బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

TulasiTL2

    కొద్ది రోజుల క్రితం ‘సాక్షి’ మహరాష్ట్ర ఎడిషన్ చదువుతూంటే, పైన ఇచ్చిన వార్త కనిపించింది. అర్రే ఈ ఊళ్ళోనే ఇన్నాళ్ళనుండీ ఉంటూ, ఈవిడ గురించి విననేలేదే అని బాధ పడిపోయాను. పోన్లే ఇప్పుడైనా తెలిసిందీ, పరిచయం చేసికుంటే బావుంటుందేమో అనిపించింది.సాక్షి వారేమో, ఆవిడ ఎడ్రసు వ్రాయలేదూ, పైగా ఆవిడ చేసే పని గురించి శుధ్ధ తెలుగులో వ్రాశారాయే. ఏం చేయడం, పోనీ ఆవిడ పెరు గూగులమ్మలో వెదికితే పోలా అనుకుని, ‘తులసి’ అని టైపుచేయగానే
क्यूंकी सास भी कभी बहू थी!, मै तुलसी तेरॅ आंगन कॅ
! లోని తులసి పాత్రలని గురించి వ్రాశారు!ఇదెక్కడి గోలరా బాబూ అనుకుని అచ్చ తెలుగులో సాక్షి వారు వ్రాసిన, ఆవిడ పనిచేసే ఆఫిసు పేరు” మహరాష్ట్ర పాఠ్యపుస్తక నిర్మితి,పాఠ్యప్రణాలికా పరిశోధనా సంస్థ’ ని, నాకున్న మిడిమిడి ఇంగ్లీషు జ్ఞానం తో ‘Maharashtra State Bureau of Text Book Production &Curriculum research’ అని అనువదించి, మొత్తానికి ఆవిడని పట్టుకోగలిగాను. ఆవిడకి ఫోను చేసి, నా పధ్ధతిలో పరిచయం చేసికుని, ఆ కబురూ, ఈ కబురూ చెప్పి, మిమ్మల్ని కలవడానికి మీ ఆఫీసుకెప్పుడు రమ్మంటారూ అని అడిగేశాను. అప్పటికీ, మా ఇంటావిడంటూనే ఉంది. ‘అదేమిటండీ మొదటి పరిచయం లోనే, మీ ఇంటికి ఎప్పుడు రానూ, మీ ఆఫీసుకెప్పుడు రానూ అంటారూ, వాళ్ళకి ఇష్టం ఉంటుందో లేదో” అని.

    ” చూడూ, నాకు కొత్త కొత్త పరిచయాలు చేసికోవడం ఇష్టం. ఆవిడే ఎప్పుడో ఫోను చేస్తానన్నారుగా, చూద్దాం, ఫోను చెస్తే వెళ్తాను లేకపోతే రాం రాం,ఓకేనా ?” ఆఫీసెక్కడో చెప్పనే చెప్పారు, చూద్దాం.చాలా రోజులు ఆవిడ దగ్గరనుండి ఫోనొస్తుందేమో, వెళ్దామూ అనుకున్నాను. ఫోను రాదే.ఆఫీసెక్కడో తెలుసును కాబట్టి, నిన్న తిన్నగా ఆవిడ ఆఫీసుకెళ్ళి కలుసుకుందామని నిశ్చయించేసికున్నాను.నిన్న ఆ క్రెడిట్ కార్డు దొరికిన ఆనందంలో ఉన్నానేమో, మూడ్ కూడా చాలా బావుంది. మా కోడలు ఆఫీసుకెళ్ళే టైములో, అబ్బాయితో కలిసి ఆవిడ పనిచేసే ఆఫీసుకెళ్ళాను.

    అప్పటికి ఆవిడ ఇంకా రాలేదు. ఆ ఆఫీసులో ఉండే ఆవిడ స్టెనో కి అప్పగించేశాడు, సెక్యూరిటీ వాడు. సరే ఎండలో కూర్చునే బాధ తప్పిందికదా అని సంతోషిస్తూ, ఆవిడ ఆఫీసులోనే కూర్చున్నాను. ఒక విషయం మాత్రం గమనించాను- రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలమీద, నాకు చాలా దురభిప్రాయం ఉండేది ఇది వరలో. ఏదో ఓ చిన్న ఆఫీసూ, దాంట్లో విరిగిపోయిన టేబుళ్ళూ,ఎప్పుడు పడిపోతాయో అనే కుర్చీల్లాటివీ, ఎవరైనా వస్తే కూర్చోడానికి ఓ స్టూలో, లేక అక్కడక్కడ చిరిగిపోయిన పేము కుర్చీలూ అబ్బో అడక్కండి అలాటివే ఉంటాయని ఆశించిన నాకు మాత్రం చాలా ‘నిరాశ’ ఎదురయింది!ఎందుకంటే, నన్ను కూర్చోబెట్టిన ఆఫీసు చాలా విశాలంగానూ, శుభ్రంగానూ కనిపించింది.నన్ను కూర్చోబెట్టి, ఆ స్టెనో వాళ్ళ ‘మేడం’ గారికి ఫోను చేసి, ఆ ఫోను కాస్తా నాకిచ్చేసింది.ఆవిడకో నమస్కారం చెప్పేసి, మీ ఆఫీసులో ఉన్నానూ అని చెప్పేశాను. ఆవిడనుకునుంటారు ఇదేమిట్రా బాబూ, వదిలేటట్లుగా లేడూ అయినా చూద్దామూ అనుకుని, ‘నిన్న శివరాత్రి కదా, ఉపవాసమూ అదీ ఉన్నానూ, కొద్దిగా రావడానికి ఆలశ్యం అవుతుందేమో, పోనీ ఇంకో రోజు వస్తారా’అన్నారు. నేనా అంత ఈజీగా వదిలించుకునేవాడినీ, ‘ఫరవా లేదండీ, నేను వెయిట్ చేస్తానూ’అన్నాను.ఇంక గత్యంతరం లేక, ఆ ఫోను స్టెనో చేతిలో పెట్టమన్నారు. ఆవిడేం చెప్పారో, ఓ పదినిమిషాల్లో, ఓ చాయీ, వాళ్ళు తెలుగులోకి అనువాదం చేసిన పుస్తకాలు ఓ దొంతరా తెచ్చి పెట్టింది.

    చాయ్ త్రాగుతూ, ఆ పుస్తకాలు చూశాను. నిజంగా, చాలా శ్రమ పడి, ఒకటో తరగతి నుండి, ఎనిమిదో తరగతి దాకా పిల్లలకి ఎలా బోధించాలో వివరించే పుస్తకాలు అవి, అచ్చ తెలుగు భాషలో! ఎంతో సంతోషమయింది వాటిని చూడగానే.ప్రవాసాంధ్ర రాష్ట్రం లో, మనభాష మీద అభిమానంతో, వారు చేస్తున్న పని చాలా అభినందనీయము.ఇంతలో 11.30 కి ఆవిడ వచ్చారు. మామూలు పరిచయాలయిన తరువాత, ఎన్నెన్నో కబుర్లు చెప్పుకున్నాము.మనిషి చాలా సింపుల్! ఎటువంటి ఇగో లేకుండా, ఓ మూడు గంటలపాటు నాతో మాట్లాడారు.ఏదో మన ఇంట్లో, ఏ చుట్టం తోనో మాట్లాడినట్లుంది.

    పేపర్లో ఆవిడ గురించి వ్రాసిందంతా చదివి, అంత పెద్ద పొజిషన్ లో ఉన్నవారు మనతో మాట్లాడతారా అనుకున్న నాకు,ఆవిడ నాతో రెండు మూడు గంటలు గడిపారంటే నాకే ఆశ్చర్యం వేసింది. మన తెలుగు భాషని పరాయి రాష్ట్రాల్లో నేర్పాలనే ఆవిడ ఆశయం ఇంకా ఇంకా పుంజుకుని శాఖోపశాఖలుగా విస్తరించాలని ఆశిస్తూ…. ఈ టపా !

%d bloggers like this: