బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–పొరిగింటి పుల్లకూర


   ఊళ్ళోవాళ్ళందరూ మనకంటె బాగా ఉన్నారనే concept మొట్టమొదట మన బుల్లితనంలో ప్రారంభం అవుతుంది. ఆ సుబ్బారావుగారి బాబు అప్పుడే పాకేస్తున్నాడుట, వాడికి అప్పుడే పళ్ళుకూడా వచ్చేశాయిట,మొదలైనవి…
ఇంక హైస్కూల్లోకి వచ్చేసరికి అడగఖ్ఖర్లేదు! ఎప్పుడూ ఎవడో కోన్కిస్కా పక్కవాళ్ళ అబ్బాయికో,అమ్మాయికో మనకంటె మార్కులు ఎప్పుడూ ఎక్కువే వస్తాయి,అదేం ఖర్మమో!అదే వాతావరణం లో పెరిగేము కాబట్టి,ప్రతీదీ అవతలివాడికంటె
తక్కువేమో అనే ఓ దరిద్రపు ఫీలింగొచ్చేస్తుంది!

ఏ విషయం తీసికోండి,ఎప్పుడైనా సొసైటీ లో ఇంకోళ్ళ పిల్లల్ని చూసినప్పుడు,మన పిల్లలకంటె, వాళ్ళే బొద్దుగా ఉన్నారేమో అనిపిస్తుంది.వాడే ఇంగ్లీషు రైమ్ములూ అవీ పాడుతున్నాడేమో, వాడు వెళ్ళే స్కూలే మనవాడు వెళ్ళేదానికన్నా బెటరేమో,ఇలా ప్రతీదీ వాడితో కంపేర్ చేసి,మనకున్న ఆనందం కాస్తా గంగపాలు చేసికోవడం చూస్తూంటాము.అలాగని ఆ అవతలివాళ్ళేమీ సుఖపడిపోవడం లేదు. వాడు, వాళ్ళ బాసు పిల్లలు వెళ్ళే స్కూలికి పంపలేకపోయామే అని ఏడుపు!
ఉన్నదాంట్లో సంతృప్తి అనేది,మనం ఆలోచించేపధ్ధతిలో ఉంటుంది.

రైల్వే స్టేషనుకెళ్ళండి,మామూలుగా త్రీ టైర్ లో ఉండేవాళ్ళు, ఏదో వాళ్ళ తిప్పలు వాళ్ళుపడుతూ ఉంటారు.ట్రైనుకి చివర్లోఉండే ఏసీ లో ఉండేవాళ్ళు, ఓ పెద్ద పోజు పెట్టేసుకుని, ప్లాట్ఫారం మీద బయటే నుంచుంటారు, ఎందుకంటే, వాడు ఏ బుక్ స్టాల్ కైనా ,ఏ క్యాంటీను కైనా వెళ్ళాలంటే, చచ్చేటంత దూరం వెళ్ళాలి,అంతదూరం వెళ్ళే ధైర్యం వీడికుండదు,ఈ లోపులో రైలెళ్ళిపోతే అమ్మో ! వాడితిప్పలు వాడివీ. ఏసీ టు టైరులో ఎప్పుడైనా గమనించారో లేదో, ఉన్న నలుగురూ
ఒకళ్ళతో ఇంకోళ్ళు ఛస్తే మాట్లాడుకోరు.ఇది అనుభవం మీద చెప్తున్నది.ఎవడికివాడే బలే హిరో అనుకుంటాడు, చేతిలో ఓ ఇంగ్లీషు నవల తప్పకుండా ఉంటుంది.పైగా బయటకి వెళ్ళి ఏ ఇడ్లీయో, ఇంకోటో కొనుక్కోడానికి నామోషీ, టు టైరులో ప్రయాణం చేస్తున్నాడాయే! పైగా అలా వెళ్ళేవాళ్ళలో ప్రతీవాడూ చెప్పే స్టాండర్డ్ డయలాగ్గు– ‘ఎప్పుడూ ఫ్లైట్ లొనే వెళ్తానూ, ఏమిటో ఈసారే ఆఖరినిమిషంలో ఇలా వెళ్ళవలసివచ్చిందీ’ అనేది.వాడే గంగలో దిగితే మనకెందుకూ? ఓ సంగతి చెప్పడు-వాళ్ళ బాసు అదేదో పెద్ద క్లాసులో వెళ్తాడూ, వీడేమో ఎకానమీ లో వెళ్తాడూ,ఎయిర్ పోర్ట్ లో దిగిన తరువాత కూడా,వాళ్ళ బాసుకి మెర్సిడీజూ, వీడికి ఇండికాయో, లేక ఎంబాసడరో ఇస్తారని.వినేవాడుంటే ఎన్నైనా చెప్పేయడం.

ఎవరైనా ఏ కాలేజీలోనో పనిచేస్తున్నారనుకోండి, ప్రతీవాడూ ‘ అబ్బ మీకేమిటండి,హాయిగా భోజనం చేసి కాలేజీకెళ్ళడం,రోజులో ఏ మూడో నాలుగో క్లాసులు తీసికోవడం, మిగిలిన టైమంతా ఖాళీ‘. ఈ కాలేజీవాడనుకుంటాడూ, అబ్బ ఈ బ్యాంకుల్లో పనిచేసేవాళ్ళ పనెంతహాయో, రోజూ ఎంతంత డబ్బు వీళ్ళ చేతులమీదుగా వెళ్తూంటుందో అని.రోజంతా క్యాష్ లో కూర్చుని సాయంత్రానికి డబ్బు లెఖ్ఖా జమా అప్పచెప్పేటప్పటికి ఈ పెద్దమనిషి ఎంత టెన్షన్ పడతాడో! ఏ డిపార్ట్ మెంటు తీసికోండి, మనకంటె అవతలివాడి పనే బాగుందనుకోవడం. వాడు ఇంకోళ్ళని చూసి అలాగనుకోవడం.

అంతదాకా ఎందుకూ, మన పిల్లకాయల్ని చూడండి, ఏడాది తిరిగేసరికి చేస్తున్న జాబ్ బోరుకొట్టేస్తోందిట. ఇంకో కంపెనీలో అదేదో బావుంటుందీ,ఆ జాబ్ profile బావుంటుందీ అని మారిపోతూండడం. అయినా ఈ వేషాలన్నీ పెళ్ళై పిల్లలు పుట్టేదాకానే లెండి. ఆ తరువాత ఉన్న ఉద్యోగం లక్షణంగా చేసికుంటాడు!

అంతదాకా ఎందుకూ, అదేమిటో ఎవరింటికైనా భోజనానికి వెళ్తే ఆ ఇంటావిడ చేసిందే బాగుందేమో అనిపిస్తూంటుంది! రోజూ పెళ్ళాం చేసినది పీకలదాకా మింగుతున్నా సరే. ‘అన్నయ్యగారూ, మరీ మారడగలేదు. వదినగారి చేతివంటంత బావుండలెదేమో’ అనగానే, ఛాన్సొచ్చిందికదా అని, అబ్బే అలాటిదేమీ లేదమ్మా, నీచేతివంట అమృతం ఎట్సట్రా వల్లించేస్తాడు.భార్య ఎదురుగా ఉండగానే. అసలు ఆ ఇంటావిడడిగిందెందుకూ, ఇంట్లో ఉన్న మొగుడికి తెలియచేయడానికి’ఓరి బడుధ్ధాయీ, నా చేతి వంట ఊళ్ళోవాళ్ళందరికీ బాగానే ఉంటుందీ, నీకే తిన్నదరక్క రోజూ వంక పెడుతూంటావూ’ అని చెప్పడానికి.ఈ పెద్దమనిషీ వాళ్ళూ అవతలివారింటికి వెళ్ళినప్పుడు సీన్ రిపీట్ !

పక్కవాళ్ళింట్లో ఏ ప్లాస్మా టి.వీ యో తెచ్చారనుకోండి,ఇంట్లో పగలనకా, రాత్రనకా ఆ టి.వీ గురించే गुण गान् !వాళ్ళింట్లో ఫ్లోరింగు బావుందీ, అబ్బ వాళ్ళాయన జుట్టుకి రంగేసికుంటే ఎంత బావుంటాడో, మీరూ ఉన్నారు.వాళ్ళకి,ఎంచక్కా
శాంట్రో ఉంది. మనమూ ఉన్నాము,ఆటోలూ, బస్సులూనూ.దేనికైనా పెట్టిపుట్టాలి అంటూ.ఆ అవతలివాడు, ఇంకోళ్ళని గురించి అలాగే అనుకుంటూంటాడు. అలా కాకపోతే మానవ జన్మే కాదు! అసలు జీవితంలో contentment అనేది ఒకటుంటుందా అనిపిస్తుంది.
అందుకనే ‘పొరుగింటి పుల్లకూర రుచి’ a.k.a. ‘Neighbour’s wife is always beautiful’ అనే సామెతలు వచ్చాయి!

ఇంకా చాలానే ఉన్నాయి. మీకు గుర్తొస్తే పంచుకోండి !

Advertisements

17 Responses

 1. Excellent! ఎంత బాగా రాశారండీ.. మీరేం చెప్పినా.. ఫ్లో ఎంత బాగుంటుందంటే..” అయ్యో అప్పుడే అయిపోతుందా? కొద్దిగా నెమ్మదిగా చదువుదాం ” అనిపిస్తుంది!!!

  Like

 2. కృష్ణప్రియా,

  నా టపా ల మీద మీ అభిప్రాయానికి చాలా చాలా ధన్యవాదాలు.

  Like

 3. >ఇది అనుభవం మీద చెప్తున్నది
  > ప్రతీవాడూ చెప్పే స్టాండర్డ్ డయలాగ్గు– ‘ఎప్పుడూ ఫ్లైట్ లొనే వెళ్తానూ, ఏమిటో ఈసారే ఆఖరినిమిషంలో ఇలా వెళ్ళవలసివచ్చిందీ’
  మీరు అలా చెప్పారా ఎప్పుడైనా? 😀

  ఇంతకి మళ్ళీ ఇంకో డబా తెచ్చుకుని ఐస్‌క్రీం తిన్నారా? 🙂

  Like

 4. >>> ఎప్పుడూ ఎవడో కోన్కిస్కా పక్కవాళ్ళ అబ్బాయికో,అమ్మాయికో మనకంటె మార్కులు ఎప్పుడూ ఎక్కువే వస్తాయి,అదేం ఖర్మమో!

  నాతో పాటు మా నాన్నగారితో పనిచేసే ఆయన కొడుకు చదివేవాడు. వాడు చదువైతే చాలా బాగా చదివేవాడు కాని, తొమ్మిదో క్లాసుకొచ్చేసరికే ఇంట్లోవాళ్ళకి తెలియకుండా చాటుగా సిగరెట్లు కాల్చేవాడు…అప్పుడప్పుడూ తాగేవాడు కూడా. మా అమ్మగారు వాడి మార్కులు చూసినప్పుడల్లా “వాణ్ణి చూసి బుద్ధితెచ్చుకో” అని తిడుతూ ఉండేవారు. “నీకు తెలీదే బాబూ…వాడు పెద్ద వెధవ” అని చెప్పేయ్యాలి అని నోటిదాకా వచ్చేది. కానీ పాపం ఎంతైనా స్నేహితుడు కదా అని కోపాన్ని అలాగే అణగ్గొట్టుకునేవాణ్ణి.

  భలే సరదాగా ఉంటాయండీ…మీ బ్లాగులు. మీరు ఏరోజన్నా వ్రాయక పోతే ప్రతీ పది నిమిషాలకీ వచ్చి చూస్తుంటాను…ఏమైనా కరుణించారేమోనని 🙂

  భవదీయుడు
  అబ్బులు

  Like

 5. బాబాయ్ గారూ…
  మరొక మంచి పోస్టు. Contentment లేక జనం చస్తున్నారు. నా పొరుగింటి వాడు వాకింగ్ లో కలిసినప్పుడల్లా…తనకు బ్యాంకులో కనీసం పది లక్షలైనా లేవే?అని తెగ ఏడుస్తాడు.
  దీనికి కొనసాగింపుగా జనం ఈర్ష్య, ద్వేషాల గురించి ఒక పోస్టు అందిస్తారని ఆశిస్తాను.
  రాము

  Like

 6. చాలా బాగుంది.

  Like

 7. మీ బ్లాగ్ చాలా బావుంటుంది.మేము కూడా ఫ్రవాస ఆంధ్రులము.మీ కబుర్లు చదివినప్పుడల్లా అంధ్రా లో ఉన్నట్లు ఉంటుంది.

  Like

 8. కృష్ణప్రియా,

  ఇంకా ప్రతీరోజూ ఏదో ఒకటి వ్రాసి బోరుకొట్టేస్తున్నానేమో అని అప్పుడప్పుడు భయపడుతూంటాను. మీకు నచ్చుతున్నందుకు సంతోషం.

  Like

 9. పానీపురి,

  నేను అలా చెప్పే అవకాశమేలేదు, ఎందుకంటే ఏరోప్లేన్ లో వెళ్ళడం అంటే చచ్చేంత భయం! ఈ సారి కుల్ఫీలు తెచ్చానోచ్.అవి ప్యాకెట్లో ఉన్నాయి కాబట్టి సేఫ్ గానే ఉన్నాయి!

  Like

 10. అబ్బులూ,

  మరీ అంత మునగ చెట్టెంకించేయఖ్ఖర్లేదు. ఎప్పుడో మీరే అంటారు, బాబూ ఇంకాపేయండి అని!!

  Like

 11. రామూ,

  ఈర్ష్యా ద్వేషాలూ లాటివి మరీ బరువుగా ఉంటాయేమో. ఎదో ఆఫామిలీ కి సంబంధించినవి, మూడ్ వచ్చినప్పుడు వ్రాస్తాను!

  Like

 12. శివానీ,

  నా టపాలు నచ్చుతున్నందుకు ధన్యవాదాలు.

  Like

 13. బాబూజి, నాకు ఒక సామెత గుతొచ్చింది ఆంగ్లంలొ – “The grass always looks greener on the other side”

  Like

 14. బాబూజి, నాకు ఒక సామెత గుర్తొచ్చింది ఆంగ్లంలొ – “The grass always looks greener on the other side”

  Like

 15. ఏరియన్,

  నీవు చెప్పిన సామెత మరీ పెద్దమనిషితరహా లో ఉంది కాబట్టి అంత త్వరగా గుర్తుకు రాలేదు! నేను వ్రాసే టపాలు, మరీ సీరియస్సువు కాదు కాబట్టి అలాటి సామెత ( ఇంగ్లీషుది) పెట్టాను. ఏమీ అనుకోవద్దు!!

  Like

 16. మీరు చెప్పినదానికి ఇంచుమించు సామెతలేమైనా ఉంటే చెప్పమన్నారని చెప్పాను…
  It, in now way, was meant to show I know better than you 🙂

  Like

 17. ఏరియన్,

  నేను అడిగినది ఇంకా ఏమైనా పొరుగింటి పుల్లకూరలు గుర్తుకొస్తే అని !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: