బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-టి.వి.జ్ఞాపకాలు-2

    1983 లో వరంగాం వెళ్ళినతరువాత,ఓ ఏణ్ణర్ధం వరకూ టి.వి.లేదు.ఆ తరువాత ప్రభుత్వంవారు,ఎల్.పి.టి (లో పవర్ ట్రాన్స్మిటర్)లు ప్రారంభిస్తూ,మాకు దగ్గరలో ఉన్న భుసావల్ లో కూడా ప్రారంభిస్తున్నారని తెలిశాక ఇంక ఊరుకుంటానా? ఓ టి.వి.(వైకింగు) తెచ్చాను.ఆ టి.వి.మా ఎస్టేట్ లో మొట్టమొదటిది!ఈ వైకింగేమిటో ఎప్పుడూ పేరు వినలెదు,ఏదొ ఒకటి ఇంట్లొకి టి.వీ.ఉండాలి అంతే!ఆ టి.వి.మా ఇంటికి అక్తొబరు 31,1984 రొజున వచ్చింది.మేము ఉండే ఏరియా ఎంత రూరల్ అంటే, ఆ టి.వి. కొట్టువాడు, నాలుగు చక్రాల గాడీలో తెచ్చాడు!!ఇందిరాగాంధీ అంతిమయాత్ర చూడ్డానికి మొత్తం ఎస్టేటంతా వచ్చేసింది.పోనీ పిక్చరేమైనా స్పష్టంగా వస్తుందా అంటే అదీ లేదు.ఆ కనిపిస్తున్నదేదో చూసేసి సంతృప్తి పడ్దారు!మళ్ళీ దానికేదో బూస్టరు పెడితే పిక్చరు బాగా కనిపిస్తుందన్నారు.మా క్వార్టరు టెర్రెస్ మీదకెళ్ళి,అస్తమానూ యాంటినా సర్దవలసిచ్చేది.గాలొచ్చినప్పుడల్లా అటూ ఇటూ తిరిగిపోయేది.

    మేము టి.వీ.కొనేటప్పటికి,చాలామందికి కొనెయాలని ఆలొచన వచ్చేసింది. కలరు టి.వీ కొనేయాలీ అని! అప్పటికింకా కలర్ ట్రాన్స్మిషన్ అంత బాగా రావడం లేదు.ఒకసారి కలర్లో వచ్చెదే సడెన్ గా నలుపూ తెలుపుల్లోకి మారిపోయేది!90-91 లో అనుకుంటా, శాటిలైట్ టి.వీ వచ్చింది.అప్పటిదాకా దూర్ దర్శన్ తోనే కాలక్షేపం.కేబులు మామూలుగానే మా ఇంట్లోనే రావాలీ అనే కోరికైతే ఉంది,కానీ మా అమ్మాయి అప్పటికి ఎలివెంత్ క్లాసులోకి వచ్చింది.బోర్డు పరీక్షల్లొకి వచ్చేముందర కేబుళ్ళూ అవీ ఎందుకూ అంటారేమో అని భయపడ్డా.మా అమ్మాయినే అడిగేస్తే పోలెదూ,అనుకుని తనని అడగ్గానే, ‘ఏం ఫరవాలెదూ, తీసేసికో’అంది.అంతే, ఎస్టేట్ లో మొదటి కేబుల్ కనెక్షన్ మా ఇంట్లోకే వచ్చేసింది!

   ఆ తరువాత ,అమ్మాయి పూణెలో చదవడానికి వెళ్ళింది,అబ్బాయి ఇంజనీరింగు మొదటి టరం శలవలకి వచ్చినప్పుడు,ఇంక కలర్ టి.వీ.లోకి మారిపోదామనుకుని, ఎల్.జి. తెచ్చాను.అదితెచ్చినప్పుడు కొద్దిగా హడావిడి చేశాననుకోండి,ఆ విశేషాలన్నీ పాత టపాల్లో వ్రాశాను.1998 లో పుణె బదిలీ మీద వచ్చాను.పూణె లో ఎటువంటి సమస్యా లెదు కాబట్టి,అక్కడ కొన్న ఎల్.జి. నే తెచ్చెసికున్నాను.అప్పటికే ఏడేళ్ళయింది,అంతే కాకుండా కొద్దిగా ట్రబుల్ ఇవ్వడంకూడా ప్రారంభం అయింది. ఆ విషయంలో కూడా,ఎల్.జి.వాళ్లతో దెబ్బలాడి మరీ రిపెరు చేయించాను.దాన్నిచ్చేసి, సోనీ లోకి వెళ్ళాను.
2004 లో మా అమ్మాయి రెండోసారి పురిటికి వచ్చింది,ఢిల్లీ నుండి.ఆ సందర్భంలోనే, రెండో గదిలొకి ఓ ఫిలిప్స్ కొన్నాను.మాములుగా ఇళ్ళల్లో సమస్యలనేవి ఈ టీ.వీ.ల వల్లే వస్తాయని నా నమ్మకం.ప్రతీవారూ ఒకే చానెల్ చూడమంటే కష్టంకదా.అలాగని హొటళ్ళలోలాగ, ప్రతీ రూమ్ములోనూ పెట్టలేము.ఇంటికి ఓ రెండు టీ.వీ.లైనా ఉంటే,సమస్య పరిష్కరించినట్లే!అందుకనే రిటైరయినతరువాత కూడా,ఏ గొడవా లేదు.ఎవరిక్కావలసిన చానెల్ వాళ్ళుపెట్టుకుని చూసుకుంటారు.

    ఈ టి.వీ ల సొద ఎందుకువ్రాశానా అంటే, మేము రాజమండ్రీ వెళ్ళేటప్పుడు,మా అమ్మాయీ,అల్లుడూ ఓ ప్లాస్మా టి.వీ.కొన్నారు.అలాగని అప్పటిదాకా ఉన్న టి.వీ ని అమ్మడానికి మనసొప్పక, మమ్మల్ని రాజమండ్రీ తీసికుపొమ్మన్నారు.మా ఇంటికి వచ్చినప్పుడల్లా తన పాత టి.వీ.చూసుకుని మురిసిపోతూంటుంది! ఓపదిరొజులక్రితం,మా అబ్బాయికీ,కోడలుకీ మా ఇంట్లో ఉన్న టి.వి. మార్చెద్దామని ఆలొచన వచ్చి ఎల్.జి. ప్లాస్మా కొన్నారు.నేను కొన్న సోనీ ఏం చేయాలో ఇంకా ఆలొచించాలి!
మొట్టమొదటి టి.వీ.కొనడానికి నేను పడ్డ తిప్పలు గుర్తుకొచ్చాయి.ఇప్పుడో అలా కాదు–यूं गया यूं लाया !

Advertisements

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    అన్నీ మనకే వచ్చేసుననుకుంటే పప్పులో కాలేసేమన్నమాటే ! ఈ మధ్యన మా అబ్బాయి బెంగళూరు వెళ్ళేడని, నేనూ,మా ఇంటావిడా,మా ఇంటికి పిల్లలు ఒఖ్ఖళ్ళూ ఉంటారని, గడపడానికి వెళ్ళాము.మా కోడలికి తెలుసు,మామయ్య గారికి
కంప్యూటరు దగ్గర లేకపోతే,ఏదో వంకన బయటికి ( అంటే మేముండే ఫ్లాట్ కి) పారిపోతారూ అని. అందుకోసం, మా అబ్బాయితో చెప్పింది,తన లాప్ టాప్ ఇక్కడే వదిలెసి వెళ్ళమని.ఆమధ్యన దాన్ని ఉపయోగించడం కొంచం నేర్చుకున్నాను లెండి,అదన్నమాట విషయం.

   మా ఇంటావిడ నేను వాడడం చూసి, తనూ మొదలెట్టింది. ఏవో తన ప్రహేళికలూ,గళ్ళనుడికట్లూ పూరించి పంపిందికూడానూ! పేద్ద పోజు పెట్టేసి, నేను మాత్రం ఆమాత్రం చెయ్యలేనా అనుకుని, నానా తిప్పలూ పడి, యంత్రం.కాం ఓపెన్ చేసి, క్రమం తప్పడం ఎందుకూ అనుకుని, రాత్రి 10.30 కి మొదలెట్టి సోమవారం ఓ టపా వ్రాశాను.దాంట్లోంచి కాపీ పేస్టు (నా వర్డ్ ప్రెస్) లోకి చేద్దామనుకుంటుండగా, దేనిమీద నొక్కానో ఏమో,వ్రాసిందంతా హూష్ కాకీ ఐపోయింది.మనవణ్ణి ఆడిస్తూ, మా రూం లోకి వచ్చినప్పుడల్లా, నేను టైపుచేస్తూండడం చూసిందిగా, దేనిమీద వ్రాస్తున్నారూ అని అడగడం, ఏదో వ్రాస్తున్నానులే అని చెప్పడం. తీరా చేసి నేను పడ్డ శ్రమంతా ఠప్పు మని ఎగిరిపోయింది!

   అలా మాయం అయిపోయిందనిచెప్తే, మా ఇంటావిడా, కోడలూ నవ్వరూ! దాంతో ‘ఏదో వ్రాద్దామనుకున్నానూ, మూడ్ లేదూ’అని ఓ వెర్రి నవ్వు నవ్వేశాను.‘మరి ఈమాత్రందానికి, అంతసేపూ లాప్ టాప్ తో ఏం చేస్తున్నారూ? పోనీ అది ఖాళీగా ఉంటే నేను ఏ ‘పొద్దుగడో’ పూర్తిచేసికుందునుకదా! అన్నీ వేషాలూ’ అంటూ ఓ లెక్చరూ! పోనీ సోమవారం అలా అఘోరించానుకదా, మంగళవారం ప్రయత్నిద్దామని చూస్తే, ఆరోజూ అలాగే అయింది! దీంతో రెండు రోజులు వ్రాసిన టపాలూ మట్టిపాలైపోయాయి. పోనీ మళ్ళీ వ్రాద్దామనుకున్నా, ఏం వ్రాశెనో గుర్తుకొస్తుందా ఏమైనానా? ఏదో వ్రాసుకుంటూ పోతే ఏదోఒక టాపిక్ మీద వ్రాసేస్తాను కానీ, ఏం వ్రాసేనో గుర్తుండి చావదు. అదండీ విషయం!

   మా అబ్బాయి బెంగళూరునుండి వచ్చేశాడూ, ఇదిగో ఇలా మా ఇంటికి వచ్చేసి ఈ టపా వ్రాసేశాను. ఎంతా పది నిమిషాలు కూడా పట్టలేదు! అందుకే అంటారు-మనకి తెలియనిదానిలో వేలెట్టకూడదూ అని.‘మెడ్డువారీ’ చేసే గుర్రం లాగ, ఈ లాప్ టాప్ ని కంట్రోల్ చేయడం మాత్రం తెలియడం లేదు. దీనిల్లుబంగారంగానూ, ఆ కర్సరు ఎక్కడెక్కడికో పారిపోతుంది, ఏం నొక్కుతామో ఆ చూస్తున్న విండో కాస్తా మాయం అయిపోతుంది. పోనీ అనిఏదో ఒకటి చదువుదామా అనుకుంటే, సిస్టం కాస్తా హాంగ్ అయిపొతుంది!దాన్ని తిరిగి తెప్పించడం రాదూ! ఏమిటో ఇన్ని తిప్పలతో ఆ లాప్ టాప్ ఒకటి మళ్ళీ కొనడం ఎందుకూ? కానీ మా ఇంటావిడ రుచి మరిగింది,దాంతో ఇంక తప్పేలా లేదు.ఎప్పుడో ముహూర్తం చూసుకోవాలి!

%d bloggers like this: