బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


   ఏమిటో ఈ మధ్యన నా టపాలలో వ్యాఖ్యలు పెట్టడం మానేశారు! అలాగని చూడ్డం మానేశారా అంటే అదీ లేదూ. రోజుకి కనీసం ఓ నూట యాభై దాకా సందర్శకులైతే వస్తూనే ఉన్నారు. బహుశా నేను వ్రాసేవాటితో మరీ మొహం మొత్తేసుంటుంది. నేనేం చేయనూ, నాకు తెలిసినదేదో వ్రాస్తూన్నాను.ఒక్కోసారి ఏమీ లేకపోతే నేను చదివినదాని గురించి మీ అందరితొనూ పంచుకోవడం.అలాగని మరీ posting for posting sake అనుకోకండి.

   మొన్నెప్పుడో పుణె లోని ఆంధ్రసంఘానికి వెళ్ళాను. నేను దానిలో సభ్యుడిని కాకపోవడం వలన, లోపల మీటింగు జరుగుతోందని, బయటే నిలబడ్డాను. ఇంతలో ఒకావిడ వచ్చి, ఫరవాలేదండీ, లోపలకి వచ్చి కూర్చోండీ అనడం చేత లోపలకి వెళ్ళాను. వాళ్ళ జనరల్ బాడీ ఎదొ జరుగుతోంది.తెలుసుగా ఇలాటి మీటింగుల్లో ఎలా ఉంటుందో!!పాలక వర్గం వారు చెప్పేది, సభ్యులకి నచ్చదూ. ఏదో ఏడాదంతా నానా కష్టం పడి ఏవెవో కార్యక్రమాలు చేస్తున్నారుకదా, వాటిలో కొద్దిగా లోపాల్లాటివుండొచ్చు. ఏ తప్పూ లేకుండా, ఇదిగో ఈ విమర్శలు చేసేవాళ్ళని చేయమనండి, అబ్బే మాకు టైము లేదండీ అనేస్తారు. పోనీ ఎవరో ఒకరు బాధ్యత తీసికుని చేస్తున్నారుగా, వాళ్ళ దారిన వాళ్ళని చేయనీయొచ్చు కదా! అమ్మో అలాగైతే మా సభ్యత్వం ఏ మూలకీ అనుకుని, హక్కు ఉంది కదా అని ఆ చేసేవాళ్ళకి తడకలు కట్టేయడం! స్వతహాగా సహృదయులే ఏదో టైం పాస్ అన్నమాట!

   ఓ పదిమందిదాకా కొత్తవారు పరిచయం అయ్యారు. అప్పుడు తెలిసింది, ఈ నాలుగు రోజులూ( 21,22,23,24) పూణే లో ఒకభాగమైన గోర్పురీ లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుపుతున్నారని. ఈ నలభై ఏళ్లలోనూ ఎప్పుడూ ఆ ప్రాంతానికి వెళ్ళలేదు. ఈవేళ ప్రొద్దుట, మా అబ్బాయిని, నన్నక్కడ దింపేసి వెళ్ళమన్నాను. అక్కడ చాలా మంది పరిచయం అయ్యారు. పూజ, వేదపఠనం,చాలా బాగా జరిగింది. అక్కడ అన్న ప్రసాదం తీసికుని వచ్చాను.

   ఎక్కడికెళ్ళినా పిన్ని గారిని ఎందుకు తీసికెళ్ళరూ అనకండి. మొన్న ఆంధ్ర సంఘానికెళ్ళిన రోజు, మా అగస్థ్య తో కాలక్షేపం. ఈవేళ నవ్య తో కాలక్షేపం. ఏం లేదూ, ఈ వాతావరణ మార్పులు( పగలంతా ఎండా, రాత్రంతా చలీ), మనకే జ్వరం వచ్చినట్లుంటుంది, పాపం చిన్న పిల్లలకెలా ఉంటుందీ? అదీ కారణం.

   తిన్న తిండరక్క చెప్పే కబుర్లనే ‘బాతాఖానీ కబుర్లు’ అంటారు. మా చిన్నప్పుడు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, గ్రామస్థుల కార్యక్రమం అని ఒకటొచ్చేది. అందులో శ్రీ ప్రయాగ నరసింహ శాస్త్రి గారనుకుంటా ఒకాయనా, ఇంకోరూ బావగారి కబుర్లనేవి వచ్చేవి. ఊరికే గుర్తొచ్చి ప్రస్తావించాను.ఓ రెండు మూడు టాపిక్కుల గురించి వచ్చే రోజుల్లో వ్రాద్దామనుకుంటున్నాను. ఏమౌతుందో, మా ఇంటావిడతో ముందరే చెప్తే, ‘ఎందుకులెస్తురూ ఊరికే కూర్చోకా’ అంటుందేమో అని భయం! అవును కదూ, అదే ఉత్తమం! అయినా తిరిగే కాలూ…అని ఓ సామెత చెప్పినట్లుగా, నేనెక్కడూరుకుంటానూ? అలాగని నేనేదో కొత్త విషయం గురించేమీ కాదు లెండి. రోజూ జరిగే విషయాలే, ఏదో నా భాషలో….

Advertisements

7 Responses

 1. “చిన్నప్పుడు” అనగా అప్పుడు మీ వయసెంత ఉండును?

  ఎందుకనగా నా చిన్నప్పుడు నేను ఈ కబుర్లు ప్రోగ్రాం వినేదాన్ని సాయంత్రాలు! అందులో “యావండోయ్ బావగారూ” అంటూ వచ్చేది శ్రీ సీ రామ్మోహన్ గారూ, ఇక్కడ పడక్కుర్చీలో కూచుని ఆహ్వానించేది నండూరి సుబ్బారావు గారూను!(ఇప్పుడు ఇద్దరూ లేరు)

  ఒకవేళ మీ చిన్నప్పుడు కూడా ఈ కబుర్లు ప్రోగ్రాం ఉండేదా కొంపదీసి?

  Like

 2. బాబుగారూ!

  తప్పకుండా వ్రాయండి.

  రేడియో అభిమాని గారు అభిమానంతో మెయిల్ ఇచ్చి మరీ అడిగారు–రేడియో అనుభవాలు వ్రాయమని.

  అప్పుడు మొదలెట్టాను–నా చిన్నప్పుడు మొదటిసారిగా రేడియో కార్యక్రమాలపై ఆసక్తి కలిగించిన “భారత దేశం-చైనా భూతం” అనే రూపక కార్యక్రమంతో. చైనా మనమీద యుధ్ధం ప్రకటించాక, రోజూ విశేషాలు అందించేవారు–నిజంగా భూతమేదో వస్తున్నట్టు అద్భుతమైన మ్యూజిక్ వచ్చేది. బావగారి కబుర్లలాగే సాగేది!

  అది పూర్తయ్యాక, బావగారి కబుర్లలోకీ, రాంబాబు, చిన్నక్క, యేకాంబరం కబుర్లలోకీ వెళదామనుకున్నాను. యేదీ! యెప్పటికి పూర్తవుతాయో మరి!

  Like

 3. మీ కబుర్లు భలే బాగుంటాయి బాబుగారు. ఒక్కొసారి ఇలాటి బాతాఖానీల్లోంచే
  ఎన్నెన్నో విషయాలు, లోకంపోకడలూ తెలుస్తాయి. నిన్న నే రిలయన్సు మార్టుకు
  వెళ్ళీ చౌకగా ఇస్తున్నాడుకదా అని నాలుగు ప్లాస్టిక్ బాక్సులు తీసుకున్నా. ఎదురుగా
  కుప్పలుగా పేర్చివున్నా ప్రతివాడూ నా కార్ట్ దగ్గరకొచ్చి మిగతా వస్తువులు ప్రక్కకుతోసి
  ఆ బాక్సులు చూస్తూ, ఈ బాక్సు లోపల ఇంకో బాక్సుంటుందా లాంటి చెత్త ప్రశ్నలు.
  విసుగొచ్చిందంటే నమ్మండి. చదువుకున్న వాళ్ళు కూడా ఇలా ఎందుకు ప్రవర్తిస్తారో
  అర్ధంకాదు. ఇలాటి కబుర్లు తప్పక వ్రాస్తుండండి. మీరు చెబితే మరింత సహజంగా
  వుంటుంది.

  Like

 4. రొజూ రాకపోయినా మీ పోస్ట్ లు సాధారణంగా మిస్ కాను. వచ్చిన రోజున రెండు మూడు చదివేస్తాను.
  విసుగొచ్చి ఆ మధ్యన రెండు సంఘాల నించి తప్పుకున్నాను. ఈకలు పికే వాళ్ళు ఎక్కువ పని చేసే వాళ్ళు తక్కువ. అన్నీ చోట్లా అల్లాగే ఉన్నాయి.
  రాయడం మానకండి .

  Like

 5. గ్రామస్థుల కార్యక్రమం కాదనుకుంటానండీ, అది కార్మికుల కార్యక్రమం అనుకుంటానండి.

  Like

 6. మీరు రాస్తూ ఉండండి. ప్రతీసారి, కనీసం ‘బాగుంది ‘ అని పెట్టడానికైనా బద్దకించే నాలాంటివారున్నారు. దానర్థం మీ ప్రమాణాలు పడిపోయాయని కాదు.

  Like

 7. @సుజాతా,
  నా చిన్నప్పుడూ అంటే నా ఆరేళ్ళవయస్సన్నమాట.అప్పుడు కూడా గ్రామస్థుల కార్యక్రమం ఉండేది.

  @కృష్ణశ్రీ గారూ,

  ఏదొ బాతాఖానీ గురించి చెప్పడానికి ‘గ్రామస్థుల కార్యక్రమం’ ప్రస్తావించాను. ఆనాటి కార్యక్రమాలగురించి వ్రాసే స్థాయి లేదు నాకు.

  @గురువుగారూ,

  ఏదో మీ అభిమానం కొద్దీ అలా అంటారు. ధన్యవాదాలు.

  @సుబ్రహ్మణ్యం గారూ,

  నా అభిమాన రచయిత శ్రీ ముళ్ళపూడి వారు అస్తమించిన తరువాత, అసలు వ్రాయాలనే మూడ్డే రావడం లేదు. ఎప్పటికి తేరుకుంటానో?

  @నరసింహరావుగారూ,

  కార్మికుల కార్యక్రమం మధ్యాహ్నం 12.30 కి వచ్చేది. గ్రామస్థుల కార్యక్రమం సాయంకాలం 6.30 కి.

  @జేబి,

  ధన్యవాదాలు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: