళ్ళే చూసుకుంటారు.

   మా రోజుల్లో అయితే, చాలా మంది, housewife లే కాబట్టి, ఇలాటి సమస్యలొచ్చేవి కావు. ఇప్పుడలాక్కాదుగా. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తేనే కానీ, రోజెళ్ళదు, పిల్లలకి పెద్ద చదువులు చెప్పించలేరు. రోజ్ మర్రాకే జిందగీ లో దొరికే లక్షరీలు అనుభవించలేరూ.ఇదేదో మాలాటివాళ్ళకు వింతగా కనిపిస్తుందేమో కానీ,నిజంగా అనుభవిస్తూన్న వారికేమీ పేద్ద ఇస్యూ కాదేమో?అయినా నాకెందుకులెండి? ఏదో ఊరుకోలేక వ్రాశాను.

5 Responses

  1. వందలమంది చేత చదివిస్తున్నవి మీ మనస్సులో ప్రేరేపణలే కాకపోతే చాకుతో పదును పెట్టి వాక్యాలుగా వ్రాస్తున్నారు. యు ఆర్ర్ డూఇంగ్ గ్రేట్ ఫణిబాబు గారూ.

    Like

  2. మొదట పేరాలో చెప్పిన వాటికి ఒకరకంగా అవినీతి కారణం. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు వస్తున్నాయిగా, చూద్దాం పరిస్థితి కొంతనా మెరుగుపడుతుందేమో. ప్రజల మద్దతుతో, ఆ సామాజిక కార్యకర్తల కష్టం వృథా పోదనే అనుకుందాము.

    చివరి పేరాల్లో తమ పిల్లల కోసం శ్రమించిందేకాక, వాళ్ళ పిల్లలకోసం కూడా వృద్ధాప్యంలో శ్రమించాల్సి రావడం అనేది బాధాకరం. కొంతమందికి అది కాలక్షేపం, సరదా అయ్యుండొచ్చు, భారం ఐతే మాత్రం .. వారి పిల్లలే భాధ్యతాయుతంగా ఆలోచించాలి.

    మీ బ్లాగు నాకు నచ్చిన కొన్ని బ్లాగుల్లో ఒకటి. బాగా లోకాన్ని చదువుకున్న, గొప్ప ఉద్యోగాలు చేసిన, పక్కింటి విశ్రాంత మామయ్య కబుర్లలా, భారీ కథనాలు, అతిశయోక్తులు లేకుండా ‘తేటగా’ వుంటుంది. 🙂
    Keep writing, Sir.

    Like

  3. __________________________
    మీ బ్లాగు నాకు నచ్చిన కొన్ని బ్లాగుల్లో ఒకటి. బాగా లోకాన్ని చదువుకున్న, గొప్ప ఉద్యోగాలు చేసిన, పక్కింటి విశ్రాంత మామయ్య కబుర్లలా, భారీ కథనాలు, అతిశయోక్తులు లేకుండా ‘తేటగా’ వుంటుంది. 🙂
    __________________________

    I completely agree and keep writing sir.

    Like

  4. విఫణి కి చెందిన సూత్రాలు :: అవసరము, అవకాశము, అందుబాటుల మీదే ధర పలుకుతుంది.- కాదంటారా?
    అవసరాన్ని బట్టి దోపిడీ – that is exploitation.
    Nice to read your musings.
    Mohan

    Like

  5. @రావుగారూ,
    థాంక్స్.

    @ఎస్ కె ఎన్ ఆర్,

    నేనేమీ గొప్ప ఉద్యోగాలు చేయలేదు. కానీ చేసిన ఉద్యోగమేదో పూర్తిగా ఆస్వాదించాను. నో డౌట్. ఏదో చదువుతున్నారు కాబట్టి వ్రాద్దామనే ఆశ !

    @గణేష్,

    థాంక్స్.

    @మోహన్ గారూ,

    ధన్యవాదాలు.

    Like

Leave a comment