బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- కాలక్షేపం


   ఇదివరకటి రోజుల్లో, మనిషి వేసికున్న దుస్తులతో, వారిని గుర్తించేవారు. ఉదాహరణకి ఏ తెలుగు మాస్టారో ఉన్నారనుకునుకోండి, ఆయనని ఎప్పుడు చూసినా పంచ,లాల్చీ, కండువా ఒక్కొక్కప్పుడు నున్నని గుండుతో కూదా ఉండేవాళ్ళు.అదే ఏ ఇంగ్లీషో, సైన్సో, సోషలో లేక లెఖ్ఖలో చెప్పేవారు ప్యాంటూ షర్టూ తో కనిపించేవారు. డ్రిల్లు మాస్టారైతే చేతిలో ఓ విజిలూ, తెల్ల ప్యాంటూ,తెల్ల షర్టూ తో, అలాగన్నమాట.స్కూల్లో గంట కొట్టే ప్యూనైతే, ఓ పంచా, తెల్ల పొట్టిచేతుల చొక్కా
నెత్తిమీద ఓ తలపాగా!

అలాగే ఏ శానిటరీ ఇనస్పెక్టరో, బిల్లు కలెక్టరో అయితే ఓ కాఖీ నిక్కరూ,పొట్టిచేతుల చొక్కా, అన్నిటిలోకీ ముఖ్యం నెత్తిమీద ఓ టోపీ! పైగా అదో తమాషాగా ఉండేది.దాన్ని ఏమని పిలుస్తారో కూడా తెలియదు.దానికి పైన ఓ ప్లాస్టిక్ కవరు కూడా ఉండేది. చాలా బరువోటి, మరీ గాలి వీస్తే ఎగిరిపోకుండా, దానికి కింద ఓ బెల్టూ! కలెక్టరాఫీసులో పనిచేసే డఫేదారునైతే, అతను ఏటవాలుగా ధరించే డవాలో ఏదో అనేవారు.ప్లీడర్లైతే ఓ నల్లకోటూ, మెడలో అదేదో టై రూపంలో, ఓ తెల్లగా ఉండే గుడ్డముక్కలూ!మరీ వయస్సులో పెద్దవారైతే పంచ,చొక్కా, తలమీద ఓ తలపాగా!

ఇంక పోస్టుమానూ, ఎలట్రీ ఆఫీసువాళ్ళూ అయితే ఓ ఖాకీ ప్యాంటూ,చొక్కా.అలాగే బస్సు డ్రైవరూ, కండక్టరూ కూడా ఖాకీ బట్టలే! ఎప్పుడూ ఇస్త్రీ బట్టల్లోనే ( పైగా రోజుకోటీ) కనిపించేవాడైతే తప్పకుండా, బట్టలుతికే చాకలే! అలాగే అర్ధముండితం తో( అంటే సగం జుట్టు తీసేసి, వెనక్కాల ఓ జడలాటి కొప్పుతో) ఉన్నారంటే ఆయన తప్పకుండా ఏ దేవాలయం లోనో అర్చకుడన్నమాటే ! సాయంత్రం పూట ఓ ఖాకీ నిక్కరూ బనీనూ/తెల్ల చొక్కా వేసికున్నవారిని చూస్తే, వారు ఆర్.ఎస్.ఎస్. శాఖకి వెళ్తూన్నట్టే ! ఈ వ్రాసినవన్నీ ఎవరినో ఎగతాళి చేయడానికీ, వారి ఫీలింగ్స్ హర్ట్ చేయడానికీ కాదు. వారి వారి వేష ధారణ బట్టి ఎవరెవరో గుర్తించే సౌలభ్యం గురించి చెప్పడానికి మాత్రమే!

అలాగే, ఏ పనీ పాటా లేకుండా సాయంత్రాలు ఓ బులెట్ మోటార్ సైకిలు మీద,ఓ జర్దా కిళ్ళీ నములుతూ, సిగరెట్ ఊదుకుంటూ, ఓ ప్యాంటూ దానిమీద ఓ గ్లాస్కో/పట్టు /సిల్కు చొక్కాయో వేసికుని, పైగా లోపలేసికున్న కట్ బనీన్ తో సహా కనిపించేటట్లు, మెళ్ళో ఓ పులిగోరు గొలుసుతో కనిపించాడూ అంటే, వాడికి తాతలు గడించిన ఆస్థి చాలా ఉందన్నమాటే!దసరా బుల్లోడి లాగ బలాదూర్ గా తిరగడమే అతని హాబీ ! ఏ కిళ్ళీ కొట్టు దగ్గరో బైక్కుకి స్టాండేసి, చుట్టూరా అతనికి భజన చేసే వాళ్ళున్నారంటే అసలు అనుమానమే లేదు!

వీళ్ళే కాకుండా, చుట్టుపక్కల గ్రామాల్లో వైద్యం చేసే ఆర్.ఎం.పీ డాక్టర్లుండేవారు, ఓ సైకిలూ, దానికి క్యారీయర్ మీద మందులున్న ఓ తోలు పెట్టీ ! ఇంక ఊరూరా తిరిగి జాతకాలూ, భవిష్యత్తులూ చెప్పే చిలక జ్యోతిష్కులూ, కొండ దొరలూ అయితే, వాళ్ళని చూడగానే గుర్తించేయొచ్చు.అలాగే రాత్రిళ్ళు తొమ్మిది దాటింతరువాత, గంట వినిపించిందంటే, ఓ బండి మీద గోలీ సోడాలమ్మే మనిషి వస్తున్నట్లే! రాత్రి భోజనాలు తిని, వెన్నెల్లో ఓ పడక్కుర్చీయో,మడతమంచమో వేసికుని, ఓ గోలీ సోడా తాగేమంటే ఉండే మజా అనుభవిస్తేనే తెలుస్తుంది.

1990 ముందర పుట్టిన చాలా మందికి స్వయంగా ఆస్వాదించినవో, ఇంట్లో ఉండే ఏ పెద్దవారో ఓ తాతయ్యనండి, ఓ అమ్మమ్మనండి, ఓ నానమ్మనండి ఓ మామయ్యనండి లేకపోతే పిల్లనిచ్చుకున్న ఓ అత్తయ్యనండి,ఎవరో ఒకరి ద్వారా తెలిసికునే అదృష్టమైనా ఉంది. కానీ ఈ తరం ( కొత్త శతాబ్దంలో పుట్టిన వారు) వారికి, ఈ నాస్టాల్జియా ఉంటుందా? వాళ్ళని చూస్తూంటే జాలేస్తోంది. హా ఈ జ్ఞాపకాలూ సింగినాదమూ ఏమైనా తిండి పెడతాయా అంటే చెప్పేందుకేమీ లేదు.
ఎంత చెప్పినా ఆ జ్ఞాపకాలలోని ఆనందమే వేరు.

ఇంక వేషధారణ సంగతి చెప్పాలంటే,ఈ రోజుల్లో మన ఇంటికి వచ్చే పనిమనిష్యులే(maid,cook అనాలి కాబోలు!) మన ఇంట్లో వాళ్ళకంటే బాగా డ్రెస్ వేసికుంటున్నారు. అసలు ఈ గొడవంతా ఎందుకు వచ్చిందంటే ఈ వేళ సాయంత్రం వేషం
వేసికుని అదేనండీ ఓ ప్యాంటూ, షర్టూనూ పైగా ఈ మధ్యన నా కొత్త ప్యాంటులన్నీ జారిపోతున్నాయి లూజయ్యి. మా ఇంటావిడంటుందీ, అమ్మయ్య మీ పొట్ట తగ్గిందీ అని. ఛస్తుందా పొట్ట తగ్గకుండా, ఆవిడతో ప్రతీ రోజూ వాకింగుకి వెళ్తూంటేనూ! మేముండే సొసైటీ లో రాత్రిళ్ళొచ్చే వాచ్ మన్ డ్యూటీకి వస్తూ కనిపించాడు. పైగా అతనిదీ నాదీ యూనిఫారం లా ఒకే రంగు షర్టూ, ఒకేరంగు ప్యాంటూనూ! అప్పుడెప్పుడో రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, గళ్ళ చొక్కా వేసికుంటే
ప్యాంట్రీ కారు ఎటెండెంటనుకుని చాయడిగాడు ఓ ప్రబుధ్ధుడు. ఇంక నేను ఈవేళ వేసికున్న వేషం కనుక మార్చకపోతే, మా సొసైటీ లో ఏ ఫోర్త్/ఫిఫ్త్ ఫ్లొర్ వాడో, నీళ్ళ పంపు స్టార్ట్ చెయమనొచ్చు !!

Advertisements

3 Responses

 1. >ఎప్పుడూ ఇస్త్రీ బట్టల్లోనే ( పైగా రోజుకోటీ) కనిపించేవాడైతే తప్పకుండా, బట్టలుతికే చాకలే!
  :-))

  Like

 2. బాగా రాసారు. ఈ యూనిఫార్మ్ కి సంబంధించిన ఒక సంఘటన గుర్తొస్తోంది నాకు. ఒకసారి మేము హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగాము. అప్పుడే రెండు మూడు ఫ్లైట్ లు వచ్చినందువల్ల ట్రాలీల కి కొరత ( పాత ఎయిర్ పోర్ట్). జనాలు ట్రాలీల కోసం సినిమా టిక్కట్ల క్యూలో కొట్టుకున్నట్టుగా గొడవ పడుతున్నారు. ఒక ఆసామీ ట్రాలీ దొరకలేదన్న కోపంతో ఎవరూ, ఏమిటీ అని చూడకుండా పక్కనే ఉన్న ఒకతన్ని పట్టుకుని ” ట్రాలీలు ఎందుకు దొరకడం లేదు? మీరంతా ఏం చెస్తున్నారు?’ లాంటి ప్రశ్నలతో కడిగేయడం మొదలు పెట్టాడు. ఆ పక్కనున్న ఆయన తప్పల్లా, ఎయిర్ పోర్ట్ సిబ్బండి లా, లేతనీలం చొక్కా, ముదురు నీలం పాంటూ ధరించడమే. ఆయన పాపం అయోమయంగా “నన్నెందుకు అడుగుతున్నారు? నేను కూడా మీలాగే ఇప్పుడే వచ్చాను” అన్నారు. మొదటాయన తన తప్పు గమనించి సారీ చెప్తారేమో అని చూశాను. కానీ ఆయన విచిత్రం గా.. ‘ అయితే మరి మీరెందుకు ఇలాంటి ఐర్పోర్ట్ వాళ్ళ లాంటి ద్రెస్స్ వేసుకున్నారు?” అని విసుక్కున్నాడు. ఇది జరిగి ఏడేళ్ళయినా ఇంకా మర్చిపోను నేను.. వేషధారణని బట్టి మనమే వారు ఎవరయి ఉండవచ్చు? అని నిర్ణయించేయడమూ, మన అవసరం తప్ప మరేదీ ఆలోచించలేకపోవడమూ.. ఎప్పటికి మారతామో?

  Like

 3. @sbi,
  మరి అంతే కదండీ !!

  @సుభద్ర గారూ,

  ఇప్పుడు రైల్వే స్టేషన్లలో చూస్తూంటాము. నల్ల కోటు వేసికున్న ప్రతీ వాడూ టీ.టీ. లాగే కనిపిస్తాడు!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: