బాతాఖాని-లక్ష్మిఫని కబుర్లు-అక్కడికి మనవాళ్ళు తక్కువైనట్లు-2


   ఆమధ్యన ఈ టపా మొదటి భాగం వ్రాశాను. మనవాళ్ళు ఎక్కడికైనా మార్కెట్ కి వెళ్తే కొనేవి handbags. ఏమిటేమిటో మోడెల్స్ కొంటారు. ఆఫీసుకెళ్ళేటప్పుడు వేసికోడానికి వీలుగా ఉంటుందనొకటి, ఏ పార్టీకైనా వెళ్ళేటప్పుడు వేసికోనాటికోటీ, సరదాగా సాయంత్రం బయటకెళ్ళడానికోటీ, అడక్కండి. కొన్న మొదట్లో బాగానే ఉంటుంది.వాడగా వాడగా దాంట్లో లోపాలొక్కక్కటీ బయట పడతాయి. మరీ చిన్నగా ఉంటే సెల్లూ, కళ్ళజోడూ పట్టవు.పోనీ అవన్నీ పట్టేటట్లుగా కొనుక్కుంటే మరీ handbag లా కాక, చేతిసంచీ లా ఉంటుందంటారు. రెండూ ఒకటే గా అనడానికి వీలులేదు. మొదటిది ఆడవారు stylish గా వేసికునేదీ, చేతిసంచీ మనం సంతలకీ, మార్కెట్లకీ తీసికెళ్ళేదీనూ. మరి తేడా ఉందంటే ఉండదు మరీ? పోనీ ఏ మాలుల్లోనైనా కొందామనుకుంటే,అక్కడ వాటి ఖరీదులు చూసేసరికి తల తిరుగుతుంది! ఎప్పుడో ఏ ఫుట్ పాత్ పక్కనే ఉండే దుకాణాల్లో తీసికోవడం.దాన్ని ఓ రెండు మూడు సార్లు వాడేటప్పటికి దాని జిప్పు కాస్తా పాడైపోతుంది. పోనీ ఏ చెప్పులకొట్టువాడి దగ్గరకో తీసికెళ్తే దాన్ని క్షణంలో బాగుచేస్తాడుగా, అబ్బే మరీ అలా వెళ్తే బావుంటుందా?దాన్ని రిటైరు చేసేసి ఇంకోటి కొనుక్కోవడంలొనే ఉంది మజా అంతా! దాంతోటి జరిగేదేమిటీ, కప్బోర్డ్ లో వేళ్ళాడేవి ఈ పాడైపోయిన handbag లే!

అలాగే ఇంట్లో చిన్న పిల్లలుంటే కొనేవి వాళ్ళ కంపాస్ బాక్సులూ, రంగు పెన్సిళ్ళూ, ఇరేజర్లూ, షార్పెనర్సూ.ఇంట్లో ఓ డబ్బా నిండా ఇవే. ఇంక సీ.డీ లూ, ఇదివరకైతే క్యాసెట్లూ. ముందరో పైరేటెడ్ ది ఒకటీ, ఆ తరువాత క్వాలిటీ బావో లేదని ఏ మోసేమైరు వాడు వేసిన ఒరిజినలూ, అదీ బావో లేదని ఓ డీ.వీ.డీ. మొత్తానికి ఒక్కో సినిమాకీ మూడేసి సీ.డీ లు.పోనీ వాటినైనా రోజూ చూస్తారా,అదీ లేదూ.ఏడాదెళ్ళేటప్పటికి ఓ డబ్బా నిండా ఇవే.మొదట్లో బాగానే ఉంటుంది,అవన్నీ పెట్టడానికి ఓ ఆల్బమ్మూ, వీటి సంఖ్య పెరిగేటప్పటికి వాల్ కబ్బోర్డులో పడేయడం. ఒక్కదాని కవరూ సరీగ్గా ఉండదు. ఏ కవరులో ఏ సీ.డీ ఉంటుందో ఆ భగవంతుడికే తెలియాలి.

ఇంక వేసుకునే డ్రెస్స్ లకి మాచింగ్ గా ఉండే బొట్లూ, క్లిప్పులూ, పూసల దండలూ- మళ్ళీ వాటిల్లో ethnic ఓటీ.ఇంటినిండా అవే, ఏదో మఠాల్లో ఉన్నట్లు ఎక్కడ చూసినా ఇవే!ఈ గంద్రగోళం లో, మొగాళ్ళకి చెవి కుట్టించుకుని వేళ్ళడతీసే టాప్సోటీ! అదికూడా ఒక్క చెవికే వేసుకోవాలిట.చేతికో రాగి రింగోటీ. జీన్సూ, కాప్రీలూ, హాఫ్ చెడ్డీలూ అసలు అడక్కండి. ఇంట్లో ఎక్కడ చూసినా అవే వేళ్ళాడుతూంటాయి.ఇవి కాకుండా పెళ్ళికో పెటాకులకో కొనుక్కున్న షేర్వాణీలూ, కుర్తా పైజమాలూ. పెళ్ళి తరువాత మళ్ళీ వేసికున్న పాపానికి పోరు, అలాగని బయట పారేయలేరూ,అవన్నీ దొంతరగా పెట్టడం వాటికో కబ్బోర్డూ!

ఇదివరకటి రోజుల్లో రెండో మహా అయితే మూడో సూట్ కేసులుండేవి. మొదట్లో అయితే ట్రంకు పెట్టెలనేవారు. క్రమక్రమంగా మౌల్డెడ్ వి.ఐ.పీ ల్లోకి వచ్చింది.తరువాత్తరువాత,పిల్లలూ పెద్దలూ అమెరికాలకీ ఇంగ్లాండులకీ వెళ్ళవలసి రావడంతో
కొంపనిండా పేద్ద పేద్ద భోషాణాల్లాటి సూట్ కేసులు తయారయ్యాయి, ఏదో విమానాల్లో వెళ్ళేటప్పుడు ఉపయోగిస్తాయి కానీ, బస్సుల్లోనూ, మన రైళ్ళలోనూ వెళ్ళేటప్పుడు ఇవెక్కడ ఉపయోగిస్తాయీ?ఇవి వాటిల్లో ఛస్తే పట్టవు. ఇదివరకటి రోజుల్లో బస్సుల్లో వెళ్ళేటప్పుడు టాప్పు మీదేసేవాళ్ళు. ఇప్పుడు ఈ ట్రావెల్స్ వాళ్ళు బస్సులకి పక్కనే ఓ దాంట్లో పడేస్తారు. రైళ్ళలో బెర్తు కింద పెడదామన్నా పట్టదు. పోనీ బెర్తు పైనే పెట్టేద్దామా అంటే, సగభాగం అదే పట్టేస్తుంది, ఇంక మనం రాత్రంతా దాని పక్కనే కూర్చుని జాగారం చేస్తూ చక్క భజన చేయాలి.ప్లాట్ ఫారం మీద దిగ్గానే పోనీ లాక్కుపొదామా అంటే, చెప్పానుగా మనవైపు ఏ స్టేషనులోనూ, ఓవర్ బ్రిడ్జీకి రాంపు ఉండదు. మెట్లమిదనుండి మోసుకుపోవాలంటే ప్రాణం మీదకొస్తుంది.ఏ పోర్టరునో పెట్టుకున్నామా, తడిపి మోపెడౌతుంది. ఆఖరికి మనం ట్రైను దిగిన తరువాత కూడా కొంపకి చేరాలంటే, రెండో మూడో టాక్సీలో, ఆటోలో చేసికోవాలి. మరీ టెంపో లో వెళ్తే బావుండదుగా!చివరకు మనం వెళ్ళే కొంపకు చేరుకున్న తరువాత కూడా దాన్ని పెట్టుకోడానికి నానా అవస్థలూ పడాలి.

ఈ గొడవలన్నీ పడలేక పిల్లలకోటీ, పెద్దలకో రెండూ చొప్పున మళ్ళీ ఓ మూడు సూట్ కేసులు ప్రత్యక్షం. వీటన్నిటినీ ఆ పెద్ద భోషాణం లాటి దాంట్లో పడేసి అటకెక్కించేయడం.ఒకదాంట్లో ఇంకోటి పడితే ఫరవా లేదు. సైజుల్లో తేడా ఉంటేనే ఉపయోగం. ప్రయాణాల్లో తీసికెళ్ళడానికి ట్రావెల్ బ్యాగ్గులోటీ ఈ కోవలోకే వస్తాయి.ఇంట్లో ఉండే చెత్తా చదారమూ వాటిల్లో కుక్కేసి పెట్టేస్తాము. మళ్ళీ ఆ చెత్తంతా ఎక్కడ పెట్టాలో తెలియక, ఇంకో బ్యాగ్గూ! దానితో పిల్లి పిల్లల్ని పెట్టినట్లుగా ఇంటినిండా ఈ బ్యాగ్గులూ, సూట్ కేసులూనూ. అప్పుడే ఎక్కడయ్యిందీ, గుర్తొచ్చినప్పుడు మళ్ళీ వ్రాస్తాను.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: