బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-USB,UPS,USP ఏమిటో అంతా గందరగోళం….


   శీర్షికలో పెట్టిన మూడు పదాలతోనూ నాకెప్పుడూ గందరగోళం గానే ఉంటూంటుంది! వాటి అర్ధాలు తెలియక కొంతకాలం అవస్థపడ్డాను, ఏదో పిల్లల్ని అడిగి తెలిసికున్న తరువాత, వాటిని వాడే సందర్భాలు తెలియక చిక్కుల్లో పడిపోతూంటాను!
‘ఏమి మాయ చేశావే ఇంగ్లీషా ‘ అనుకుంటూ, పోనీ మీతోనైనా చెప్పుకుందామని ఈ టపా! ఊరికే నవ్వేసికోకండి, అసలు ఈయనకి ఈ వయస్సులో ఇవన్నీ అవసరమా, హాయిగా రామా కృష్ణా అంటూ ఓ మూలని కూర్చోక అనుకుంటున్నారు కదూ! ఏమిటో అన్నీ తెలుసుననుకోవడం,ఏదో వాగడం! పోనీ హాయిగా ఏ పత్రికో పేపరో చదివేసి కూర్చోక ఎందుకండీ ఇవన్నీ? దాన్నే ‘ఆబ’ అంటారు!పిల్లల ధర్మమా అని కంప్యూటరోటి నేర్పించారు, పోనీ అన్నీ చెప్తారా,అబ్బే, మీకు అవసరం ఉండదూ, అయినా అంతకావలిసిస్తే మేమున్నాంగా అంటారు. ఏదో వాళ్ళందరూ మాట్లాడుకునేటప్పుడు విన్నవాటినే, గుర్తుంచేసికుని ‘ఓహో అలాగా…’ అనుకుంటూ, వాటిని నాకంటే అధమాధముడు( కంప్యూటరు విషయంలో) ఎవడైనా దొరికితే వాడెదురుగుండా ఎడా పెడా వాడేయడమే!వాళ్ళుకూడా ‘ఓహో ఎంత అదృష్టవంతులూ, మీకు చాలానే వచ్చునే’ అనుకుంటూంటారు!

    ప్రస్తుత విషయానికొస్తే… ఈ మధ్యన మా అబ్బాయీ,కోడలూ ప్రారంభించిన గ్రంధాలయం కోసం ఓ ఫ్లాట్ అద్దెకు తీసికున్నారు.దాంట్లో ఓ రెండు కంప్యూటర్లూ, వాళ్ళ లాప్ టాప్పులూ పెట్టుకున్నారు.అక్కడ ఇంకా నెట్ కనెక్షన్ రాలేదు లెండి,దాంతో మా కోడలు ఫోను చేసింది, మేముండే చోటుకి, ‘మామయ్యగారూ, వచ్చేటప్పుడు, మీ USB తీసికుని రండీ’ అని.ఇక్కడ నాకున్న కంప్యూటరులో ఈ USB ఏమిటో తెలియదు!నెట్ రావడానికి వచ్చే ఆ బుచ్చి కాడని USB అంటారని నాకేం తెలుసూ? పాపం ఒకదానికోటి చెప్పిందేమో అనుకుని,టేబుల్ క్రింద ఉండే UPS ని ఓ పేద్ద సంచీలో పెట్టుకుని చక్కాపోయాను.’USB తెచ్చారా’ అని అడగ్గానే, జేబులోంచి తీసి ఇస్తానేమో అని చూస్తున్న మా కోడలు, ‘ఇదేమిటీ ఈయన్ని USB తీసుకురమ్మంటే, ఏదో కూరలు తీస్తున్నట్లు సంచీ తీస్తారూ’అనుకుంది.నేను నాతో తెచ్చినదాన్ని టేబిల్ మీద పెట్టాను.అదేమిటీ దీన్ని తెచ్చారూ అంటే, ‘నాకేం తెలుసూ, ఇదే అనుకున్నానూ’ అనేటప్పటికి,మా పిల్లలకి నవ్వాలో ఏడవాలో తెలియలేదు! ఆ తరువాత విషయం అర్ధం అయేలా చెప్పారనుకోండి.

   మా వాళ్ళు ప్రారంభించిన గ్రంధాలయం గురించి వీళ్ళూ, వీళ్ళ పార్ట్నరూ ఏదో డిస్కస్ చేసికుంటూంటే, నేనెందుకూ అక్కడ పానకంలో పుడక లాగ, అయినా సరే నాకూ ఏదో వచ్చునూ అని చూపించుకోవాలిగా, వాళ్ళు చెప్పేదంతా వింటూ కూర్చోచ్చుగా, అబ్బే, అలా ఉండిపోతే మననెవడు పట్టించుకుంటాడు? మా గ్రంధాలయంలో ‘పుస్తకాలు తీసికోవడానికి, ఎవరూ ఎక్కడికీ వెళ్ళఖ్ఖర్లేదు, పుస్తకాలే మీదగ్గరకి వస్తాయీ’. దీన్నేదో అంటారు, ఎవరివద్దా లేనిదాన్ని, సమయానికి గుర్తొచ్చి చావదూ,అమ్మయ్యా గుర్తొచ్చింది ‘హా UPS’ అదే కదా మన UPS అని ఇంకోసారి అనేటప్పటికి, మా వాడి ఫ్రెండు/పార్ట్నర్ హటాత్తుగా మాట్లాడుతూన్నవాడల్లా, అర్ధం కాక ఆగిపోయాడు! అలాటి దాన్ని USP అంటారుట! ఏమిటో ఇలాగున్నాయి నా పాట్లు!

   ఇక్కడితో అయిందా పోనీ అనుకుంటే, ఈ మధ్యన మన సత్యాన్వేషణ బ్లాగరు, రెహ్మానుద్దీన్ తో పరిచయం అయిన తరువాత, అతనితో చెప్పాను, ‘ నా దాంట్లో ( కంప్యూటరులో) తెలుగులో అక్షరాలు టైపు చేసినప్పుడు బాగానే వస్తున్నాయి కానీ,కొన్నిటిలో అక్షరాలకి బదులుగా బాక్స్ ల్లాగ వస్తున్నాయీ, ఏమైనా చెసిపెట్టు బాబూ’ అన్నాను. ‘ మీ OS ఏమిటండీ’ అన్నాడు. మళ్ళీ ఈ గొడవేమిటీ అనుకుంటూ‘వాడెవడూ’ అన్నాను. గవర్నమెంటు లో పనిచేసినంతకాలం, ఈ ఆఫీసు సూపర్నెంట్లే గా(OS)నాకు తెలిసినవాళ్ళు.’ కాదు మాస్టారూ,మీ Operating System ఏమిటీ’ అన్నాడు. ‘నాయనా నాకు ఆ గొడవలేమిటో తెలియదూ, నువ్వే చూసుకో’ అనేటప్పటికి, అయ్యబాబోయ్
ఈ ఊళ్ళోనే ఉంటే ఈయనతో వేగడం ఎలాగరా బాబూ అనుకుని, హైదరాబాద్ పోస్టింగు తీసికుని వెళ్ళిపోయాడు!!

   ఆఫీసంటే గుర్తొచ్చింది, నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు, ఒకసారి మా ఆఫీసులో డాక్యుమెంట్స్ ఫైలు చేద్దామనుకుంటే, వాటికి చిల్లులు ( పైల్లో పెట్టడానికి) చేయడానికి, మా ఆర్డర్లీతో పక్క సెక్షను కి వెళ్ళి Punching machine తీసుకు రారా అంటే, వాడు నా ఎదురుగుండానే మోటారు సెక్షను వాళ్ళకి ఫోను చేసి ఓ ట్రక్కు అడిగాడు, ఎందుకురా అంటే, ‘మీరు అదేదో మెషిను తెమ్మన్నారుగా, అందుకూ’ అన్నాడు. మా నాయనే దాన్ని జేబులో పెట్టి తేవచ్చు అన్నాను.
దాన్నే అంటారు ఎంత చెట్టుకు అంత గాలీ అని! ఆ రోజున వాడికి పంచింగ్ మెషీన్ అంటే తెలియలేదు, ఈవేళ నాకు USB అంటే తెలియలేదు! అదండీ సంగతి!!

Advertisements

7 Responses

 1. ఇంతకీ USPఅంటే ఏమిటి?

  Like

 2. Unique Selling Preposition

  Like

 3. పక్క సెక్షను కి వెళ్ళి Punching machine తీసుకు రారా అంటే, వాడు నా ఎదురుగుండానే మోటారు సెక్షను వాళ్ళకి ఫోను చేసి ఓ ట్రక్కు అడిగాడు, ఎందుకురా అంటే, ‘మీరు అదేదో మెషిను తెమ్మన్నారుగా, అందుకూ’ అన్నాడు. —– Super

  Like

 4. మీరు మరీనూ!

  దసరా అయిపోయాక సరదా టపా వ్రాశారు!

  (మళ్లీ ‘ముసలి……కి ‘ దసరా యేమిటి అంటారేమో)

  సంతోషం!

  Like

 5. USB తేవడమేమిటి మాస్టారూ? అదేమైనా తోటకూరా తెంపుకురావడానికి?! థంబ్ లేదా పెన్ డ్రైవ్ అని పిలవాలి. USB అంటే యూనివర్సల్ సీరియల్ బస్, వాల్వో బస్ కాదు అని అమ్మాయి గారికి చెప్పి మార్కులు కొట్టేయండి. :))

  Like

 6. బావున్నాయి(ఈ మాట రొటీన్ గా చెప్పీ చెప్పీ బోరు కొడుతోంది.) లక్ష్మి గారికి కంప్యూటర్ ఇవ్వట్లేదా ఏమిటి?ఈ మధ్య ఆవిడ పోస్ట్లు అసలు రావట్లేదు.

  ఆవిడ పుట్టినరోజు విశేషాలు రాయండి

  Like

 7. @మురళీ మోహన్ గారూ,
  కృష్ణగోపాల్ గారు చెప్పారుగా !

  @కృష్ణగోపాల్,

  థాంక్స్ .చెప్పినందుకు.

  @నరేష్, ధన్యవాదాలు.

  @కృష్ణశ్రీ గారూ,
  ఏదో కాలక్షేపానికి వ్రాసేవే లెండి.

  @ఎస్ ఎన్ కే ఆర్,

  వాళ్ళకి మాత్రం తెలియదుటండీ. నేనేదో అతి తెలివితేటలకి వెళ్తే వీధిన పడిపోతాను!

  @ఋషీ,

  ఈ వేళ్టి టపా లో వ్రాశాను.నా కేమిటో భవిష్యత్తంత బాగా లేదేమో అనిపిస్తోంది !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: