బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-ఈ నెలలో రైళ్ళలో ప్రయాణాలు–2


    క్రిందటి టపాలో ఏ.సి 2 లో నేను చూసినవాటిగురించి వ్రాశాను. చెన్నై నుండి పూణె తిరుగు ప్రయాణం ఏ.సి.3 లో చేశాను. మరీ ఎక్కువ ఖరీదు కాదు కాబట్టి, చాలామంది దీంట్లో ప్రయాణం చేయడానికి చాలామంది ఉత్సాహం చూపుతారు.అందుకనే ఎప్పుడు చూసినా waiting list కొల్లేటి చేంతాడంత ఉంటుంది!దానితో, పాపం చాలామంది తత్కాల్ లో చేసేసికుంటూంటారు.
ఇదో దోపిడీ! లాలూ ప్రసాద్, తన దారిన తను తింటూ, ప్రభుత్వానికి కూడా అదనపు రాబడి ఏర్పాటు చేశాడు! ఏ concession నూ ఉండదు.అప్పుడప్పుడు మాత్రం అదృష్టాన్ని బట్టి టికెట్టుని upgrade చేస్తూంటారు! ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. మళ్ళీ ఎందుకీ గోలంతా అనకండి.

ఏ.సీ 3 లో ప్రయాణం చేసేవారిలో ఒక విషయం మాత్రం చూస్తూంటాము.ఎలాగూ అంత డబ్బెట్టి టికెట్టు తీసికున్నాము కదా, పూర్తి వసూలు చేయాలనే ఉద్దేశ్యంతో,మిడిల్ బెర్త్ వచ్చినవారు
వేళా పాళా లేకుండా, బెర్తుని క్రిందకు దింపేసి, attendant ఇచ్చిన ‘దీక్షావస్త్రాలు’ కప్పేసికుని, నిద్రరాకపోయినా కళ్ళు మూసేసికుని, కాళ్ళు జాపేసికుని, ఏదో తన్మయత్వంలో మునిగిపోతూంటారు!
దీంతోటి ఏమౌతుందంటే, క్రింద బెర్తు వాడి పని ఇరకాటంలో పడుతుంది! తన బెర్తు మీద, మెడ వంచుకుని కూర్చోనూ లేడూ, పోనీ ఏ సైడు బెర్తు వాళ్ళో కూర్చోనిస్తారా అనుకుంటే, వాళ్ళుకూడా సీట్లు విడతీసి,పైవాడూ, క్రిందివాడూ సెటిల్ అయిపోతారు! ఇంక అక్కడ ఉండేది భార్యాభర్తలైతే, ఒకళ్ళు పడుక్కునీ, ఇంకోళ్ళు వాళ్ళ కాళ్ళదగ్గరా సెటిల్ అవుతారు!
ఆతావేతా తేలేదేమిటంటే, మనకిచ్చిన క్రింది బెర్తులోనే, మెణ్ణరం (stiff neck) పట్టేసినా సరే నోరుమూసుకుని కూర్చోడమే!

అన్నిటిలోనూ ఆ కోచ్ attendant ఇచ్చే కంబళీలు- వాటంత దరిద్రపువి ఇంకెక్కడా ఉండవు!తెల్లదుప్పట్లూ,నాప్ కిన్నూ ఏదో ఒకసారైనా ఉతికి ఇస్త్రీ చేసినట్లనిపిస్తాయి. ఆ కంబళ్ళు మాత్రం
అసలు వాటిని క్లీన్ చేసి ఎన్ని యుగాలయిందో అనేట్లుంటాయి! తలక్రింద పెట్టుకోడానికి మాత్రం బాగా ఉంటాయి!అడిగితేనే కానీ, ఆ attendant నాప్ కిన్ ఇవ్వడు.
ఇందులో ప్రయాణం చేసే మనుష్యులు మాత్రం, ఏ.సీ 2 లో వారికంటె, కలివిడిగా ఉంటారు.ప్రక్కవాడితో మాట్లాడడం వగైరా.. మరీ హైఫై కాదు.స్టేషనొచ్చినప్పుడు, platform మీదికెళ్ళి ఏదో ఒకటి తినేది కొనుక్కోవడమో లాటివి చేస్తూంటారు, ఎందుకంటే చాలా మంది పిల్లలతో ప్రయాణం చేస్తూంటారు. ఏ.సీ లో ప్రయాణం చేసినట్లూ ఉంటుంది, మరీ ఖరీదెక్కువా కాదు.suffocation ఒకటే భరించలేము. ఏ.సీ.2 కంటే ఎక్కువ బెర్తులేమో, దీంతోటి ఊపిరాడదు.

మరీ ట్రైనుకి ముందరో ఆఖర్నో ఉండడంచేత స్టేషన్లలో ఆగినప్పుడు, పుస్తకాల షాప్పులికీ వాటికీ వెళ్ళడం కొంచెం రిస్కు తో కూడిన పని! చాలా మంది ఓ పోర్టబుల్ డి.వీ.డీ ప్లేయరు పెట్టుకుని, అందరి ప్రాణాలూ తీస్తూంటారు! పోనీ దాంట్లోకైనా తొంగి చూద్దామా అంటే, అబ్బే, వాళ్ళూ వాళ్ళ కుటుంబంతప్ప ఇంకోళ్ళు చూసేటట్లుగా పెట్టరు! పిల్లలతో ప్రయాణం ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూపించుకోవద్దూ!

ఈమధ్యన ప్రయాణంలో మాపు ఆగుతుంది కదా అని, ఓ చిన్న చిన్న గళ్ళున్న షర్టువేసికున్నాను. నాకేం తెలుసూ, IRCTC Pantry Car వాడి యూనిఫారం అలాగే ఉంటుందని. మా కోచ్ లో Toilet ఖాళీ లేదని పక్కదాంట్లోకి వెళ్తూంటే, चाय है क्या? అని అడిగాడు ఓ ప్రాణి! మళ్ళీ జీవితంలో అలాటి గళ్ళున్న షర్టు ఛస్తే వేసికోను!ఇలాటి ‘కష్టాలు’ ఉన్నా, నాకు మాత్రం కాలక్షేపం బాగానే అయింది. ఎందుకంటే, సైడు బెర్తు రైల్వే ఎంప్లాయీస్ దిట. నా అదృష్టంకొద్దీ, రేణిగుంటనుండి, గుంతకల్ దాకా ప్రయాణం చేశారు. రైల్వే లో ఆడిటరుట, ఎన్నెన్నో విషయాలు చెప్పారు.తిరుమలలో ఓ రైల్వే రిజర్వేషను కౌంటరుందికదా, దాని ఆడిట్ కి వెళ్తూండడంవలన, అక్కడ చాలా పలుకుబడి కూడా ఉంది.నా కబుర్లన్నీ విని, ఎప్పుడైనా తిరుమల వేళ్ళేమాటైతే, ఆయనకి ఫోను చేయమని ఓ ఆఫరు కూడా ఇచ్చారు.ఇదిగో ఇలాటి ఉపయోగాలుంటాయి, ఇంకోరితో కబుర్లు మొదలెడితే!

స్టేషనులో దిగినతరువాత ఆ చివర్నించి సామాన్లు మోసుకుంటూ రావడానికి పడే తిప్పలు ప్రక్కకి పెడితే, మొత్తంమీద ప్రయాణం బాగానే సాగింది! ఈసారి మన ‘జనతా జనార్ధన్’ స్లీపరు క్లాసు గురించి!

8 Responses

  1. మాస్తారూ .. నా బ్లాగు టాగ్ లైను బ్లాగులందు తెలుగు బ్లాగులు మేలయా అని. మీ బ్లాగు మాత్రం .. తెలుగుబ్లాగులందు ఫణిబాబు బ్లాగే మేలయా అనిపిస్తున్నది.

    You have a a unique style!! Please do continue.

    బైదివే, మా వూళ్ళో కొండవీటి చాంతాడంటాం. మీ తూగోజిలో కొల్లేటి చాంతాడు అంటారు కాబోలు

    Like

  2. “మళ్ళీ జీవితంలో అలాటి గళ్ళున్న షర్టు ఛస్తే వేసికోను!” – 🙂

    Like

  3. చాలా బాగా వ్రాసారు ఫణి గారు..మంచి హాస్యం తో రాయడం వలన అప్పుడే అయిపోయిందా అనిపించింది..నేను ఎప్పుడూ 3A లోనే ప్రయాణిస్తూ ఉంటాను, మీరే చెప్పేవి నాకూ అనుభవమే…స్లీపర్ టపా కోసం ఎదురు చూస్తూ ఉంటా

    Like

  4. భలే రాసారు మస్టారు 🙂
    అన్నట్టు గోదావరి మీద స్వాతిలో(2008) ఆర్టికల్ రాసారు కదా మస్టారు మీరు.

    Like

  5. కొత్తపాళీ గారూ,

    మా ప్రాంతంలో అలాగే అంటారని విన్నాను. బై ద వే థాంక్స్.

    Like

  6. చదువరి గారూ,

    మీలాటి సీనియర్, సీరియస్ బ్లాగరుకి నచ్చిందంటే చాలా సంతోషం.

    Like

  7. కిషన్ రెడ్డి గారూ,

    ఢన్యవాదాలు. స్లీపరు టపా మొదటి భాగం ఈవేళ వ్రాశాను.

    Like

  8. శేషేంద్ర శాయీ,
    ముందుగా ధన్యవాదాలు. గోదావరి మీద అంతులేని ఆపేక్ష మాత్రమే.ఇంకా గోదావరి గురించి వ్రాసే ధైర్యం చేయలేదు. ‘కోతికొమ్మచ్చి’ మీద ఓ వ్యాఖ్య వ్రాయడం తప్ప, స్వాతి లో ఇంకేమీ వ్రాయలేదు.

    Like

Leave a comment