బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-కాలక్షేపం

Dilse dil

   మొన్న ఆదివారం ‘ఈనాడు’ లో మా గ్రంధాలయం గురించి వచ్చిన తరువాత, కొందరు ఫోను చేసి, వివరాలు తెలిసికుని, సభ్యత్వం తీసికున్నారు. ఆ హడావిడిలో పడి, టపా వ్రాయడం కొద్దిగా వెనకబడింది. అదేదో నేను టపా వ్రాయకపోతే, దేశానికి నష్టం అనికాదు కానీ, ఏదో అలవాటు పడ్డ ప్రాణం !

   ప్రొద్దుటే 7.00 గంటలకల్లా రెడీ అయి, మా ఇంటికి వెళ్ళి, నవ్య ని స్కూలు బస్సెక్కించి, అగస్థ్యతో ఓ గంట కాలక్షేపం చేసి, తిరిగి మేముండే ఇంటికి వచ్చేస్తున్నాను.ఎండలు పేల్చేస్తున్నాయి.ఇంకా ఏప్రిల్ రాలేదు, అప్పుడే 39 డిగ్రీలు.ఇంక అసలు వేసంకాలం వచ్చిందంటే, ఎలాగుంటుందో?

   ఈ మధ్యన కొత్తవారితో పరిచయాలు బాగానే అవుతున్నాయి. మొన్నెప్పుడో పూణె లో కొత్తగా వచ్చిన ఒకతని టపా చదివి, నా ఫోను నెంబరిచ్చాను వ్యాఖ్య రూపంలో. ఈవేళ ఫోను చేశాడు. తనది పసలపూడి ట! ఈ శనివారం కలుద్దామనుకుంటున్నాము. ఒకరోజు, నాకు చిన్నప్పుడు చదువు చెప్పిన గురువుగారిని కలిశాను.ఆయన వారి అబ్బాయి దగ్గరకు వచ్చారు.ఆయనని కలిసే ముందు, మా అమలాపురం ఆయనొకాయన్ని కలుద్దామని వెళ్ళి, ఓ రెండు గంటలు బోరు కొట్టాను. చిత్రం ఏమిటంటే, మా గురువుగారూ, ఈయనా అమలాపురం లో పక్కపక్క ఇళ్ళల్లో ఉండేవారుట.నా ద్వారా మళ్ళీ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకున్నారు ఫోన్లోనేలెండి.అలాగే మా క్లాసుమేట్ ఒకతని కుమారుడు ఈ ఊళ్ళోనే పని చేస్తున్నాడు, అదీ మా గురువుగారిద్వారానే తెలిసింది. ఆ అబ్బాయిక్కూడా ఫోను చేసి పరిచయం చేసికున్నాను, ఎప్పుడో వీలు చూసుకుని కలవాలి.

   వచ్చే సోమవారం, ఉగాది సందర్భంగా జరిగే కార్యక్రమానికి వెళ్తే ఇంకా కొందరిని పరిచయం చేసికోవచ్చు.ఈనాడు లొ నాగురించి చదివిన తరువాత,ముంబై నుండి ఒకాయన అభినందిస్తూ ఫోను చేశారు.చాలా సంతోషమేసింది.ఆయనెవరో నాకు తెలియదు.కానీ, ఆయన మాట్లాడిన పధ్ధతీ, అభినందించిన తీరూ,it made my day! ఇవే కదండీ జీవితంలో చిన్ని చిన్ని ఆనందాలూ!

   ఏమిటో రిటైరయిన తరువాత బిజీబిజీ అయిపోయాను. ఉద్యోగంలో ఉండేటప్పుడు అదో రకమైన బాధ్యతా.కానీ it was systematic. ఏదో ఆఫీసులో పనీ, అది పూర్తిచేయడం, తిండం,నిద్రపోవడం, మళ్ళీ ఆఫీసూ. రిటైరైన తరువాత ఎలాగరా బాబూ, అనుకున్నంత సేపు పట్టలేదు, ఓ ఉద్యోగం లేదూ, సద్యోగం లేదూ అయినా సరే టైమనేది ఉండడంలేదు చేతిలో.మా అమ్మాయైతే ఫోను చేసినప్పుడల్లా, కోప్పడుతూంటుంది,ఊరికే తిరక్కూ, రెస్ట్ తీసికుంటూండూ అని.ఏది ఏమైనా,I am enjoying every moment of it. ఉన్నవాటికి సాయం, నా మిస్టరీ షాపింగైతే ఉండనే ఉంది. క్రిందటి వారంలో క్రోమా కి వెళ్ళి, నా కెమేరాలొకి సెల్స్ కొనుక్కున్నాను. పాపం కెమెరాతో ఇచ్చిన బ్యాటరీలు, రీచార్జ్ చేసి చేసి,ఒట్టిపొయాయి ! ఒట్టిపోవడం అంటే తెలుసుగా, ఆవులూ, గేదెలూ పాలివ్వడం మానేసినట్లన్నమాట !

   ఇంకో విషయమండోయ్, నేను ఆంధ్రభూమి లో వ్రాసిన ‘దిల్ మిల్’ వ్యాసానికి స్పందిస్తూ శ్రీమతి శారదా అశోక్ వర్ధన్ గారు ఒక వ్యాసం వ్రాశారు. పైన ఎడం చేతివైపు పెట్టిన Dilse dil మీద ఓ నొక్కునొక్కండి,చదవొచ్చు.

%d bloggers like this: