బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-అయిదురొజుల పెళ్ళి !!

    ఈ రోజుల్లో ఒక్క రోజులోనే పెళ్ళిళ్ళు పూర్తిచేసేస్తున్నారు.స్నాతకంతో మొదలెట్టి ( ఒక్కొక్కప్పుడు పెళ్ళికొడుక్కి ఒడుగు అవకపోతే దాన్నికూడా!!),రాత్రి కార్యక్రమాలతో సహా… ఎవరికీ టైమే ఉండడం లేదు, ఇంకేం చేస్తారు? ఈ మధ్యన, నేను లాప్ టాప్ తో కుస్తీపడుతూ, టపాలు హూష్ కాకీ అయిపోయినప్పుడు,విసుగొచ్చి, ఓ పుస్తకం చేతబట్టుక్కూర్చున్నాను.ఆ పుస్తకంలోని కథలు వ్రాసినవారు శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు. పుస్తకం పేరు ‘వడ్లగింజలు’.అందులోని
‘కొత్తచూపు’ కథలోని కొంత భాగం మాత్రమే. ఈ కథ 1948 వ సంవత్సరంలో ‘కిన్నెర’ పత్రికలో వచ్చిందిట.

    అచ్చతెలుగు నుడికారంతో,అలనాటి సామాజిక పరిస్థితులెలా ఉండేవో, ఆయన వ్రాసిన ప్రతీ కథలోనూ ఉట్టిపడుతూంటుంది.అస్సలు విసుపు అనేది పుట్టదు. శ్రీ శాస్త్రిగారు వ్రాసిన ఒక్క కథ చదివారంటే,ప్రచురించిన మిగిలిన నాలుగు పుస్తకాలూ వదలకుండా చదివేస్తారు. అంతవరకూ గ్యారెంటీ.మీరు ఆ పుస్తకాలు చదివేవరకూ, నేను చదివిన కథల్లోని కొన్ని కొన్ని భాగాలు, మీ ముందరకి తేవాలని ఈ ప్రయత్నం.ఇప్పుడు వస్తూన్న సినిమాలూ, టి.వీ. ల్లో వస్తూన్న సీరియల్సూ చూస్తూంటే ‘ఘృణా’ అనిపిస్తోంది.హాయిగా ఏ పురాణం వారి రచనలో, ఏ మల్లాదివారి రచనలో చదువుకుంటూ, హాయిగా పాతరోజులు గుర్తుచేసికోవడంలో ఉన్న ఆనందం ఇంతా అంతాకాదు.

అందరికీ, అయిదు రోజులూ,పూటకి రెండు పిండివంటలతోపాటు,మైసూరు రసమూ, సాంబారూ విధిగా ఉండాలి.పనసకాయ,వంకాయ,అరటికాయ,గుమ్మిడికాయ, కందా,పెండలం-ఇలాటి చచ్చు కూరలు పనికి రావు మాకు.క్యాబేజీ, నూల్ కోలూ,బీట్ రూటూ,కాలిఫ్లవరూ-ఇలాటివి పూటకి రెండు చేయించాలి.బంగాళా దుంపలు చిప్స్ గా మాత్రమే చేయించాలి.ప్రతీ రోజూ పగలు పెరుగు పచ్చడీ, రాత్రి క్షీరాన్నమూ ఉండాలి.రెండు పూటలా పెరుగే కానీ,మాకు మజ్జిగ సుతరామూ పనికి రాదు.పొద్దు పొడిచాటప్పటికి కాఫీ ఉప్మాలూ, పొద్దు వాలాటప్పటికి ఒక తీపీ,ఒక కారమూ, టీ– ఇవి నిక్కచ్చిగా ఉండాలి.తుని ఆకులేగాని, ద్రాక్షారం తమలపాకులు పనికి రావు.విడిదిలో నలుగురు వడ్డిమంగళ్ళెప్పుడూ సిధ్ధంగా ఉండాలి.రెండు జట్కాలున్నూ హాజరుపెట్టి ఉంచాలి.రోజుకొకరకం మంచి సబ్బు బిళ్ళలు డజనూ,అరడజను చీట్ల పేకలు పంపుతూ ఉండాలి. స్నానాలకి మాకు వేణ్ణీళ్ళే కానీ, చన్నీళ్ళు పనికి రావు.ప్రతీ రాత్రీ రెండయేదాకా మేజువాణి ఉంటుంది. పన్నెండు గంటల వేళ సమృధ్ధిగా టీ పంపుతూ ఉండాలి.ఇది అగ్రహారం, మాకు తెలుసు, అయినా పూటకు సిజర్స్ డబ్బాలారూ, బీడీ కట్టలు పెద్దవి మూడూ, కేతకీ మసలా ఒక పౌనూ, బంగాళా ఆకులు నూరూ పంపుతూండాలి. వీటికి మాత్రం రోజుకి పూటలు మూడు సుమండీ!ఫిల్టరు సోడా, కలర్సూ చాలా ముఖ్యం, మరచిపోకూడదు. మిక్కిలి ముఖ్యమైనది మరొకటుంది. భోగం వాళ్ళకిచ్చే బస చక్కగానూ, పరిశుభ్రంగానూ, విశాలంగానూ ఉండాలి.

.

Advertisements
%d bloggers like this: