బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- సినిమా హాళ్ళలో ఈతిబాధలు


    చిన్నప్పుడు సినిమాలకి వెళ్ళడం అమ్మా,నాన్నలతోటే.కొద్దిగా స్కూల్లో పెద్దక్లాసులకి వచ్చినప్పుడు,ఒక్కడినీ వెళ్ళడానికి డబ్బులిచ్చేవారు.అదీ ఎంత, ఓ కుర్చీ క్లాసుకి సరిపోయేటంత, ముప్పావలా!సినిమా హాలుకీ,ఆట అయిపోయిన తరువాత ఇంటికి వెళ్ళడం అన్నీ నడకే.పోనీ పాపం ఏదో రిక్షాలో వెళ్తాడూ అని ఓ పావాలాయో, అర్ధో ఇస్తే,సినిమా హాల్లో ఇంటర్వెల్ లో ఏదో ఒకటి తినడమో, తాగడమో చెయొచ్చు అనే కల కలలాగే మిగిలిపోయింది.అలాగని ఇప్పటిలాగ
పాకెట్ మనీలూ అవీ ఉండేవికావు.పీకలదాకా తిండి పెట్టి,కట్టుకోడానికి బట్టా ఇచ్చిన తరువాత, ఇంకా ఈ పాకెట్ మనీలూ</b. అవీ ఎవళ్ళిస్తారు? ఊళ్ళో ఉన్నవి మొత్తం నాలుగో అయిదో హాళ్ళు.వారానికి ఒకదానికెళ్ళినా, మొత్తం నాలుగు సినిమాలూ,వెరసి మూడు రూపాయలూ!

స్కూలుకెళ్తే మిగిలిన ఫ్రెండ్స్,అదేదో సినిమా చూశానూ అదీ రెండోసారో,మూడోసారో అన్నప్పుడల్లా వళ్ళు మండీపోయేది.ఛస్తే అమ్మా నాన్నా ఉన్న ఊళ్ళో చదవకూడదూ అనిపించేది.అంతదృష్టం ఎక్కడా? కాలేజీకూడా ఇంటికి దగ్గరే!మన జీవితం ఇలాగే వెళ్ళిపోవాలని రాసిపెట్టాడు ఆ భగవంతుడు.మహా అయితే సినిమా హాల్ దగ్గరకు వెళ్ళి, మనకు నచ్చిన పాటోసారి వినొచ్చేవాడిని.ఎస్.ఎస్.ఎల్.సి, మా అన్నయ్యగారి దగ్గర చదవడంవల్ల, కొద్దిగా డబ్బులొచ్చేవి.ఆ ‘తీరని కలలు’ కొన్నిటిని సాకారం చేసికున్నాను!అంటే ఇంటర్వెల్ లో బయటకు వెళ్ళి కలర్ సోడా తాగడం, పాటల పుస్తకాలు కొనుక్కోవడం లాటివన్నమాట!కాలేజీకెళ్ళిన తరువాత ఇంకొంచెం ఫ్రీడం వచ్చేసింది. మామూలుగా చూసే సినిమాలే కాకుండా, క్లాసులెగ్గొట్టి హిందీ మ్యాట్నీలు చూడడం ( అదీ బాగా నచ్చినవైతే రెండో మూడో సార్లు చూడడందాకా). ఇన్ని వ్యాపకాల్తోటి, చదువు వంటబట్టమంటే ఎలా పడుతుందీ?

మనవైపు ఆరోజుల్లో సీట్లకి నెంబర్లూ అవీ ఉండేవికావు.ఆట మొదటిరోజైతే వరెండాలో కూడా కుర్చీలేసి చూడనిచ్చేవారు.బాల్కనీ సీట్లకైతే నెంబర్లుండేవి. ఎలాగో ఢక్కామొక్కీలు తిని, టికెట్టు సంపాదించి, హాల్లోకెళ్ళేటప్పటికి, న్యూస్ రెవ్యూ అయిపోయి, సినిమా టైటిల్స్ మొదలెట్టేసేవాడు. ఆ చీకట్లో ఏమీ కనిపించి చావదు. గేటుకీపరు ఓ టార్చీలైటు తీసికుని ఓ వరసలోకి తీసికెళ్ళి, లైటుచూపించేవాడు, అక్కడ ఓ పదిమందిని దాటుకుంటూ, వాళ్ళు పడే విసుపు భరిస్తూ,ఎవరెవరివో కాళ్ళు తొక్కేస్తూ మొత్తానికి ఆ సీటులో సెటిల్ అయినంతసేపు పట్టదు, ఇంతట్లో ఆ టార్చీలైటువాడు, మన మీద లైటేసి, బయటకు పిల్చి, మన టిక్కెట్టు చూపించమంటాడు. మీదిక్కడ కాదూ అని ఇంకోచోట చూపిస్తాడు
మళ్ళీ అక్కడా ఇదేసీను రిపీట్!అదేం పాపమో, మనకి ముందు సీట్లో కూర్చున్నవాడెప్పుడూ పొడుగ్గానే ఉండేవాడు.నిజంగాపొడుగ్గా ఉండేవాడా, లేకపోతే కావాలని మెడ సాగతీసేవాడా,ఏది ఏమైనా మనకి మాత్రం, హీరో తలా, హీరోయిన్ చెయ్యీ కనిపించేవి.ఇంత డబ్బూ పెట్టి ఇదేం తద్దినంరా అనిపించేది!

ఉద్యోగంలో చేరిన మొదటి ఏడాదిలోనూ(1963), డొమీనియన్ ప్రతిపత్తిలోంచి, పూర్ణ స్వాతంత్రం రాగానే, కసితీరా వారానికి అయిదారు సినిమాల చొప్పున 300 సినిమాలూ చూశాను!ఆమధ్యన ఎక్కడో, అప్పుడు చూసిన సినిమాల లిస్టు కూడా కనిపించింది. ఇంత ఘన చరిత్ర పెట్టుకుని, పిల్లల్ని సినిమాలకెళ్ళొద్దూ అంటే వింటారా!నా అదృష్టం ఏమిటంటే, ఈ లిస్టు ఈమధ్యనే వెలుగులోకి వచ్చింది!పెళ్ళైన మొదటేడాదీ ఏమో కానీ,ఆ తరువాత సినిమాకెళ్ళడం, పిల్లల్ని ఎత్తుకోడానికే.ఇంట్లో ఎవరైనా పెద్దాళ్ళుంటే ఏమో గానీ, పెళ్ళాన్ని ఓ సినిమాకి తీసికెళ్దామని ఓ యావా,మూడేళ్ళ వయస్సుదాకా టిక్కెట్టుండదు కాబట్టి,ఆ పిల్లనో,పిల్లాడినో చంకనేసికుని వెళ్ళడం.ఆ పిల్లో,పిల్లాడో ఇనెవిటబుల్ గా ఏదో శాపం పెట్టినట్టుగా,సినిమా మొదలైన అరగంటకల్లా ఏడుపు మొదలెడతాడు/తుంది.పొలో మని,వాళ్ళనీ, వీళ్ళనీ దాటుకుంటూ,ఈ పిల్ల ఇంకా రాగం పెడితే, అక్కడున్న వాళ్ళందరి కళ్ళూ మన జంటమీదే( తండ్రీ,పిల్ల). ఆ హడావిడిలో మనం ఏ వరసలో మన పెళ్ళాంతో కూర్చున్నామో అంత పెద్దగా గుర్తుంచుకోము. ఏదో ఏడుస్తున్న పిల్లని బయటకు తీసికెళ్ళాలని తొందరే కానీ,ఇలాటి సిల్లీ థింగ్స్ ఎవడు చూస్తాడూ?

బయటకు తీసికెళ్ళగానే అదేదో స్విచ్చ్ ఆఫ్ చేసినట్లుగా, ఏడుపాపేసి, ఠింగురంగా అని ఆడుతుంది.పోనీ ఊరుకుందికదా అని హాల్లోకి ఓసారి వెళ్ళిచూద్దామా సినిమా ఎంతదాకా వచ్చిందో అని లోపలకి వెళ్తాము. మన సీటెక్కడో చచ్చినా గుర్తుండదు,ఆ చీకట్లో ఏ రో లోకి వెళ్ళాలో తెలియదు.పైగా అక్కడున్న ఆడాళ్ళందరూ, మన వాళ్ళలాగే కనబడతారు, అలాగని ఎవరిపక్కైనా కూలబడితే పళ్ళూడకొడతారు!ఈ బాధలన్నీ భరించలేక,అక్కడే పైకీ కిందకీ తిరుగుతాం.అక్కడెక్కడో కూర్చున్న భార్య ఇవన్నీ చూస్తూంటుంది, ఓ సారి ఇష్ ఇష్ అని అంటే తనసొమ్మేంపోయిందిట! అబ్బే, ఇక్కడకు వచ్చిన తరువాత, పిల్లేడిస్తే తన్ని తీసికెళ్ళమంటాడేమో అని భయం,అయ్యబాబోయ్, ఇంత మంచి సినిమా మిస్ అయితే ఎలాగా అనుకుని. తొమ్మిది నెలలు మోయలేదేమిటీ,ఆ మాత్రం ఓ గంటెత్తుకుంటే ఏం అరిగిపోరు అనుకుని, పోన్లెద్దూ అనుకుంటుంది!

అటూ ఇటూ (వయస్సులో) కాని పిల్లలతో సినిమా కెళ్ళారా,ఇంటర్వెల్లో,అక్కడుండే గడ్డంతా కొనాలి.అవి తిండానికే పుట్టారా అనిపిస్తుంది.చిన్న పిల్లలున్నారుకదా అని బిస్కట్ ప్యాకెట్లూ,వాటర్ బాటిల్సూ అన్నీ పట్టుకుని, ఏదో ఊరు ప్రయాణంలా బయలుదేరుతామా, ఆపిల్లలు అవన్నీ తింటారా తాగుతారా మన పిచ్చిగానీ, అదో మోతబరువూ</b.!

ఇలాటి ఈతి బాధలన్నీ దాటుకుని,మొత్తానికి సినిమా అంటే, అదీ హాల్లోకి వెళ్ళిచూడడం అంటే వైరాగ్యం పుడుతుంది. ఈ మధ్యన మా స్టేటస్ అమ్మా నాన్నల్లోంచి, తాతయ్యా,అమ్మమ్మా/నానమ్మాల్లోకి మారిన తరువాత, ఎప్పుడైనా వాళ్ళతో సినిమా హాలుకి వెళ్ళినప్పుడు, ఈ పాత జ్ఞాపకాలన్నీ, సినిమా రీళ్ళలాగ గిర్రున తిరుగుతూంటాయి!

10 Responses

  1. This type of “Cinima Pichi” we telugu people will have a lot. I am missing theatre exp in bangalore a lot now. I used to watch 2-3 movies a week when i am in Andhra.

    Like

  2. చాలా బాగుందండీ మీ సినీ భారతం..
    అదేంటోగానీ.. ముందుసీటువాడు ఎప్పుడూ పొడుగుమెడవాడే దొరుకుతాడు..

    అన్నట్టు.. ఇంకొకవిషయం.. కలర్ సోడా గుర్తుచేసారు.. ఈ సారి ఊరెళ్ళినప్పుడు తాగాలి.. 🙂

    Like

  3. Wonderful post.
    డొమీనియన్ ప్రతిపత్తిలోంచి, పూర్ణ స్వాతంత్రం రాగానే, కసితీరా….
    పైగా అక్కడున్న ఆడాళ్ళందరూ, మన వాళ్ళలాగే కనబడతారు….
    బాబాయ్ గారూ…ఇలాంటి చమక్కులు అదిరిపోయాయి. ఈ రోజుల్లో నగరాల్లో మల్టీ ప్లెక్ష్ లలో బైటి బిస్కత్తులు, నీళ్ళు అనుమతించడం లేదు. తిరు క్షవరం వారే చేయాలి కదా మరి.
    అవునూ….ఏదో ఐస్ క్రీం తో హడావుడి చేసారట. హేమ అన్నం తినేప్పుడు చెప్పి నవ్వించింది. ఆ పోస్టు ఎక్కడ వుంది?
    రాము
    apmediakaburlu.blogspot.com

    Like

  4. శేషూ,
    I totally agree with you.

    Like

  5. శ్రీనివాసూ,

    కలరు సోడాలో ఉండే మజాయే వేరు!

    Like

  6. కొత్తపాళీ,

    థాంక్స్

    Like

  7. రామూ,

    ఏదో సంతోషిస్తుంది కదా అని,ఐసుక్రీం తెస్తే, అది కాస్తా డబ్బాలోంచి బయటకొలికి,నా పరువు తీసింది.దానిమీద ఛాన్సొచ్చిందికదా అని మా ఇంటావిడ ఓ టపా http://bsuryalakshmi.blogspot.com/2010/07/blog-post_08.html వ్రాసేసింది.
    అలా ఊళ్ళోఅందరికీ చెప్పుకుంటారా!

    Like

  8. i like the satire between the lines in your writings.

    Like

Leave a comment