బాతాఖాని-లక్ష్మిఫణికబుర్లు–భ్రమలు-2


    ‘భ్రమ’లు మొదటి భాగంలొ చెప్పినట్టు,ఇంకోరు చేసే పనిని మనం చేయలేమా అనే క్యాటగిరీలో, ఇంట్లో ఎప్పుడైనా, కిచెన్ లోకి వెళ్ళి, ఏ బనానా షేక్కో చేద్దామనే అతి ఉత్సాహంతో, మిక్సీ తీసికుని, దాని మూత సరీగ్గా పెట్టకుండా, పాలూ,అరటిపండు ముక్కలూ వేసి, ఓసారి తిప్పేటప్పటికి, చూడండి, నాసామి రంగా, మన మొహం, బట్టలే కాకుండా కిచెన్ లో అన్ని చోట్లకీ చిందిపోతుంది. ఇంటావిడ లేచేలోపలే, ఏదో క్లీను చేసేశామనే, భ్రమలో, ఓ తడిగుడ్డ తో
తుడుస్తాము.గిన్నెలూ, బట్టలూ క్లీను చేసేసికుని, ఏమీ తెలియనట్లు మొహంపెడతాము. ఆవిడేమో, ఏ చాయో పెడదామని, గిన్నే తీసేటప్పటికి, అంతకుముందు మనం చేసిన నిర్వాకం బయట పడుతుంది! ఎందుకొచ్చిన గొడవండి బాబూ
మనకి చేతకాని పనుల్లో వేలుపెడితే ఇలాగే వీధిన పడతాము!

   నాకు ఎప్పుడైనా, గీజరువేసి, వేడినీళ్ళు బకెట్ లోకి తీస్తాననే అంటుంది, పాపం మా ఇంటావిడ. అబ్బే నీకెందుకు శ్రమా, నేనే తీసికుంటానూ అని అంటూనే ఉంటాను.అదేం ఖర్మమో, వేడి నీళ్ళు ఏ ట్యాప్పు తిప్పితే వస్తాయో ఇప్పటికీ
తెలియదు! ఇంకోటి, ఎప్పుడైనా బయటకు వెళ్ళేముందర ఏమైనా తిని, చెయ్యి కడుక్కోడానికి, కిచెన్ లోఉన్న సింకు ఉపయోగించమని చెప్తూనే ఉంటుంది. అబ్బే,మనం ఎందుకు వింటామూ?పేద్ద తెలిసున్నట్టుగా, బాత్ రూం లోకి వెళ్లి ఓ ట్యాప్పు తిప్పగానే, పైనున్న షవర్ లోంచి, నెత్తిమీద నీళ్ళు పడతాయి!దాన్ని ఏ పొజిషన్ లో పెడితే నీళ్ళు వస్తాయో ఇప్పటికీ తెలియదు! ఏదో బిందెలోంచీ, బకెట్టులోంచీ చెంబుతో నీళ్ళొంపుకున్న వాడినీ!

    వర్షాల్లో ఉపయోగించే రబ్బరు బూట్లు,తొందరగా చిరిగిపోతూండేవి.మామూలుగా అయితే, చిరిగిపోయిన బూట్లని అవతల పారేయడమే. కానీ, కొన్ని సంవత్సరాల క్రితం, వాటిని కూడా రిపేరు చేయడం మొదలెట్టారు.రోడ్డు పక్కన ఒకడు
చేతిలో ఓ స్క్రూ డ్రైవరూ, పక్కనే ఓ కుంపటీ, దాన్నిండా కణకణలాడే నిప్పులూ, ఆనిప్పుల్లో కాల్చి, దాన్ని సుతారంగా, మన చిరిగిపోయిన బూటుమీద రాసేవాడు. బస్, సెకనులో, ఆ చిల్లుకాస్తా మూసుకుపోయేది, ఆ షూ కి ఇంకో సీజను దాకా ఢోకా లేదని చెప్పి, ఓ అర్ధరుపాయో,రూపాయో తీసికునేవాడు. ఆమాత్రం మనం చేయలేమా అని ఇంట్లో మనం ప్రయోగాలు చేస్తే, ఉన్న చిల్లుమాట దేముడెరుగు, ఇంకాస్త చిరుగుతుంది!

   అలాగే ప్లాస్టిక్/పోలిథీన్ బ్యాగ్గుల్ని, కొట్లలో కొవ్వొత్తి మంటమీద, నాజూగ్గా సీలు చేస్తూంటారు. మనకి ఛస్తే ఇంట్లో వీలవదు! అలాగే ఏ పైజమాకో బొందు పెడదామని, ఓ సూదిపిన్నీసుకి, నూలుతాడు గుచ్చి, బొందెక్కించడం మొదలెట్టండి,ఆ పిన్నూ,బొందూ ఛస్తే చివరిదాకా తీయలేము. మధ్య మధ్యలో,నానా తిప్పలూ పెడుతుంది!
ఏమిటో జీవితం అయిపోతూంది, ఒక్క పనీ రాదూ అని ఓ విరక్తి పుట్టుకొచ్చేస్తూంటుంది!అలాగని మానుతామా, ప్రతీదీ నాకేతెలుసూ అని వేలెట్టడం, చివాట్లు తినడం!!

2 Responses

 1. ఫణిబాబుగారూ,

  అయినదానిలోనూ, కానిదానిలోనూ వేలెట్టి మా ఆవిడతో చీవాట్లు తిన్నప్పుడల్లా ఏదో ఓ మూలకెళ్ళి, “భగవంతుడా, ఏమిటి నాకొక్కడికీ ఈ అగ్నిపరీక్షలు” అని ఏడ్చేవాణ్ణి. ఇప్పుడు తెలిసింది, నేను ఒంటరిని కాదు అని 🙂

  భవదీయుడు
  అబ్బులు

  Like

 2. అబ్బులూ,

  చెప్పుకోడానికి సిగ్గూ మొహమ్మాటం కానీ, నూటికి తొంభైమంది అలా అనుకున్నవారే ! ఈ విషయంలో మనకి స్నేహితులు చాలామందే ఉంటారు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: