బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   ఈవేళ మా స్నేహితొలొకరి ఇంటికి, వారి గృహప్రవేశానికి వెళ్ళాము.ఆ అమ్మాయి పంజాబీ, భర్త మలయాళీ.భర్తగారి తండ్రితో పరిచయం చేశారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. ఆయన 1950 నుండీ మన సికిందరాబాద్ లో ఉంటున్నారు. నా పరిచయం అయిన తరువాత, నేను తెలుగువాడినని తెలిసి, మా స్వంత ఊరు ఏదీ వగైరా ప్రశ్నలు వేశారు. మరీ తెలియదేమో అనుకుని, రాజమండ్రీ అని చెప్పాను. అంటే తూర్పుగోదావరా అన్నారు.అబ్బో, ఈయనకి అన్నీ తెలుసే అనుకుని, కాదూ దగ్గరలోనే అమలాపురం అని ఉంది అక్కడే పుట్టి పెరిగానూ అన్నాను.’ ఓహో కోనసీమా..’ అనడంతో, వామ్మోయ్ ఈయనకి చాలా తెలుసునూ, అనుకుని పిచ్చాపాటీలోకి దిగిపోయాను.

   అప్పుడు ఆయన తను అవిభక్త మద్రాసు రాష్ట్రంలో, ఎక్కడెక్కడ పనిచేశారో ఆ వివరాలన్నీ చెప్పారు.ఇప్పటికి సికిందరాబాద్ లో అరవై ఏళ్ళనుండి ఉంటున్నారుకదా, తెలుగు మాట్లాడడం అదీ వచ్చునా అని అడగ్గానే, టకటకా మని తెలుగులో కుశలప్రశ్నలు వేసేశారు! ఆ సందర్భంలోనే సికిందరాబాద్ లో ఉండే తన ఓ స్నేహితుడిగురించి చెప్పారు- ఆయన బెంగాలీ, ప్రస్తుత తమిళనాడు రాష్ట్రం లో పుట్టారు,చివరకి గుజరాతీ అమ్మాయిని పెళ్ళి చేసికుని, హైదరాబాదులో స్థిరపడ్డారు-
అన్ని భాషలూ అనర్గళంగా మాట్లాడుతారుట. ఈ స్నేహితుడిగురించి చెప్తూ,ఆయనకీ ఈయనకీ ఎక్కడ పరిచయం అయిందో చెప్తే ఆశ్చర్యపోయాను. సికిందరాబాద్ ఆర్మీ హాస్పిటల్ లో ఫిజియో థెరపీ వార్డు దగ్గరట. ఈయనకి ఎడం వైపు, పెరాలిసిస్ స్ట్రోక్ రావడం తో, మందులూ అవీ వాడి, ఆ తరువాత ఫిజియో థెరపీకి వెళ్ళినప్పుడు, అక్కడ ఓ పెద్ద మనిషి, అక్కడికి వచ్చిన ప్రతీ పేషంటుతోనూ, వారి వారి భాషల్లో మాట్లాడుతూ, వారికి ధైర్యం చెప్తూ,అందరినీ ఉత్తేజ పరచడం చూసి, ఆయనతో మాటలు కలిపినప్పుడు తెలిశాయిట వివరాలన్నీ. ఆయనేమీ అక్కడ గైడ్ కాదు. తనుకూడా చికిత్సకోసం వచ్చిన వారే. తగిలిన చోట తగలకుండా, శరీరంలోని చాలా చోట్ల- కాలు,చెయ్యి,మోకాలూ- అడక్కండి ఎక్కడపడితే అక్కడ, విరిగో, బెణికో ఒకదాని తరువాత ఇంకో దాన్ని గురించి ఫిజియో థెరపీ కోసం ఇక్కడికి అంటే ఆ హాస్పిటల్ కి వస్తున్నారుట.చివరికి ఈ మధ్య బాత్ రూం లో జారిపడి నడుము దెబ్బ తిందిట!అయినా సరే, ధైర్యం కోల్పోక, పట్టువదలని విక్రమార్కుడిలా వైద్యం చేసికుంటునే వీలున్నంతవరకూ అక్కడికొచ్చిన పేషంట్లకి ధైర్యం చెప్తున్నారు! హాట్స్ ఆఫ్ !!

   ఇంకో విషయం కూడా చెప్పారు తన తమ్ముడి గురించి- ఆయన అవడం మలయాళీ అయినా, ఒక కన్నడ అమ్మాయిని వివాహం చేసికున్నారుట.ఆరొజుల్లో వాళ్ళ అమ్మగారు అభ్యంతరం చెప్తే, ఆయనన్నారుట-‘అమ్మా మీరూ, నాన్నా ఉండేది ఇంకో అయిదారు సంవత్సరాలు, ఆ తరువాత నేను ఎలాగూ ఒంటరివాడినే కదా, నాకు ఎవరు నచ్చితే వాళ్ళని చేసికుంటేనే సుఖం కదా. కావలిసిస్తే మీ మాట ప్రకారం, మీరున్నంతవరకూ, ఒంటరిగానే ఉండిపోతానూ, అలాగని మీరెప్పుడు పోతారా అని ఎదురుచూడ్డం కాదు. మీరు ఇష్టపడితేనే ఈ పెళ్ళి, అనేటప్పటికి వారు కన్విన్స్ అయి ఆ అమ్మాయితో పెళ్ళి చేశారుట.అలాగని దానితోనే ఆగిపోలెదు, తన పిల్లలకి కూడా వాళ్ళకిష్టమైన వివిధ రకాల భాషల పిల్లలతోనూ పెళ్ళిళ్ళు చేశారుట. అందరూ హాయిగా ఉన్నారు.

   ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే ఈవేళ ప్రొద్దుట జీ తెలుగులో ‘గోపురం’ కార్యక్రమంలో,’ కొత్తగా పెళ్ళైన భర్త ఎలా ఉండాలీ? ‘ అనే విషయం మీద చెప్పారు.ఆవిడ చెప్పినవన్నీ థీరిటికల్ గా బాగానే ఉంటాయి. తల్లితండ్రులతోనూ, భార్యతోనూ సంయమనం పాటించాలీ, ఓ సారధిలాగ ఉండాలీ వగైరా వగైరా.. ఓ మాట చెప్పండి ఈ రోజుల్లో అంత సంయమనం పాటించే ఓర్పూ, ఓపికా ఎవరికైనా ఉన్నట్లు కనిపిస్తోందా?

   ఏది ఏమైనా ఓ కొత్త పరిచయం అయింది.కొత్తవారితో పరిచయం చేసికున్నప్పుడే కదా తెలిసేది ప్రపంచం ఎలా ఉందో ? అంతేకానీ మనమూ, మన పిల్లలూ అనుకోకుండా కొత్తవారితో పరిచయం చేసికుంటూ ఉండండి.
బై ద వే ఈ రెండుమూడు రోజుల్లోనూ చేయడానికి రెండు మిస్టరీ షాపింగులు వచ్చాయి. పీటర్ ఇంగ్లాండ్, లారెన్స్ మేయో. ఆ అనుభవాలు అవి పూర్తయిన తరువాత ! సీ యూ !!

Advertisements
%d bloggers like this: