బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-జనతా జనార్ధన్ క్లాసులో ప్రయాణం


    చెన్నై కి రాకా పోకా,ఏ.సి2,3 లలో చేసిన తరువాత, భాగ్యనగరానికి ప్రయాణం జనతా జనార్ధన్ క్లాసు స్లీపరు లో చేశాను.ఏ.సి దొరక్క కాదు.ఏదో మన ‘ఆంఆద్మీ’ లు ఎలా ఉన్నారో ఓసారి దగ్గరనుంచి చూద్దామని! ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళూ,వీటిల్లోనే ప్రయాణం చేశాము.ఏ.సీ లూ అవీ మనకొచ్చే జీతాల్లో అందుబాటులో ఉండేవి కావు!రిటైరు అయ్యేసరికి, పిల్లలు ఉద్యోగాల్లోకి వచ్చాక,ఈ ఏసీ లూ అవి అలవాటుచేసి ‘చెడగొట్టారు’ ! దాంతోటి ఏమయ్యిందేమిటంటే,
ప్రయాణం చేయాలంటే, ఏ.సీ దొరక్కపోతే, అదేదో చాలా పెద్దవిషయంలా చెప్పేసికుని, టిక్కెట్లు దొరకలేదూ అందుకోసం ప్రయాణం చేయలేకపోతున్నామూ అని ఓ వంక చెప్పేసి, దగ్గరవారి పెళ్ళిళ్ళకి వెళ్ళడం మానేసిన సంఘటనలూ ఉన్నాయి!
ఇదంతా ‘కండకావరం’ తప్ప ఇంకోటి కాదు! మామూలు క్లాసుల్లో వెళ్ళేది మనుష్యులుకాదా, మనమేమైనా పుట్టిన దగ్గరనుంచీ ఏ ఏ.సీ ల్లోనే పుట్టామా? అదో సరదా!

    ఏ.సీ ల్లో వెళ్ళేవారైతే, ఏ.సీ 2 వాడు, ఏ.సీ 3 వాడిముందర పోజు పెడతాడు!మరి స్లీపరు లో వెళ్ళేవాడో- ఇంకెవరూ unreserved లోని బక్క ప్రాణితో- దానికి సాయం ఆ కోచ్ లు స్లీపరు కోచ్ తరువాతే ఉంటాయి.స్లీపర్లో ప్రయాణం చేసేవాళ్ళలొ చూస్తాము, రిజర్వేషను దొరక్క మామూలుగా ప్రయాణం చేయవలసొచ్చిన ప్రయాణీకుల ఉరకలూ, పరుగులూ. ఒకచోట ఖాళీ లేకపోతే పాపం ట్రైను రెండో ఎండు కి పరిగెడుతూ ఉంటారు.మనవాడు ( స్లీపరులో ఉన్నవాడు) అక్కడికేదో తను ఘనకార్యం చేసేసినట్లుగా పోజిస్తూంటాడు. ప్రతీ ప్రాణీ, జీవితంలో ఒక్కసారైనా అలా unreserved లో ప్రయాణం చేసినవాడే. అయినా మర్చిపోతూంటాము.ఏదో అదృష్టం బాగుండి, కొంచెం improved conditions లో ప్రయాణం చేసే యోగం పట్టింది!

   ఈ ఈ స్లీపరులో ప్రయాణం చేసే వారు స్టేషనుకొచ్చి చేసే మొదటి పని-రైల్వే వాళ్ళు పెట్టే chart లో మనపేరుందో లేదో చూసుకోవడం.ఉండకేం చేస్తుందీ, అయినా ఓ సరదా! మన పేరు ప్రింటులో చూసుకోవడం.ఆ display board దగ్గర
చూడాలి హడావిడి.ప్రతీవాడూ మూగిపోతాడు, ఆ పేర్లేమో చిన్న చిన్న అక్షరాల్లో వ్రాస్తారు, నాలాటివాడికి కనిపించి చావవూ, ఏదో మొత్తానికి మన కోచ్ ఏదో ఇంకోసారి తెలిసికుని,తృప్తి పడతాము.చూస్తూంటాము, స్లీపరులో ప్రయాణం చేసే చాలా మంది దగ్గర, మామూలు VIP సూట్ కేసులుంటూంటాయి,( వాటికి పైన ఓ గుడ్డ కవరోటీ, దానికి ఓ జిప్పూ) లాక్కునేవి కావు! ఇంకో రెండో మూడో జిప్పు బ్యాగ్గులూ,( ఒక్కదానికీ జిప్పు పనిచేయదు, పనిచేస్తే మాత్రం దానికో తాళం!). ఓ బాగ్గు నిండా తినే సరుకులూ, ఇంకో దానినిండా దుప్పట్లూ వగైరా ( ఎందుకంటే స్లీపరులో లో ‘దీక్షావస్త్రాలు’ దొరకవు కాబట్టి).వీటన్నిటినీ స్టేషనుకి ఏ ప్రొద్దుటే వచ్చేసి ,క్లోక్ రూం లో పెట్టడం, మధ్యతరగతి స్టేటస్సూ! పూర్వాశ్రమంలో నేనూ ఇదే పనిచేసేవాడిననుకోండి ! ఇంకో సదుపాయం ఏమిటంటే, ట్రైను సమయానికి మన ఇంట్లోని కుటుంబసభ్యులందరికీ మరీ రెండో మూడో ఆటోలు మాట్లాడఖ్ఖర్లేదు, ఏ బస్సులోనో, లోకల్ ట్రైనులోనో కానిచ్చేయొచ్చు!

    సామానులు మరీ ఎక్కువగా ఉంటే, ఆ క్లోక్ రూం దగ్గరే ఓ కూలీని మాట్లాడుకుని, భార్యా పిల్లలతో, కూలీ ముందు నడుస్తోండగా, మొత్తానికి ప్లాట్ఫారం మీదికి చేరుతాడు. మనమొహాలు చూడగానే తెలుస్తాయి మనం ‘ఆంఆద్మీ’ అని.కోచ్ నెంబరేదో అడిగి తెలిసికొని, ప్లాట్ఫారం మీద సామాన్లన్నీ దిగేసి, వాడు ఇంకో బేరం చూసుకోడానికి పోతాడు.ట్రైనొచ్చే టైముకి వచ్చి సామాన్లు కోచ్ లో పెడతాననే వాగ్దానం చేస్తాడు.(ముందరే బేరం ఆడుకుంటాము కాబట్టి). వాడు ఎప్పుడూ రాడూ, సామన్లన్నీ మనమే పెట్టుకొవలసివస్తుంది, అది వేరే సంగతిలెండి.

   ఇంకో విషయం గమనిస్తూంటాము, నల్ల కోటు వేసికుని ఎవడైనా కనిపిస్తే చాలు, వాడి చుట్టూరా బెల్లం దగ్గర ఉండే చీమల్లాగ మూగిపోతారు,ఎవరూ waiting list లో confirm కానివాళ్ళు.ప్రతీవాడికీ వరాలు ఇచ్చేస్తాడు, ఆ టి.టీ
ఫలానా కోచ్ లో కూర్చోండీ అని.

ఇంకా కోచ్ లోకి ఎక్కలేదు.. కోచ్ లో ఉండే కష్టాలు ఇంకో టపాలో…..

Advertisements

4 Responses

 1. “ఇదంతా ‘కండకావరం’ తప్ప ఇంకోటి కాదు! ” Awesome statement

  Like

 2. చాలా బాగా వ్రాసారు
  నేను ఇప్పుడిప్పుడే వ్రాయటం మొదలెట్టాను
  మీ బ్లాగు బాతాఖాని ప్రకారం నేను రెండవ అవస్థ లో ఉన్నాను
  స్లీపర్ క్లాస్ స్టేజీ
  మీ నుండి చాలా నేర్చుకోవాలి

  Like

 3. కిరణ్ కుమార్,

  నా టపా మికు నచ్చినందుకు ధన్యవాదాలు.

  Like

 4. రహ్మానుద్దీన్ షేక్,

  ముందుగా మీకు ٰد مئبااراک ( సరీగ్గా వ్రాశాను కదూ! ఇందులో నా ప్రతిభేమీ లేదులెండి. http://type.yanthram.com లో టైపు చేశాను!).నేనేమీ అంత గొప్పవాడిని కాదు, నా నుండి నేర్చుకోవడానికి! ఏదో కాలక్షేపం కబుర్లు అంతే !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: