బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


   మన రొటీన్ లోకి వచ్చేద్దామంటారా? ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, మన చేతిలో ఓ రెండుమూడు ఫొటో ఆల్బం లు చేతిలో పెట్టేసినట్లు,నేను కూడా మిమ్మల్ని గత మూడు రోజులుగా బోరు కొట్టేసినట్లున్నాను. నన్నూ, నాగోలనీ భరించినందుకు మనసా,వాచా ధన్యవాదాలు.

మా చిన్నతనంలో ఎప్పుడైనా రేడియోల్లో పాటలు వినాలంటే,ఏ పార్కులోనో వినేవాళ్ళం. కొన్నికొన్ని గ్రామాల్లో అయితే ఏ పంచాయితీ బోర్డువారో, ఆఫీసులో రేడియో పెట్టి, స్పీకర్లద్వారా వినిపించేవారు. తరువాత్తరువాత స్థోమతను బట్టి ఇళ్ళల్లొకి రేడియోలు వచ్చాయి.క్రమక్రమంగా టేప్ రికార్డర్లూ,గ్రామఫోన్లూ వచ్చాయి.ఆ తరువాత Walkman లు వచ్చాయి. ట్రాన్సిస్టర్లోటి మధ్యలో వచ్చాయి. సినిమా పాటలు వినాలంటే ఇన్ని సాధనాలు అందుబాటులోకి వచ్చేశాయి.టెక్నాలజీ అభివృధ్ధిచెంది,సెల్ ఫోన్లూ వగైరాలొచ్చేశాయి.వాటిల్లో మళ్ళీ ఎఫ్.ఎం లూ గట్రా. దాని తరువాత ఐపాడ్ రంగంలోకి వచ్చాయి.

ఇప్పుడు రోడ్డుమీద ఎవరిని చూసినా చాలామంది చెవుల్లో ఏవేవో వైర్లు,’ఇయర్ ఫోన్లు’ తోటే దర్శనం ఇస్తున్నారు. ఇదివరకటి రోజుల్లో ఎవరైనా చెవిలో ఇయర్ ఫోను పెట్టుకున్నారూ అంటే, వారికి వినబడదనే అర్ధం.కొంతమంది ఎందుకొచ్చిన గొడవా, అవతలివాళ్ళు మాట్లాడేది వినబడకపోతేనే హాయీ, అని ఇయర్ ఫోన్లూ వగైరా పెట్టుకునేవారు కారు. దీనికి ఉదాహరణ మా అమ్మగారే. ఆవిడచెప్పేదేదో మనం వినాల్సిందే, మనం చెప్పేది ఆవిడ ఇష్టం ఉంటే విన్నట్లుండేవారు లేకపోతే మన ఖర్మ! ఏదిఏమైనా సుఖపడ్డారనే అనుకుంటాను. ఈ one way traffic లో చాలా ఉపయోగాలుకూడా ఉంటాయి. నేను ఉద్యోగం చేసేటప్పుడు, మా ఫోర్మన్ ఒకాయన ఉండేవారు. ఆయనది బ్రహ్మచెముడు, జి.ఎం. వచ్చినప్పుడు మాత్రమే ఇయర్ ఫోను పెట్టుకునేవారు! మిగిలిన రోజంతా వాటిని దాచేసేవారు.నెత్తినోరూ బాదుకున్నా సరే, చిదానందంగా, చిద్విలాసం తోనే ఉండేవారు. అమలాపురంలో మా ఇంటిపక్కనే ఓ ప్లీడరుగారు శ్రీ చేబోలు అచ్యుతరామయ్య గారని
ఓ ప్లీడరుగారుండేవారు. ఎంత ప్రాక్టీసో ఆయనకి. చెవిలో ఏదీ పెట్టుకోకుండానే కోర్టుల్లో వాదించేవారుట. అవతలివారి వాదనలు ఆయనకి ఎలా వినిపించేవో ఆ బ్రహ్మకే తెలియాలి!He was one of the busiest and successful Advocates in those days.

ఇప్పటిరోజులకొస్తే, ఎక్కడ చూసినా చాలామంది (స్టూడెంట్స్) అదేదో హ్యూమన్ బాంబుల్లాగ, ఈ.సి.జీ. తీసికున్నప్పుడు వేళ్ళాడే వైర్లలాగ జేబుల్లోంచో,బాగ్గుల్లోంచో వైర్లతో, చెవుల్లోకి ఓ ఇయర్ ఫోనూ. మళ్ళీ దాంట్లో ఒకటి ఐఫోనుకీ, రెండోది సెల్ ఫోనుకీనూ. ఏమిటో ఇన్నిన్ని అలంకారాలు చేసికుని, కాలేజీల్లో ఏం చదువులు వెలగబెడతారో అంతా అయోమయం! ఏమైనా అంటే,one must move with times అని జ్ఞానబోధోటీ !పైగా వాటిల్లోంచి వచ్చే పాటలు వింటూ,కొండపల్లి బొమ్మల్లాగ, తల అటూ ఇటూ ఊపడం ఓటీ!ఒక్కొక్కప్పుడు బలే చిరాకనిపిస్తుంది.మనం చెప్పే మాట వినిపించదు,అయినా తల అటూ ఇటూ ఊపేస్తూంటారు, ఏమైనా మతిస్థిమితం తప్పిందేమో అనిపించేలా.

దీంట్లో వాళ్ళనని ఏమీ లాభం లేదు. అసలు వాళ్ళడగ్గానే ఇలాటి hi-fi gadgets కొని ఇచ్చిన వాళ్ళ తల్లితండ్రుల్ని అనాలి. వీళ్ళు ఇస్తేనే కదా వాళ్ళు ఉపయోగిస్తున్నదీ.ఆమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించే తల్లితండ్రులదే తప్పంతా!ఏ బైక్కుమీదో వెళ్తూ, ఈ ఇయర్ ఫోన్లు చెవుల్లో పెట్టేసికుని బయటి శబ్దాలు ( వెనక్కాల వచ్చే కారు హారన్లతో సహా)వినబడక, ఏ ఆక్సిడేంటో చేస్తే, నెత్తీ నోరూ బాదుకోడం! ఇదంతా అవసరమంటారా?ఆ సెల్ ఫోన్లలో కెమేరాలోటీ! వాళ్ళు చేసేదేమిటిట,ఎక్కడపడితే అక్కడ ఎవరినిబడితే వారిని ఫొటోలు తీయడం.కాలేజికి వెళ్ళే పిల్లలకి ఇలాటివివ్వవలసిన అగత్యం ఏమిటో నాకు ఇప్పటికీ అర్ధం అవదు.ఆ పిల్లలు వాళ్ళ కాళ్ళమీద నిలబడినప్పుడు, వాళ్ళకి కావలిసినవేవో వాళ్ళే కొనుక్కుంటారు కదా! ఇక్కడ వచ్చిన గొడవల్లా ఏమిటీ అంటే,ప్రతీవారూ ( పిల్లలూ, వాళ్ళ తల్లితండ్రులూ) తమకున్న ఐశ్వర్యాన్ని చాటుకోవడం. వీళ్ళని చూసి ఇంకోళ్ళు పులినిచూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా, అప్పో సప్పో చేసైనా సరే పిల్లలకి మార్కెట్ లొకి వచ్చిన hi-fi gadgets కొనిచ్చేయడం.18 సంవత్సరాలు నిండేదాకా డ్రైవింగు లైసెన్సు ఎలా ఇవ్వరో, అలాగే ఈ hi-fi gadgets కి కూడా ఓ చట్టం తెస్తే బాగుండును.

ఆ కొడుకో, కూతురో తన సెల్ ఫోను వాడకానికి బిల్లు ఈ తండ్రే కట్టాలిగా.అంతంత బిల్లు ఎందుకౌతూందీ అని అడిగిన పాపానికి పోయాడా ఎప్పుడైనా?తను తీసికోవలసిన జాగ్రత్తలు తీసికోకుండా,ఎప్పుడో ఏదో దారుణం జరిగినప్పుడు ఊళ్ళోవాళ్ళమీదా, సమాజం మీదా పడి ఏడవడం ఎందుకూ? టెక్నాలజీ ఉపయోగించుకోవాలి తప్పు అనరు ఎవరూ. కానీ దానికీ ఓ సమయం సందర్భం ఉంటాయి. కాలేజికి వెళ్ళే పిల్లలకి ఈ కమెరా ఫోన్లూ, ఐ పాడ్లూ లేకపోతే ఏమీ కొంపలు మునిగిపోవు. ఒక్కసారి గుండెల మీద చెయ్యెసికుని ఆలోచించండి, మనం చేసేది సరైనదేనా అని. తరువాత దురదృష్టవశాత్తూ జరగరానిదేదైనా జరిగితే బాధపడేదీ,నష్టపోయేదీ మనమే. ఆ ఐపాడ్/ కెమెరా ఫొను కంపెనీలు కాదు!

ఈ టపా ఎలా ఉందని ఎరక్కపోయి మాఇంటావిడ అభిప్రాయం అడిగితే, ఆవిడ చెప్పిందేమిటంటే, కంప్యూటరు లో టైపు చేయడం వచ్చిన ప్రతీవారూ ఈ బ్లాగ్గులూ అవీ వ్రాసి ప్రపంచాన్ని బోరుకొట్టకుండా, Computer knowledge లో ఓ టెస్ట్ పెట్టి అందులో పాస్ అయినవాళ్ళే బ్లాగులు రాయొచ్చూ అని ఓ చట్టం తెస్తే బాగుండునూ అని!ఆవిడకు తెలుసు, మాకు ఏదో టైపుచేయడం తప్ప ఇంకే కంప్యూటర్ పరిజ్ఞానం లేదని!

Advertisements

5 Responses

 1. కొసమెరుపు (చివరి) పేరా మాత్రం అదుర్స్. మనలో మాట, ఇవాళ కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ లు పుచ్చుకొంటున్న చాలా మందికి కూడా, కంప్యూటర్ జ్ఞానం పెద్దగా ఏమీ ఉండటం లేదు కాబట్టి, మీరు దాని గురించి పట్టించుకోనక్కరల 🙂

  Like

 2. బాబుగారూ!

  భలే పట్టేశారండీ–వీక్షకుల, చదువర్ల నాడిని–‘….ఫోటో ఆల్బంలు…..’ అంటూ! నేనందుకే మీ టపాలమీద కామెంటు చెయ్యలేదు.

  మీరన్నట్టు, హై-ఫై గాడ్జెట్లు కొనుక్కోడానికి సరిపడా పాకెట్ మనీ ఇస్తున్న తల్లిదండ్రులనే అనాలి!

  ఐ టీ వాళ్లననాలి–సెల్ ఫోన్లో ఎంపీ3, ఎంపీ4, కెమేరా, వీడియో, ఇంటర్నెట్…..అంటూ వెర్రి వేషాలేస్తున్న కంపెనీలవాళ్లనీ అనాలి!

  బాగా చెప్పారక్కయ్య…..బ్లాగర్లకి టెస్టులు?! చాలా బాగుంది.

  నా అభినందనలు!

  Like

 3. @కృష్ణ,

  ధన్యవాదాలు. మీ వ్యాఖ్యకి సమాధానం వ్రాద్దామని మొదలెట్టాను, కానీ ఓ పెద్ద టపా రూపం తీసికుంది. త్వరలో ఓ టపా వ్రాస్తాను!

  @కృష్ణశ్రీ గారూ,

  లోగడ ఒక టపా వ్రాశాను. ఈ ఆల్బం ల మీద. నాకు తెలుసండి అవతలివాళ్ళు పడే క్షోభ!

  Like

 4. Sir..nenu inni rojulu mee link enduku : HAREPHALA ani vundhi ani burra gokkuney daani…innalaki kanipettanu..avi mee kutumba sabhyula perlu ani….

  Like

 5. శిరీషా,

  ఇన్నాళ్ళూ శ్రమపెట్టినందుకు క్షంతవ్యుడిని! నేనేదో మనసు పడి పెట్టుకుంటే, అదేదో ఎరువు పేరులా ఉంటుందని, మావాళ్ళు అంటూంటారు!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: