బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–కాలెండర్లు, డైరీలు…


    ఎక్కడ చూసినా ప్రతీవారూ ‘నూతన సంవత్సర శుభాకాంక్షలు..’2011’, ఆంగ్ల సంవత్సర.. అంటూ ఏదో ఒక శీర్షిక పెట్టి వ్రాస్తున్నారు. మామూలు గ్రీటింగ్సే కదా అని, నా టపా చూడకపోతే, అమ్మో, కొత్తసంవత్సరం అలా మొదలెడితే ఏం బావుంటుందండీ, అందుకోసం శీర్షిక ఇలా పెట్టాను.. ఒకళ్ళు చెప్పినా చెప్పకపోయినా, సంవత్సరాలు కొత్తవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఏదో మొహమ్మాటానికి ఈ గ్రీటింగ్స్ చెప్పేసికుంటే ఓ గొడవ వదిలిపోతుంది!చేతిలో సెల్ ఉండడం ధర్మమా అని, ఓ మెసేజ్ పంపేస్తే చాలు.’ ఓహో వీడింకా ఉన్నాడేమిటీ, ఫరవాలేదే, గుర్తుంచుకున్నాడూ..’ అని ఓసారి అనుకోవడం. కాకపోతే ఈ మెయిల్స్ ఉండనే ఉన్నాయి ఓ గ్రీటింగు తయారుచేసేసి, మన ఎడ్రెస్ బాక్స్ లో ఉన్న ప్రతీవాడికీ ‘సెండ్’ చేసేస్తే చాలు. ‘ఉభయ కుశలోపరి. మేము ఇక్కడ క్షేమం, మీరంతా క్షేమం అని తలుస్తాను..’అని భావించేయొచ్చు! ఈ రోజుల్లో ఈ గ్రీటింగ్స్ కి ఏమీ personal touch ఉండడం లేదు. ఏదో చెప్పాలి కాబట్టి చెప్పేయడం. బస్!

ఇదివరకటి రోజుల్లో ఎంత హడావిడి ఉండేది! నాన్నగారికొచ్చిన పాత గ్రీటింగు కార్డుల్లో మెసేజిలు కాపీ చేసేసికొని ( మనకి అంత భాషా పరిజ్ఞానం ఉండెక్కడేడ్సింది!), ఓ దిట్టంగా ఉన్న కార్డోటి తీసికుని, దానిమీద, ఇంకో గ్రీటింగు కార్డుమీది బొమ్మ నీట్ గా కత్తిరించుకుని, ‘తుమ్మ జిగురు’ తోనో ‘లైపిండి’ తోనో అంటించి తయారుచేసికోవడం!ఆ రోజుల్లో ఈ feviquick లు ఎక్కడుండేవి? ఆ గ్రీటింగుని, పాత కవరేదో తీసికుని, దానిమీద ఎడ్రెస్ కనిపించకుండా, మళ్ళీ ఓ కాయితం అంటించేసి, దీన్ని దాంట్లో పెట్టడం! ఇంత హడావిడి చేశాము కాబట్టి, దాంట్లో మన heart and soul కనిపించేది.ఎలాగూ మనం ఇచ్చేది ఒకళ్ళకో, ఇద్దరికో మరీ ఈ రోజుల్లోలాగ వందలమీదెక్కడుండేవారు?

మా పెద్దన్నయ్య, శ్రీ అఛ్యుత రామ సోమయాజులు గారు అయితే, ఓ వారం రోజులు ముందుగానే, ఓ వంద పోస్ట్ కార్డులు కొనేసి, అన్నిటిమీదా HAPPY NEW YEAR అని వ్రాసి, సంతకం పెట్టి, మన దేశ రాష్ట్రపతి నుంచి, తనకు తెలిసిన చుట్టాలూ, స్నేహితులూ ఒకళ్ళేమిటి, తనకు గుర్తున్న ప్రతీ వారికీ పోస్ట్ చేసేసే వారు, సరీగ్గా జనవరి ఒకటో తారీఖుకి అందేలా!ఎప్పుడైనా ఎవరికైనా ఆ ఏడాది అందకపోతే, ‘ ఇదేమిటీ సోమయాజులు గారు మర్చిపోయారా ఈ ఏడాది’ అని స్నేహితులూ, ‘ఇదేమిటీ సుబ్బులన్నయ్య దగ్గరనుండి గ్రీటింగ్స్ రాలేదేమిటీ’ అని చుట్టాలూ అనుకునేలా! అందుకనే, మా ఇంట్లో ఎక్కెడెక్కడినుంచో, అంటే రాజకీయ నాయకుల దగ్గరనుంచీ, మంత్రుల దగ్గరనుంచీ, ఆఖరికి సినిమా స్టార్లదగ్గరనుంచీ జవాబులు వచ్చేవి. దురదృష్టం ఏమంటే, వాటిలో ఒక్కటీ ఇప్పుడు లేవు! ఆ ఉత్తరాల విలువ, ఆయన ఉన్నంతకాలం తెలిసే జ్ఞానం లేదు నాకు, తీరా తెలిసే సమయానికి ఆయనే లేరు.పోనీ, మా వదిన గారిని అడిగితే ఏమైనా దొరుకుతాయేమో అని అప్పటికీ, ఈ మధ్య అడిగి చూశాను.’ ఇప్పుడు అవేమీ లేవోయ్, ఎప్పుడో తీసేశాము..’ అనగానే, నాకైతే చాలా బాధేసింది.ఏం చేస్తాం, అవన్నీ ఇప్పుడు ‘తీపి జ్ఞాపకాల’ లాగ మిగిలిపోయాయి! అందుకే నాకొచ్చిన ప్రముఖుల ఉత్తరాలన్నిటినీ , ఓ ఆల్బం లో పెట్టి జాగ్రత్త చేశాను, మా అబ్బాయైతే, వాళ్ళ ఫ్రెండ్సందరికీ చూపించుకుంటూంటాడు!

ఉద్యోగపు రోజుల్లో అయితె, ఇ రోజు ప్రొద్దుటినుండి, కనిపించిన ప్రతీ వాడూ, షేక్ హాండ్ ఇవ్వడం, HAPPY NEW YEAR అని చెప్పడం, ఈ షేక్ హాండ్ లు ఇచ్చి ఇచ్చి సాయంత్రానికి ఓ క్రేప్ బ్యాండేజ్ కట్టుకోవలసి వచ్చేది ( ఓదార్పు యాత్రల్లో జగన్ కట్టుకున్నట్లుగా!). మా ఫ్రెండొకాయనైతే, గ్రీటింగ్స్ చెప్పేసి,Copy to all concerned.. అనేవాడు. ఎక్కడికిపోతాయ్ ఆఫిసలవాట్లు?ఏదో పర్చేస్ ఆఫీసులో పని చేశాను కాబట్టి, వెండర్లందరూ, ఓ క్యాలెండరూ, డైరీ, ఓ బాల్ పెన్నూ తెచ్చేవారు. జనవరి నెల అయేసరికి, ఓ బస్తాడు తయారయ్యెవి అడిగిన ప్రతీవాడికీ ఇచ్చుకుంటూ పోయినా! వాటిల్లో రాస్తామా ఏమన్నానా? ఆ సీటులో ఉన్నాము కాబట్టి ఇచ్చేవారు, అంతే కానీ మనమీదేమైనా ప్రేమా ఏమిటీ?ఇప్పుడు చూడండి, రిటైరయి 6 ఏళ్ళయింది, ఒక్క డైరీఅయినా లేదు. ఏదో ఉంటే రాసేస్తామని కాదు,అదో తృప్తీ! అలా పోగెసిన డైరీలు ఎక్కడ తేలుతాయీ, చాకలి పద్దులకో, మనవలూ, మనవరాళ్ళూ పెన్నుతో గీతలు గీసుకోడానికో! ఒక్కొక్కప్పుడు, ఏ పేకాటైనా ఆడితే అదీ ఇంటావిడతోనేనండోయ్, స్కోరులు వ్రాసుకోడానికీ. ఆ ఎకౌంటులు ఛస్తే సెటిల్ అవవు, ఎందుకంటే ఎప్పుడూ నేనే ఓడిపోయేవాడిని!పైగా స్టేకు పాయింటుకి రూపాయి, ఇచ్చెమా చచ్చేమా! అసలు ఈ ఎకౌంట్లతోటే, మన జీవితం hyppothicate అయిపోయింది!

చిన్నప్పుడు, కనిపించిన ప్రతీ కొట్టుకీ వెళ్ళి వాళ్ళిచ్చే క్యాలెండర్లు తెచ్చుకోడం ఓ మరపురాని జ్ఞాపకం. వెంకట్రామా ఎండ్ కో వారి తెలుగు క్యాలెండరు, ప్రతీ ఇంట్లోనూ ఒక ఉన్నత స్థానం లో ఉండేది. తరువాత్తర్వాత, ప్రతీ వాళ్ళూ మొదలెట్టారనుకోండి, కానీ దాని ప్లేసు దానిదే! చింతలూరు వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం వారిదోటుండేది (వెడల్పుగా).ఓ ముహూర్తం చూడాలన్నా,వారం వర్జ్యం చూడాలన్నా, ‘ఒరే ఆ కాలెండరోసారి పట్రా ‘ అనేవారు!ఇవే కాకుండా, చిన్న చిన్న కాగితాలతో, ఒక్కో తేదీకి, ఒక్కో కాగితంతో కొన్నుండేవి. ఓ దేముడి బొమ్మేసి, కింద ఒత్తుగా ఈ కాలెండరుని తగిల్చేవారు. ఏడాది అయిపోయినా, ఈ కాగితాలన్నీ చింపేసినా, పైనున్న ఆ ఫుటో బోనస్సన్నమాట మనకి. దాన్ని ఓ పటాలు కట్టేవాడి దగ్గరకు తీసికెళ్ళి, ఓ ఫ్రేము కట్టించేయడం.అందుకే ఇంటినిండా ఆ రోజుల్లో దేముళ్ళ ఫుటోలు ఎక్కడ పడితే అక్కడ వేళ్ళాడేవి,దానికి సాయం ఓ అగరొత్తి అంటించి గుచ్చడం!ఇవి కాకుండా, సినిమా స్టార్ల కాలెండర్లోటి, మన influence ని బట్టి దొరికేవి. కాలేజీకి వచ్చిన తరువాత చదుకోడానికి ఓ రూమ్మిచ్చేవారుగా, దాన్నిండా ఇవే! వాటినే చూస్తూ చొంగ కార్చుకోడం,ఇప్పటిలా ఇంటర్ నెట్లు చూశామా ఏమిటీ?

ఇప్పుడో, న్యూఇయర్ ఈవ్ పార్టీలూ, రేవ్ పార్టీలూ, తాగుళ్ళూ తందనాలూ, అర్ధరాత్రయేసరికి, ఫైర్ వర్క్సూ. ఇన్నీ అయి ఏ తెల్లారకట్లో కార్లు డ్రైవు చేసికుంటూ, ఎక్కడో ఎవడిమీదో పెట్టేసి యాక్సిడెంట్లూ, ఎవడి గోల వాడిదీ! పైగా ప్రతీవాడూ
New Year resolutions అనోటీ.ఎన్నెన్నో అనుకుంటారు, ఒక్కటైనా చేసిన వాడిని చూశామా? అసలు మన జీవితమే unpredictable అయిన తరువాత, ఈ రిజల్యూషన్లూ, ప్లానింగులూ ఎందుకో? బయటికెళ్ళిన వాడు కొంపకి తిన్నగా తిరిగివస్తాడో లేదో తెలియదు, ఇంట్లో వాళ్ళ అదృష్టం బాగుండి, వాళ్ళ పుస్తె గట్టిగా ఉంటే, వచ్చినట్లూ, లేకపోతే అంతే సంగతులు! Life goes on and on....

