బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- జ్ఞాపకాలు


   మనం విద్యుఛ్ఛక్తికి ఎంత బానిసలయ్యామో ఈ రెండు రోజుల్లోనూ బాగా తెలిసింది.శనివారం పగలూ,రాత్రీ మా అమ్మాయిదగ్గర గడిపి, ఆదివారం మా ఫ్లాట్ కి తిరిగి వచ్చాము.తనతో గడపడం లేదని, అమ్మాయి కోప్పడుతుందేమో అని,రోజంతా అక్కడే గడపాలని నిశ్చయించుకుని ఉండిపోయాము.నాకు చూపించాలని ఎప్పటినుండో అనుకుంటున్న ఓ రెండు మరాఠీ సినిమాలు, झेंडा, हरिस्चन्द्राची फाक्टरी చూపించింది.మొదటిది ఎంత సీరియస్సో, రెండోది అంత హాస్యం,అద్భుతం ! ఇన్నాళ్ళూ, ఆ సినిమా గురించి విన్నా, ఏమిటో 100 సంవత్సరాలక్రిందటి పాటలూ, సెట్లూ బ్లాక్ ఎండ్ వైట్ లో ఉంటాయేమో అనుకుని, ఆ సినిమా చూడ్డానికి అంత ఆసక్తి చూపలేదు. మా అమ్మాయి అంటూనే ఉంది- The movie is simply awesome, I know you would love it. అలాగే తనన్నట్లే ఆ మూవీ చాలా చాలా బాగుంది…

ఇంటికి తిరిగి వచ్చిన తరువాత సాయంకాలం దాకా బాగానే ఉంది. 3 Idiots సినిమా వస్తుంటే, కరెంటు పోయింది. పక్క బిల్డింగుల్లో అందరికీ వచ్చింది, మాకు మాత్రం డిమ్ముగా వస్తోంది.కంప్యూటరు లేదు, టి.వీ.లేదు, ఫ్రిజ్ ఆపేయవలసివచ్చింది. రాత్రంతా దోమల బాధ. అడక్కండి. ప్రొద్దుటే స్నానం చేయడానికి, గిన్నెతో వేణ్ణీళ్ళు పెట్టుకుని, లిఫ్ట్ పనిచేయకపోవడంతో, మాట్లాడకుండా, నాలుగు అంతస్థులూ మెట్లమీదుగా దిగి, వాచ్ మన్ ని అడిగాను-ఎలెట్రీవాళ్ళని ఎలా పిలవడమూ అని.వాడికేం తెలుసూ,అంతేకాదు, ఓ ఫోన్ నెంబరుకూడా లేదు.పోనీ అని సొసైటీ లో చాలామందికి, రాత్రంతా లైటులేదుకదా, పోనీ వాళ్ళదగ్గరైనా ఉండకపోతుందా అని అడిగితే, వాళ్ళకీ ఏమీ తెలియదుట!అక్కడ గత నాలుగేళ్ళనుండీ ఉంటున్నారూ, ఆమాత్రం తెలియదూ అంటే ఆశ్చర్యం వేసింది.ఎవడోఒకడు కంప్లైంటు చేస్తాడులే, వాడికొస్తే,మనకీ వస్తుందీ అనే భరోసా! పోనీ, నలుగురికీ ఉపయోగించేటట్లుగా ఉంటే ఏం పోయిందీ?

ఇది మన సిటీల్లోనూ, ఇప్పుడిప్పుడే పట్టణాల్లోనూ వస్తూన్న ఓ కొత్త జాడ్యం!మనకి దేనిగురించైనా తెలిస్తే, ఇంకోళ్ళకి చెప్పకుండా ఉండడం.ఏదో రోజు, నీళ్ళురావని, ఏ పేపర్లోనైనా వేసేడనుకుందాము, దాన్ని చదివినవాడు, అందరికీ చెప్పొచ్చుగా, అబ్బే అలా చెప్పేస్తే అందరూ సుఖపడిపోరూ, తనొక్కడే బాగుపడాలి. పైగా సొసైటీ లో మిగిలినవాళ్ళందరూ, అదేమిటీ, చెప్పాపెట్టకుండా, కార్పొరేషను వాళ్ళు ఇలా నీళ్ళు బందుచేశారూ, అనుకుంటూంటే, మన హిరో పేద్ద గొప్పగా
నిన్న పేపర్లో ఇచ్చారు, నేను చదివానూ, అందుకనే రాత్రే నీళ్ళుపట్టిపెట్టేసికున్నానూ అంటాడు. ఆ మాత్రం అందరితో చెప్పడానికేంరోగం?

మనకి తెలిసినది, ఏ విషయమైనా సరే ఇంకో నలుగురితో పంచుకోడంలో ఉన్న ఆనందం, మనమే అనుభవించాలనుకోడం చాలా తప్పు.ప్రతీవారూ పేపరు చదవకపోవచ్చు, న్యూసు చూడకపోవచ్చు, అలాటివారికి ఉపయోగిస్తుందికదా.ఒక్కొక్కప్పుడు, ఊళ్ళో ఏదైనా మంచి కార్యక్రమం జరగబోవచ్చు, దానిగురించి తెలిసినవారందరికీ చెప్తే, దానిమీద ఇష్టం ఉన్నవాళ్ళు వెళ్ళొచ్చుగా, అంతేకానీ, మనకే తెలుసునుకదా అని మనదారినమనం చూసొచ్చేసి, గొప్పగా అందరితోనూ, ‘మేము ఫలానా కార్యక్రమం చూసొచ్చామోచ్’ అంటే, చాలా బాధొస్తుంది. నామట్టుకి నాకైతే, తెలిసిన విషయాన్ని నలుగురితోనూ పంచుకుంటాను. ఇష్టమైన వాళ్ళు వింటారు, లేనివాళ్ళు మానేస్తారు. మనకేమీ నష్టంలేదు.లేనిపోనివన్నీ,తెలిసినవీ,తెలియనివీ exaggerate చేయకూడదు.ఒకసారి విన్నా, దాన్లోని నిజా నిజాలు తెలిసిన తరువాత మన మొహం చూడడెవడూ!

దీనివలన మనం ఇంకో నలుగురు స్నేహితుల్ని సంపాదించుకుంటాము. కాదూ నన్నుముట్టుకోకు నామాలికాకీ లా ఉందామనుకుంటారా మీఇష్టం.మనం పోయినతరువాత, మన గురించి చెప్పుకునేది వీటిగురించే! నా ఎలెట్రీ గొడవలోంచి, దేంట్లోకో వెళ్ళిపోయాను!మొత్తానికి ఎలెట్రీ ఆఫీసు పట్టుకుని,complaint ఇచ్చిన తరువాత, బాగుపడింది.మళ్ళీ ఇవాళ సాయంత్రం అదే తంతు. అదేమిటో శాపం పెట్టినట్టుగా ఠంఛనుగా, సాయంత్రం ఆరుగంటలకల్లా మళ్ళీ మొదలూ, ఈ సారి మెట్లుదిగి వెళ్ళే ఓపిక లేక, ఫోను చేస్తే, పాపం వాళ్ళు, ఎనిమిదింటికల్లా బాగుచేశారు! దాని ఫలితమే ఈ టపా.

కరెంటుపోయిందంటే, కాళ్ళూ చేతులూ పడిపోతాయి.మన దినచర్యలు దానితో ఎంత పెనవేసుకుపోయాయీ అనేది చూస్తూంటే,కరెంటు లేనిరోజుల్లో మనం ఎలా ఉండేవాళ్ళమా అనిపిస్తూంటుంది.సాయంత్రం అయేసరికి, కొంచెం పెద్ద చిమ్నీ ఉండే, కోడిగుడ్డు ల్యాంపు తీసికుని, ఆ చిమ్నీలో ముగ్గువేసి, క్లీను చేసికుని, వెలిగించడం.ఇంట్లో అందరి భోజనాలూ, అమ్మ వంటిల్లు కడగడం అదీ అయిన తరువాత, సావిట్లో, దానిముందర, కూర్చుని, పుస్తకాల్లోది బట్టీ పడుతూ,మధ్య మధ్యలో జోగుతూ, నాన్న ” ఏరా చదువుతున్నావా” అనగానే ఉలిక్కిపడడం, అలా ఉలిక్కిపడి, దీపం మీదికి వంగడం, దాంతో మనమొహం మీదపడే వెంట్రుకలు కొద్దిగా కాలడం, ఆ వాసన తగిలి, నాన్నో, అమ్మో ‘ చాల్లే చదివింది ఇంక పడుక్కో’అనడం, అబ్బ ఎన్నెన్ని జ్ఞాపకాలో !!
ఇవి కాకుండా, హరికెన్ లాంతర్లని ఉండేవి.పెట్రోమాక్స్ లైట్లకి, అదేదో మాంటిల్ అనేదాన్ని వెలిగించగానే, అది ఓ తమాషా చప్పుడు చేసికుంటూ, బ్రహ్మాండంగా వెలిగేది.సాయంత్రాలవగానే, ఓ నిచ్చేనేసికుని వీధిదీపాలు వెలిగించడానికొచ్చేవారు
పంచాయితీ వాళ్ళు!ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్ని జ్ఞాపకాలో !!

Advertisements

6 Responses

 1. “….ఎవడోఒకడు కంప్లైంటు చేస్తాడులే, వాడికొస్తే,మనకీ వస్తుందీ అనే భరోసా! పోనీ, నలుగురికీ ఉపయోగించేటట్లుగా ఉంటే ఏం పోయిందీ?…”

  “…ఆ మాత్రం అందరితో చెప్పడానికేంరోగం?…”

  Well said Sir. You have hit right on the idiosyncrasy of so called urban elite most of whom think that talking to others is below their (imagined) dignity!

  Like

 2. మా తాతయ్యగారింటికి వెళ్ళినప్పుడు ఇలాగే ఉండేది…అప్పటికి కరెంట్ వచ్చిందిగాని, కరెంట్ కోత ఉండేది…అందుకే అన్ని పనులూ కరెంట్ తో ముడిపడి ఉండేవి…మా అమ్మమ్మ, మళ్ళీ కరెంట్ పోతుందర్రా ఆమ్ము పెట్టేస్తాను తినేసి ఆడుకోండి…అంటూ, మేము ఎంతకీ రాక కరెంట్ కాస్తా పొతే, చెప్పానా ఇప్పుడు చీకట్లొ తినండి అంటూ, వేడి వేడి అన్నం, చిమ్నీ దీపాల వెలుగులో, కలిపి పెట్టేది…
  అక్కడ ఉన్నప్పుడు మేము రొజువారీగా అలవాటుపడిన టీవీ మాట తలుచుకునేవాళ్ళమేకాదు…ఆ పెద్దపేద్ద పెరళ్ళలో ఆటలే సరిపొయేవి…

  నిజంగానే ఆ రోజులే వేరు…

  Like

 3. chaala manchi vishayam………..nenu oka manchi vishyam nerchukunna
  thx………

  Like

 4. శివరామప్రసాద్ గారూ,

  వచ్చిన గొడవల్లా అదే కదండీ !

  Like

 5. ఏరియన్,

  నేను వ్రాసింది చదివిన తరువాత నీ చిన్నతనపు జ్ఞాపకాలు గుర్తొచ్చినందుకు సంతోషం.

  Like

 6. వినయ్,

  ఏం బాబూ, చిరకాల దర్శనం !!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: