బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- కుక్కేయడం…


   ఈ ‘కుక్కేయడం’ అనే పదం,కావలిసినన్ని సందర్భాల్లో వాడుకోవచ్చు.ఇదివరకటి రోజుల్లో, ఎప్పుడైనా ప్రయాణాలు చేయాల్సొస్తే, తీసికెళ్ళే బట్టలన్నిటినీ ఓ ట్రంకు పెట్టిలొనో, హోల్డాలు లోనో కుక్కేసేవారు. అలాగే రైళ్ళలో, unreserved compartment లో జనం కిక్కిరిసి ఉంటారు. ఇదికూడా కుక్కేయడం లోకే వస్తుంది.బస్సుల్లో అయితే ప్రతీ రోజూ చూస్తూనె ఉంటాము.చివరాఖరికి మన బట్టలు ఏ ఇస్త్రీ కైనా తీసికెళ్ళాలంటే ఓ క్యారీ బాగ్ లో కుక్కేసి తీసికెళ్తాము.చెప్పొచ్చేదేమిటంటే, ఉన్న అసలు కెపాసిటీ కంటే ఎక్కువగా సర్దడానికి ప్రయత్నించడం. దాని పరిణామాలు ఎలా ఉంటాయో తెలుస్తూనే ఉంది.

ఈ ప్రక్రియలోకే వస్తుంది, ఈ రోజుల్లో చిన్న పిల్లల బుల్లి బ్రైనులోకి తల్లితండ్రులు, వాళ్ళు చేయలేకపోయినవన్నీ కుక్కేయడం!అసలా బుల్లి బుర్రెంతుంటుందండీ పాపం. ఏమిటో మాటలు వచ్చినప్పటినుండీ, వాళ్ళని హోరెత్తించేయడం.ఒకటని కాదు, ప్రపంచంలో ఉన్న విశేషాలన్నీ, మన పిల్లలకే వచ్చేయాలి. వాళ్ళ రిటైనింగ్ కెపాసిటీ ఏమిటో తెలిసికుంటే ఏం పోయిందిట? ఏమైనా అంటే, కాంపిటీటివ్ ప్రపంచంలో, అలా ఉండకపోతే, ఎందుకూ పనికి రారూ అని ఓ సమర్ధింపోటీ.అసలు ఆ చిన్ని బుర్రలకు విశ్రాంతి అనేది ఏమైనా ఉంటుందా అనికూడా ఆలోచించరు. ఇదివరకటి రోజుల్లో వేసంగి శలవల్లాటివి వస్తే, పిల్లల్ని తీసికుని ఏ అమ్మమ్మగారింటికో, నానమ్మ గారింటికో తీసికెళ్ళేవారు. ఆ పిల్లల ప్రాణాలకీ హాయిగా ఉండేది.ఆ శలవల్లో తాతయ్యలు చెప్పే కబుర్లతోనూ, అమ్మమ్మ/నానమ్మ లు వండిపెట్టిన పిండివంటలతోనూ, తమతమ బ్యాటరీలు రీఛార్జ్ చేసేసికుని,తిరిగి వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి ఫ్రెష్ గా స్కూళ్ళకి వెళ్ళేవారు.ఇప్పుడు, ఏ కొద్దిమందిలోనో తప్ప ఈ concept అటకెక్కేసింది.

ఈ రోజుల్లో శలవలొచ్చాయంటే, ఇంకొక సో కాల్డ్ ఆర్టులో ట్యూషనుకి పంపిద్దామా అనే కానీ, పోనీ ఏడాదంతా స్కూలుకెళ్ళడానికి ప్రొద్దుటే నిద్రలేవడం,సాయంత్రాలు ట్యూషన్లతోనూ బుర్ర వేడెక్కిపోయిందే, ఈ శలవల్లోనైనా, హాయిగా కంటి నిండుగా నిద్రపోనిస్తారా అంటే అదీ లేదు.ఏ స్విమ్మింగో, డాన్సింగో, మ్యూజిక్కో అంటూ వాళ్ళ ప్రాణాలు తీస్తారు.వీటికి సాయం టీ.వీ. ల్లో వచ్చే ‘సరిగమ’,పాడుతా తీయగా’ ‘సూపర్ సింగరూ’, అదీ ఇదీ కాకపోతే ‘ఆట’ డ్యాన్స్ బేబీ డ్యాన్సో’ ఇంకో మట్టీ మశానమో!ఆ పిల్లల దారిన పిల్లల్ని వదిలేస్తే, వాళ్ళకి దేంట్లో ఇష్టమో చెప్తారుకదా.అబ్బే వాళ్ళకేం తెలుస్తుందండీ చిన్న పిల్లలూ అనడం. అక్కడికి వీళ్ళకే అన్నీ తెలిసినట్లు!

ఇంక క్రమశిక్షణ పేరుతో, చిన్న పిల్లల్ని పెట్టే బాధలు అన్నీ ఇన్నీ కావు.ముఖ్యంగా తిండి విషయంలో,ఏ డాక్టరునడిగినా చెప్తారు, వాళ్ళకి కావలిసిందేదో తింటారు, బలవంతం చేయొద్దూ అని.మనం ఏ నెట్ లోనో చూడ్డం,లేకపోతే, టి.వీ ల్లో వచ్చే ప్రకటనల ప్రభావం అనండి,ఫలానా క్యాలరీల తిండి తినాలీ, లేకపోతే అదేదో యాడ్ లో చెప్పినట్లుగా,సైకిలు తొక్కేటప్పుడు పెడలందదూ, మామిడికాయ చేతికందదూ,వయస్సొచ్చేస్తోందీ. మరి ఆ ప్రకటనల ప్రకారం, ఓ కాంప్లాన్ త్రాగేసి, ఫార్ట్యూన్ నూనె తో సమోసాలు చేసేసికుని,ధారా నూనెతో గారెలూ, జిలెబీలూ తయారుచేసికుని, మాగ్గీ నూడిల్స్ తాగేసో,తినేసో, ఓ లైఫ్ బాయ్ సబ్బుతో ప్రతీ రోజూ స్నానం చేసేసి రోజులు గడిపేస్తే, మరి లక్షలు పోసి డిగ్రీలు తెచ్చుకున్న డాక్టర్లందరూ ఎక్కడకి పోతారమ్మా వల్లకాట్లోకా?

అందువలన ప్రకటనలని నమ్ముకుని చిన్న పిల్లలకి టైంటేబుల్ ప్రకారం, రోజంతా నోట్లో కుక్కేస్తూ ఉంటే వాళ్ళకి విశ్రాంతనేది ఎక్కడా?పైగా ఇంకో గోలోటీ,పళ్ళెంలో పెట్టిందంతా పూర్తిచేయాలీ అని!కడుపు అనేదొకటి ఉందికదా, దానికీ లిమిటెడ్ కెపాసిటీ ఉంటుంది. దాంట్లొకి వెళ్ళకలిగినంతే వెళ్తుంది. ఎక్కువయితే బయటకి వచ్చేస్తుంది. ఏదో వాళ్ళకి కావలిసినదేదో తిననీయాలి కానీ, ఈ క్రమశిక్షణ పేరుతో హింసించకూడదు.తల్లితండ్రులు, వాళ్ళేదో పిల్లల్ని ఆరోగ్యంగా పెంచుతున్నామనే అపోహలో ఉంటున్నారు. అంత ఆరోగ్యంగా పెంచుతూంటే, ఏ child specialist దగ్గరైనా అంతంత క్యూలు ఎందుకుంటాయీ? ఏమైనా అంటే, అంతా పొల్యూషన్ మహాత్మ్యం అంటారు కానీ, వాళ్ళు తిండి విషయంలో పిల్లల్ని హింసిస్తున్నారూ అనే విషయం మాత్రం ఒప్పుకోరు! పెద్దాళ్ళు ఈ విషయంలో జోక్యం చేసికోకూడదు. వాళ్ళంతా బూజు పట్టేసిన వాళ్ళు!
అంతదాకా ఎందుకూ,కంచంలో పెట్టిన ఆధరువులనే తిసికోండి, శుభ్రంగా అన్నంతో కలిపి తినిపిస్తే ఎంత బావుంటుందీ, అబ్బే అలా కాదు, వేళ్ళతో కోడి కెక్కరించినట్లు సుతారంగా,నామ్ కే వాస్తే ఓసారి రాసేసి నోట్లో, అదీ నోరు మరీ తెరవకూడదు పడేయడం. ఏమైనా అంటే ఎవరి పనులు వాళ్ళు చేసికోడం ఇప్పటినుండీ నేర్పకపోతే ఎలాగా అనడం.ఇదంతా చూసి ఆహా ఓహో అని తల్లితండ్రులు మురిసిపోవడం.

చెప్పొచ్చేదేమిటంటే, ఈ రోజుల్లో పిల్లో, పిల్లాడో పుట్టినప్పటినుండీ ఈ’ కుక్కేయించుకోవడం’ అనే చిత్రహింసకి బలైపోతున్నాడు.మరి ఎక్కడ చూసినా కాంపిటీషనాయె! ఎవడెక్కువ తింటే వాడు ఫస్ట్. ఎవడికెక్కువ బట్టలుంటే వాడు ఫస్ట్.
సర్వే జనా సుఖినోభవంతూ !

6 Responses

 1. 🙂 నిజమే.. బాగా చెప్పారు.. ఎప్పటిలాగే..

  Like

 2. కుక్కేయడం గురించి చదివాక నేను రెండు రోజులక్రితం మద్రాసుకు వెళ్ళినప్పుడు
  మా మనవళ్ళ పరిస్థితి చూస్తే జాలేసింది.కానీ వాళ్ళు మాత్రం జాలీగానే వున్నారు.
  పెద్దవాడు నృపేష్ కు 11 ఏళ్ళు, చిన్నవాడు హ్రితీష్ కు 9 ఏళ్ళు. వాళ్ళు వైలెన్
  క్లాసులకు, క్రికెట్ ట్రైనింగులకి, మధ్యలో చిన్నవాడికి ఎక్స్ట్రాగా కరాటే ఒకటి. అందుకే
  ఒకసారి నా బ్లాగులో వ్రాశా. మన రోజులే బాగున్నాయని. మనం జాలి పడుతున్నాం
  గానీ మన పిల్లలు, వాళ్ళ పిల్లలూ జాలీగానే వున్నారు !! అన్నట్లు, బాపు గారిని,
  వాళ్లబ్బాయి వరను కలసి వచ్చాను.

  Like

 3. నిజం సార్. ఆ దరిద్రం ఇక్కడ కూడా వుంది. కుమాన్ లాంటి ప్రైవేటు ట్యూషన్లు చెప్పించడంతో సహా వివిధ కళల్లో తమ పిల్లలు ప్రావీణ్యులు కావాలని ఆరాటంతో వారాంతం కూడా పిల్లలు తమకు ఇష్టం వచ్చిన ఆటలు ఆడకుండా ఎన్నిట్లోనో తోసేస్తున్నారు.

  Like

 4. తమాషా ఏమిటి అంటే పిల్లలు కూడా దానికి అలవాటు పడిపోయారు!
  తల్లిదండ్రులే దానికి ముఖ్య బాధ్యులు.
  అన్ని కళలలో వాళ్ళు ఆరితెరిపోవాలనే ఆరాటంలో వాళ్ళ బాల్యాన్ని చిదిమేస్తున్నాం.
  తప్పకుండా భవిష్యత్తులో దాని మూల్యం చెల్లించ వలసి వుంటుంది
  అందుకే ముందే మేలుకుంటే బావుంటుంది
  అందమైన బాల్యం వాళ్ళకి అందించాలి. ఆ తీపి గుర్తులు వాళ్ళు పెద్దయాక అనుభవించాలి

  Like

 5. @కృష్ణప్రియా,

  ధన్యవాదాలు. ఎప్పటిలాగే !!

  @గురువుగారూ,
  మీరు చెప్పింది నిజమేనండి.ఊరికే మనమే వాళ్ళేదో శ్రమ పడిపోతున్నారేమో అని బాధ పడడం ఒకటే మిగిలింది.!!

  @శరత్,

  ‘ప్రాపంచీకరణం’ ప్రభావం !!

  @ఫల్గునీ,

  నిజమే.

  @శ్రీ,

  మీరు పెట్టిన లింకు చూశాను. ఆధునికం వెర్రితలలు వేయడం అంటే ఇదేనేమో !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: