బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–అప్పులు/ఋణాలు…


   మళ్ళీ ఏం వచ్చిందో మన చానెళ్ళు ,పత్రికలు గత వారంరోజులుగా స్వల్ప ఋణాల సంస్థల వెనక్కాల పడ్డారు. ఆ సంస్థలకి వాళ్ళు చేసే పన్లనీ అదేదో హై సౌండింగ్ పేర్లు–మాక్రో ఫైనాన్స్/మైక్రో ఫైనాన్స్ అనో ఇంకేదో సింగినాదమో పేరుతో పిలుస్తారుట! ఏది ఏమైనా వాళ్ళిచ్చేది అప్పులే! అయినా పేరులో ఏముందిలెండి? ఏ రాయైతేనేమిటిట బుర్ర పగులకొట్టుకోడానికి? ఆ విషయానికొస్తే, చిట్ ఫండులకీ, ఫైనాన్సు కంపెనీలకీ,క్రెడిట్ కార్డులకీ,కొంప కట్టుకోడానికిచ్చే అప్పులకీ,బ్యాంకుల వాళ్ళు మనవెనక్కాల పడి ఇచ్చే అప్పులకీ అలా చెప్పుకుంటూపోతే,ఎవడిచ్చే అప్పయినా తల తాకట్టు పెట్టైనా తిరిగి ఇవ్వాలిగా? ఏమిటో ఆ అప్పు తీసికునేటప్పుడు ఏదో మాయా మైకం కమ్మేస్తుంది అప్పు తీసికున్న ప్రతీ వాడికీనూ.ఇవ్వలేకపోతామా అనుకుంటూ తీసికుంటారు.పని అయిపోయి, వాయిదాలు కట్టేటప్పుడు వస్తుంది గొడవంతా. ఆ అప్పిచ్చినవాడు, మనకేమైనా మేనత్త కొడుకా ఏమిటీ,వదిలెయడానికి?

    ఇదివరకటి రోజుల్లో అప్పులు దొరికేవి కాదు కాబట్టి, చచ్చినట్లు చేతిలో డబ్బులున్నప్పుడే వస్తువులు కొనడం, ఓ కొంప కట్టుకోవడం లాటివి చేసేవారు.మహ ఉంటే పచారీ కొట్టులోనో, బట్టలకొట్టులోనో ఖాతాలుండేవి.తరువాత్తర్వాత, బ్యాంకులవాళ్ళ సౌజన్యంతో ఏదో ఫ్రిజ్జిలూ, టి.వీ.లూ కొనుక్కోడానికి Instalments కొనుక్కోడానికి వీలుపడేది. దానిక్కూడా ఏవేవో సంతకాలూ, గ్యారంటీలూ కావల్సివచ్చేవి. డబ్బులు టైముకి కట్టకపోతే, మనం కొనుక్కున్న సరుకు కాస్తా తిసుకుచక్కాపోయేవాడు.

    ప్రపంచంలో ఎవడూ చారిటీ కోసం అప్పులివ్వడు చిట్ ఫండు వాడు, ఓ లక్ష కావాలంటే,ఏ ఎనభైవేలకో పాడాలి,అంటే ఇరవైవేలు మనం అదనంగా కడుతున్నామన్న మాటే కదా! అలాగే హౌసింగు లోన్ తీసికోండి,చూడ్డానికి 8%- 10% అంటారు, ఓ పాతికేళ్ళకి, ముందర మనం కట్టే వాయిదాలన్నిటినీ వాడు వడ్డీ క్రిందే జమ చేసేసికుంటాడు, అందుకే ఎప్పుడడిగినా మన ప్రిన్సిపల్ ఎమౌంటు ఎక్కడుందే గొంగళీ అంటే అక్కడే ఉంటుంది!ఏదో ఉధ్ధరించేస్తున్నట్లుగా కబుర్లు చెప్తారు మళ్ళీ. క్రెడిట్ కార్డుల పేర్లతో వాళ్ళు వసూలుచేసే వడ్డీ ఏమైనా తక్కువా ఏమిటీ? తేడా ఏమిటంటే, పేద్ద స్టైలుగా ఆ కార్డులు ఊపుకుంటూ,ఓ సంతకంపెట్టేస్తే చాలు! వాళ్ళుమాత్రం ఊరుకుంటారా, తిరిగి ఇవ్వకపోతే, ఎవళ్ళో గూండాగాళ్ళని పంపించి, ముక్కు పిండి వసూలు చేస్తారు.ఈ క్రెడిట్ కార్డులు,ఈ బి.పి.ఎల్ ( బిలో పావర్టీ లైన్) వాళ్ళకి ఇవ్వరుకాబట్టి, ఈ స్వల్పఋణాల సంస్థలు ఊరిమీదకు బయలుదేరాయి.దానికీ ప్రభుత్వం అనుమతిచ్చిందికదా.వాళ్ళు ఏదో ఎక్కువ వడ్డీ వసూలు చేసేస్తారట,ఎవడిస్తాడండీ ఈ రోజుల్లో చవగ్గా!వాళ్ళ కంపెనీల్లో పనిచేసే వాళ్ళకి జీతాలూ భత్యాలూ ఎవడిస్తాడు? మనం ఇచ్చే వడ్డీమీదే బ్రతకాలి!ఆ వాయిదాలు వసూలు చేయడానికి వచ్చిన వాళ్ళని అల్లరి పెడితే ఎలాగ? పైగా చానెల్స్ లో కనిపించేవారందరిదీ ఒకటే మాట, ఆవిడెవరో స్టూడియోలో కూర్చుని మరీ చెప్పేస్తోంది, ‘అప్పు తీర్చకపోతే ఆత్మహత్య చేసికో కావలిసిస్తే’ అని అంటున్నారూ అని.ఇదంతా స్టోరీకి ఒకవైపేకదా! మరి ఆ సూక్ష్మఋణాల కంపెనీ వాళ్ళని ఇంటర్వ్యూ చేయడంలేదేం? ఈ మధ్యన చూస్తూన్నాము, Paid News అని, ఇదికూడా ఆ కోవకే చెందిందనుకోవడంలో తప్పేమిటిట?

   ఛాన్సు రావాలే కానీ,మన రాజకీయనాయకులు రంగంలోకి వచ్చేస్తారు.నాయుడుగారూ,నారాయణ గారూ పొద్దుటినుంచి ఒకటే హడావిడి! ఇదంతా ఆత్మహత్యలు చేసికున్నవారి మీద సానుభూతి లేక ఏదో వ్రాస్తున్నాననుకోకండి.వాళ్ళు తీసికున్న అప్పులు తీర్చాలికదండీ మరి.ఏ చార్మినార్ బ్యాంకో,కృషీ బ్యాంకో దివాళాతీస్తే మనవాళ్ళు ఏం చేయలేరు. కారణం అలా నష్టపడ్డవారు vote bank లోకి రారు. సో కాల్డ్ ఇంటలెక్చుఅల్స్! ఏదో పేద్ద ఉధ్ధరించేస్తున్నట్లుగా, ఓటు వేయడానికి వెళ్ళకపోవచ్చు.‘ఈ దేశం బాగుపడదండీ’ అంటూ, ఈమాత్రందానికి వోటింగుకూడా ఎందుకూ అంటూ శలవిచ్చారుకదా అని ఏ సినిమాకో పోయే ప్రబుధ్ధులు.వీళ్ళనెవరు బాగుచేయకలరూ?అందుకే అలా ఏడుస్తున్నారు.ఈ స్వల్పఋణాలు తీసికుని ( అప్పుడు బాగానే ఉంటుంది),ఇవ్వలేక ఆత్మహత్యలూ వగైరాలు చేసికుంటూంటే ఎంత హడావిడో? ఎంతైనా vote bank లోకి వాళ్ళ ముఖ్యపాత్ర ఎక్కువ.అందుకే అందరూ ఇంత గొడవ చేస్తున్నారు.

    మనం తీసికునే హెల్త్ పాలిసీలు తీసికోండి, రెండేళ్ళపాటు మనం డబ్బులు కడితేనే కానీ, దాని ఉపయోగం ఉండదు. అలాగే హౌసింగు లోన్ తీసికున్నప్పుడు ఓ యాభై కాగితాలమీద సంతకాలు పెట్టించుకుంటారు అందులో ఏం వ్రాశారో చదవడానికి మనకు తీరికా, ఓపికా ఉండదు. వెధవది ఓ యాభై సంతకాలు పెడితే ఏం పోయిందీ, డబ్బులు వచ్చాయా లేదా బస్! జీవితం అంతా ఫలానావాడి ‘సౌజన్యంతో’ అని బ్రతికేయడమే!మనం అప్పు తీర్చకపోయినా, ఓ ఈ.ఎం.ఐ కట్టకపోయినా, ఆ బ్యాంకువాడొచ్చి కారు పట్టుకుపోతాడు, లేదా పేపర్లో ఓ ప్రకటనిచ్చేసి ఇల్లు వేలానికి పెడతాడు. మనం నోరుమూసుకు కూర్చుంటాము,అప్పుడు ఈ నాయకులు మన రెస్క్యూకి రారు,ఎందుకంటే మనం సో కాల్డ్ మిడిల్ క్లాసు కాబట్టి.
ప్రభుత్వం వారు ఈ రెండుమూడు రోజుల్లోనూ ఓ ఆర్డినెన్స్ జారీ చేస్తారుట, అక్కడికి ఇప్పటికే రూల్సూ, రెగ్యులేషలూ,చట్టాలూ లేవన్నట్లు!

6 Responses

  1. ఈ సూక్ష్మ రుణాలవాళ్ళు 30-40% వడ్డీ వసూలు చేస్తారు అది కూడా ఇన్ స్టాలుమెంట్ వారానికో రెండు వారాలకో ఒకసారి ఉంటుంది. అది తప్పుడు వ్యవస్థ. రైతుల రుణాల లాగా మాఫీ చేసేస్తాం అనడం కన్నా ఆర్డినెన్సే నయం కదండి.నేను మహానేత అనుచరుణ్ణి కాదు కానీ పావలా వడ్డి ఒక అద్భుతమైన పధకం. అది సరిగ్గా అమలుచేస్తే ఈ చావులు,ఆర్డినెన్సు గొడవ ఉండేది కాదు.

    Like

  2. మాస్టారూ నా తరవాణీ కధ ఏం చేసారు?
    దాని గురించి మీ పోస్టులో చూడాలన్న నా చిన్ని కోరిక త్వరలో తీరుస్తారని ఆశిస్తున్నాను

    Like

  3. శ్రీరాం,

    ఏమైతేనేం మొత్తానికి ఆర్డినెన్స్ చేసేశారుగా!

    Like

  4. శ్రీనివాస ఉమా శంకర్,

    త్వరలో తీరుస్తాను !!

    Like

  5. వాళ్ళు వ్యాపారస్తులే..సరే..వీళ్ళ బుద్ది ఏమయిందీ…ఎలా తీరుస్తామ్ అన్న ఇంగితఘ్యానం వీళ్లకు శూన్యం..ఎలా ఐనా అప్పు తెచ్చుకోవాలన్న తపనే..చేతిలో డబ్బులు పడ్డ వరకూ వీళ్ళు పూనకం వచ్చినట్టు తిరుగుతారు….

    Like

  6. కేవీఎస్వి,

    ఔనండి.

    Like

Leave a comment