Advertisements

7 Responses

 1. మీ సకుటుంబ సపరివారానికి, మీ అభిమాన గణానికి (నాతో సహా), మీరు అభిమానించే వారందరికీ… ఈ ఏడాదంతా బోల్డంత బాగా జరగాలని బ్లాగ్ముఖతా ఆకాంక్షిస్తున్నాను.

  Like

 2. 2011 వ సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులందరికి శుభప్రదం గానూ, జయప్రదంగానూ, ఆనందదాయకం గానూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాను.

  Like

 3. 2011 వ సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులందరికి శుభప్రదం గానూ, జయప్రదంగానూ, ఆనందదాయకం గానూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాను.

  Like

 4. బాబుగారూ!

  భలే వ్రాశారండీ!

  మా అన్నయకన్నా మహా అయితే ఓ నాలుగేళ్లు పెద్దవాళ్లేమోమీరు. మనవి అన్నీ ఐడెంటికల్ అనుభవాలే!

  ‘తుమ్మజిగురు, లైపిండి’; ‘తీపి ఙ్ఞాపకాలు’; ‘ఆ సీటులో వున్నాము కాబట్టి’; డైరీలూ ‘చాకలి పద్దులకో……’; ‘ఇచ్చేమా చచ్చేమా!’ (hyppothicate …..భలే అన్నారు!); ‘వెంకట్రామా…..’; ‘చింతలూరు….’; తేదీల కాయితాలు చింపేసుకొనే (ఎల్జీ మిశ్ర ఇంగువ వారివా?) క్యాలెండర్లూ, కాయితాలని చించడానికి మా అన్నదమ్ముల, చెల్లెళ్ల మధ్య పోటీ; ‘చొంగలు కార్చుకోడం’; అబ్బ! అబ్బ! అబ్బబ్బా!

  మీరన్నట్లు, పార్టీలూ, యాక్సిడెంట్లూ, యెక్కడికిపోతున్నాం? అనే వ్యథా!

  రిజల్యూషన్లంటే ఙ్ఞాపకం వచ్చింది–నేను రెండు చేసుకొన్నాను–1. పగలు బ్లాగింగు చెయ్యకూడదు (ఇదో వ్యసనం లా, మిగిలిన పనులన్నీ పాడయిపోతున్నాయి!) అనీ; 2. ఇతరుల టపాలమీద వ్యాఖ్యానాలు చెయ్యకూడదు (శ్రీరామా అన్నా, బూతుమాటగా జమకట్టి, వొంటికాలిమీదొస్తున్నారు పెద్దలు కూడా!) అనీ!

  నిలబెట్టుకుంటాననే ఆశిస్తా! మీ ఆశీర్వాదాలతో!

  Like

 5. Hope Every Moment Of Your Life In The New Year Becomes More Meaningful And Memorable Personally, Professionally & Socially.

  Like

 6. @శంకర్,

  ధన్యవాదాలు.

  @సుబ్రహ్మణ్యం గారూ,

  ధన్యవాదాలు.

  @ఊకదంపుడు గారూ,

  ధన్యవాదాలు.

  @కృష్ణశ్రీ గారూ,

  ముందుగా ధన్యవాదాలు. ఔనూ, ఎవరి టపాలమీదా వ్యాఖ్యలు వ్రాయకూడదనుకుంటే ఎలాగ?నన్నెక్కడికి పొమ్మంటారు ?

  @బోనగిరీ,

  ధన్యవాదాలు.

  Like

 7. i like it

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: