బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-ఫుకట్ సర్వీసులు


    ‘భ్రమ’ ల గురించి వ్రాద్దామనుకున్నాను. అవెక్కడికి వెళ్తాయిలెండి, మనతోపాటే ఉంటాయి. వాటిగురించి ఇంకో రోజు వ్రాయొచ్చులే అని, ఇంకో విషయం గుర్తుకొచ్చింది. దానిగురించీ టపా.మనం కానీ, మన పక్కింటివాళ్ళో,అదేబిల్డింగులో ఉండే ఇంకోరో, లేక అదే సొసైటీలో ఉండే మరోరో,ఫుకట్ గా ఏదైనా వస్తోందన్నా, లేక పనైపోతుందన్నా, ఛాన్సొదలరు!అది ఎవరినో విమర్శిస్తున్నానని కాదు, నేనైనా ఇదే పని చేస్తాను,మానవ సహజం అది.

7nbsp;  మా చిన్నప్పుడు టార్చి లైట్లనుండేవి. అంటే ఇప్పుడు లేవనికాదు,ఇప్పుడు అవేవో చాలా sleek గా ఉండేవి వస్తున్నాయి.సెల్లులో లైటు,తాళం కప్పలో లైటు, లేకపోతే ఇంకో లేసరు లైటో చాలా వచ్చాయి. కానీ, మా రోజుల్లో Eveready వాళ్ళవి, స్టీలుతో ( అలా అనేవారు!) చేసిన టార్చ్ లైట్లొచ్చేవి, బుల్లిదీ, కొద్దిగా పెద్దదీ,మూడు బ్యాటరీలు వేసికునే పేద్దదీ. ఇందులో బుల్లిది మామూలుగా డాక్టర్లదగ్గర ఉండేది.మనకేమైనా వచ్చి డాక్టరుగారిదగ్గరకు వెళ్తే, ఆయన ముందుగా మన నోరు తెరిచి నాలుక బయటకు పెట్టమంటారు, మళ్ళీ అలా కాదూ, ఇంకా సౌండొచ్చేలా నాలిక బా…..గా చాపమంటారు, అప్పుడు ఆ బుల్లిలైటు దాంట్లోకి(అంటే తెరిచున్ననోట్లొకి) వేసి, ఓసారి నిట్టూర్పు విడిచి, బాగా inflame అయిపోయిందీ అంటూ ఏదో మందు రాసిచ్చేసేవారు. అలాగే పళ్ళడాక్టరుగారుకూడా పళ్ళ గ్రహస్థితులు తెలిసికోడానికి ఉపయోగించేవారు. వాటిలో టార్చ్ లైటు సైజులాగే మీడియం సైజు బ్యాటరీలు వేసేవారు.

ఇంక కొద్దిగా పెద్దసైజువి, వాటిని ఇంచుమించు ప్రతీ ఇంట్లోనూ వాడేవారు. అదిలేకపోవడం ఓ నామోషీగా ఉండేది.చీకట్లో బయటకి వెళ్ళాలన్నా, లైట్లుపోతే ఫ్యూజు వేయాలన్నా, ఏ పురుగో పుట్రో ఇంట్లోకి వస్తే, దాన్ని పట్టుకోవాలన్నా దీని ఉపయోగం అమోఘం.ఆ రోజుల్లో సైకిళ్ళకి లైటుండకపోతే, పోలీసులు పట్టుకునేవారు. అందరికీ సైకిళ్ళకి డైనమో పెట్టుకునే స్థోమతుండేది కాదు కదా, అలాటి వారు, సైకిలు మీదెళ్తుంటే, ఏ పోలీసైనా ఎదురుపడితే, ఈ టార్చ్ వేసి పనికానిచ్చుకునేవాడు!

7nbsp;  ఇంక మరీ పెద్ద టార్చ్ లైటు-దీంట్లో మూడో నాలుగో బ్యాటరీలు వేసేవారు. దాని ఫోకస్ కూడా చాలా దూరం వచ్చేది.వాటిని జనరల్ గా, రాత్రిళ్ళు కాపలా కాసే, నైట్ వాచ్ మన్లదగ్గరుండేవి. ఆరోజుల్లో నైటువాచ్ మన్లెక్కడుండేవారూ అనడగకండి,బ్యాంకుల్లోనూ వాటిలోనూ ఉండేవారు.పొలాల్లోకి వెళ్ళడానిక్కూడా వీటి ఉపయోగం ఉండేది.ఇదేమిటీ ఈయన, ఆయన రాసిన టపాలు చదువుతున్నాము కదా అని, టార్చ్ లైట్ల ‘ప్రవర’ చెప్తున్నాడూ అనుకుంటున్నారు కదూ!
ఇంక అసలు కథలొకి వచ్చేద్దాం.

ప్రతీ ఇంట్లోనూ ఓ టార్చ్ ఉంటుందన్నాను కదా, ఆ టార్చ్ లైటుని ప్రతీరోజూ ఉపయోగించంకదా, ఎప్పుడో ఏడాదికో, ఆర్నెల్లకో వాడుతాం.పనైపోగానే దాన్ని ఏగూట్లోనో పెట్టేసి వదిలేస్తాం.ఏ వస్తువైనా, ఆఖరికి, మనుష్యులైనా సరే, వాటికీ
periodical maintenance అనేది ఒకటుండాలి. లేకపోతే పడకెక్కుతాయి. అలా పడకెక్కిన టార్చ్ లైటు,మన కళ్ళల్లో పడుతుంది.పడకెక్కిందనెందుకు తెలిసిందంటే, ఆ ముందురాత్రి, పక్కవాళ్ళింట్లో అవసరమై, టార్చ్ లైటు గురించి అడగ్గానే, పేద్ద పోజు పెట్టి, వాళ్ళపిల్లాడికి మన గూట్లో ఉన్న లైటిస్తాము.వాడు నిమిషంలో తిరిగొచ్చేసి, అంకుల్, ఈ బాట్రీ లైటు ( టార్చ్ లైటుకి ముద్దుపేరు) వెలగడంలేదూ, అని మన మొహాన్న కొట్టి పారిపోతాడు.అదేమిటీ, ఆమధ్యనే
బ్యాట్రీలు కూడా మార్పించాను, అని ఓసారి ఇంట్లో వాళ్ళందరిమీదా ఎగురుతాడు,ఎవరడిగితే వాళ్ళకి ఎరువిచ్చేస్తూంటారూ, ఏ వెధవ, దీంట్లో బ్యాట్రీలు మార్చేశాడో అంటూ.నిజం చెప్పాలంటే, దాంట్లో బ్యాటరీలు మార్చి, ఆరునెలలైనా అయిఉంటుంది.సరే, రేపు దీని సంగతి చూద్దాం అనుకుని, అప్పటికి వదిలెస్తాడు.

మర్నాడు ప్రొద్దుటే గెడ్డం వగైరా గీసికుని, ఓ కాఫీ తాగేసి, ఈ టార్చ్ లైటు వ్యవహారం ఏదో తేలుద్దామని, ఓ పాత గుడ్డా, ఓ మూతలో కిరసనాయిలూ వేసికుని సెటిల్ అవుతాడు. ముందుగా ఆ టార్చ్ లైటు వెనక్కాలుండే మూత, అప్పటికే బిగుసుకుపోయుంటుంది, తీసి నీరు కారిపోతున్న బ్యాటరీలు( ఆ లిక్విడ్ ఇల్లూ వళ్ళూ చేసికుంటూ)అవతల పారేస్తాడు.పైగా ఆ ముందురోజు రాత్రేమన్నాడూ-ఈ మధ్యనే కొత్త బ్యాటరీలు వేయించానని (ఉత్తిదే)– అంత కొత్తబ్యాటరీలైతే నీళ్ళెందుకు కారుతాయమ్మా? మొత్తానికి, ఆ బ్యాటరీలు తీసి,కిరసనాయిల్లో ముంచిన గుడ్డతో ఓ సారి, లోపలంతా శుభ్రంగా తుడుస్తాడు.ఆ బల్బుండేచోటోటి, దాని బుడిపికింద నీలంగా ఓ కోటింగోటొస్తుంది.దాన్ని కూడా తుడిచి, కొత్త బ్యాటరీలు వేయగానే, కొత్త పెళ్ళికొడుకులాగ వెలుగుతుంది.

ఇంట్లో వాళ్ళందరూ, అబ్బ మా నాన్న ఎంతబాగా రిపెరు చేశాడో అని పిల్లలూ, మా ఆయనెంత ఇంజనీరులా,బాట్రీని మళ్ళీ వెలిగించారో అని ఇంటావిడా ఆనందపడిపోయి, కాలనీలోఉన్న ప్రతీ వాళ్ళకీ చెప్పేయడం, ఈయన ఏ బజారుకో వెళ్తూంటే, అందరి కళ్ళూ తనమిదే ఉన్నాయని మురిసిపోడం.ఇంతాచేసి ఆయన చేసిందేమిటయ్యా అంటే ఓ బాట్రీ లైటుకి మళ్ళీ వెలుగివ్వడం. ఇంతటితో ఆగదీ వ్యవహారం, బాట్రిలు బాగుచేసేవాడొకడు దొరికాడుగా, కాలనీలో ఉన్న ప్రతీవాడూ,వాళ్ళింట్లో పనిచేయని బాట్రిలు, పనిగట్టుకుని మరీ వెదికి, వీళ్ళింట్లో వాటికి తన పేరున్న కాగితం అంటించి, వాళ్ళబ్బాయిచేత పంపించి, ‘అంకుల్ మా టార్చ్ వెలగడం లేదు,డాడీ మిమ్మల్నోసారి చూడమన్నారు’ అంటూ కాలనీ లో ఉన్న, ఓ పది టార్చ్ లైట్లు మనకొంపలోకి చేరతాయి.దీంతో ఆగదు,ఎప్పుడో బజార్లో స్నేహితుడితో వెళ్తున్నప్పుడు, పనిమాలా ఆపి, ‘మాస్టారూ మా బాట్రీ రిపేరయిందా, అయితే మావాడిని పంపిస్తాను సాయంత్రం’ అంటూ ఓ పలకరింపూ. తనతో ఉన్న స్నేహితుడు, ఆశ్చర్యపడి ‘ ఇదేమిట్రా, ఈ మధ్యన సైడు బిజినెస్సు మొదలెట్టావా ఏమిటీ, నాతో చెప్పనేలేదూ’అంటూ పరామర్శా.

ఏ కొట్లోకో వెళ్ళి టార్చ్ లైట్లు రిపేర్ చేసికోవచ్చు. మళ్ళీ దీనికి డబ్బులు తగలేయడం దేనికనీ, అప్పనంగా అవుతోందని పక్క వాళ్ళమీద బతికేద్దామనే ఆబ ఉందే, చాలా మందిలో చూస్తూంటాము.అలాగే మిక్సీలూ, రేడియోలూ ఇంకా ఏమైనా సరే మీకు రిపెరీ చేసికోడం వచ్చిందా, సైలెంటుగా మీపనేదో మీరు చూసుకోండి. అంతేకానీ గొప్పకోసం ఊళ్ళో అందరికీ టముకెసికున్నారా అంతే సంగతులు!

Advertisements

3 Responses

 1. Excellent. challa baaga raasaru.

  Like

 2. మద్దులపల్లి చంద్రశేఖర్,

  ధన్యవాదాలు.

  Like

 3. “అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కాదేదీ మీ బ్లాగుకనర్హం” అని ఇదివరలో ఎవరో మీ టపాలలో వ్యాఖ్యానించారు…అందుకునేనేమో ఇవ్వాళ్ళ టార్చ్ లైట్ గురించి టపా వ్రాసారు…
  కాని బాబూజీ, మీరు ఏమి రాసినా చాలా చదవబుల్ గా ఉంటుంది…
  ఇంత సాధారణ విషయం పై వ్రాసినా కూడా చివరి లైన్ వరకు చదివిగాని వొదలలేం…
  Kudos!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: