బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- పుట్టిన రోజు హడావిడి…


   నిన్నటి రోజంతా మన బ్లాగులోకంలోని స్నేహితుల ఫోన్లలో గ్రీటింగులూ, నా టపాలలో మనవారు పెట్టిన వ్యాఖ్యలూ చదవడంతోనే, అబ్బ నాక్కూడా ఎంతమంది అభిమానులో అని సంతోష పడిపోయాను.ఫరవాలేదూ, ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోయినతరువాత, ఈ ప్రపంచంలో, నా గురించీ కొంతమందైనా జ్ఞాపకం చేసికుంటారూ అని ఆనందం అనిపించింది!మనం సంపాదించే ఆస్థి ఇంతకంటే ఏం కావాలండి?ఇటు ఇంట్లోవారైనా, బయటి వారైనా తిట్టుకోకుండా ఉంటే చాలు!Our day is made !

   వీటన్నిటితోనూ కడుపు నిండిపోదుగా. సరే అని మా కుటుంబ సభ్యుల్ని బయటకెక్కడికైనా హొటల్ కి తీసికెళ్ళి భోజనానికి వెళ్దామన్నాను. తీసికెళ్ళేది ( కార్లలో) వాళ్ళే అయినా, అక్కడికి నేనే ఏదో శ్రమ పడిపోతున్నట్లు సీన్ క్రియేట్ చేసేసి,మా పిల్లల ఆఫీసు టైమింగ్స్ చూసికొని, ఇక్కడనుండి మేమూ, అక్కడ నుండి మా అమ్మాయీ,పిల్లలూ ఓ హొటల్ కి చేరాము. ఓ పదినిమిషాల్లో మా అల్లుడు కూడా చేరాడు.నేనైతే ఆటోలో, బస్సులో పట్టుకోవాల్సివచ్చేది, వీళ్ళందరికీ కార్లుండడంతో ఒక్కరోజుకైనా, మా ఇంటావిడ సుఖ పడింది.
హొటల్ కి వెళ్ళగానే, మా అమ్మాయి ఓ పెద్ద కారీ బాగ్ చేతిలో పెట్టి ఏదో అంది. నాకైతే ‘దోహా’ అని వినిపించింది.ఇదేమిటీ కబీర్ దాస్ గారు వ్రాసినవేవో ఇచ్చిందేమిటీ అనుకున్నాను. ఊరికే వస్తున్నవి ఏదైతేనే అనుకుని, మరీ ఇంత పెద్ద బాగ్ నిండా ఎవరో పాడిన సీడీ లేమో పోన్లే అనుకున్నాను. పైగా నీకూ, మమ్మీకీ తీసికున్నానూ, నచ్చకపోతే మార్చేద్దామూ అనికూడా చెప్పింది.ఓహో ఆవిడక్కూడానా అనుకున్నాను.చూశారా అమ్మ అంటే అలా అనిపిస్తుందేమో? ఆవిడ పుట్టినరోజునాడు మాత్రం నా గురించి ఎవరూ పట్టించుకోరు, హొటల్ లో బిల్లు చేతిలో పెట్టేవాడు తప్ప!ఏది ఏమైతేనేం ఇంక ప్రతీ రోజూ ఈ దోహా లు పాడుకుంటూ, వింటూ రోజులు గడపాలన్నమాట అనుకున్నాను! బలే అయింది, మా ఇంటావిడ చూసే సీరియల్స్ గొడవోటి వదులుతుందీ అనుకున్నాను.ఇదంతా ఎందుకూ అంటే, మా అమ్మాయికి ఓ పట్టింపోటుందిలెండి.ఏమైనా ఇస్తే వాటిగురించి డైలీ ప్రోగ్రె రిపోర్ట్ ఇస్తూండాలి!ఎప్పుడైనా సీడీ లిస్తే చూశారా అని అడుగుతుంది.ఇప్పుడు కూడా అలాగే అడుగుతుందనే అనుకున్నాను.

   చాయిస్ నాదికదా అని, మా పిల్లలు రెగ్యులర్ గా వెళ్ళే అవేవో హోటళ్ళకెళ్ళకుండా, ఏదో సంసారపక్షంగా మరాఠీ రుచులతో, సర్వ్ చేసే హొటల్ కే వెళ్ళాము.వీళ్ళ టైపు హొటళ్ళకెళ్తే, వాడెవడో ఓ మెనూ కార్డిస్తాడు, వాటిల్లోవి ఏవేవో సెలెక్ట్ చేసి చెప్పాలి. స్టార్టర్స్ కీ, సూప్ కీ ఏది ఎప్పుడు మొదలెట్టాలో తెలియని నన్ను ఊరికే ఇరుకులో పెట్టడం ఎందుకులే అనుకుని, నేను బిల్లు కట్టే మూడు సందర్భాల్లోనూ ( ఆవిడ పుట్టినరోజు, నా పుట్టినరోజు, మా పెళ్ళిరోజు),హొటల్ చాయిస్ నాకే వదిలేస్తారు. అదోటీ ఇంకో కారణం ఏవేవి ఎంతంత ఆర్డరివ్వాలో తెలియదు.వాళ్ళేమో అవేవో కాపర్ బాటం పాత్రల్లో తీసికొస్తారు, అందరికీ సరిపోదేమో అనుకుని ఎవరికి వాళ్ళే కొద్ది కొద్దిగా తీసికుని, చివరకు మిగిల్చేస్తారు.బిల్లు మాత్రం గూబ పగలకొట్టి మరీ వసూలు చేస్తాడు. ఏమిటో ఈ గోలంతా నాకు అర్ధం అవదూ, వాళ్ళతో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పదు,వాళ్ళే ఏదో తెప్పించేస్తారు, ఆ నాన్ లో,రోటీలో దేంట్లోనో నాన పెట్టేసికుని తినేస్తే ఓ గొడవొదిలిపోతుంది.నాకు మాత్రం ఇలా కాకుండా, ఓ పళ్ళెం దాంట్లో నాలుగైదు కఠోరీలూ, వాటినిండుగా, పేర్లు తెలిసిన పదార్ధాలూ,ప్రతీ రెండు నిమిషాలకీ కావాలా అని వడ్డించే సర్వర్లూ-ఇలా ఉంటేనే బాగుంటుంది. ఎంతైనా రాజమండ్రీ లోనూ, అమలాపురంలోనూ, కాకినాడ లోనూ తిండి తిన్న స్టాండర్డూ, ఏం చేస్తాం? అన్నీ బాగుంటాయి కానీ, ఆ చివర్లో వేణ్ణీళ్ళూ, నిమ్మకాయ చెక్కా చిరాకు! హాయిగా వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళి కడుక్కోక! నేనైతే అలాగే చేస్తాను. నన్ను చూసి మా మనవడూ, మనవరాళ్ళూ చెసేటప్పటికి, వాళ్ళని చెడగొట్టేస్తున్నావూ అని మా వాళ్ళ గోల.

   మా అమ్మాయితో ముందరే చెప్పేశాను, తిరిగి వెళ్ళేటప్పుడు మా ఇద్దరినీ మా ఇంటిదగ్గర వదిలేయమని.పిల్లల్ని అల్లుడితో పంపించేసి, మమ్మల్ని మేముండే ఫ్లాట్ దగ్గర దింపేసి వెళ్ళిపోతూంటే, అదేదో ‘దోహా’ ల పాకెట్టు డిక్కీలో ఉందని జ్ఞాపకం వచ్చింది. అవేవో చూసి, తీసికుని పాడుకోవద్దూ? ఇంట్లోకి వచ్చి పాకెట్ ఓపెన్ చేసి చూస్తే తీరా అందులో ఉన్నవి రెండు కప్పుకునే పలచటి రగ్గు/రజాయి లాటివి. ఏమండీ దోహా సీడీ అన్నారూ, ఇదేమిటీ, వీటిని ‘DOHAR’ అంటారు. నాకేం తెలుసూ? మీరూ, మీ అమ్మాయీ ఊరికే చెవులు కొరుక్కుంటే నాకేం తెలుస్తుంది? పాపం తను దోహార్ అనే అనుంటుంది, మీకే ‘దొహా’ అని వినిపించింది!
పోన్లే ఏదో ఒకటీ, రోజూ ఓ తంబురాయో, ఎక్ తారొయో పట్టుకుని పాడుకోవాలేమొ అని భయపడ్డాను, ఇవైతే హాయిగా ముసుగెట్టేసి పడుక్కొవచ్చూ, అవునూ, రెండెందుకిచ్చిందీ అన్నాను.అప్పుడు గుర్తొచ్చింది, నేనే హాయిగా ఉంటే, మా ఆవిడ పేచీ పెడుతుందేమో అని ఇద్దరికీ ఇచ్చింది.

   నిన్న హారం నిర్వాహకులు శ్రీ భాస్కరరామ రెడ్డిగారు అంత హడావిడిలోనూ నా జన్మదిన సందర్భంగా ఓ టపా పెట్టేసరికి, అమ్మో బాపూ గారికిలాగానే నామీదా ఓ టపా వచ్చిందే అనుకున్నాను. ముందుగా శీర్షిక ‘లక్ష్మిగారి మొగుడు..’ చూసి, వీడెవడో నాలాటి వాడే అయిఉంటాడని తీరా చదివితే నాగురించేనండీ! అబ్బో అబ్బో ఎంత సంతోషమయిందో? అందులో మీరువ్రాసినవి చాలా భాగం మరీ ఎక్కువే అయినా,మీకు వ్రాయడానికి టైమెక్కడ దొరికిందండి బాబూ !
మీకూ,అందులో వ్యాఖ్యలద్వారా శుభాకాంక్షలు అందచేసిన-‘చెప్పాలంటే, మాలాకుమార్,సునిత,సుజాత,పి.లక్ష్మి,వేణూ శ్రీకాంత్, బులుసు సుబ్రహ్మణ్యం,శివ భండారు, చిలమకూరు విజయ మోహన్’-గార్లకు ధన్యవాదాలు!! You made my day !

3 Responses

  1. మాకూ కొన్ని స్వీట్లు పంపించరూ ?

    Like

  2. భోజనం విషయంలో నాకూ మీ పద్దతే ఇష్టమండి. కానీ అలాంటి హోటళ్ళు అరుదైపోతున్నాయి ఈ మధ్య.

    Like

  3. @గురువుగారూ,

    పద్మగారికి ఫోను చేసి చెప్పనా, మీరు ఈమధ్యన స్వీట్స్ ఎక్కువగా తింటున్నారని!

    @వేణూ శ్రీకాంత్,

    నిజమే.

    Like

Leave a comment