బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–” Misfire”….

   ఈవేళ అదేదో చానెల్ లో న్యూసు చూస్తూంటే ఒక వార్త ఆకర్షించింది. ” తిరుపతిలో ఒక బులెట్ ” Misfire”. అయిందనిన్నూ, ఎవరికీ గాయాలవలేదనిన్నూ etc etc….అది చూడగానే నాకు ఆశ్చర్యమేసింది. అసలు బులెట్ misfire అయితే, గాయం అవలేదనే ప్రశ్న ఎక్కడినుంచి వచ్చిందీ అని! ఏం లేదూ, ఏదో 42 ఏళ్ళపాటు ఈ బుల్లెట్లూ,బాంబులూ, గ్రెనేడ్లతో ఇరవైనాలుగు గంటలూ జివించిన తరువాత, ఏదో కొద్దిగా తెలిసిందిలెండి. Actual గా ammunition misfire అంటే ఏమిటో ఇక్కడ చదవండి. అంటే నాకేదో ఎక్కువ తెలుసునూ అని కాదు, సరైన పదమేదో తెలియనప్పుడు, ఈ చానెళ్ళ వాళ్ళు హాయిగా ఏ తెలుగులోనో, “బులెట్ ప్రమాదవశాత్తూ ప్రేలడం వలన..” అని చెప్పేస్తే బాగుండేదేమో అని నా అభిప్రాయం. ఇంకో సంగతేమంటే, మనదేశం లో రక్షణ శాఖ వారనండి, పోలీసు శాఖ వారనండి ఇంకెందరో తుపాకీలుపయోగించేవారు అయోమయంలో పడతారు ఇలాటి వార్తలు చూసి! అదేమిటీ మిస్ ఫైర్ అంటే ప్రేలలేదనికదా మనం నేర్చుకున్నామూ, ఇదేమిటీ ఈ చానెల్ వాడిలా అంటాడేమిటీ అనికూడా అనుకోవచ్చు. ఇదేదో నా limited knowledge ప్రదర్శించుకోవాలని కాదు, మన చానెళ్ళవాళ్లు ఇలాటిదేదైనా జరిగినప్పుడు, కొద్దిగా టెక్నికల్ వాళ్ళని సంప్రదిస్తే బావుంటుందనీ.

   పోన్లెండి ఆ గొడవెందుకూ మనకి, అసలు టి.వీ ల్లో వార్తలు చూడమన్నదెవరూట? మా అబ్బాయి వాళ్ళూ ఈ మధ్యన ఓ LCD టి.వీ. తీసికున్నారు. మరి దాంట్లో నాలాటి సామాన్య ప్రజానీకం చూసే DTH ఉంటే ఎలా మరి?దాంతో ఓ ఇరవై రోజులక్రితం Tatasky వాడి HD కి డబ్బులు కట్టారు. వాడేమో డబ్బులు తీసేసికుని అత్తా పత్తా లేకుండా పోయాడు. మొత్తానికి వాడికి ఫోన్లు చేయగా చేయగా ఈవేళ ప్రొద్దుటే వచ్చాడు. మా కోడలు ఫొను చేయగానే మా ఇంటికి వెళ్ళి కూర్చున్నాను. వాడు టెరేస్ మీద ఉన్న డిష్ తీసేసి, కొత్తది పెట్టాడు. లోపల సెట్ టాప్ బాక్స్ కొత్తది పెట్టేసి, పాతది మా దగ్గరే వదిలేసి, 24 గంటల్లో HD యాక్టివేట్ అవుతుందీ అనేసి, బిచాణా సద్దుకోడం మొదలెట్టాడు. నీ HD మాట సరే, మరి మిగిలిన చానెళ్ళు (HD కానివి)ఎక్కడ నాయనా అంటే, అదేం లేదూ, కొంచం సేపట్లో వస్తాయీ అన్నాడు. చూడు నాయనా అవేవో వచ్చిన తరువాతే నీవిక్కడినుండి కదలడమూ, లేకపోతే, సాయంత్రం, మా మనవరాలొచ్చి, తనుచూసే చానెల్స్ ఏవీ అనడిగితే, నువ్వొస్తావా సమాధానం చెప్పడానికీ అని చివాట్లేశాను. వాడు ఇలాటి మనిషి చేతిలో పడ్డామేమిట్రా బాబూ అని విసుక్కుంటూ, వాళ్ళ సెంటరుకి ఫోన్లు చేయడం మొదలెట్టాడు. గంట సేపు తరువాత తేలిందేమిటయ్యా అంటే, వాడు ఫిట్ చేసిన సెట్ టాప్ బాక్స్ లో ఉన్న డిజి కార్డు, మాచ్ అవడం లేదుట! మానాయనే, డబ్బులు కట్టిన ఇరవై రోజులదాకా పత్తా లేరు, ఏమైనా అంటే, hardware shortage అని సమాధానం, తీరా ఇన్ని రోజుల తరువాతైనా సరీగ్గా తెస్తారా అంటే అదీ లేదూ. మళ్ళీ టి.వీ ల్లో మాత్రం యాడ్లూ ‘జింగా డాలా…‘ అంటూ!సాయంత్రానికి కొత్తది తెస్తానన్నాడు.చూద్దాం.

   నిన్నేమో బడ్జెట్టూ, అంతకు ముందరేమో రైల్వే బడ్జెట్టూ. వాళ్ళు చెప్పేదేమిటో అర్ధం అయి చావదూ. ఫిస్కల్ డెఫిసిట్, జి.డి.పీ ఇన్ఫ్లేషన్ ఏమిటేమిటో చెప్తారు. ఒఖ్ఖముక్క అర్ధం అవదు.లక్షల్లోనూ కోట్లల్లోనూ పద్దులూ, లెఖ్ఖలూనూ.అన్నిటిలోకీ నచ్చిందేమిటంటే, రైళ్లల్లో ఇటుపైన, మా ఇంటావిడ లాటి వాళ్ళకి(అరవై ఏళ్ళు నిండకపోయినా) కూడా,సీనియర్ సిటిజెన్ హోదా వచ్చిందనిన్నూ, కన్సెషన్( 50 %) ఇస్తారనిన్నూ. పైగా మా కన్సెషన్ కూడా 40% చేశారనిన్నూ!ఐ.టి లిమిట్ 2,50 000 చేశారనిన్నూ. మిగిలిన గోలంతా ఎలాగూ అర్ధం అవదు. అయినా సరే ప్రతీవాడూ, ఎదో ఒకటనేవాడే. ఓ మైక్కు చేతిలో ఇస్తే చాలు ప్రతీ రాజకీయ నాయకుడూ, ఇది ఆం ఆద్మీ బడ్జెట్టనేవాడోడూ, హాత్తెరీ కాదూ అనేవాడోడూ. రెండు నెలల క్రితం కిలో ఎనభై రూపాయలమ్మిన ఉల్లిపాయ ఖరీదు ఒక్క సారిగా అయిదు రూపాయలకి ఎలా పడిపోయిందో మాత్రం ఎవడూ చెప్పని చిదంబర రహస్యం గానే మిగిలిపోతుంది!అయినా మనం మాత్రం బలిపశువుల్లాగ మిగిలిపోతాం. ప్రతీ వాడూ, రైతే మన దేశానికి వెన్నెముక అనేవాడే.

%d bloggers like this: