బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- ఆడుతు పాడుతు పనిచేస్తోంటే…


   ఇదేదో తోడికోడళ్ళు సినిమాలో పాటగురించి వ్యాఖ్యానం అనుకోకండేం. ఈ పాట పాడుకోవడం కోసం, సావిత్రి,నాగేశ్వర్రావు లాగ పొలాల్లోనే పనిచేయఖ్ఖర్లేదు. మామూలుగా ఇంట్లో కూడా పనిచేస్తూ పాడుకోవచ్చు.మనసుండాలంతే. ఇంట్లో ప్రతీ పనీ పెళ్ళామే చెయ్యాలంటే కుదరదుగా మరి.ఈ మధ్య ఓ నాలుగురోజులు, మా ఇంట్లోనే ఉండవలసొచ్చిందని వ్రాశానుగా, ఆ సందర్భంలో ప్రతీ రోజూ మా నవ్య స్కూలు బస్సెక్కేటప్పుడు, నేను కూడా వెళ్ళేవాడిని. తనకి బై చెప్పినట్లుంటుందీ, అదే బస్సులో వచ్చే మా తాన్యా, ఆదిత్య లను చూసినట్లుంటుందీ అని.

   ఆ సందర్భం లో ఒకావిడని రోజూ చూసేవాడిని.ఎప్పుడు చూసినా ఉరకలూ పరుగులతోనే వెళ్ళి, అక్కడే ఉండే కంపెనీ బస్సెక్కేది.ఒక్కరోజు కూడా, సావకాశంగా వెళ్ళిన రోజు లేదు. విషయమెమిటని విచారించగా తెలిసిందేమిటంటే,ఆవిడ ఇద్దరు పిల్లలకి,భర్తకి టిఫిన్ డబ్బాలు రెడీ చేసి, ఇంట్లో ఉండే అత్తమామలకు బ్రేక్ ఫాస్ట్ రెడీ చేసి,తనకోసంకూడా ఎదో ఒకటి తయారుచేసికుని, ఆఫీసుకెళ్ళాలన్నమాట.మా పిల్లల బస్సు వచ్చేసమయానికే, ఆవిడ భర్తో, మామగారో ఆ పిల్లల్ని కూడా బస్సెక్కిస్తూంటారు. ఇక్కడనేకాదు, ప్రతీ ఇంట్లోనూ, భార్యా భర్తా పనిచేస్తూ, వాళ్ళ పిల్లలు స్కూళ్ళకెళ్ళవలసివచ్చినప్పుడు కనిపించే దృశ్యమే ఇది.

   ఇదిగో ఇలాటి పరిస్థితుల్లోనే ఒకళ్ళకొకళ్ళు సహాయపడితే, హాయిగా ఆ పాట పాడుతూ పనిచేసుకోవచ్చు.పని పంచుకోవాలని తపనే ఉండాలికానీ,ఇలాటివి నేర్చుకోడానికి ఏమీ Induction Training లాటివేవీ ఉండవు! పెళ్ళవడమే ఓ ట్రైనింగనుకోవడం, దిగిపోవడమూనూ! ఉద్యోగాల్లో ఉండేవాళ్ళే కానఖ్ఖర్లేదు పనులు పంచుకోవడానికి. రిటైరయిన తరువాతా చేసికోవచ్చని తెలిసింది. ఈ మధ్యన ఓ వారంరోజులుగా, మా ఇంటికి వెళ్ళడం ధర్మమా అని, ఇక్కడి ఫ్లాట్ తాళం వేసుండడం ధర్మమా అని, ఇల్లంతా ఓ అంగుళం మందాన, మట్టీ మశానం పేరుకుని ఉన్నాయి. మామూలుగానే మా ఇంటావిడ ప్రతీ రోజూ రెండు మూడు సార్లు క్లీనింగు చేస్తేనే కానీ ( తనే లెండి) తిండి పెట్టదు.పైగా, ఒకటా రెండా, వారంరోజులు క్లీనింగు చేయలేకపోయిందంటే, మీరే ఊహించుకోవచ్చు!నాకేమో పన్నెండున్నరయేసరికి ముద్ద లేకపోతే గడవదూ, మేమేమో ఇక్కడికి వచ్చేటప్పటికే పదిన్నరయింది. ఈవిడ క్లీనింగభియాన్ ఎప్పటికవనూ, అత్తిసరో కుక్కరో ఎప్పటికి పెట్టనూ,నా నోట్లోకి తిండెప్పుడు వెళ్ళనూ, అమ్మో తలచుకుంటేనే, ఆకలేసేస్తూంది. ఇంక ఇలా కాదని, మన ఇలాకాలోకి వచ్చేపనులేవో చేసేద్దామని, ఓ గుడ్డా, కొలినూ పట్టుకుని రంగంలోకి దిగిపోయాను. అదేం బ్రహ్మవిద్యా ఏమిటీ, ఆవిడ ప్రతీరోజూ చేసే ఏరియాలు చూస్తున్నా కదా,కంప్యూటరు టేబిలూ, సోఫాలూ, డైనింగు టేబిలూ, టి.వి. చుట్టుపక్కలా, ఏ.సీ. రుద్దేసి తుడిచేసి, ‘రాముడు మంచి బాలుడు’ లాగ చేసేశాను. ఈలోపులో ఆవిడకూడా, ఇల్లంతా తుడిచేసి ఓ కిలో మట్టీ మశానం ప్రోగెసి తడిగుడ్డతో తుడిచేసింది.

   వచ్చిన గొడవల్లా ఏమిటంటే, ఆవిడ తడిగుడ్డేసి తుడిచిన చోట, మనం ఖర్మకాలి అడుగేశామా, గయ్యిమంటుంది. అంతే, Traffic Constable లాగ ఎక్కడివాడిని అక్కడే ఆగి, ఆ తడేదో ఆరేదాకా statue అయిపోవడం!ఆ తరువాతే మనం చేద్దామనుకున్నది చేయడం!ఇలాటి చిల్లర మల్లర చివాట్లు తప్పితే, ఇంట్లో మనం కూడా పనిచేస్తే బాగానే ఉంటుందని ఈ రోజే తెలిసింది!దీన్నే మీరు ‘పనికి ఆహారం’ అనేమీ వేళాకోళం చేయఖ్ఖర్లేదు! ఏదో జ్ఞానోదయం అయిందికదా, పోనీ మీలోకూడా ఎవరికైనా ఇలాటి మంచి ఆలోచనలు వస్తాయికదా అని వ్రాశాను!

   మన ఇంట్లో మన పన్లు చేసికోవడానికి ఏమీ నామోషీ ఫీలవఖ్ఖర్లేదు.తెలిస్తే బయటివాళ్ళేమనుకుంటారో అనీ భయపడఖ్ఖర్లేదు. ఇంట్లో వాళ్ళకి సహాయం చేయకుండా, కొంపలో కాఫీ,తిండీ దొరక్క బయటికెళ్ళి తినవలసివస్తేనే ఇంకోళ్ళు ఏమనుకుంటారో అని భయపడాలి!ఏమైనా ఇంకో ఇంటికి వెళ్ళి పాచిపని చెయ్యమన్నారా ఏమిటీ, మనింట్లో మనం చేసికోకపోడానికి ఏం రోగం? ఏమీ ఫరవాలేదూ, ఒళ్ళేమీ అరిగిపోదు.హాయిగా ఆడుతు పాడుతు అని Duet పాడుకోవచ్చు!

Advertisements

3 Responses

 1. అదో సరదా! ఎవడో కామెంట్ చేస్తాడని మానుకోవడం ఏమిటి? ఇంట్లో కుదిరినంత సాయంచేయడం; అప్పుడప్పుడు గయ్యిఁమనిపించుకోవడం. అనుభవిస్తేనే కానీ తెలీదు కొన్ని కొన్ని విషయాల్లోని ఆనందం.

  Like

 2. @తెలుగుభావాలు,

  అందుకే అప్పుడప్పుడు గయ్యిమన్నా ( నేను కాదు!) చేతికొచ్చిన పని చేసేస్తే ఒంటికీ ఇంటికీ మంచిది!

  @వజ్రం,

  థాంక్స్.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: