బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-రోగాలూ, రొచ్చులూ…


   ఇదేమిటీ ఇంతకంటె మంచి టాపిక్కు దొరకలేదా అనుకోకండి, ఏదో నాకు తోచింది వ్రాద్దామనీ అంతే ! చిన్నప్పటి రోజుల్లో ఏవో అరడజను రోగాలుండేవి. దగ్గు ఖళ్ళుఖళ్ళుమంటే క్షయ అనేవారు, మామూలుదైతే ఏదో గోరింత దగ్గనేవారు.ఓ డాక్టరు దగ్గరకు వెళ్ళడం, ఆయనేదో ఇస్తే తాగడం.లేదా ఇంట్లోనే ఏ ‘అగ్నితుండు’ మాత్రో, ‘మాదీఫలరసాయనమో’ తాగడం.మన అదృష్టం బాగోపోతే, ఏ అమ్మమ్మో వచ్చి ‘మిరియాల కషాయమొ, శొంఠి రసమో,ఇవ్వండర్రా ‘అంటే, దగ్గూలేదూ, ఏమీ లేదూ అన్నీ హూష్ కాకీ అయిపోయేవి! ఏ కాలో బెణికితే, సున్నం బెల్లం పట్టో,ఇరుకు మంత్రమో వేయడం. ఏ తేలైనా కుడితే,తేలు మంత్రమో, లేదా గ్రామఫోను రికార్డ్ కాల్చి ఏదో పట్టేసేవారు. మరీ దగ్గెక్కువయితే ‘శ్లేష్మం ఎక్కువయిందనేవారు.వాళ్ళ పిల్లాడికి ‘కడుపులో బల్ల’ ట అని వినేవారం. ఎక్కడా చోటు లేనట్లు ఈ బల్ల కడుపులోకి ఎలా వెళ్ళిందా అని ఆశ్ఛర్యపడేవాళ్ళం. కామెర్లూ, ఆట్లమ్మలూ సీజనల్ రోగాలు! కానీ ఆ తరువాత చేయవలసిన పథ్యాలు చేసేసరికి ప్రాణం మీదికొచ్చేది. బీరకాయ, పొట్లకాయ ఏ పోపూ వేయకుండా పెట్టేవారు.

ఇంక డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళడం, ఏ పిప్పి పన్నో నెప్పెట్టినప్పుడు.అన్నిటిలోకీ నవ్వొచ్చేదేమిటంటే వాళ్ళమ్మాయికి సైటొచ్చిందిట అనడం. అప్పుడు తెలిసేది కాదుకానీ, సైటు రావడం ఏమిటండి బాబూ, సైటనేదే లేకపోతే, అసలు కనిపించేదే కాదుగా!పైగా ఆరోజుల్లో కళ్ళజోడు పెట్టుకుంటే, ఆడపిల్లకి సంబంధాలు రావేమో అని భయం!అందుకనే పెళ్ళికి ముందర తనని చూడ్డానికి వచ్చిన ప్రబ్రుధ్ధుడు ఎలా ఉండేవాడో తెలిసేది కాదు!పైగా, ఎప్పుడైనా ఏ పెళ్ళిలోనో మామ్మలో, అమ్మమ్మలో,అత్తయ్యలో చూసి అదేమిటే అప్పుడే జోడొచ్చెసిందేమిటీ అనేవారు!ఇంకోటి ‘రాచపుండు’. అదో status symbol లా ఉండేది. డబ్బున్నవాళ్ళకే వచ్చేది!ఇవి కాకుండా, పురిట్లో గుర్రం వాతం, వేడి చేయడం కామనే ! ఈ వేడి చేయడం అనేది తెలిసేది కాదు, పిల్లలకి పెట్టకూడదూ అని డిసైడయిపోయిన తరువాత, ఏదడిగినా సరె వేడి చేస్తుందీ అనేవారు. కామోసనుకుని వీళ్ళూ నోరుమూసుక్కూర్చునేవాళ్ళు! ఏమిటో అంతా మాయ!

కాలక్రమేణా, డయాబెటిసూ వచ్చేసింది. ఇప్పుడు సుగర్ ( అది బ్లడ్ లోనా, యూరిన్ లోనా అనేది ఇప్పటికీ నాకు తెలియదు!) లేకపోవడం ఓ చిత్రం. ఎవడు చూసినా ‘నాకు కాఫీలో సుగర్ వేయకండే ‘అని చెప్పేవాడే. అంతేకాదు, ఎవరైనా మనింటికి వస్తే, కాఫీలో సుగర్ వేయొచ్చా అని అడగడం, అదేదో మీ ఇంట్లో అంతా కులాసాగా ఉన్నారా అని అడిగినంత ఈజీగా అడిగేస్తున్నారు.అదో టైపు ‘గ్రీటింగు’ అయిపోయింది.ఈ మధ్యన మా ఇంటావిడని డాక్టరు దగ్గరకి తీసికెళ్ళినప్పుడు తెలిసింది, ఆ సుగరో సింగినాదమో చూడ్డానికి, ఓ గిద్దెడు రక్తం తీస్తారుట. అది బ్లడ్ సుగర్ కి, లేకపోతే ఓ బాటిల్ ఇచ్చి టాయిలెట్ లోకి వెళ్ళమంటారు. వాళ్ళు అలా తెమ్మన్నప్పుడు, ఛస్తే రాదు! మళ్ళీ ఫాస్టింగు, పీకలదాకా తిని ఇంకోసారీ!ఏమిటో ఈ రోగాలేమిటో గొడవేమిటో? ఇన్నాళ్ళూ, హెర్నియా అంటే మొగాళ్ళకే ఉంటుందేమో అనుకునేవాడిని,అది అందరికీ ఉంటుందనిన్నూ, అది కాస్తా ప్రకోపిస్తే, ప్రాణం మీదకొస్తుందనిన్నూ, ఈ మధ్యనే తెలిసింది!ఇంకోటి prostate, మొన్నమొన్నటిదాకా, ఇదేదో సాష్టాంగ నమస్కారానికి సంబంధించిందనుకునేవాడిని. తిన్న తిండరక్క అసలు ఈ సాష్టాంగాలూ అవీ చేసి ప్రాణం మీదకి తెచ్చుకోవడం ఎందుకూ అని చాలారోజులు ఆలోచించేవాడిని.తరవాత్తర్వాత తెలిసింది, ఈ సమస్య రాకుండా ఏం చేయాలో ( అదీ నెట్ లో చదివిన తరువాత)!!

అసలు ఈ గొడవంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, ప్రొద్దుటే, మా ఫ్రెండొకాయన కనిపించి, ఈ మధ్యన యాంజో ప్లాస్ట్ చేయించుకున్నానూ అనగానే, ఆయన గుండె వైపు చూడ్డం మొదలెట్టాను. అప్పుడు చెప్పారు, గుండెక్కాదూ, ఇంకోచోటెక్కడో, అని చూపించారు.అసలు అది చేయించుకోవాలని ఎందుకనిపించిందీ అని అడగ్గానే, పోన్లే పొద్దున్నే ఎవడో ఒకడు దొరికాడూ అని, కథా కమామిషూ మొదలెట్టారు. ఏదో కొద్దిగా ఊపిరి పీల్చుకోడం శ్రమగా అనిపిస్తే హాస్పిటల్ కి వెళ్తే,stress test చేస్తాం అన్నారుట.దీని సంగతేదో తేల్చుకుందామని, అది ఎలా చేశారూ అన్నాను.Windmill మీద నుంచోపెట్టి నడవమన్నారూ అన్నాడు. నాకైతే అక్కడేదోమిస్ అవుతున్నామేమో అనిపించింది, నాకు తెలిసినంతవరకూ, ఈ Windmill
అనేది అదేదోunconventional sources of energy కే ఉపయోగిస్తారూ అని నమ్మకం.ఇదేమిటీ ఈయన్ని అంత పైన నుంచోపెట్టి పైగా నడిపించడం కూడానా అనుకున్నాను. పిట్టలా ఉండే ఆయన అంత పైకి ఎలా ఎక్కగలిగాడూ అని, అప్పటికీ అడిగాను, మిమ్మల్ని అంత ఎత్తుకి ఎలా తీసికెళ్ళారూ అని, అంటే ఆయనంటాడూ, ఎత్తేమిటీ, ఓ రూమ్ములో ఉంది దానిమీద నడవమన్నారూ అన్నారు. ఓహో ట్రెడ్ మిల్ కొచ్చిన పాట్లాబాబూ.ఈ మధ్యనే తెలిసిందిలెండి, మా పిల్లలు ఎప్పుడు చూసినా, దానిమీద విన్యాసాలు చేయడం! హాయిగా ఓ గంట నడిస్తే పోయేదానికి ఈ ట్రెడ్ మిల్లులూ, విండుమిల్లులూ ఎందుకో అంట! తిండి తినడానికే టైముండని ఈ రోజుల్లో నడవడానికి తీరిక ఎక్కడుంటుందిలెండి? లేకపోతే, మా ఇంటావిడలా అర్ధరాత్రీ, అపరాత్రీఇంట్లోనైనా నడవాలి. వినరూ, చెప్తే అర్ధం చేసికోరూ, ఎవరికి వాళ్ళే!ఆయన ఎలా హాస్పిటల్ కి వెళ్ళి చేయించుకున్నారో, మొత్తానికి లక్షా ముఫ్ఫై వేలు బిల్లెలా అయిందో చెప్పుకొచ్చారు. ఈయనేమైనా కట్టాలా పెట్టాలా, ఆ CGHS ధర్మమా అని అదీ అయింది.

చెప్పొచ్చేదేమిటంటే, రోజులు గడిచేకొద్దీ, రోగాలూ ఎక్కువైపోతున్నాయి. సందుకో డాక్టరూ, మళ్ళి వాటిల్లో Speciality, Superspeciality లూ! ప్రతీదానికీ ఓ వైద్యం. ఎన్ని టెస్టులు చేయించుకుంటే అంత గొప్ప.Nuerology ఒకటీ, ఇన్నాళ్ళూ numerology అనుకునేవాడిని. వీళ్ళేదో జాతకాలూ గట్రా చెప్తారేమో అనుకునేవాడిని.ఇటుపైన ఎవరైనా ఇలా ఫలానా రొగం వచ్చిందీ అంటే నోరు వెళ్ళపెట్టకూడదని నిశ్చయించేసికున్నాను. రోజుకో రోగం చొప్పున నెట్ లో చదివేస్తే, కనీసం దానిగురించైనా తెలిసికోవచ్చు.కానీ, మా అమ్మమ్మ గారు చావలి బుచ్చాయమ్మ గారు అనేవారు, ‘ఊళ్ళో ఉన్న రోగాలన్నీ నీకెందుకురా,తధాస్థు దేవతలుంటారు పైన’ అని. Ignorance is bliss అని వదిలేస్తే హాయేమో అనీ అనిపిస్తుంది, వచ్చేదేదో రాక మానదు, దానిగురించి, ఇప్పటినుండీ తెలిసేసికుని మనం టెన్షన్లు పెంచేసికోడం అంత అవసరమా అని కూడా అనిపిస్తూంది. చూద్దాం!

మా పిల్లలు ‘ఏమిటి డాడీ, తెలుగంటే అభిమానం ఉండొచ్చు కానీ, ఇంగ్లీషులో వ్రాయడం మానేస్తే ఎలాగా’ అని,అక్కడికేదో నేను ఇంగ్లీషులో నాకున్న limited vocabulary తో వ్రాయగలనన్నట్లు, మరీ మొహమ్మాట పెట్టేస్తే, పోనీలే అని, ఓ ఏణ్ణర్ధం తరువాత ఓ టపా కెలికాను. ఓసారి చదవండి. బాగోపోతే మాత్రం తిట్టకండి !

Advertisements

2 Responses

  1. Baga chepparu…maa chinappudu amalapuram ammamma vallintiki vellinnappudu ilaney vedi cheso (mari enduko telidhu) pundu vachinnappudu aggipetti kagitham tho edo vaidhyam chesevallu…anthey marnadu purthiga thaggipoyedhi…ento ado maya…Mee English blog bavundhi..

    Like

  2. శిరీషా,

    మీది కూడా అమలాపురమేనా తల్లీ ! నా ఇంగ్లీషు పోస్ట్ నచ్చినందుకు సంతోషం.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: