బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–షార్టు కట్లు !!

   అసలు మనం ఈ షార్ట్ కట్లనేవి చిన్నప్పుడే నేర్చేసికుంటాము. పెద్ద అయేకొద్దీ, ఏదో వాటిని రిఫైన్ చేయడం తప్ప ఏమీ కొత్తగా నేర్చుకునేదేమీ లేదు. చిన్నప్పుడు క్లాసుల్లో పాఠాలు శ్రధ్ధగా వినని వారు, ఆరోజుల్లో గైడ్లని వచ్చేవి. వాటిల్లో మళ్ళీ వడబోసి imp అని కొన్నుండేవి. మళ్ళీ వాటిని వడబోసి ఇంట్లో ఉండే ఏ చిన్న పిల్లాడిచేత్తోనో చీటీలు తీయించడం.లేదా పుస్తకాన్ని పైకి గాలిలోకి ఎగరేసి,ఏ పేజీ వస్తే ఆ పేజీలో ప్రశ్నలు/జవాబులు చదవడం. మన అదృష్టం బావుందా, అలా చేసింతరువాత హీనపక్షం ఓ అరడజను ప్రశ్నలొచ్చినా సెప్టెంబరుకి వెళ్ళే అవసరం ఉండేది కాదు!

   ఈరోజుల్లో చూస్తూంటాము రోడ్డు మీద టూ వీలర్లు డ్రైవు చేసే చాలా మంది, ఛస్తే ట్రాఫిక్ రూల్స్ పాటించరు. ఎక్కడ ఛాన్సు దొరికితే అక్కడే షార్టు కట్లు! ఫుట్పాత్ మీద జుయ్యిమంటూ లాగించేయడమే. అక్కడ నడిచే నాలాటి అర్భకులు, ఏ గంగలో దిగితేనెమిటి? ఒక్కొక్కప్పుడు బస్సులోంచి దిగేటప్పుడు చూస్తూంటాము, బస్సుకి అదీ ఏ స్టాప్ లోనైనా ఆగినప్పుడు, ఎడంవైపునుండి ఏ వెహికిలూ రాకూడదు. అయినా సరే ఈ షార్టు కట్టు దరిద్రులు, అక్కడినుంచే వెళ్తారు. మనం చూసుకోకపోయామా గోవిందా!

   ఈవేళ సాయంత్రం నేనూ, మా ఇంటావిడా వాక్ కి వెళ్తూంటే చూశాము-ఫుట్ పాత్ ప్రక్కనే ఓ ఇంట్లోంచి,ఒకావిడ వచ్చి చేతిలో ఉన్న చెత్త బుట్టని, ఎదురుగా ఉండే డ్రైన్ లో ఖాళీ చేసేసింది.మరి వర్షాకాలంలో ఈ డ్రైన్లన్నీ ఛోక్ అయ్యేయంటే అవవూ మరి.రాజమండ్రీలో చూసేవాడిని, అక్కడ చాలా చోట్ల ఓపెన్ డ్రైన్లే చూసేవాడిని. పాపం మునిసిపాలిటీ వాళ్ళు ప్రతీ వీధికీ పెద్ద పెద్ద చెత్తకుండీలు పెట్టినా సరే, అవి కొద్దిగా దూరంగా ఉండడంతో, దగ్గరలో ఉండే ఓపెన్ డ్రైన్ లోనే వేసేవారు. ఇలాటివాళ్ళని భగవంతుడు కూడా బాగుచేయలేడు.

   అలాగే మనం ఈ రోజుల్లో చూస్తున్న ఎపార్ట్మెంట్లలో, ఏ అరటి పండైనా తిన్నాక, ఆ తొక్కని ఇంట్లో ఉండే డస్ట్ బిన్ లో వేయొచ్చుకదా, అబ్బే అలా చేస్తే మన ఘనతేముందీ? బాల్కనీ లోకి వెళ్ళి, కిందకు విసిరేయడం. రోడ్డు మీదెళ్ళేవాడెవడి నెత్తిమీదో పడుతుంది. వీడిదేం పోయిందీ? వీళ్ళనే అనఖ్ఖర్లేదు, కారుల్లో వెళ్ళే ఘనుల్నీ చూస్తూంటాము, ఆ విండో లోంచి, ఏ గుట్కా ఖాళీ పోచ్చో పడేస్తూంటారు. ఏమైనా అంటే ఓనరు కాదూ, ఛాఫర్ అలా చేస్తాడూ అనే అంటారు చాలా మంది.

   రైల్వే స్టేషన్లలో అయితే, చూస్తూంటాము, చాలామంది పట్టాలు దాటే వెళ్తూ.ఏ ట్రైను చక్రాలకిందో పడడం ప్రాణాలు పోగొట్టుకోవడం. హాయిగా ఓవర్ బ్రిడ్జి మీదనుంచి వెళ్ళొచ్చుకదా. అలాగే, లెవెల్ క్రాసింగులదగ్గరా అంతే, గేటు వేసున్నా సరే, దానికిందనుంచి దూరి వెళ్ళడం. ఒక్కోప్పుడు బైక్కులూ, స్కూటర్లూ కూడా దాటిస్తూంటారు.ఇంక దగ్గరగా ఉంది కదా అని ఒన్ వే లోంచికూడా దూసుకుంటూ వెళ్ళడం ఎప్పుడూ చూసే దృశ్యమే! కార్ పార్కింగు గురించైతే అడగఖ్ఖర్లేదు. అవతలివాడు కారు ఎలా తీసికుంటాడో అని ఆలోచించకుండా, తనిష్టం వచ్చినట్లు పార్కింగు చేయడం.

   ఈ షార్ట్ కట్ సిండ్రోమ్ నుండి ఎప్పుడు బయట పడతామో?

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-హిపోక్రసీయో అదేదో అంటారు…

   ఈ హిపోక్రసీ అంటే తెలుగులో అర్ధం ఎమిటో మాత్రం తెలియదు! ఇదేదో నా హిపోక్రసీ అనుకోకండేం.నిజంగానే తెలియదు. నా భాషా పరిజ్ఞానం చాలా తక్కువ. ఉన్నదున్నట్లుగా ఒప్పుకోవడమే, హిపోక్రసీ అనరూ అని మాత్రం తెలుసు.మొన్నెప్పుడో భక్తి టి.వీ. లో ‘మహాభారతం’మీద శ్రీ గరికపాటి వారి వ్యాఖ్యానం లో ఆయనంటారు– మనిషి ముందుగా 1. లోకులు తనగురించి ఏమనుకుంటున్నారో తెలిసికోవాలిట. 2. తను తనగురించి ఏమనుకుంటున్నాడో తెలిసికోవాలిట. 3. అసలు నిజంగా తనేమిటీ ! ఈ మూడు విషయాలూ ప్రతీవాడూ తప్పకుండా తెలిసికుంటే జీవిత సత్యం ఏమిటో తెలుస్తిందిట. ఏమిటో అంతా అగమ్యగోచరంగా ఉంది ఈ వేదాంతం అంతా వింటూంటే. అయినా వినడం మాత్రం మానను. ఎందుకంటే ఆయన చెప్పేవిధానం చాలా బాగుంటుంది. వచ్చిన గొడవల్లా నా ఐ.క్యూ. తోనే.అది చాలా నిమ్న స్థితి లోనే ఉంటుంది ఎప్పుడూ!అర్ధం అయినా అవకపోయినా ఊరికే వినేయడం, కనిపించిన ప్రతీవాడితోనూ దానిగురించి చర్చించేయడమూ, అక్కడికేదో జీవిత సత్యాలు అన్నీ తెలిసినట్లు! ఇదే అనుకుంటా హిపొక్రసీ అంటే!

   ఉన్నదున్నట్లుగా ఒప్పుకోవడానికి అసలు ఏం రోగమంట? ఉదాహరణకి కుక్కల్ని చూస్తే నాలాటివాళ్ళకి చాలా భయం. చెప్పుకోడానికి ఏమీ సిగ్గు పడను. కానీ కొంతమందిని చూస్తూంటాము, ‘నాకు కుక్కలంటే ఎలర్జీ అండి.నాకు అసహ్యం అండీ’ అంటూ అక్కడికేదో మిగిలిన జంతుజాలం అంటే ఎంతో అభిమానం అన్నట్లుగా మాట్లాడతారు.ఇదిగో దీన్నే హిపొక్రసీ అంటారనుకుంటాను.ఇంకొంతమందిని చూస్తాము, ఊరికే అయినదానికీ కానిదానికీ గొప్పలు చెప్పేసికోవడం.కొంతమందైతే, తాము చదివినవో, చదవాలనుకున్నవో, పుస్తకాల గురించి చెప్తూంటారు.అవతలివాడితో మాట్లాడుతూ, ‘అర్రే మీరు Alchemist చదవలేదా, The monk who sold his ferrari గురించి వినలేదా, అయ్యో మీరు జివితంలో చాలా కోల్పోతున్నారండీ..’ అంటూ బొరుకొట్టేయడం. ఈ సంభాషణలో ఈయన సాధించినది ఏమిటంటే, తను మార్కెట్ లో బెస్ట్ సెల్లర్ పుస్తకాల గురించి (చదివాడో లేదో ఆ భగవంతుడికే తెలియాలి)తెలిసినట్లూ, ఎందుకంటే అవతలివాడు ముందరే తనకు ఆ పుస్తకాల గురించి ఏమీ తెలియదని ఒప్పేసికున్నాడు కాబట్టి, వాణ్ణి హొరెత్తించేయొచ్చు. ఇంత గొడవ అసలు అవసరమంటారా? నాలాటివాడికి ఇలాటి పుస్తకాలు అర్ధం అవవు. నాకు చేతన్ భగత్, ఇంకో సిడ్నీషెల్డన్, ఛేజ్ అంటే ఇష్టం. అలాగని ప్రతీ వాడిదగ్గరకూ వెళ్ళి టముకు వేసికోను. లైట్ రీడింగ్ ఇష్టం. తప్పా?

   అసలు సిసలైన ప్యూర్ 99.99% బంగారం లాటి హిపొక్రైట్లు మన నాయకులు! అదేదో, మార్చ్ అంటారు, ధర్నా అంటారు ఇంకోటేదో అంటారు. ఊరికి ముందరే అరెస్టయి జైల్లో కూర్చుంటారు. ఎందుకంటే, అసలు హడావిడి జరుగుతున్న చోటకి వస్తే జరిగేదేమిటో వాళ్ళకీ తెలుసు.పోలిసులూ, ప్రభుత్వమూ వారితో ముందరే మొరపెట్టేసికుంటారు. స్వామీ నన్ను అరెస్ట్ చేసేయండీ, దాంతో నా ఇమేజీ పెరుగుతుందీ, గొడవలు జరిగే చోటకి వెళ్ళి తన్నులూ తినఖ్ఖర్లేదూ. సాయంత్రం బెయిల్ మీదొచ్చేస్తానూ, రాత్రికి మందు పార్టీ చేసుకుందామూ అని ఓ ఒప్పందానికి వచ్చేస్తారు. మర్నాడు రోజంతా చానెళ్ళలో మొసలి కన్నీళ్ళు కార్చేయొచ్చు అయ్యో అయ్యో ఎంతపనైపోయిందీ, మేము ముక్త కంఠంతో ఫలానా సంఘటనని ఖండిస్తున్నామూ అంటూ!చివరకి వెర్రివెధవలయ్యేది మనమూ!

   ఏ సంఘటనవనీయండి, ఎక్కడవనీయండి, మనం ఎన్నుకున్న నాయకుడెవడూ తుపాగ్గుండుకి కనబడ్డు.ఎక్కడున్నాడయ్యా రోజంతా అంటే,అంతకు ముందు రాత్రే హాయిగా జైల్లో కూర్చుంటాడు!వీళ్ళు మాత్రం పుటం వేసినా బాగుపడరు.మన ప్రజా జీవితంలో ఎక్కడ చూసినా ఈ హిపోక్రసీ తాండవం చేస్తోంది. ఉదాహరణకి పూణే లో వినే ఉంటారు. నాలుగేళ్ళ క్రితం హస్సన్ ఆలీ అనేవాడు, 3000 కోట్ల రూపాయల మనీ లాండరింగు చేశాడని పేపర్లలోనూ, చానెళ్ళలోనూ గోలెట్టారు.ఈ నాలుగేళ్ళూ హాయిగా తిరిగాడాయన. ఈ మధ్య కోర్టువాళ్ళకి, ఈ.డీ. వాళ్ళకీ గుర్తొచ్చింది,వాడు పెట్టిందంతా తిని ఇన్నాళ్ళూ,ఓ సారి వాడిళ్ళమీద రైడ్లు చేద్దామూ అని! ఓ వారం క్రితం హడావిడి చేసేసి, ‘ఒకే సమయంలో వివిధ నగరాల్లోనూ
రైడ్లు చేసేసి, ఆ హసన్ ఆలీని అరెస్ట్ చేసేసి, కోర్టులో హాజరు చేశారు. చివరకి జరిగిందేమిటయ్యా అంటే, ఆ జడ్జీ గారు,అసలు వీడిమీద అరోపణేమిటో నాకు తెలియడం లేదూ, వీడికి జ్యుడీషియల్ కస్టడీ ఎందుకూ అన్నారు.ఇదిగో ఇలా ఉంటుంది. అసలు ఏమీ చేయాలనే ఉండదూ, మరీ అలా కనిపించేటట్లుగా చేస్తే బావుండదూ ఇదిగో దీన్నే గ్లోరిఫైడ్ హిపోక్రసీ అంటారు.

   కొసమెరుపు : ఇప్పుడే తెలుగు చానెల్స్ లో స్క్రోలింగు లో చూశాడట మా తమ్ముడు రాజమండ్రీ నుంచి ఫోను చేశాడు–తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ఇటుపైన పంచదార బదులు బెల్లం తో చేస్తారుట. హాయిగా’ బెల్లం మిఠాయి’ అనొచ్చుగా! నాకు బెల్లం మిఠాయి అంటే ఎంత ఇష్టమో ఇదివరకే చెప్పాను.అందుకే కాబోలు,ఆ దేముడు కూడా వరం ఇచ్చేశాడు.

%d bloggers like this: