బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-కాలక్షేపం


   &నిన్న సాయంత్రం నేను, మా ‘విశాల హృదయం’ ఫ్రెండు ఇంటికి వెళ్ళి వచ్చిన తరువాత, నేనూ మా ఇంటావిడా మా ఇంకో స్నేహితుల ఇంటికి వెళ్ళాము. విడిగా మన దారిన మనం ఉంటే, ఇదే సౌకర్యం-ఓ బాధ్యతనేది ఉండదు, మనిష్టం వచ్చినవాళ్ళింటికి వెళ్ళొచ్చు,మనిష్టం వచ్చిన వాళ్ళు ఇంటికి వస్తే కావలిసినంతసేపు కబుర్లు చెప్పుకోవచ్చు.అలాగని మేము మా ‘బాధ్యతల’ నుండి దూరంగా పారిపోయామని కాదు. వాళ్ళకి ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు, లేక మా మనవరాలూ, మనవడిని ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడూ ఠింగురంగా మని మా ఇంటికి వెళ్ళడం. మొత్తానికి పుణ్యం పురుషార్ధం! హాయిగా వెళ్ళిపోతూంది, ఆ దేముడి దయవలన.మేముండే ఫ్లాట్ లో ఎన్ని రోజులున్నామో, మా ఇంట్లో ఎన్ని రోజులున్నామో, నెలాఖరుకి పాల ప్యాకెట్టువాడికి డబ్బులిచ్చేటప్పుడు. ఆతావేతా చూసుకుంటే, క్రిందటేడాది ఏ నెలలోనూ, పదిహేను రోజులకంటె ఎక్కువ రోజులకి డబ్బులివ్వలేదు. ఊరికే విడిగా ఉన్నామనే కానీ, సగంరోజులు మా ఇంట్లోనే గడిపాము!పిల్లలకీ వాళ్ళ స్పేసుంది, మాకూ బాగానే ఉంది.జీవితం ఏ టెన్షనూ లేకుండా వెళ్ళిపోవాలంటే ఇంతకంటే ఏం కావాలి? మనం చూసే దృష్టికోణం లో ఉంటుంది.

   ప్రస్థుత విషయానికొస్తే,మేము వెళ్ళేటప్పటికి, మా ఇంకో స్నేహితుల జంట కూడా అక్కడే ఉన్నారు. మా ‘జాతే’ ( రిటైర్డ్) లెండి.’అరే వీళ్ళు వస్తున్నామని ఫోను చేశారూ, మీరు ఎప్పుడూ వచ్చేముందర ఫోను చేసి వస్తూంటారుకదా, ఇవేళ ఫోను చేయలేదే’ అన్నారు. ‘అయితే వెళ్ళిపోమంటారా, ఫొను చేసి వస్తామూ’ అన్నాను.’బాబొయ్ మీతో ఎలా మాట్లాడినా చిక్కేనండి బాబూ’అన్నారు.అప్పుడన్నాను,’ చూడండి, వీళ్ళు అప్పటికే ఫోను చేశారు, మేము కూడా ఫోను చేసేమనుకోండి, మీకు అనవసర టెన్షనూ, ఇద్దరే ఉంటున్నప్పుడు ఇంట్లో పాలుండవు, మీరేమో మేము వస్తున్నామని, ఆయన్ని క్రిందకు పంపి పాలు తెమ్మంటారూ, ఈ టైములో మాములుగా తెచ్చే పాల బదులు ఏ ఆవుపాలో దొరుకుతాయీ, చివరకి ఏదో నైవేద్యం పెట్టినట్లు, ఆవుపాలతో కాఫీయో, చాయో పెడతారు మీరు,ఇంత టెన్షను అవసరమంటారా? మహా అయితే, చేసిన కాఫీనే మనవైపు హొటళ్ళలోలాగ, ఒన్ బై టు చేసేయడం, మీరూ, మీవారూ ఖాళీ కప్పు చేతిలో పెట్టుకుని జుర్రుమండం, ఎవడు చూడొచ్చాడు మీ కప్పులో ఏముందో? లేకపోతే, ఈ టైములో మేము కాఫీలూ, చాయ్ లూ త్రాగమండీ, మళ్ళీ నిద్ర పట్టదు అని ఓ excuse చెప్పేయడమూ!చెప్పాలంటే కావలిసినన్ని बहाना లు చెప్పేయొచ్చు!!’అన్నాను.

   ఏదో మామూలు కబుర్లు ‘పిల్లలెలా ఉన్నారూ, మేమంతా క్షేమం, మీరంతా క్షేమం అని తలుస్తామూ వగైరా వగైరా గ్రీటింగులు పూర్తి చేసికుని, మగాళ్ళం ముగ్గురూ ఒకవైపూ, ఆడవాళ్ళు ముగ్గురూ ఇంకో వైపూ సెటిల్ అయ్యాము.మేము ఎవరింటికైతే వెళ్ళామో ఆ దంపతులు పూజలూ అవీ చేస్తూంటారు. ఆయన ఇప్పటికీ విధిగా సంధ్యావందనం చేస్తూంటారు. వారి ఇంట్లో దేముడి మందిరం వర్ణించలేను, చూడాలంతే, అద్భుతం ! ఏ రోజు ఏ దేముడికి ప్రీతిపాత్రమో, ఆరోజు పూజ ఉంటుంది. చెప్పేదేమిటంటే వారింటికి ఏ రోజు వెళ్ళొచ్చో, ఏ రోజున వెడితే వారు ఏ పూజలోఉంటారో,రమారమి అందరి స్నేహితులకీ తెలుసు, ఆ ప్రకారమే వాళ్ళింటికి వెళ్తూంటారు.ఇక్కడ మేము కబుర్లు చెప్పుకుంటూంటే, సడెన్ గా వినిపించింది ‘Big Boss’ లో ఎవరు నెగ్గారండీ అని, ఎవరా అడిగినది అని చూస్తే, మేము ఎవరింటికి వెళ్ళామో ఆవిడా!!‘Eu too Brutus’ అనుకుని, ‘అమ్మా మీరు Big Boss గురించీ….’ అని ఆశ్చర్యపడిపోయాను!మా ఇంటావిడ చూస్తూంటుందిలెండి, ఈవిడేదో చెప్పింది.చెప్పొచ్చేదేమిటంటే, ఏదో పూజలూ, పునస్కారాలే కాక, ప్రాపంచిక విషయాల్లోనూ, ఆవిడకు ఆసక్తి ఉందని అప్పుడే తెలిసింది!

   అవీ ఇవీ మాట్లాడుతూంటే, మిగిలిన ఇద్దరు లేడీసూ మాటి మాటికీ గడియారం వైపు చూడ్డం మొదలెట్టారు. ‘ఏమిటీ మీ సీరియల్స్ మిస్ అయిపోతున్నామనా?’ అన్నాను. ఎందుకంటే వారిలో ఒకావిడ, చాగంటి వారి ప్రవచనాలూ, ఇంకో ఆవిడ ఈ టీవీ లో వచ్చే సీరియల్లూ టైమయ్యింది. చెప్పుకోలేరూ, మేమేమో పేద్ద టీ వీ మీద అంత ఆసక్తి లేనట్టుగా ఊరికే పోజులూ.నాకూ ఇదివరకైతే ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి 8.00 గంటలకి వచ్చే झान्सी कि राणि మిస్ అయేవాడిని కాను.మా ఇంటావిడేమో మిగిలిన వాటిలో వచ్చే సీరియల్సూ చూస్తూంటుంది. ఇప్పుడేమో నిర్వికార్, నిరాకార్ గా కూర్చున్నాము అక్కడికి మాకేదో ఇంటరెస్ట్ లేనట్లు! కారణం మరేమీ లేదు, ఈమధ్యన నెట్ బ్రౌజ్ చేస్తూంటే,కొతికి కొబ్బరికాయ దొరికినట్లుగా Hindi Serials Telugu Serials దొరికాయి. హాయిగా ఆ దిక్కుమాలిన యాడ్ల గొడవ లేకుండా ఓ గంటలో ఓ పది హిందీవీ, గంటలో ఓ నాలుగు తెలుగువీ చూసేసుకోవచ్చు.మామూలు టైముల్లో, మిగిలిన పనులేనా చేసికోవచ్చు. ఈ సిరియల్స్ ధర్మమా అని, అసలు దేశంలో, ఒకరితో ఒకరికి సంబంధ బాంధవ్యాలే తగ్గిపోతున్నాయి.ఎక్కడికి వెళ్ళాలన్నా, అదేదొ సీరియల్ మిస్ అయిపోతామెమో అని బాధ.వాళ్ళింట్లో ఈ సీరియల్ చూడరేమో, పాపం తులసి ఏమయ్యిందో, సింగినాధానికి శిక్ష వేశారో లేదో, శొంఠికాయ ఆ పిల్లనేం చేశాడో ... ఇవే ఆలోచనలు. వెళ్ళినప్పటినుంచీ ముళ్ళమీద కూర్చున్నట్లు, వెళ్లినవాళ్ళూ, ఎందుకొచ్చారురా బాబూ అని ఆ ఇంటివారూ ఇదే!పైగా ఈ సీరియళ్ళు, జీడి పాకం లా సంవత్సరాల తరబడి సాగుతూంటాయి!ఇచ్చే అరగంటలోనూ 15 నిమిషాలు యాడ్లూ, పదినిమిషాలు ‘జరిగిన కథ’,పుణ్యకాలం ఓ అయిదునిమిషాలు. దీనికోసం అరగంట తగలేయడం. హాయిగా నెను పైన ఇచ్చిన లింకుల్లో, వారంలో ఓ రోజు కేటాయించారంటే మొత్తం వారంలో జరిగినదీ చూసుకోవచ్చు.ఇళ్ళల్లో కంప్యూటర్లున్నవాళ్ళైనా, ఈ యాడ్ల హింసనుండి తప్పించుకోవచ్చు.

సర్వేజనాసుఖినోభవంతూ !!

Advertisements

2 Responses

  1. గురువుగారూ మీరన్నట్లు “ఈ సిరియల్స్ ధర్మమా అని, అసలు దేశంలో,ఒకరితో ఒకరికి సంబంధ బాంధవ్యాలే తగ్గిపోతున్నాయి”. అన్న మాట వాస్తవమే అయినా దూరదర్సన్ ఒకే ఒక చానల్ గా అందుబాటులో వున్నప్పటికే… రామాయణం ఆ తరువాత మహాభారత్ ….అప్పటి నుండే మానవ సంబంధాలు బీటలువారడం మొదలయ్యాయండి.
    కంప్యూటర్ ఉద్యోగాలు చేసుకొనే వాళ్ళిల్ల లలోనూ యిదే కత ,బ్లాగులు రాసుకునే వాళ్ళకూ సమాజం తో సంబంధ బాంధవ్యాలు తరిగి పోతూనే వున్నాయి. ప్రాక్టికల్గా చూస్తున్నాం. అతి సర్వత్ర వర్జయేత్ అని పెద్దలు ఎంత అనుభవాన్ని విశ్లేషించి చెప్పారో కదా.

    Like

  2. రాఘవేంద్ర రావు గారూ,

    నిజమేనండి.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: