బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- ఎక్కడ చూసినా ఆర్టిఫిషియాలిటీయే…

   ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఈ ఆర్టిఫిషియాలిటీ యే దర్శనం ఇస్తోంది.బజారుకెళ్ళి అక్కడ అందంగా,అమర్చిన కూరలూ, పళ్ళూ చూశామంటే, మన immediate reaction ఏమంటే, వెంటనే అవి ఎంతఖరీదైనా సరే కొనేద్దామనే.తీరా ఇంటికి వెళ్ళి, ఆ పండు కోసిచూస్తామా, లోపల అంతా పచ్చిగానే ఉంటుంది.అంత ఉత్సాహమూ నీరుకారిపోతుంది.అలాగే కూరలూనూ, ఓ రుచీ పచీ ఉండవు. ఎక్కడో ఏ పేపరులోనో తరువాత చదువుతాము, కూరల్నీ, పళ్ళనీ ఏవేవో కెమికల్స్ తో తాజాగా కనిపించేటట్లుగా చేస్తారని. ఇదివరకటి రోజుల్లో, ఇలాటివి పెద్ద పెద్ద సిటీలకే పరిమితమయేవి. ఇప్పుడు గ్లోబలైజేషన్ ధర్మమా అని, ఎక్కడెక్కడో ఉన్న చిన్న చిన్న గ్రామాలకూ పాకేసింది.వాటిని తిన్నప్పటినుండీ, రోగాలూ రొచ్చులూ, డాక్టర్లూ ప్రారంభం.ఆ డాక్టరు దగ్గరకు వెళ్ళగానే, ముందుగా ఎలర్జీ అంటాడు. పైగా ఏమేం తింటే ఆరోగం వస్తోందో మనల్నే చూడమంటాడు. ఏం తింటే వస్తోందని చెప్తాము, మనం తినే ప్రతీ వస్తువూ కల్తీయే! ఈ రోజుల్లో, యాడ్లు చూసేసి, తామేదో పిల్లలకి చాలా పరిశుభ్రమైన డ్రింకులూ, రెడీ టు యూజ్ కూరలూ, ఒకటేమిటి ప్రతీదీ కొనేయడం, పిల్లల నోళ్ళల్లో కుక్కేయడం!, చిన్నప్పుడు మన అమ్మలూ,అమ్మమ్మలూ ఇంట్లో చేసే ప్రతీవస్తువు, టెట్రాప్యాక్కులో అమ్మేస్తున్నారు.

దరిద్రం కాకపోతే, ఉప్మా, వడా,ఇడ్లీ రెడీ ఫర్ యూజెమిటీ? పప్పు నానబోసి,హాయిగా రుబ్బుకుని ఇడ్లీ, గారె చేసికోకా?ఏమైనా అంటే, ఈ రోజుల్లో అంతంత టైమెక్కడుంటుందండీ అంటారు. అదీ నిజమే కదా.పోనీ ప్యాక్ చేసిన వస్తువులు ఏమైనా అంత పొడిచేశాయా అంటే, దాన్ని ఏ నెలో, రెండు నెలలో ఉంచనీయడానికి ఏదో ఒక preservative తగలేయాలిగా? ఇంక అదేదో ప్యూరూ, ప్యూరెస్టూ అని ఘోష పెట్టడమెందుకో?పైగా,వీటికో, డేట్ ఆఫ్ mfg.డేట్ ఆఫ్ expiry.అనోటీ. చిన్నప్పుడు మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళు పెట్టిన ఊరగాయలు ఎప్పుడైనా బూజు పట్టడాలు చూశామా? పైగా కొత్త ఊరగాయలు పెట్టేదాకా ఉండేవి. అలాగని ఇప్పటిలా సీసాల్లో కాకుండా, పెద్ద పెద్ద జాడీల్లో పెట్టి ఉంచేవారు.వాటికేమీ డేట్ ఆఫ్ mfg.డేట్ ఆఫ్ expiry ఉండేవి కావే? మహ ఉంటే, ఆ పెద్దావిడకే డేట్ ఆఫ్ expiry !!

అంతే కాదు, ఇంటికి ఎవరైనా వస్తే, ఏ భోజనాల టైమో అయితే, ‘కాళ్ళు కడుక్కుని, భోజనానికి లే నాయనా’ అనేవారు.’లే’ అనేకానీ, ‘లేదూ’ అనే మాటుండేది కాదు.ఆ వచ్చినవాడు మన చుట్టమో, పక్కమో కానఖ్ఖర్లేదు, ఎవరైనా సరే.అలాగని అందరూ, లక్షాధికార్లూ, కోటీశ్వరులూ కాదు.అభిమానమూ, ప్రేమా, ఆపేక్షా అస్సలు కల్తీ లేనివి.

ఇదివరకటి రోజుల్లో, ఏ పిల్లకైనా, పెళ్ళి చేయాలంటే, ఓ పెళ్ళిచూపుల తతంగం జరిగేది. ఇప్పుడు నెట్ లో ఓ ఫొటో పెట్టేస్తే సరిపోతుంది. పైగా ఆ ఫొటోకి చేసే హంగులూ, ఆర్భాటాలూ ఇంతా అంతా కావు.పోనీ, ట్రెడిషినల్ గా పిల్లని చూపిద్దామా అనుకున్నా, ఆ పిల్లని ఓ నాలుగైదు గంటలు ఏ బ్యూటీ పార్లర్ కో పంపడం, ఛకా ఛక్ గా చేయడం!

అంతదాకా ఎందుకూ, మొహాన్ని ఓ చిరునవ్వు కూడా నాచురల్ గా ఉండదు.అది కూడా ప్లాస్టిక్కే!నవ్వితే, ఎక్కడ మన నెత్తికి చుట్టుకుంటాడో, అని. లాఫింగ్ క్లబ్బులో ఏవో ఉంటూంటాయి. స్వతహాగా నవ్వు రావాలి కానీ, తెచ్చిపెట్టుకున్న నవ్వులతో రోగాలు రాకుండా ఉంటాయా మరీ చిత్రం కానీ! ఇదివరలో మేముండే, ఫ్లాట్ దగ్గరలో, సాయంత్రాలు, ఓ పాతికమంది ఆడా మగా చేరి ఏవేవో చేసి, చివర ఓ అరగంట సేపు ఒహ్హో అహ్హా హొహోహో..అంటూ అరుస్తూండేవారు.
ఏమిటా అని విచారిస్తే అదో లాఫింగ్ క్లబ్బన్నారు. పైగా నన్నూ చేరమన్నారు! అఖ్ఖర్లేదూ ఏదో ఇలా వెళ్ళిపోనీయండీ, మిమ్మల్ని చూస్తూంటేనే హాయిగా తనివి తీరా నవ్వుకుంటున్నాము.మాకు ఆమాత్రం నవ్వు చాలూ అన్నాను.

మన నాయకులూ, సెలిబ్రెటీసూ, స్టార్లూ పేద్ద పోజులిచ్చేసి, నవ్వేస్తూ, ఫుటోలకి దిగుతారు. ఒక్కడంటే ఒక్కడు, మనస్పూర్తిగా నవ్వినవాడిని చూస్తే ఒట్టు !చివరాఖరికి పెళ్ళిళ్ళ రిసెప్షన్లలో, కొత్త దంపతులతో వచ్చిన ప్రతీవాడితోనూ ఫుటోకి దింపుతారు. ఆ సీన్ height of artificiality !!

అసలు కల్తీలేని అసలు సిసలైన అభిమానమూ, నవ్వూ, ప్రవర్తనా ఉందంటే చిన్న పిల్లల దగ్గర మాత్రమే దొరుకుతుంది!!

%d bloggers like this: