బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–టైంపాస్


   ఏమిటో గత పదిహేను రోజులనుండీ అంతా హడావిడే. ఓసారి ఢిల్లీ రండీ అంటే, ఆ పెద్దాయన వెళ్ళి రాజీనామా చేసొచ్చారు. వయోభారంతో చేశారుట. అక్కడికి అప్పుడే ఆయనకి ఈ విషయం తెలిసినట్లు! పైగా ఇంట్లో కూడా ఎవరికీ చెప్పలేదుట. సుఖ పడ్డారంటాను. ఏదో వచ్చే మూడేళ్ళూ లాగించేద్దామనుకున్నారు, ‘అధిష్టానం, సోనియా..’ అంటూ. కుదరలేదు. పోనిద్దురూ ఆయన గత 14 నెలలూ చూపించిన విశ్వాసానికి ఎక్కడో అక్కడ గవర్నరు పోస్టిచ్చేస్తారు. హాయిగా మనవలతోనూ, మనవరాళ్ళతొనూ ఆడుకుంటూ గడిపేయొచ్చు.ఎప్పుడైనా పైవారికి నచ్చకపోతే, ‘రాష్ట్రపతి పాలన’ అంటూ రికమెండేషన్లు చేయడం తప్ప పనేముంటుంది లెండి. దేనికైనా పెట్టి పుట్టాలి !

    ఆయన దారిన ఆయన కండువా మీదేసికుని వెళ్ళిపోయిన తరువాత, ఆంధ్రదేశం లో మెడమీద తలున్న ప్రతీ నాయకుడి పేరూ( కాంగ్రెస్), ముఖ్యమంత్రి పదవి కోసం ఊహాగానాలు చేసేశారు. మన టి.వీ వాళ్ళు, తమే అధిష్టానవర్గం అన్నట్లు కథలు ప్రసారం చేసేశారు. ఈమధ్యలో సో కాల్డ్ ప్రముఖంగా వినిపిస్తున్న నాయకులైతే, ‘ నేను రేస్ లో లేనూ..’అంటూ ప్రకటనలోటి.చివరకి ఎవరికీ చెప్పా పెట్టకుండా స్పీకరు కిరణ్ కుమార్ గారిని, మీరే ముఖ్యమంత్రీ అన్నారు.
మిగిలిన శాసనసభ్యుల ఉద్దేశ్యం వగైరాలెప్పుడు తీసికున్నార్లెండి? పోన్లే ఎవరో ఒకరూ,అని మన కాంగ్రెస్ నాయకులందరూ తలూపేశారు.ఆ తరువాత మంత్రివర్గం అన్నారు. దానికి ఓ నాలుగు రోజుల తరువాత ముహూర్తం పెట్టారు. ఈ లోపులో కావలసినంత కాలక్షేపం మన చానెల్స్ కి. వాళ్ళదారిన వాళ్ళకు నచ్చిన వారి పేర్లు జిల్లాలవారిగా, సామాజిక ( కులం) న్యాయం పేరుగా ఓ పేద్ద లిస్టు తయారుచేసేశారు. రోజంతా ఈ Probables తో ఇంటర్వ్యూలూ. వాళ్ళుకూడా ఏమిటో మొహమ్మాట పడిపోయి సిగ్గు పడిపోతూ, మెలికలు తిరిగిపోతూ ‘ అధిష్టానం చెప్తే నిజమైన కాంగ్రెస్ వాదిగా,తప్పకుండా విధేయుడిగా ఉండడంలో అసలు సందేహమే లేదూ..’అని ఓ స్టేట్మెంటిచ్చేయడం. చుట్టూ ఉన్నవాళ్ళు టపాకాయలు పేల్చడం !

   ఈ లోపులో మాజీ ముఖ్యమంత్రి గారి కొడుకు, ఓ పెద్ద టపాకాయ పేల్చాడు!’హాత్తెరీ మా కుటుంబంలో కలతలు పెడతారా.. etc etc…’అంటూ రాజీనామా చేసేశారు. అయినా ఈ పధ్నాలుగు నెలల్లోనూ, ఆయన పార్టీ వ్యవహారాలేమి పట్టించుకున్నారు లెండి, ఏదో ఓదార్పు యాత్ర అంటూ తిరగడంతోనే సరిపోయింది. ఎవరి గొడవ వాళ్ళది.‘అయ్యో పుత్రా, నువ్వే పార్టీనుంచి వెళ్ళిపోయాక నేను మాత్రం ఇందులో ఉండి ఏం చేస్తానూ..’ అంటూ మాజీ ముఖ్యమంత్రిగారి కొడుకు గారి మాతాశ్రీ గారు రాజీనామా చేశారు. ఇంత హడావిడిలోనూ, మాజిముఖ్యమంత్రి గారి కొడుకు గారి పినతండ్రి గారు, ఈ గొడవల్లో మనకేమైనా కిడుతుందా అని ఆలోచించేసి, ఢిల్లీ వెళ్ళి’ నాకో మంత్రి పదవి పడేస్తే, మీకాళ్ళ దగ్గర పడుంటానూ’ అని చెప్పేనని ఆయనే చెప్పారు. పైగా తప్పా అనికూడా కోప్పడ్డారు!అబ్బ ఎంత హాయో కదా అడగ్గానే మంత్రిపదవులిచ్చేస్తూంటే! మనక్కూడా ఎవడైనా ఇస్తే బాగుండునూ అనీపిస్తూంటుంది!

   ఈ హటాత్పరిణామాలతో మళ్ళీ రాజకీయ, సామాజిక విషయాలు మొదటికొచ్చాయి-Back to square one. ఏదోలాగ లెఖ్ఖలూ గట్రావేసి, మొత్తానికి ఓ నలభై మందితో ఓ మంత్రివర్గం తయారుచేసి, వాళ్ళచేత ప్రమాణ స్వీకారాలూ, సంతకాలూ వగైరా చేయించి ఓ గ్రూప్ ఫొటో కి దిగారు. ఇంతగొడవలోనూ ఆవిడెవరో మంత్రి, కూతురి పెళ్ళికూడా చేశారు. మళ్ళీ తరువాత మంత్రి పదవి ఉంటుందో ఊడుతుందో అని. ఊరికే సరదాకి అన్నాన్లెండి, పెళ్ళి ముహూర్తం ఎప్పుడో పెట్టుకునుంటారు, ఏదో కాకతాళీయంగా మంత్రి అయ్యారు. ఎవరెవరు యే యే శాఖలు నిర్వర్తిస్తారో తరువాత చెప్తామన్నారు. ఏ శాఖిస్తేనేమిటీ మంత్రి చేశానుగా అని కిరణ్ కుమార్ గారు, వాళ్ళందరినీ ‘పొండి పార్టీ చేసుకోండి..’ అని ఆ రోజుకి వదిలేశారు. అక్కడే ఆయన పప్పులో కాలేశారు! శాఖా మజాకానా?ఈ మూడేళ్ళలోనూ ( ఉంటే గింటే) ఎంతంత డబ్బులు చేసుకోవచ్చూ, ఎన్నెన్ని మేడలూ, పొలాలూ కొనుక్కోవచ్చూ అనేసి కలలు కనేశారు. తీరా మర్నాడు చూస్తే వాళ్ళ లెఖ్ఖలన్నీ ఉల్టా అయ్యాయి.

    ఆయనెవరికో రవాణాశాఖ నచ్చలేదుట. Joke of the century- రవాణా శాఖలో డబ్బులు చేసుకోలేమూ అన్న వెధవెవడండీ? ఆర్.టీ.ఓ నుండి, బ్రేక్ ఇనస్పెక్టర్లదాకా ప్రతీవాడూ డబ్బులు చేసికునేవాడే.కావాలంటే ఓ సిండికేట్ గా చేసేసికుని, మా మంత్రిగారిక్కూడా వాటా ఇవ్వాలీ అని రేటు పెంచేయడమే!అంతేకానీ రవాణాశాఖిస్తే ఒప్పుకోనూ అంటూ పేచి పెడతారా ఏమిటీ? ఏమిటో ఎవరూ అర్ధం చేసికోరూ ( స్వర్ణకమలం లో భానుప్రియ డయలాగ్)!అదండీ మన మాననీయ మంత్రులు కొంతమందికి వాళ్ళకు కేటాయించిన శాఖలు నచ్చలేదుట- మరీ చిల్లర ఖర్చులకేనా సరిపోదూ- అంటూ రాజీనామాలు చేస్తున్నారో, చేసేశారో లో ఉంది పరిస్థితి. చూద్దాం ఈ డ్రామాలు ఎప్పటిదాకానో?
సరదాగా ఇచ్చిన దానిమీద నొక్కి నవ్వుకోండి. ఎంత నవ్వగలిగితే అంత ఆయుద్దాయం పెరుగుతుందిట !

Mr.M

Advertisements

2 Responses

  1. http://ruchi-thetemptation.blogspot.com/2010/12/blog-post.html

    మీకు అదంటే ఇష్టం కదా! ఎప్పుడన్న ఆంటీ మీ మీద కోపంగా ఉన్నప్పుడు, ఆ లింక్ చూసి సొంతంగా మీకు ఇష్టమైనది చేసుకోవడానికి ప్రయత్నించండి 🙂

    Like

  2. పాని పురీ,

    ఏదో ఆవిడ చెస్తోంది నాకు సుష్టుగా పెడుతోంది. కోపాలూ తాపాలూ ఇలాటివాటిదగ్గర చూపించుకుని చేతులు కాల్చుకోకూడదు. పైగా నేను ఏదైనా ఎడ్వెంచర్లు చేస్తే, తినలేక చావాలి! ఏదో ఇలాగ వెళ్ళిపోనీ నాయనా!! !!!!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: