బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- Some interesting news….

Vir Sanghvi “Tell me what should I tell them_” _ OPEN Magazine

పైన ఇచ్చిన రెండింటిమీదా ఒకసారి నొక్కి చూడండి. Most popular journalists వీర్ శాంఘ్వీ, బర్ఖా దత్ లు ఎంత influential వ్యక్తులో తెలుస్తుంది !

Advertisements

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-టైంపాస్

IE SG

    ప్రస్తుతం దేశంలో జరుగుతున్న విషయాలగురించి, ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ లో ఎడిటర్ శ్రీ శేఖర్ గుప్త వ్రాసిన వ్యాసం పైన ఇచ్చాను. ఒకసారి చదివి, మనం ఎటువంటి దౌర్భాగ్యుల చేత పాలింపబడుతున్నామో తెలుస్తుంది.ఒక్కడంటే ఒక్కడు నీతీ నిజాయితీ ఉన్న రాజకీయనాయకుడు కనిపించడం లెదు. ఏదో మొహమ్మాటానికి, పైన ఇచ్చిన వ్యాసంలో, మన్మోహన్, చిదంబరం,ప్రణబ్, ఆంటొనీ లగురించి వ్రాశారు కానీ, వారి వారి పార్టీల్లో దారుణాలు చేసేవారిని, ఆపకుండా,దేశాన్ని కొల్లగొట్టించేసట్లు చూస్తూ ఉండడం , చేయడం కంటే పెద్ద నేరం ! ఏమైనా అంటే Coalition compulsions/ obligations అంటారు. ఇదేమి గోలండి బాబూ? ఈ దరిద్రులు పోతే ఇంకో దౌర్భాగ్యులు వస్తారు.అసలు ఈ రాజకీయనాయకులకి సిగ్గూ శరమూ ఉందాంట?

    ముంబైలోని ‘ఆదర్శ్ హౌసింగు స్కాం’ లో, అడ్డదోవలోంచి ఫ్లాట్లు కొట్టేసిన Defence అధికారులందరూ,వాళ్ళజీతాలు 50,000 లోపు చూపించారుట.మాజీ ముఖ్యమంత్రైతే అసలు అడగఖర్లేదు. 2G రాజా ఏమైనా అంటే, తను దళితుడిని కాబట్టి, అందరూ తనమీద కత్తికడుతున్నారూ అంటాడు. ఇతనికి సపోర్టు ఇంకో దౌర్భాగ్యుడు కరుణానిధి. ఏం చూసుకునో, అంతా కలిపి పధ్ధెనిమిది మందిలేరూ ( అందులోనూ సగం భాగం కాబినెట్ లో దూరేశారు),కర్ర పెత్తనం చేసేస్తున్నాడు.ఈమధ్యన తన కొడుకు కొడుకుదో, కూతురిదో పెళ్ళి చేశాడు. మన పార్లమెంటు సభ్యుల్ని చూసి నేర్చుకోమనండి. దేర్భ్యాల్లా 33 మందున్నారు. వచ్చిన మంత్రివర్గంలో స్థానాలేమిటీ,అదేదో Dy.Minister లూ,MOS లూనూ.అక్కడికే ఏదో ఘనకార్యం చేసేమనుకుంటూంటారు.

   కామన్వెల్తు గేమ్స్ స్కాం అదసలు ఎంతమంది ఎన్నెన్ని కోట్లు తినేశారో ఇంకా లెఖ్ఖే తేలలేదు, 2G ఏ బెటరూ, ఏదో ఓ లెఖ్ఖ చూపిస్తున్నారు.పదిరోజులయింది, పార్లమెంటు ప్రారంభం అయి, ప్రొద్దుటే సమావేశం అవడం, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, మర్నాటికి పోస్ట్పోను చేయడం.మనమందరం నోరు వెళ్ళబెట్టుకుని చూస్తూండడం!ఇంకా ఎన్నిరోజులు ఈ తమాషా చూడాలో? అందరూ అడిగిన జె.పి.సి. వేస్తే అసలు గొడవ వదిలిపోతుందికదా? ఏమో ఏ పుట్టలో ఏ పాముందో?
మనం ఇన్నాళ్ళూ నీతిమంతులని అనుకుంటున్న ఏ ఘనాపాఠీల పేర్లు బయటకొస్తాయో? వస్తే మాత్రం ఏం పోయిందిటా? వాళ్ళకేమైనా శిక్షలు పడతాయా ఏమైనానా? ఎన్నెన్ని చూడలేదూ? ఓ నెలో రెణ్ణెల్లో మాట్లాడతారు, ఆ తరువాత అంతా మామూలే!

    ఇంక యడ్డిబాబా ని చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు.కావలిసిస్తే, మా పిల్లలకి రాసిచ్చేసిన భూములన్నీ తిరిగి ఇచ్చేస్తాము( ప్రభుత్వానికి), అంతేకానీ, నన్ను ముఖ్యమంత్రి పదవినుండి తీసేయకూడదమ్మా అంటున్నాడు. అంటే’పట్టుకుంటే దొంగా, లేకపోతే దొరా’ అన్నమాట!వాడి కొడుకులైతే పేద్ద జోకర్లనుకుంటారు- వాళ్ళెవరో మైనింగు కంపెనీ వాళ్ళు వీళ్ళ ఎకౌంట్లలోకి 20 కోట్లరూపాయలు వేశారుట, అసలు వాళ్ళది మైనింగు కంపెనీయే అని వీళ్ళకి తెలియనేతెలియదుట సత్తె ప్రమాణికంగా! అబ్బ ఏం సత్యవంతులండి బాబూ!ఈవేళ్టి పేపర్లో ఇంకో సంగతి చదివాము- యడ్డి ఉపముఖ్యమంత్రిగా ఉన్నప్పటినుండే ప్రారంభించాడుట ఈ వ్యవహారాలన్నీ. ఈయనగారి గర్ల్ ఫ్రెండు శొభా ద్వారా ‘ఆదర్శ్’ అనే కంపెనీ నుండి యడ్డి కొడుకులకీ కూతుళ్ళకీ డబ్బులొచ్చేవిట! చూశారా ఈ ‘ ఆదర్శ్’ అనే పేరు ఎంతమందికొంపలు తీస్తోందో? ఇక్కడ ముంబైలో ఓ ముఖ్యమంత్రిని పాపం ‘బలి’ తీసికుంది, ఇప్పుడేమో ‘అమాయకులైన’ యడ్డీ కుటుంబాన్ని వీధిన పెట్టేసింది.ఇవన్నీ బయటపెట్టిందెవరనుకున్నారు? ఇంకో’ నీతిమంతుడు’ కుమారస్వామి.

   ఏదో మనరాష్ట్రంలోనే నాయుడుగారూ, కాంగ్రెసోళ్ళూ డబ్బులు తినేస్తున్నారనుకుని ఏమీ ఏడవనఖ్ఖర్లేదు.బయటి వాళ్ళు వేల కోట్లైతే మనవాళ్ళు లక్షలకోట్లు అంతే!ఛాన్సొస్తే తిందామని సైడు స్క్రీన్ దగ్గర ఓపిగ్గా వేచి, డిశంబరులో ఫీల్డులోకి వద్దామనుకునేవారు ఇంకోళ్ళు! చెప్పొచ్చేదేమిటంటే, కాగడా పెట్టి వెదికినా యుగాంతం లోపులో మనకి ( రాష్ట్రానికీ, దేశం మొత్తానికీ) బాగుపడే ఆశలు లేవు. ఓ దరిద్రుడు పోతే ఇంకో భ్రష్టుడొస్తాడు.మనం మాత్రం Yours faithfully అంటూ ఓట్లేసి నెగ్గిస్తూంటాము.

   ఇంత డిప్రెషన్ లోనూ ఓ మంచిన్యూసు ఏమిటంటే, సుప్రీంకోర్టు వారు, CVC గా నియమింపబడిన థామస్ ( 2G స్కాంలో పావులు కదిపిన ఓ ఘనుడు</b.) నియామకం విషయంలో వివరాలిమ్మందిట! అడిగేరని ఇచ్చేస్తామేమిటీ మరీనూ, అని మన ప్రభుత్వం వారు అన్నా అనొచ్చు! మామూలేగా !!

సర్వేజనాసుఖినోభవంతూ !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Part time job…..

   ఇదివరకటి రోజుల్లో ఓ చాకలి ఇంటికి వచ్చి ఉతికి, ఇస్త్రీ చేయడానికి బట్టలు తీసికెళ్ళేవాడు. మనం అంటే నాలాటివాళ్ళం, బట్టలు మాయగానైనా, ఇంటావిడ అదేమిటండీ నాలుగు రోజుల్నుండి అవే బట్టలేసుకుంటున్నారూ. అని చివాట్లు పెట్టినప్పుడో, బట్టలు విడిచేవాడిని.పెళ్ళైన కొత్తలో మాకు పూనాలో కూడా ఓ తెలుగు చాకలి దొరికాడు. పోన్లే పాపం మా ఇంటావిడకు భాషా సౌకర్యం ఉంటుందీ అని అతనికే ఇచ్చేవాళ్ళం. వచ్చినప్పుడల్లా ఏవేవో కబుర్లు చెప్పేవాడు, కొంతకాలం బాగానే కాలక్షేపం అయింది. ఒక్కోప్పుడు పద్దు వ్రాసేది, ఒక్కొక్కప్పుడు మేము ఏదో బయటకివెళ్ళే హడావిడిలో ఉన్నప్పుడు వస్తే, వ్రాయకుండానే ఇచ్చేసేది.ఒకసారి తను అతి అప్యాయంగా చూసుకునే చీర ఒకటి, కాల్చేసి తీసికుని రావడంతో మాన్పించేశాము.

ఆ తరువాత పిల్లల బట్టలూ, స్కూలు యూనిఫారాలు, మా బట్టలూ మరీ ఎక్కువైపోతూండడంతో, బయట ఉతికి+ఇస్త్రీ కి ఇచ్చే ఓపిక లేకపోవడంతో, మా ఇంటావిడ ఇంట్లోనే బట్టలుతకడం ప్రారంభించింది. మరి ఇస్త్రీ? మరీ చెంబులో నిప్పులు వేసి చెంబిస్త్రీ చేస్తే బాగుండదేమో అని, తను పెళ్ళైనప్పుడు తనతో తెచ్చుకున్న ‘ఉషా’ వారి ఇస్త్రీపెట్టెతో చేసేది. ఆరోజుల్లో ఇస్త్రీపెట్టెలకి టెంపరేచర్ కంట్రోల్ చేసే రియోస్టాట్లూ గట్రా ఉండేవి కావు. స్విచ్చి నొక్కిన అయిదు నిమిషాల్లో ఓ వేడెక్కిపోయేది. ఈవిడ అంత శ్రమ పడ్డం చూడలెక, నేనే అన్ని బట్టలూ ఇస్త్రీ చేయడానికి ఒప్పుకున్నాను. ఇందులో నా స్వార్ధం కూడా ఉందనుకోండి- ఇలాటిదేదో పెట్టేసికుంటే, పిల్లలకి చదువులు చెప్పడం తప్పించుకోవచ్చనీ! నేను చదివింది అదేదో బి.ఎస్సీ అయినా, చదువుకీ, నాకూ ఆమడ దూరం అని చాలా టపాల్లో విన్నవించుకున్నాను.ఏదో పిల్లలకి నా గాలి సోక్కపోవడం వలనే, అంతంత బాగా చదువుకుని జీవితంలో ఓ మంచి స్థానానికి వచ్చారని ఎప్పుడూ నమ్ముతాను.నేను బట్టలు ఇస్త్రీ చేయాలంటే, నేల మీద ఓ చాపా, దానిమీద ఇంట్లో ఉన్న అన్ని దుప్పట్లూ, బొంతలూ వేసేసికుని, ఓ చెంబులో నీళ్ళెట్టుకుని సెటిల్ అయ్యేవాడిని. చాపా, నీళ్ళూ అన్నానని ఊరికే ఏదేదో ఊహించేసుకోకండి రాత్రిళ్ళు పిల్లల చదువులు పూర్తయే వరకూ, బట్టల్ని రుద్దుతూనే ఉండేవాడిని. ఎక్కడ ఆపుచేస్తే, వాళ్ళొచ్చి డాడీ, దీనికి ఆన్సరేమిటీ? అంటారేమో అని! ఈ కార్యక్రమంలో ఒకసారి, మా ఇంటావిడ చీర ఒకటి- నైలెక్సో( ఆరోజుల్లో ఆ మెటీరియల్ ని నైలెక్స్ అనే అనేవారు, అదే కాలక్రమంలో మనుష్యులు తెలివి మీరాక దాన్నే సింథటెక్ అంటున్నారు) ఇంకోటేదో చీర మీద ఆ ఉషా& ఇస్త్రీ పెట్టి పెట్టేటప్పటికి, ఆ చీర కాస్తా కాలిపోయింది.ఓ పెద్ద చిల్లడిపోయింది. ఆ చీర ముక్క ఏమయిందా అని చూస్తే, అదికాస్తా ఆ ఇస్త్రీ పెట్టికి చిపక్కయిపోయింది. దాంతో ఆ ఇస్త్రీ పెట్టి రిటైరయిపోయి, అదేదో ఆటోమెటిక్ ది కొన్నాము.

రోజులన్నీ ఒకలాగే ఉంటాయా ఏమిటీ, మరీ చాదస్థం కాకపోతే! మా ఇంట్లోనూ, వాషింగు మెషీన్లొచ్చాయి, పిల్లలు పెద్దాళ్ళయ్యారు, చదువులూ, పెళ్ళిళ్ళూ అయ్యాయి, వాళ్ళకీ పిల్లలొచ్చారు. మరీ ఇంటికి పెద్దాణ్ణయిపోయానూ, బట్టలు ఇస్త్రీ చేస్తే చూసేవాళ్ళకీ బావుండదూ, ఇంట్లో కోడలు కూడా వచ్చిందీ, అందుకోసం బట్టలన్నీ ఆ వాషింగు మెషీనులో పడేసి, ఆ తరువాత బయట ఇస్త్రీకి ఇవ్వడం ప్రారంభించాము.బట్టకీ మూడో నాలుగో రూపాయలు, చీరలకైతే ఇరవయ్యీ తీసికుంటాడు.చాలా బ్రాడ్మైండుతో ( విశాల హృదయమో ఏదో అంటారుట),మా ఇంటావిడని నా ఒకానొక వీక్ మూమెంటులో, ప్రతీ రోజూ ఈవెనింగు వాక్కుకి వెళ్ళేటప్పుడు ఇస్త్రీ చేసిన చీరలే కడుతూ ఉండమన్నందుకు, ఆవిడ కూడా వారానికో, పదిహెను రోజులకో ఓ అయిదారు చీరలిస్తూంటుంది ఇస్త్రీకి.

వాటన్నిటినీ ఓ మూట కట్టి లాండ్రీ ( అదేనండీ డ్రై క్లీనర్సంటూంటారు) వాడికి ఇస్తూంటాను.వాణ్ణి మరీ అర్జెంటు అంటే ఎక్కువ తీసికుంటాడేమో అని,వాడెప్పుడిస్తే అప్పుడే ఇమ్మంటూంటాను. ఇదిగో ఇక్కడే వస్తుంది అసలు గొడవంతానూ.
నా చీరలు ఇస్త్రీకి ఇచ్చి చాలా రోజులయిందనుకుంటాను అని జనాంతికంగా, అనేస్తుంది. అంటే వెళ్ళి తీసికుని రా అని అర్ధం. జీ హుజూర్ అనుకుని వెళ్తాను.అక్కడికెళ్ళగానే ఆ లాండ్రీ వాడు, చీరలు రోలరు ప్రెస్సో, సింగినాదమో ఏదో అయ్యాయీ, మీ చీరల ( అదేనండీ నేనిచ్చిన చీరలు) రంగేమిటీ అంటాడు.అక్కడకొచ్చేసరికి నాకు టెన్షను ప్రారంభం అవుతుంది. నిన్న తిన్నదే గుర్తుండి చావదు, వారం రోజుల క్రితం ఇచ్చిన చీరల రంగెవడికి గుర్తూ? పోనీ ఇంటికి వెళ్ళి ఆవిడని అడుగుదామా అంటే కలనేత చీరోటీ, తొపు రంగోటీ,చిలకాకుపచ్చోటీ అంటూ ఏవేవో చెప్తుంది. ఆ రంగులు దేనికీ డిక్షనరీలో అనువాదం ఉండదు, పోనీ లాండ్రీ వాడికి చెప్దామా అంటే!

ఆ లాండ్రీ కొట్లు మనవైపున్నట్లు పెద్దగా ఉంటాయా ఏమిటీ, ఓ రూమ్మూ దానిమీద ఓ అటిక్ ( అదేనండీ మనం అటక అంటామే దాన్నే వీళ్ళు స్టైలుగా అలా పిలుస్తారు). కొన్ని బట్టలక్కడా, కొన్ని బట్టలు కిందా ఉంచుతూంటారు. వాడు చెక్క మెట్లెక్కేసి పైకెళ్ళిపోయాడు, నన్ను కింద చూసుకోమని ( అదే నేనిచ్చిన చీరలు). ఇంతలో బట్టలిస్త్రీకివ్వడానికి కాబోలు వచ్చింది చేతిలో రెండు క్యారీ బాగ్గులతో. అప్పటికి నేను సీరియస్సుగా మా ఇంటావిడ చీరలకోసం వెదికేస్తున్నాను. ఆ వచ్చినావిడ నా అవతారం చూసి అక్కడ పనిచేసేవాడిననుకుందో ఏమిటో ४ साडी,४ कुर्ती,४पैजमा,४ शर्ट् అంటూ, इस्त्री केलियॅ అని చెప్తూ, పైగా अर्जेंट् అని కూడా చెప్పేసింది.ఇంకేమీ వినిపించుకోదే! చివరకి ఇంత బ్రతుకూ బ్రతికి లాండ్రీలో పార్ట్ టైం జాబ్ చేయాల్సొచ్చింది.అదేదో తప్పనడం లేదు. నాకూ డిగ్నిటీ ఆఫ్ లేబరూ వగైరాలమీద గౌరవం ఉంది.చివరకి ఫుకట్ గా చెయ్యవలసొచ్చిందే అనే బాధ!

పోనీ ఇన్ని తిప్పలూ పడ్డా చివరకు వ్రతఫలం దొరికిందా అంటే అదీ లేదు. చివరకు ఉద్యాపన కి మా ఇంటావిణ్ణే తీసికొచ్చి తన చీరలు ఐడెంటిఫై చేసికోమన్నాను !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   మొన్నెప్పుడో, నేనూ,మా ఇంటావిడా ఈవెనింగ్ వాక్ కి వెళ్తూ, దారిలో ఉన్న గణపతి గుడికి వెళ్ళాము. ఇంతలో ఒకతను ( అతనెవరో గుర్తుకి రాలేదు)మేము ఉండే పాత ఇంటిదగ్గర ఉండేవాడనుకుంటాను, వచ్చి పలకరించాడు.అదేదో నా మీదేదో అభిమానంతో కాదు.అక్కడికి ప్రక్కనే ఆ ఏరియా కి సంబంధించిన ఓ సీనియర్ సిటిజెన్స్ క్లబ్బోటుందిలెండి, ఆ రోజు అక్కడ వాళ్ళందరూ ‘తంబోలా’ ఆడుకుంటున్నారనుకుంటా. వాళ్ళకి ఆడేవాళ్ళు తక్కువై, నన్ను పిలిచినట్టనిపించింది.అలాటి వాటి మీదైతే నాకు ఆసక్తనేది ఎప్పుడూ లేదు.క్లబ్బు వాతావరణం ఒకటి, నెనెప్పుడూ వాటి జోలికి పోలేదు. అలాగని నేను ఏమీ Unsocial animal కాదు. నా లోకం, నా స్నేహితులూ నాకున్నారు.అసలు ఎవరో ఎందుకూ, మీరందరూ నాకు స్నేహితులే.

    Somehow నాకు, Real world కంటే Virtual world హాయనిపిస్తుంది. మామూలుగా మా సీనియర్ సిటిజెన్స్ క్లబ్బుల్లో జరిగేదేమిటంటే ఓ నలుగురు బెంగాలీ వాళ్ళు Bridge ఆడుకుంటూనో,ఓ నలుగురు మళయాళం వాళ్ళు
రమ్మీ
ఆడుకుంటూనో కనిపిస్తారు. పైగా Bridge ఆడటం ఒక్క బెంగాలీ వాళ్ళకే వచ్చినట్లూ,ఓ Status symbol లా దానిగురించే మాట్లాడుకోవడం. పోనీ ఏదో అదృష్టం బాగుండి ఎవడో ఒకడు ఖాళీగా ఉన్నాడని, కబుర్లు చెప్దామంటే,‘మనకి Next DA instalment ఎంతొస్తుందీ’ లోకి వెళ్ళిపోతుంది. ఏమిటో ఈ తాపత్రయాలు? వచ్చే డి.ఏ. వస్తుందికదా.ఒక మంచివిషయం ఏమిటంటే, దాదాపు అందరూ ఒకే డిపార్ట్ మెంటు లో (ఆర్డ్నెన్స్ ఫాక్టరీ) లోనే పనిచేసినవాళ్ళు కావడం. ‘ ప్రతీ రోజూ పాత మొగుడేనా’ అన్నట్లు, నలభై ఏళ్ళపాటు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూస్తూన్నాము. ఇప్పుడూ వాళ్ళేనా? వెరైటీ ఉండొద్దూ!

   బయటి వాళ్ళు మనల్ని ఎలాగూ వాళ్ళతో చేరనీయరు, ప్రతీ చోటా polarisation. హాయిగా మన దారేదో మనమే చూసుకుంటే పోలేదూ? ఈ ప్రపంచంలో సవాలక్ష మార్గాలున్నాయి కాలక్షేపానికి.One has to look for the options. ఈ బ్లాగులోకంలోకి ప్రవేశించినప్పటినుండీ, ఎంతమంది స్నేహితుల్ని సంపాదించానో తలుచుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. అసలు రెండేళ్ళక్రితం వరకూ కంప్యూటరు జోలికే వెళ్ళడానికి భయపడే నేను, ఇంత తక్కువ సమయంలో
ఎంతమంది స్నేహితుల్ని సంపాదించకలిగానో! ఏ ఆరుగురో ఏడుగురో తప్ప చాలామంది నాకంటే చిన్నవారే అని నా అభిప్రాయం.ఆ ఉన్న ఆరుగురూ నాకు సమవయస్కులే అయుండవచ్చు.చెప్పేదేమిటంటే, ప్రత్య్క్షక్షంగా కలిసినది ఓ పాతిక మందిని, వారుకూడా మాట్లాడినంతసేపూ ప్రాణం ఇచ్చి మాట్లాడారు. ఎంత సంతోషమనిపించిందో?

    అలా కాకుండా ఏదో పొడిచేద్దామని ఏ క్లబ్బులోనో చేరితే ఏమౌతుందీ? మొదటి నెలా రెండు నెలలూ అంతా హ్యాపీ హ్యాపీ గానే ఉంటుంది. తినగా తినగా మొహం మొత్తేసినట్లు, ఆ తరువాత మొదలౌతాయి పోలిటిక్స్. ‘మా అబ్బాయి ఫ్లాట్ కొన్నాడు, మీ వాడేం చేస్తున్నాడూ’, మా వాడు ఆన్ సైట్ వెళ్ళాడూ, ఏమిటోనండీ మమ్మల్నీ రమ్మంటున్నాడూ” మా అమ్మాయి ఈ నెక్లెస్ ఇచ్చిందీ, మా వియ్యాలారు మొన్న ఈ పట్టుచీర పెట్టారూ’ ఇవే కబుర్లు. ఇవన్నీ చెప్పి చెప్పి బొరు కొట్టడమే కాకుండా, మన వ్యవహారాల్లోకి తలదూర్చి, అడిగినా అడక్కపోయినా ఊరికే సలహాలోటీ.నలభై ఏళ్ళు భరించాం, ఇంకా ఇప్పుడు కూడా ఈ తలనొప్పి అవసరమంటారా?ఆ చెప్పే కబుర్లు కూడా, భార్య చెప్పేది ఓటీ, భర్త చెప్పేది ఓటీ! దాంతోటే తెలుస్తుంది వాళ్ళు చెప్పేవాటిలో ఎంతంత నిజం ఉందో?

    పోనీ ఏ టి.వీ. యేనా చూద్దామనుకుంటే,ఆ సీరియల్సూ, న్యూసు చానెల్సూ చూస్తే మన భాష కూడా తగలడుతుంది.ఓపికున్నంతసేపు నెట్ లో బ్రౌజింగు చేసికుంటే హాయి.ఈ గోలంతా ఎందుకు వ్రాస్తున్నానంటే ఈ మధ్యన మా ఇంటావిడ ఓ టపా వ్రాసింది.తను పదిహేనేళ్ళనుండీ ఉంటున్న గ్రూప్ లో కంటిన్యూ చేయడమా, మానేయడమా అని. నన్నడిగితే మానేస్తే సుఖ పడతావు అని చెప్పాను. ఏదో మన దారిన మనం ఉండక, ఈ తాపత్రయాలన్నీ ఎందుకూ? ఎవరో ఏదో అన్నారని బీ.పీ. పెంచేసికోవడం ఈ వయస్సులో అంత అవసరమా? నాతో వంతు పెట్టుకుని కంప్యూటరు ఎలాగూ నేర్చేసికుంది.పైగా ఓ అడుగు ముందేసి లాప్ టాప్ కూడా ఉపయోగిస్తుంది. మా అబ్బాయి ధర్మమా అని ఓ లైబ్రరీ ఉంది. కావలిసినన్ని తెలుగు, ఇంగ్లీషు పుస్తకాలున్నాయి.ప్రతీ వారం పిల్లలతో గడుపుతోంది.ఎప్పుడైనా దెబ్బలాట పెట్టుకుని చివాట్లు తిండానికి Yours obediently నేనున్నాను ! ఇంకేం కావాలండి బాబూ?

   మనం ఉండేది ఎన్నేళ్ళూ? ఉన్నంతకాలం హాయిగా నవ్వుతూ బ్రతకాలి కానీ, ఊళ్ళో జరిగే అన్ని విషయాలూ పట్టించుకోకూడదు.అలాగని పేద్ద intellectual లాగ పోజు పెట్టేయమని కాదు. మన Comfort level లో మనం ఉండడం.మనసుకు ఏది తోస్తే అది చేసేయడం. God has given us a beautiful life. Enjoy !

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- Thaద్దినం….

   ఇదేమిటీ ఈయనకేం పనిలేదా, అస్తమానూ తద్దినాల గురించీ, మాసికాలగురించీ రాస్తూంటాడూ అని మీరందరూ అపోహ పడొచ్చు.ఏం చేయనూ, మామూలుగా అయితే ఈ తద్దినాలనేవి, స్వర్గస్థులైన మన పెద్దవాళ్ళని ఆ రోజు స్మరించుకోడానికి పెడతాము. ఇప్పుడు నేను వ్రాసేదేమంటే, మనది మనమే పెట్టుకోడం అన్నమాట!దానికి ఏదో గయ వెళ్ళి ‘గయోహం గయోహం..’ అనుకోనక్కర్లేదు. అక్కడకి ఒక్కసారి వెళ్తే, మళ్ళీ మళ్ళీ ప్రతీ సంవత్సరం, పెట్టుకోకపోయినా ఫరవా లేదుట.మనమే స్వయంగా పెట్టేసికుంటే, మన తరువాత పిల్లలు పెట్టకపోయినా, మన ‘ఆత్మ’లు సంతృప్తి పొందుటాయిట!

    ఇప్పుడు నేను వ్రాసేదేమిటంటే, ఈ ప్రపంచంలో ప్రభుత్వోద్యాగాలు చేసి రిటైర్ అయిన ‘ప్రాణులు’ ప్రతీ సంవత్సరం, నవంబరు నెలలో, పెన్షన్ తీసికునే బ్యాంకు కి వెళ్ళి, ‘ మేము బ్రతికే ఉన్నాం బాబోయ్’ అని, విన్నవించుకుంటే,మన మహారాజశ్రీ ప్రభుత్వం వారి ‘ఆత్మలు’ సంతృప్తి చెంది, ఏడాది పొడుగునా మన పెన్షన్ ని కంటిన్యూ చేస్తారన్నమాట! వచ్చే ఏడాది నవంబరులో మళ్ళీ ‘సీన్ రిపీట్’.అసలు ఈ నవంబరు నెలనే ఎందుకు ఎంచుకున్నారో బ్రహ్మక్కూడా తెలియదు.ఎప్పుడో ఆ బ్రిటిష్ వాళ్ళు చేసుంటారు, వాళ్ళకి డిశంబరులో క్రిస్మసూ,కొత్త సంవత్సరం శలవులూ కదా, ఓ గొడవ వదిలిపోతుందని, ఈ Thaద్దినం వ్యవహారం నవంబరులో ఫిక్స్ చేసేసుంటారు.గుడ్డెద్దు చేలో పడ్డట్టు, మనవాళ్ళు అదే కంటిన్యూ చేసేస్తున్నారు.

   గమనించుంటారు, ఎక్కడెక్కడిలేని పెన్షనర్సూ, ఈ నవంబరు వచ్చేసరికి, వాళ్ళ’స్వగ్రామం’ లాగ ‘బ్యాంకు గ్రామానికి’ వచ్చేస్తూంటారు. దీపావళి కూడా కలిసొస్తుందీ, పిల్లల్నీ, మనవళ్ళనీ, మనవరాళ్ళనీ చూసినట్టుంటుందీ, మన పాత స్నేహితులు ( వాళ్ళూ పెన్షనర్సే కదా) ఎంతమంది ఉన్నారో ఎంతమంది ఊడేరో తెలిసికున్నట్టుంటుందీ అని, ఓ రెండు మూడు నెలలముందరే రిజర్వేషన్లు చేసికుని ఆ ఊరికి చేరతారు.అందుకనే ఈ నెలలో రైళ్ళలో చాలా మంది ‘కన్సెషన్’ గాళ్ళే కనిపిస్తూంటారు! ఏదో అమ్మాయిలకి సైటు కొట్టొచ్చుగదా అని రైల్వే స్టేషన్ల దగ్గర చక్కర్లు కొట్టే కుర్రాళ్ళందరికీ, ఓ పేద్ద disappointment. రైల్వే కూలీలకి కూడా మంచి గిరాకీ.ఈ పెన్షనర్సందరికీ, తమ సామాన్లు మోసుకునేటంత ఓపిక ఎక్కడ చచ్చిందీ!ఆ కూలీ ఎంతంటే అంతా చేతిలో పెట్టడం.బ్యాంకుకి వెళ్ళి బతికున్నట్లు సంతకం పెట్టకపోతే, సంవత్సరమంతా, రైల్వే స్టేషనులోనో, బస్ స్టాండులోనో, సామాన్లు మోసుకోవాలి!

    మొదటి వారం లో రష్ గా ఉంటుందని, ఓ పదిరోజులు ఆగి వెళ్ళొచ్చులే అనుకుంటే, రెండాదివారాలూ తీసేస్తే మిగిలేది ‘పక్షం’ రోజులే- మహళాయ పక్షాల్లాగ! పైగా పుణ్యంట కూడానూ. ఇదే కాకుండా, మన బ్యాంకోద్యోగులు ‘హాబీ’ గా చేసికునే వార, పక్ష, మాశిక, త్రైపక్ష, త్రైమాసిక,అర్ధసంవత్సర, సాంవత్సరీక ‘సమ్మె’ లోటీ ! వాళ్ళేదో సరదాగా చేసికునే సమ్మెలు కనీసం, ఈ నెలలో పెట్టకపోయినా బాగుండును. అయినా అనుకుంటాం కానీ, వాళ్ళదేం పోయిందీ,వాళ్ళేం ‘బ్రతుకు తెరువు’ సంతకాలు పెట్టాలా ఏమిటీ? పని చేసినా, చెయ్యకపోయినా, మనల్ని ఎంతంతసేపు క్యూల్లో వెయిట్ చేయించినా, ఏ.టీ.ఎం లు పనిచేసినా చెయ్యకపోయినా,పాస్ బుక్కులు అప్డేట్ చేయడానికి ఎంతంత సమయం తీసికున్నా, వాళ్ళ జీతాలు వాళ్ళకి వస్తాయి-ఇందిరా గాంధీ ధర్మమా అని, ‘జాతీయం’ అయిపోయాయి!పెన్షనర్ బ్రతికుంటే ఏమిటీ, ఛస్తే ఏమిటీ, వీడు పోతే వాడి పెళ్ళానికి వస్తుంది, మనకి మన సమ్మె కన్నా ముఖ్యమా ఏమిటీ? అని బ్యాంకులవారి ఉద్దేశ్యం. ఈ నెల 25,26 తేదీల్లో వాళ్ళు సరదాగా చేసికునే సమ్మె ట. దాంతో 24 వ తేదీ లోపలే వెళ్ళి ఉన్నామో ఊడేమో చెప్పాలిట. లేకపోతే you will be treated as dead.

    అప్పటికీ రెండు మూడు సార్లు మా మహారాజశ్రీ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కి వెళ్ళి చూశాను, బాగా రష్ గా ఉంది. ఇంకొంచం ఆగుదామా అనుకున్నాను కానీ, రైల్వే స్టేషనూ, బస్ స్టాండూ, కూలీ, నెత్తిమీద ఎర్ర గుడ్డా, దానిమీద సామాన్లూ దృశ్యం మనో ఫలకం మీదకొచ్చేసరికి, నోరు మూసుకుని, ఈవేళ తిథీ, నక్షత్రం చూసుకుని ఆటో చేసికుని బ్యాంకు ముందర తేలాను.అస్తమానూ బస్సుల్లో వెళ్ళే నేను ఆటో ఎందుకెక్కేనా అని ఆశ్ఛర్యపోకండి. నిన్న వెళ్ళి, నింపి సంతకం పెట్టవలసిన ఫారాలు తెచ్చుకుని, కొంపలో నింపాను. ఈవేళ 10.30 కి బ్యాంకు తెరిచీ తెరవగానే క్యూలో ముందర నుంచోచ్చుకదా అని! ఇక్కడ ‘సీనియర్ సిటిజెన్స్’ కి ప్రత్యేకం అని లేదు. అందరూ ఆ ‘ప్రాణు’ లేగా!

   నేను ఇంత శ్రమా పడి వెళ్ళేటప్పటికే,ఓ వందా రెండొందలమందున్నారు నానా జాతి వారూ ( అంటే చలాన్లు కట్టే వారూ, డీడీ లు తీసుకునేవారూ వగైరా…).ఆ సెక్యూరిటీ వాడు దయతలచి ఏదో ఉధ్ధరించేస్తున్నట్లు మొహం పెట్టి, తలుపులు తెరవగానే పొలో మంటూ, కిందా మీదా పడుతూ, లేస్తూ, తిట్టుకుంటూ, ఒకళ్ళనోరు తోసుకుంటూ ఏ కాలూ చెయ్యీ విరక్కొట్టుకోకుండా మొత్తానికి లోపలికి చేరాను!వాడెవడో చెప్పాడని డూప్లికేట్ లో నింపాను. అక్కడ కూర్చున్న’ బుల్లెమ్మ’ అన్నీ చూసి, నేను వేసిన ఎకౌంటు నెంబరు తప్పంది. ‘ మా తల్లే, మీరిచ్చిన పాస్ బుక్కులో అచ్చేసిందే వేశానూ’ అంటే ‘ఠాఠ్ అది తప్పూ, ఏ.టీ.ఎం కి వెళ్ళి ప్రింటౌట్ తీసికుని రా, అందులో ఉంటుందీ’ అంది. దేముడా అనుకుంటూ, పక్కనే ఉన్న ఏ.టీ.ఎం. లో మినీ స్టేట్మెంట్ తీసికుని వచ్చాను. నా అదృష్టం బావుంది, మామూలుగా అయితే ‘unable to issue a printed statement’ అంటూంటుంది!

    మొత్తానికి వచ్చే ఏడాది దాకా బతికున్నట్లే.అయినా రేపు ముఫై యో తారీఖున చూడాలి వాళ్ళు ఒప్పుకున్నారో లేదో! క్రిందటేడాది ఈ వ్యవహారం అంతా పూర్తిచేసినా, ఏదో సర్వర్ లోపం వల్ల నాకు పెన్షన్ ఓ’నెల తప్పింది’ !ఇప్పుడు తెలిసిందా ఈ టపాకి శీర్షిక అలా ఎందుకు పెట్టానో? ఇంకో సంగతండోయ్ భోజనం అదీ అయ్యేసరికి మూడు దాటింది !!!!!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఈ రోజుల్లోకూడా…

Wife kills self, case against techie, mother – Express India

    ఈవేళ ఓ పేపరులో చదివిన వార్త పైన ఇచ్చాను. ఈ సంఘటన పూణె లో జరిగింది.దురదృష్టం ఏమిటంటే ఈ రోజుల్లో ఇలాటివి జరుగుతున్నాయని. అదీ ఓ విద్యావంతులైన కుటుంబంలో. వచ్చిన న్యూసు ప్రకారం, ఓ అమ్మాయిని,ఆడపిల్ల కనిందన్న కారణం చేత, తన భర్తా, అత్తగారూ హింసలు పెట్టడం చేత, పాపం ఆ అమ్మాయి ఆత్మహత్యచేసికుంది.ఆ అమ్మాయిది ధవళేశ్వరం ( ఆ విషయం ఇంకో పేపర్లో చదివాను). ఆడపిల్ల పుడితే ఏం అయిందిట? ఐ.టి. లో పనిచేస్తున్న అతనికి, ఒక్క ఆడపిల్లనే పెంచి పెద్దచేసే తాహతేలేదంటే,వాణ్ణేం చేసినా పాపం లేదు అని నా ఉద్దేశ్యం.

   అస్సలు ఇంటికి ఆడపిల్ల ఉంటేనే అందం. ఉన్న పిల్లలంతా మగపిల్లలే అని విర్రవీగే తల్లితండ్రుల్ని చూస్తూంటాను.ఇంట్లో ఓ ఆడపిల్లని పెంచి పెద్దచేస్తేనే, ఆ వచ్చే కోడలుతో ఎలా ఉండాలో తెలుస్తుంది. ఆడపిల్లని పెంచడంలో ఉండే ఆనందం ఇలాటి ( అదే న్యూసులో వచ్చినవాడు) దౌర్భాగ్యులకి ఎలా తెలుస్తుందీ? రేపెప్పుడైనా వీడు ఛస్తే ‘ అయ్యో నాన్నా…’ అని ఏడ్చేది ఈ ఆడపిల్లే.మొగపిల్లలు, ఎంత ప్రేమా, ఆప్యాయతా ఉన్నా కానీ, ఏడవడం వచ్చేటప్పటికి ఊరికే మొహమ్మాటపడిపోతూంటారు!

   ఆడపిల్ల ఉంటే ఆ పాపకి ఎన్నిరకాల డ్రెస్సులు,అలంకారాలూ వేసి ఆనందించొచ్చో! మగపిల్లాడికేమిటీ, ఓ లాగూ చొక్కా వేస్తాం. ఓ రెండేళ్ళదాకా ఓ డయపరు బస్ అంతేగా ! మగపిల్లలు ఏదో ఉధ్ధరించేస్తారని, నెత్తిమీద కిరీటం పెడతారని ఆశించడం ఉత్తి అపోహే. రెక్కలొచ్చేదాకా అమ్మా అమ్మా అంటూ కొంగుపట్టుకు తిరిగినవాడే అవి వచ్చీరాగానే జుయ్యి మని ఏ అమెరికాకో ఎగిరిపోతాడు! అమ్మా నాన్నా సెకండ్ ప్రయారిటీలోకి వచ్చేస్తారు. ఇంట్లో అమ్మాయుంటే, తనకి చదువు చెప్పించడం, పెళ్ళి సంబంధాలు వెదికి పెళ్ళి చేయడం ఇదివరకటి రోజుల్లో కష్టమనుకునేవారు. ఈ రోజుల్లో ఏదో నెట్ లో వెదికి ఇదిగో ఈవేళ్టి న్యూసులో వచ్చిన ప్రబ్రుధ్ధుడి లాటివాడికి కట్టబెడతారు.వాడేమిటో, వాడి బాగోగులేమిటో ఎవరికీ తెలియదు.ఇదివరకటి రోజుల్లోనే బాగుండేది, పెళ్ళి నిశ్చయించే ముందరే, అటు ఏడు తరాలూ, ఇటు ఏడు తరాల వివరాలూ తెలిసేదాకా పెళ్ళిళ్ళయేవి కావు.అందుకే అప్పటి జంటలు అరవై, డెభ్భై ఏళ్ళు కాపరాలు చేసే వారు.ఇప్పుడో, సంబంధాలకోసం వెదికి వెదికి విసుగెత్తేసి, చాలా మంది నెట్ లో వచ్చే ‘వివాహ వేదికలు’ కే సెటిల్ అయిపోతున్నారు. అక్కడికి అవేవో తప్పనడం లేదు.అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడంటారు, గ్రీన్ కార్డుందంటారు, హాయిగా అక్కడి పిల్లనే చేసేసికుంటే హాయికదా!

   పోనీ ఈ ‘ వేదిక’ల ద్వారా,తెలిసికుని సంబంధం సెటిల్ చేసికుంటే, ఆ పెళ్ళికొడుకు, ఆ అమెరికాలో ఏమేమి నిర్వాకాలు చేశాడో బ్రహ్మక్కూడా తెలియదు.పెళ్ళికొడుకు వాళ్ళిచ్చిన వివరాలు తప్ప ఇంకేమీ తెలియకుండా జాగ్రత్త పడతారు. మన పిల్ల వాడికి పార్ట్ టైము భార్యా, లేక ఫుల్ ఫ్లెడ్జ్డ్ భార్యో అసలు తెలియదు.పోనీ, ఆ గొడవలన్నీ ఎందుకూ, మన దేశంలోనే ఉన్నవాణ్ణి సెలెక్ట్ చేస్తే ఇదిగో పైన చెప్పిన వాడిలాటి వారు దొరుకుతారు!ఏం చెప్పండి, అంతా మన అదృష్టం మీదుంటుంది.

   అలాగని మగపిల్లాడికి పెళ్ళి చేయడం మాత్రం అంత సులభమంటారా? ఎన్నెన్ని ‘ కోరికలు’- రంగు, కట్నం,ఒకత్తే ఆడపిల్లేనా,చదువూ, సంధ్యా, జీతం ఎంత తెస్తోందీ, వంటొచ్చునా వగైరా వగైరా… ఈ గొంతేరమ్మకోరికలన్నీ తీరడానికి
ఓ పాతిక సంబంధాలు చూసేసరికి మనవాడికి 35-40 ఏళ్ళొచ్చేస్తాయి.మరి వీడికి ఇరవై, పాతికేళ్ళ సుకుమారి కావాలంటే ఎక్కణ్ణించొస్తుందీ? ఏదో కాంప్రమైజు గా ఎవరో ఒకరు దొరికితే చాలూ అనుకుంటారు. ఈ పనేదో ఓ పదేళ్ళముందరే చేస్తే పోలే? ఈపాటికి ఓ ఇద్దరు పిల్లల తండ్రి అయిఉండేవాడు!అస్సలు ఈ బాదరబందీలూ, భవబంధాలూ వద్దే అనుకుంటే హాయిగా ఆజన్మబ్రహ్మచారిగా ఉంటే పోలా? అవ్వాకావాలి బువ్వాకావాలంటే ఎలా? ఓ పిల్లని పెళ్ళి చేసికుని బాధ్యత తీసికున్న తరువాత,ఆ పిల్ల బాగోగులన్నీ చూసుకోవాలి, అంతేకానీ పైన చెప్పిన దరిద్రుడిలాగ ఆడపిల్లని కన్నావూ, మగపిల్లాడిని కనలేదూ అంటూ హింస పెడితే ఎలా? అయినా ఓ మాట చెప్పండి,ఆడపిల్లో, మగ పిల్లాడో పుట్టేది వీడి ఘనకార్యమేకదా!
ఈ మాత్రం దానికి ఆ పిల్లే బాధ్యురాలూ అని ఏడవడం దేనికో?

ఏమిటో ఈవేళ ఏదో రాద్దామనుకుంటూ దేంట్లోకో వెళ్ళిపోయాను. మూడ్ అంతా తగలేశాడు !

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–KBC-4

    వారమంతా సోనీ టి.వీ. లో ప్రొమోలు చూపిస్తూనే ఉన్నారు- అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న KBC-4 లో ఈ సీజన్ కి మొట్టమొదటి సారిగా ఒక అబ్బాయి కోటి రూపాయలు నెగ్గాడని-అందుకోసం ఎంతో ఉత్సాహంగా టి.వీ. ముందరే కూర్చున్నాము. మీరట్ నుండి వచ్చిన ఆ అబ్బాయి ప్రశాంత్ చాలా చాలా బాగా ఆడి, చివరి రెండు ప్రశ్నలకూ మూడు lifeline లు కూడా మిగుల్చుకున్నాడు.ఆఖరి ప్రశ్నకు రెండు lifeline లు ఉపయోగించుకుని, చివరకు తన మనస్సుకు తోచిన సమాధానమే చెప్పేసి, మొత్తానికి కోటి రూపాయలు నెగ్గాడు.

   చిట్టచివరగా, జాక్ పాట్ ప్రశ్న అయిదు కోట్లది ప్రయత్నించాడు. అప్పటికీ అమితాబ్, అతని తల్లి తండ్రులూ చెప్తూనే ఉన్నారు, క్విట్ అయిపోయి కోటి రూపాయలతో సంతృప్తి పడమని. అబ్బే అలా అయితే బాగానే ఉండేది. ఆఖరి lifeline ఉపయోగించి, చివరకు తప్పు ఆన్సర్ చెప్పడంతో, ఒక్కసారిగా మూడు లక్షల ఇరవై వేలల్లోకి దిగిపోయాడు ! చాలా బాధేసింది.అంటే అతనికి వస్తే మనకేదో ఒరిగిపోతుందనికాదు,వద్దు వద్దూ అంటున్నా కానీ, ఆడడం ఎందుకూ అనే బాధ!

    అమితాబ్ చెప్పినట్లుగా Confidence కీ Over confidence కీ మధ్య చాలా చిన్న గీతే ఉంటుంది. ఇప్పటి తరం వారితో అన్నట్లైతే ‘ఈ రోజుల్లో వారికి drive లేదూ, ambition లేదూ’ అనే అంటారనుకోండి.మేము ఇక్కడకు వచ్చింది just for fun అనికూడా అనొచ్చు.మేమేం నెగ్గుతామని వచ్చామా, ఊరికే అమితాబ్ తో కొంత టైము గడపొచ్చని కానీ, అని కూడా అంటారు.

   ఏమిటీ, అతనెవరో నెగ్గకపోతే ఈయనింత బాధ పడిపోతున్నాడేమిటీ అని కూడా అనుకోవచ్చు.ఇక్కడ బాధ పడేదేమిటంటే,వయస్సులో పెద్దవారైన వారు చెప్పినా కూడా వినకుండా, ఉత్తి పుణ్యాన్న చేతికి వచ్చింది తీసికోక, ఖాళీ చేతులతో వెళ్ళాడే అని.అక్కడికి పెద్దవారు చెప్పినవన్నీ వినాలీ అని కాదు. దేనికైనా ఓ లిమిట్ కానీ కంటెంట్మెంట్ అనేది ఉండాలీ అని.రోడ్డుమీద బైక్కు మీద వందమైళ్ళ స్పీడులో వెళ్ళడం ఓ సాహసం అనుకునే రోజులు ఇవి.అలా వెళ్ళకపోతే దేశం ఏమీ అయిపోదు. అయినా సరే ఎవడో చెప్పాడు, మనం ఎందుకు వినాలీ అనే మనస్థత్వం ఈ రోజుల్లో చాలామందిలో చూస్తూంటాము.

    పోనీ పెద్దవారు ఏదో చెప్పారూ వింటే ఏం పోయిందీ అనే మనస్థత్వం ఎప్పటికి వస్తుందో ఏమిటో? ఈవేళ ఆ గేం లో నెగ్గకపోవడం వలన ఆ అబ్బాయి కొంతైనా నేర్చుకున్నాడేమో అని ఆశిద్దాం.సరదాగా బయటివాళ్ళు కాకుండా, ఇంట్లో వాళ్ళు చెప్పిందైనా సరదాగా ఒక్కసారి విని చూడండి, ఏమీ నష్టపోరు.ఆ అబ్బాయి అయిదుకోట్లూ నెగ్గుంటే ఈ గోలంతా వ్రాసేవాడినా అనకండి. ఏమో I don’t know !