బాతాఖాని-లక్ష్మి ఫణి కబుర్లు– చిరాకులు,పరాకులు

   ప్రపంచంలో ఎక్కడైనా ఓ బెస్ట్ ఎస్కేపిస్ట్ రూట్ ఉందంటే అది ‘చిరాకు’. దీన్నడ్డబెట్టుకుని, ఎటువంటి విషమ పరిస్థితుల్లోంచైనా, వీధిన పడకుండా బయట పడిపోవచ్చు!ఏ పిల్లాడైనా, బయటివాళ్ళే అవఖ్ఖర్లేదు మన పిల్లలైనా సరే మనకి తెలియని ఏ పొడుపుకథో అడిగాడనుకోండి, చిరాగ్గా మొహం పెట్టేసేమంటే చాలు, వాడు మనదగ్గరకి రాడు! ఈ చిరాగ్గా మొహం పెట్టడమనేది కొద్దిగా ప్రాక్టీసు చేస్తూండాలి. మరీ రాత్రికి రాత్రే రాదుగా! సరిగ్గా ప్రాక్టీసు చేయకుండా, చిరాగ్గా మొహం పెడదామని ప్రాక్టికల్ గా చేయడానికి ప్రయత్నించామా,పట్టేస్తారు.
కొంతమందికి ఈ చిరాగ్గా మొహం పెట్టడమనేది జన్మతోనే వచ్చేస్తుంది. కొంతమందిని చూస్తూంటాము, ఎప్పుడూ మొహం చిటపటలాడిస్తూంటారు.ఏం అడిగితే ఏం ముంచుకొస్తుందో అనే అనిపిస్తూంటుంది.చాలామంది వీరినుంచి సేఫ్ డిస్టెన్స్ లో ఉంటారు. అదేకదా కావలిసిందీ వీళ్ళకి!కొంతమందైతే,ఊళ్ళో జరిగే ప్రతీ విషయంలోనూ వేలెడుతూనేఉంటారు, తిన్న తిండరక్క.వీళ్ళు ఊళ్ళో అందరి సమస్యలూ, స్వంతంగానే భావించేస్తూంటారు.అదో కాలక్షేపం!

పైగా ఈ చిరాకు ఓవర్ డోస్ అయితే, ఒక్కొక్కప్పుడు మనమీదకే బూంరాంగ్ అవుతూంటుంది.అందుకే స్పేరింగ్ గా వాడుతూండాలి.ఓ హోటల్ కెళ్దామన్నా,పిల్లలు ఏ సినిమాకో వెళ్దామన్నా, నెలకో రెండు నెలలకో ఓమాటు తీసికెళ్తూండాలి.లేదా ఎప్పుడో భార్యతో స్వీట్ నథింగ్స్ చెబ్దామనుకుని దగ్గరకు వెళ్తే, అబ్బ చిరాగ్గా ఉందండీ అందనుకోండి, గోవిందా గోహోవిందా!!ఓ ఆర్నెల్లు సావాసం చేస్తే వాళ్ళు వీరౌతారంటారు. అలాగే ఓ ఏడాది తిరిగేసరికల్లా, భార్య, భర్త గారు ఎప్పుడు నిఝంగా చిరాకు పడుతున్నారూ, ఎప్పుడు ఏక్టింగ్ చేస్తున్నారూ అనే విషయం కనిపెట్టేస్తుంది. అందుకే ఈ జాగ్రత్తలన్నీనూ!

అందువలన ఇంటావిడతో వేషాలు వేయకుండా ఉంటే, ఒక్కోప్పుడు ఆవిడే మన రెస్క్యూకి వచ్చేస్తూంటుంది.అదన్నమాట మూలసూత్రం! ఇదివరకటి రోజుల్లో,క్రొత్తగా పెళ్ళై, ఏ పండక్కో పబ్బానికో అత్తారింటికి వెళ్ళినప్పుడు,అల్లుడిగారి/అమ్మాయిగారీ, గొంతేరమ్మ కోరికలన్నీ, ఈ ‘చిరాకు’ ముసుగులో, తీర్చేసికునేవారు.అప్పటిదాకా అమ్మా నాన్నలంటే ఉన్న అభిమానం కాస్తా మాయం అయిపోయి, తనూ, తన భర్తా,తన సంసారం గురించే ఆలోచనలు. మరీ ఏ వస్తువైనా తనకే కావాలీ అనుకుందనుకోండి,’అదేమిటో నాన్నా, ఆయనకి ప్రతీరోజూ బస్సులు పట్టుకుని ఆఫిసుకెళ్ళాలంటే చిరాకు పడుతున్నారు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అలిసిపోతున్నారు, ఓ అచ్చటా లేదూ,ముచ్చటా లేదూ. ప్రతీ దానికీ చిరాకే.పోనీ ఈ పండక్కి మిమ్మల్ని ఓ స్కూటరు కొనిపెడతారేమో అడుగుదామనుకుంటున్నాను’ అంటుంది.ఇలా ఒక్కో పండక్కీ, ఒక్కో వస్తువు చొప్పునా ఇల్లంతా కానీ ఖర్చు లేకుండా ఫర్నిష్ చేసేసికోవచ్చు. పాపం ఆ పెద్దాయనకి ఒకత్తే కూతురైతే ఫరవా లేదు, అలా కాకుండా ఓ ఇద్దరో ముగ్గురో కూతుళ్ళనుకోండి ( ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో ఒక్కో ఇంటికీ ఇద్దరో ముగ్గురో కూతుళ్ళూ, వారి ధర్మాన అల్లుళ్ళూ ఉండేవారు!),పాపం ఆయన పరిస్థితి ఏమిటీ?
కట్నాలూ,కానుకలూ ఆడపడుచు లాంఛనాలూ పెళ్ళిలో వడుక్కోవలసినవన్నీ, ముందరే లాగించేశారు, పెళ్ళైన తరువాత ఇదో దోపిడీ! తన పెళ్ళైపోయినతరువాత, ఇంట్లో ఉండే చెల్లెళ్ళు ఏం దోచుకుపోతారో అని దుగ్ధ! భర్త చిరాకు పేరుతో పుట్టింటారిల్లు గుల్ల చేసిన వారు ఎంతో మందున్నారు. ఇందులో భర్త అనే ప్రాణి ఓ పాసివ్/సైలెంట్ స్పెక్టేటరు మాత్రమే! అంటే ఇక్కడ జరిగిందేమిటంటే టోటల్ మిస్యూజ్ అన్నమాట!

చెప్పొచ్చేదేమిటంటే ఈ ‘చిరాకు’ ఇస్పేటాసు లాటిదన్నమాట. పోనీ రమ్మీ లో జోకరు లాటిదనుకుందాము.ఎక్కడైనా,వాడేసుకోవచ్చు.రోడ్డుమీద ఏ అడుక్కునేవాడైనా కనిపిస్తే చాలు, చిరాకు పడ్డం ఓ స్టైలూ! అంతదాకా ఎందుకూ, ఏ కూతురి పురిటికో, కోడలి పురిటికో విదేశాలకి వెళ్ళొచ్చారంటే చాలు, మన దేశంలో ప్రతీదీ చిరాకే!అంత పుట్టిపెరిగిన దేశంమీదా, మనుష్యులమీదా చిరాకు పడేవాళ్ళు అక్కడే ఉండిపోవచ్చుగా? అబ్బే, పిల్లలకి వీళ్ళంటే చిరాకూ మరి.”అవన్నీ ఎక్కడ చెప్పుకుంటాము, చులకనైపోమూ, మరీ ఇంటివిషయాలు ఊళ్ళోవాళ్ళందరితోనూ టముకేసుకుంటామా ఏమిటీ? ఏమిటో చదివేవాళ్ళున్నారు కదా అని ఏమిటేమిటో వ్రాసుకుపోతున్నాడీ పెద్దాయన, అందుకే అసలు ఆయన టపాలు చదవడమంటే
‘చిరాకు’ నాకు”-అనుకునేవారూ ఉన్నారు.

రైలు ప్రయాణాల్లో చూస్తూంటాము, మనం తినిపడేసిన వేరుశనగ తొక్కలూ అవీ, క్రింద పడేసిన మిగిలిన చెత్తా చదారమూ, తుడవడానికి చిన్న చిన్న పిల్లలు వచ్చి తుడుస్తూంటారు. పూర్తిగా తుడిచేసి, ఓ రూపాయో, రెండో ఇస్తే పుచ్చుకుందామని చెయ్యి చాపుతారు. వాళ్ళని చూడగానే ఎక్కళ్ళేని చిరాకూ వచ్చేస్తుంది చాలామందికి, ఎంతో బిజీగా ఉన్నట్లు పక్కకుతిరిగేయడమో, లేకపోతే మనకున్న మొహానికి ‘చిరాకు’ పులిమేసికోవడమో.ఇంక వాడికేమీ ఇవ్వఖ్ఖర్లేదుగా
ఇదో ఉపయోగం ఈ చిరాకు వలన.ఏ కుక్కంటేనో భయం అనుకోండి, మరీ భయం అంటే బావుండదుగా, ‘ఏమిటోనండీ నాకు మాత్రం ఈ కుక్కలంటే మహ చిరాకులెండి’అనడం, అక్కడికేదో పెద్దపులీ, సింహం అంటే అభిమానంలాగ! ఏ సర్కస్ లోనో బోనులో వదిలేస్తే కుదురుతుంది రోగం !

%d bloggers like this: