బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Part time job…..

   ఇదివరకటి రోజుల్లో ఓ చాకలి ఇంటికి వచ్చి ఉతికి, ఇస్త్రీ చేయడానికి బట్టలు తీసికెళ్ళేవాడు. మనం అంటే నాలాటివాళ్ళం, బట్టలు మాయగానైనా, ఇంటావిడ అదేమిటండీ నాలుగు రోజుల్నుండి అవే బట్టలేసుకుంటున్నారూ. అని చివాట్లు పెట్టినప్పుడో, బట్టలు విడిచేవాడిని.పెళ్ళైన కొత్తలో మాకు పూనాలో కూడా ఓ తెలుగు చాకలి దొరికాడు. పోన్లే పాపం మా ఇంటావిడకు భాషా సౌకర్యం ఉంటుందీ అని అతనికే ఇచ్చేవాళ్ళం. వచ్చినప్పుడల్లా ఏవేవో కబుర్లు చెప్పేవాడు, కొంతకాలం బాగానే కాలక్షేపం అయింది. ఒక్కోప్పుడు పద్దు వ్రాసేది, ఒక్కొక్కప్పుడు మేము ఏదో బయటకివెళ్ళే హడావిడిలో ఉన్నప్పుడు వస్తే, వ్రాయకుండానే ఇచ్చేసేది.ఒకసారి తను అతి అప్యాయంగా చూసుకునే చీర ఒకటి, కాల్చేసి తీసికుని రావడంతో మాన్పించేశాము.

ఆ తరువాత పిల్లల బట్టలూ, స్కూలు యూనిఫారాలు, మా బట్టలూ మరీ ఎక్కువైపోతూండడంతో, బయట ఉతికి+ఇస్త్రీ కి ఇచ్చే ఓపిక లేకపోవడంతో, మా ఇంటావిడ ఇంట్లోనే బట్టలుతకడం ప్రారంభించింది. మరి ఇస్త్రీ? మరీ చెంబులో నిప్పులు వేసి చెంబిస్త్రీ చేస్తే బాగుండదేమో అని, తను పెళ్ళైనప్పుడు తనతో తెచ్చుకున్న ‘ఉషా’ వారి ఇస్త్రీపెట్టెతో చేసేది. ఆరోజుల్లో ఇస్త్రీపెట్టెలకి టెంపరేచర్ కంట్రోల్ చేసే రియోస్టాట్లూ గట్రా ఉండేవి కావు. స్విచ్చి నొక్కిన అయిదు నిమిషాల్లో ఓ వేడెక్కిపోయేది. ఈవిడ అంత శ్రమ పడ్డం చూడలెక, నేనే అన్ని బట్టలూ ఇస్త్రీ చేయడానికి ఒప్పుకున్నాను. ఇందులో నా స్వార్ధం కూడా ఉందనుకోండి- ఇలాటిదేదో పెట్టేసికుంటే, పిల్లలకి చదువులు చెప్పడం తప్పించుకోవచ్చనీ! నేను చదివింది అదేదో బి.ఎస్సీ అయినా, చదువుకీ, నాకూ ఆమడ దూరం అని చాలా టపాల్లో విన్నవించుకున్నాను.ఏదో పిల్లలకి నా గాలి సోక్కపోవడం వలనే, అంతంత బాగా చదువుకుని జీవితంలో ఓ మంచి స్థానానికి వచ్చారని ఎప్పుడూ నమ్ముతాను.నేను బట్టలు ఇస్త్రీ చేయాలంటే, నేల మీద ఓ చాపా, దానిమీద ఇంట్లో ఉన్న అన్ని దుప్పట్లూ, బొంతలూ వేసేసికుని, ఓ చెంబులో నీళ్ళెట్టుకుని సెటిల్ అయ్యేవాడిని. చాపా, నీళ్ళూ అన్నానని ఊరికే ఏదేదో ఊహించేసుకోకండి రాత్రిళ్ళు పిల్లల చదువులు పూర్తయే వరకూ, బట్టల్ని రుద్దుతూనే ఉండేవాడిని. ఎక్కడ ఆపుచేస్తే, వాళ్ళొచ్చి డాడీ, దీనికి ఆన్సరేమిటీ? అంటారేమో అని! ఈ కార్యక్రమంలో ఒకసారి, మా ఇంటావిడ చీర ఒకటి- నైలెక్సో( ఆరోజుల్లో ఆ మెటీరియల్ ని నైలెక్స్ అనే అనేవారు, అదే కాలక్రమంలో మనుష్యులు తెలివి మీరాక దాన్నే సింథటెక్ అంటున్నారు) ఇంకోటేదో చీర మీద ఆ ఉషా& ఇస్త్రీ పెట్టి పెట్టేటప్పటికి, ఆ చీర కాస్తా కాలిపోయింది.ఓ పెద్ద చిల్లడిపోయింది. ఆ చీర ముక్క ఏమయిందా అని చూస్తే, అదికాస్తా ఆ ఇస్త్రీ పెట్టికి చిపక్కయిపోయింది. దాంతో ఆ ఇస్త్రీ పెట్టి రిటైరయిపోయి, అదేదో ఆటోమెటిక్ ది కొన్నాము.

రోజులన్నీ ఒకలాగే ఉంటాయా ఏమిటీ, మరీ చాదస్థం కాకపోతే! మా ఇంట్లోనూ, వాషింగు మెషీన్లొచ్చాయి, పిల్లలు పెద్దాళ్ళయ్యారు, చదువులూ, పెళ్ళిళ్ళూ అయ్యాయి, వాళ్ళకీ పిల్లలొచ్చారు. మరీ ఇంటికి పెద్దాణ్ణయిపోయానూ, బట్టలు ఇస్త్రీ చేస్తే చూసేవాళ్ళకీ బావుండదూ, ఇంట్లో కోడలు కూడా వచ్చిందీ, అందుకోసం బట్టలన్నీ ఆ వాషింగు మెషీనులో పడేసి, ఆ తరువాత బయట ఇస్త్రీకి ఇవ్వడం ప్రారంభించాము.బట్టకీ మూడో నాలుగో రూపాయలు, చీరలకైతే ఇరవయ్యీ తీసికుంటాడు.చాలా బ్రాడ్మైండుతో ( విశాల హృదయమో ఏదో అంటారుట),మా ఇంటావిడని నా ఒకానొక వీక్ మూమెంటులో, ప్రతీ రోజూ ఈవెనింగు వాక్కుకి వెళ్ళేటప్పుడు ఇస్త్రీ చేసిన చీరలే కడుతూ ఉండమన్నందుకు, ఆవిడ కూడా వారానికో, పదిహెను రోజులకో ఓ అయిదారు చీరలిస్తూంటుంది ఇస్త్రీకి.

వాటన్నిటినీ ఓ మూట కట్టి లాండ్రీ ( అదేనండీ డ్రై క్లీనర్సంటూంటారు) వాడికి ఇస్తూంటాను.వాణ్ణి మరీ అర్జెంటు అంటే ఎక్కువ తీసికుంటాడేమో అని,వాడెప్పుడిస్తే అప్పుడే ఇమ్మంటూంటాను. ఇదిగో ఇక్కడే వస్తుంది అసలు గొడవంతానూ.
నా చీరలు ఇస్త్రీకి ఇచ్చి చాలా రోజులయిందనుకుంటాను అని జనాంతికంగా, అనేస్తుంది. అంటే వెళ్ళి తీసికుని రా అని అర్ధం. జీ హుజూర్ అనుకుని వెళ్తాను.అక్కడికెళ్ళగానే ఆ లాండ్రీ వాడు, చీరలు రోలరు ప్రెస్సో, సింగినాదమో ఏదో అయ్యాయీ, మీ చీరల ( అదేనండీ నేనిచ్చిన చీరలు) రంగేమిటీ అంటాడు.అక్కడకొచ్చేసరికి నాకు టెన్షను ప్రారంభం అవుతుంది. నిన్న తిన్నదే గుర్తుండి చావదు, వారం రోజుల క్రితం ఇచ్చిన చీరల రంగెవడికి గుర్తూ? పోనీ ఇంటికి వెళ్ళి ఆవిడని అడుగుదామా అంటే కలనేత చీరోటీ, తొపు రంగోటీ,చిలకాకుపచ్చోటీ అంటూ ఏవేవో చెప్తుంది. ఆ రంగులు దేనికీ డిక్షనరీలో అనువాదం ఉండదు, పోనీ లాండ్రీ వాడికి చెప్దామా అంటే!

ఆ లాండ్రీ కొట్లు మనవైపున్నట్లు పెద్దగా ఉంటాయా ఏమిటీ, ఓ రూమ్మూ దానిమీద ఓ అటిక్ ( అదేనండీ మనం అటక అంటామే దాన్నే వీళ్ళు స్టైలుగా అలా పిలుస్తారు). కొన్ని బట్టలక్కడా, కొన్ని బట్టలు కిందా ఉంచుతూంటారు. వాడు చెక్క మెట్లెక్కేసి పైకెళ్ళిపోయాడు, నన్ను కింద చూసుకోమని ( అదే నేనిచ్చిన చీరలు). ఇంతలో బట్టలిస్త్రీకివ్వడానికి కాబోలు వచ్చింది చేతిలో రెండు క్యారీ బాగ్గులతో. అప్పటికి నేను సీరియస్సుగా మా ఇంటావిడ చీరలకోసం వెదికేస్తున్నాను. ఆ వచ్చినావిడ నా అవతారం చూసి అక్కడ పనిచేసేవాడిననుకుందో ఏమిటో ४ साडी,४ कुर्ती,४पैजमा,४ शर्ट् అంటూ, इस्त्री केलियॅ అని చెప్తూ, పైగా अर्जेंट् అని కూడా చెప్పేసింది.ఇంకేమీ వినిపించుకోదే! చివరకి ఇంత బ్రతుకూ బ్రతికి లాండ్రీలో పార్ట్ టైం జాబ్ చేయాల్సొచ్చింది.అదేదో తప్పనడం లేదు. నాకూ డిగ్నిటీ ఆఫ్ లేబరూ వగైరాలమీద గౌరవం ఉంది.చివరకి ఫుకట్ గా చెయ్యవలసొచ్చిందే అనే బాధ!

పోనీ ఇన్ని తిప్పలూ పడ్డా చివరకు వ్రతఫలం దొరికిందా అంటే అదీ లేదు. చివరకు ఉద్యాపన కి మా ఇంటావిణ్ణే తీసికొచ్చి తన చీరలు ఐడెంటిఫై చేసికోమన్నాను !!

Advertisements
%d bloggers like this: