బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   నేను మా ఇంటి క్రింద ఉండే రిలయన్స్ ఫ్రెష్ లో ఒక్కొక్కప్పుడు వెళ్తూంటాను. ఎప్పుడైనా అత్యవసరంగా ఏ కొత్తిమిరో, పాలో, పెరుగో తీసికోవాలంటే, మంచిగా ఫ్రెష్ గా ఉండేవే దొరుకుతాయనుకోండి, కానీ, బిల్లింగ్ అయేటప్పటికి ఓ అరగంట పైగా వేచి ఉండాల్సొస్తూంటుంది,అప్పుడప్పుడు. ఈ మాత్రందానికి ఆ కొట్లోకెళ్ళడం ఎందుకూ అనుకుని, బయటే ఏ ఫుట్ పాత్ మీదుండే కొట్లోనో, లేక ఏ బండివాడిదగ్గరో కొత్తిమిర, తీసికుంటూంటాను.ఎప్పుడైనా మా ఇంటావిడకి సర్ప్రైజిద్దామనే సదుద్దేశ్యంతో ఏ ఐస్ క్రీమో తీసికోడానికి అక్కడికే వెళ్తూంటాను. మొత్తం బిల్లు కనుక ఏ మూడు నాలుగు వందలు దాటిందంటే, ఎప్పుడో ఉద్యోగంలో ఉన్నప్పుడు తీసికున్న క్రెడిట్ కార్డు మీద ఇచ్చేస్తూంటాను.రిటైరయిన తరువాత మాత్రం ఫోన్లు చేస్తారు కానీ, క్రెడిట్ కార్డులెవడూ ఇవ్వడు.ఏదో కార్డు మీద పేమెంటు చేస్తే అదో స్టైలూ !ఎలాగూ పైనెలలో ఇచ్చేసేదే కదా అని, అప్పుడప్పుడు క్రెడిట్ కార్డు ఉపయోగిస్తూంటాను!

   మొన్న 28 వ తారీఖున ( అదే రోజున నేనూ, మా ఇంటావిడా ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకుంటూ 39 ఏళ్ళు పూర్తిచేశాము లెండి! మమ్మల్ని చూసే బాపుగారు మాకు ఆ కార్టూన్ ఇచ్చారు!).ఎలాగూ ముఖపరిచయం ఉందికాబట్టి,( ఛస్తారేమిటీ, ఆ బిల్డింగులో పైనే ఉంటుండబట్టి, ప్రతీ రోజూ నా మొహమే చూస్తూంటారు!), అక్కడుండే సేల్స్ గర్ల్స్ నాదగ్గర సంతకం కూడా తీసికోరు. మళ్ళీ అదో స్టైలూ! ఆ రోజునకూడా, మామూలుగానే, సరుకులు తీసికుని, కార్డిచ్చాను,సరుకులు తీసికుని వచ్చేశాను.మా ఇంటావిడకి తెలియకూడదుగా, అసలే ఖంగారూ.

   మొన్నెప్పుడో నెట్ మీద క్రెడిట్ కార్డు పేమెంట్ చేద్దామని కార్డు గురించి వెదికితే కనబడదే! వామ్మోయ్ ఎక్కడైనా పడేశానా, లేక ఎవడైనా కొట్టేశాడా అని హైరాణ పడిపోయాను. పోనీ, మేముండే ఫ్లాట్ లో ఉండుంటుందిలే అనుకుంటూ, రాత్రికి ఎలాగో నిద్ర పట్టించుకుని, మర్నాడు మేముండే ఫ్లాట్ కి వచ్చేసి, ముందుగా చేసిందేమిటంటే, అక్కడా ఇక్కడా వెదకడం. మళ్ళీ ఈ సంగతి మా ఇంటావిడతొ చెప్పకూడదూ, చెపితే చివాట్లూ- “అసలు ఈ కార్డులు వదిలించుకోమని ఎప్పణ్ణించి మొత్తుకుంటున్నానూ, అసలు వింటేనా, అది చెప్తే నేనెందుకు వినాలీ అనే తప్ప, పోనీ మన మంచికే చెప్తోందీ అనే బుధ్ధి ఎప్పుడు వస్తుందో కానీ.…”.అయినా నా ఖంగారూ, హావభావాలూ ఆవిడకు తెలియకుండా ఉంటాయా, ఏదో మన భ్రమ కానీ...చివరకి చెప్పేశాను, సంగతి ఫలానా అని. ఇంక ఇవ్వవలసిన డోస్సేదో ఇచ్చేసి, ఇదిగో ఈవేళ ప్రొద్దుటే ఆరున్నరకల్లా లేపేసి, బ్రేక్ ఫాస్ట్ పెట్టేసి బయటకు తోలేసింది.with a one point agenda.. ఆ కార్డు సంగతేదొ తేల్చుకునే ఇంటికి రావడం!

   పొలో మంటూ వెళ్ళాను. ముందుగా ఆ రిలయన్స్ వాడినడుగుదామూ, లేకపోతే, హెల్ప్ లైన్ కి ఫోను చేసేసి, కార్డుని బ్లాకు చేద్దామూ అని. నేను వెళ్ళానుకదా అని వాడేమైనా షాప్ ఓపెన్ చేస్తాడా ఏమిటీ? వాడి టైముకే తెరుస్తాడు, ఊరికే మన ఖంగారు కానీ!మా SBI cards వాడు అలర్ట్ పంపిస్తూంటాడులెండి, కార్డు ఎప్పుడైనా స్వైప్ చేసినప్పుడు. ఈ మూడు రోజులలోనూ అలాటిదేమీ రాకపోవడం చేత, పోన్లే ఇప్పటిదాకా ఎవడూ నా కార్డుమీద అత్యాచారం చేయలేదని మాత్రం తేలింది. ఇంకో గంట అలాటిదేదీ జరక్కుండా ఉంటే, ఆ కార్డేదో బ్లాకు చేసేస్తాను స్వామీ,అని, మా ఇంటికెదురుగా ఉండే గణపతికి ఓ దండం పెట్టుకుని, ఇటుపైన జాగ్రత్తగా ఉంటానూ అని రిజాల్వ్ ( ఇదో పురిటి వైరాగ్యం లాటిది!) చేసేసికుని, మా నవ్య ని బస్సెక్కించేసి, రిలయన్స్ లోకి వెళ్ళాను.నా అదృష్టం కొద్దీ,28 న నా బిల్లింగు చేసిన పిల్ల కనిపించింది. పోన్లే ప్రారంభం శుభంగానే ఉందీ అనుకుంటూ, ఆ అమ్మాయిని ‘హాయ్’ అన్నానో లేదో क्या सर्, उस दिन आप कार्ड छॉड कर चलॅ गया !!అనేసింది! మా తల్లే,మా అమ్మే అనుకుంటూ ఆ అమ్మాయికి థాంక్యూలు చెప్పేసికుని,వాళ్ళ మేనేజర్ దగ్గర నా ఐడింటిటీ చూపించుకుని, అతనిచేత కూడా జ్ఞానబోధ చేయించుకుని బయటకు వచ్చాను!

   ఇదివరకోసారి ఇలాగే మా అబ్బాయి ఇక్కడ ఉండే రాంకా జ్యూలర్స్ దగ్గర తన కార్డు మరచిపోతే, పాపం ఫోను చేయగానే, ఆ కార్డుని జాగ్రత్త చేసి ఉంచాడు.నేను చెప్పొచ్చేదేమిటంటే, ఛాన్సు దొరికితే ఎంత నొక్కేద్దామా అని చూసే ఈ మనుష్యుల్లో, ఇంకా నీతీ నిజాయితీ వదలకుండా ఉండేవాళ్ళూ ఉన్నారని చెప్పడానికే ఈ టపా! మన అదృష్టాన్ని బట్టికూడా ఉంటుంది.అయినా మనమేమైనా ఎవణ్ణైనా దోచుకుంటున్నామా ఏమిటీ?
రిలయన్స్ వాళ్ళు బిల్లింగుకి ఎంత టైము తీసికున్నా సరే, రిలయన్స్ ఫ్రెష్ జిందాబాద్ !!!!

%d bloggers like this: