బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–చెప్పులూ, బూట్లూ–2


    నిన్న బూట్లగురించి చెప్పుకున్న తరువాత, వాటి కజిన్స్ చెప్పులగురించి కూడా చెప్పుకోవాలిగా! మగాళ్ళకి మారోజుల్లో అవేవో ‘ఆకు చెప్పులు’ అని వచ్చేవి.మరి ఇంకేమైనా ‘కాయ,పండు,పువ్వు’ చెప్పులుకూడా ఉన్నాయేమో నాకైతే తెలియదు.ఒకటి మాత్రం నిజం. ఎటువంటి చెప్పేసుకున్నా సరే అది నిశ్చయంగా ‘ కరుస్తుంది’. ఈ కరవడం అనే పదం ఎక్కడినుండి వచ్చిందో కూడా తెలియదు. రెండు బొటనవేళ్ళ దగ్గరా,మడమ పైనా అయితే తప్పకుండా కరుస్తుంది.కొత్త చెప్పేసుకుని ఓ సారి బజారుదాకా వెళ్ళొద్దామని బయలుదేరిన, ఓ కిలోమీటరు దూరంలో, తన పని తాను చేసికుని పోతుంది.ఎలాగో, కాలు కొంచెం కొంచెం బయటకి పెట్టుకుంటూ, ఎలాగోలాగ కొంపకి చేరుకుంటాము.ఆ చెప్పులు తీసి అవతలపడేసి, అమ్మయ్యా అని ఓ నిట్టూర్పు విడిచి, ఆ కరిచినచోట రిపేరీ పని మొదలెడతాము.రిపేరీ అంటే మరేం లేదు,ఓ బ్యాండ్ ఎయిడ్ తీసికుని, ఆ కరిచిన చోట్లలో, సున్నం బొట్ల లాగ, పాచీలు వేసికోవడం.ఈ శస్త్రాస్త్రాలతో మళ్ళీ బయటకి వెళ్ళి, అలవాటయ్యేదాకా వాడితే, పాపం ఆ చెప్పూ కరవడం మానేస్తుంది.

   వచ్చిన గొడవల్లా ఈ చెప్పులతో ఏమిటంటే, చెప్పా పెట్టకుండా తెగూరుకుంటాయి.ఎక్కడా దగ్గరలో చెప్పులు కుట్టేవాడెక్కడా కనిపించడు.వాళ్ళనీ వీళ్ళనీ అడిగి, మొత్తానికి పట్టుకుంటాము.ఆ బొటనవేలు పెట్టుకునే రింగు తెగుతుంది, మొదట్లో.ఆ చెప్పుచూడగానే, ఆ చెప్పులుకుట్టే డాక్టరు వేసే మొదటి ప్రశ్న– బాటాదాండీ. అంటే అతనికీ తెలుసు, ఈ కంపెనీ చెప్పుల జీవితకాలం అంతేననీ, వాటికి ఆయుషు పోయడానికి, మనం ఈ చెప్పులుకుట్టేవాళ్ళకి, మహరాజ పోషకులౌతామనీ.
ఎంత డిస్కౌంటులో కొన్నా, డబ్బెట్టే కొన్నాం కదా. పోనీ ఆ కొట్టువాడిని వెళ్ళి అడుగుతే, మేము అప్పుడే చెప్పామండీ, సెకండ్ సేల్స్ చెప్పులకి గ్యారెంటీ ఉండదూ అని.వాడు చెప్పలేదూ అని తెలుసు మనకి, అయినా చేసేదేంలేదు.ఇంక ఈ చెప్పులుకుట్టే ఆసామీ,మనం చెప్పిన రింగుకే రిపేరీ చేస్తాడు. అతనికీ తెలుసు, మిగిలిన పార్టులు కూడా వీక్కూ అని.ఎలాగూ ఓ రెండురోజులుపోయిన తరువాత, ఇంకోచోట తెగుతుందీ, మన దగ్గరకి రాకేం చేస్తాడూ అని భరోసా.డాక్టర్లు చూడండి,మనకున్న రోగాలన్నీ ఒకేసారి చెప్పరు, దఫా దఫాల్లో చెప్పి, మనల్ని దివాళా చేయిస్తారు!

    ఇంక వర్షంలో వెడితే, ఈ చెప్పులతో వచ్చిన గొడవ ఇంతా అంతా కాదు.ఒక్కో అడుగూ వేస్తూంటే,చిందిన వర్షం నీరూ, బురదా,మన వెనక్కాల భాగం నుండి, తలమీదుగా ప్రయాణం చేసి, ముందర భాగంలో కూడా ఓ డిజైన్ తయారుచేస్తుంది.ఇంటికొచ్చిన తరువాత చివాట్లూ. ఓరబ్బరు బూటు కొనుక్కుంటే మీకేం పోయిందీ, ఈ దరిద్రపు చెప్పులేసికుని వర్షంలో వెళ్ళడం, బట్టలన్నీ తగలెసికుని నా ప్రాణం తీయడం అంటూ.

    కొద్దిరోజులకి, హవాయి చెప్పులనోటొచ్చాయి.అవీ అంతే కరవడంలో. పైగా వీటికి బొటనవేలు పెట్టుకునే రింగుండదు.కాలి బొటనవేలూ, రెండో వేలూ మధ్యలో కరిచి చంపుతాయి.ఏ రోడ్డుమీదెళ్ళేటప్పుడో పుటుక్కున తెగుతాయి. ఆ తెగిన చెప్పుకి
ఓ సూదిపిన్నీసు గుచ్చి కొంపకు చేరడం ( ఈ విషయం నా సూదిపిన్నీసుల టపాలో శ్రీసరస్వతుల శ్రీనివాస ఉమా శంకర్ గారు గుర్తుచేశారు, థాంక్యూ!). పోనీ అలాగని ఊరుకుంటామా, ఓ చెప్పులదుకాణానికి వెళ్ళి ఓ Strap తెచ్చుకోడానికి. అక్కడ ఈ Strap లు జతల్లెఖ్ఖనే ఇస్తారు.లేకపోతే మన తెలివితేటలకి, ఓ కాలికి పెద్దదీ, ఇంకోకాలికి చిన్నదీ వేసికుంటామనేమో.తెచ్చామండీ, దాన్ని హవాయి చెప్పులో దోపడం మళ్ళీ ఓ ప్రళయం. ఛస్తే దాంట్లో దూరదు, ఓ కంఠాణీ యో మరోటో తీసికుని, ఆ Strap కి చిల్లు చేసి, లక్షణంగా ఉన్న చెప్పుకి చిల్లుచేసి మొత్తానికి ఎక్కిస్తాము. అక్కడికి ఓ చిల్లయింది. ఇంకా రెండున్నాయి. నానా హైరాణా పడి ఓ చెప్పుకి పూర్తిచేస్తే చాలదుగా, ఆరోగ్యంగా ఉన్న రెండో చెప్పుకి కూడా మార్చాలిగా.ఈ కార్యక్రమం అంతా దేనికీ, మళ్ళీ కరిపించుకోడానికి, ఎందుకంటే ఈ Strap లు కొత్తవిగా, వాటి సరదా కూడా తీరొద్దూ? ఈ గొడవలన్నీ అఖ్ఖర్లేకుండా,ఆ హవాయి చెప్పుతెగినప్పుడే, ఏ రోడ్డు పక్కన చెప్పులుకుట్టే ఆసామీ దగ్గరకు వెళ్ళుంటే,అతనే ఆ తెగిన చెప్పుకే ఓ Strap వేసి పనికానిచ్చేవాడుకదా. అబ్బే మనమే తెలివైనవాళ్ళమనుకుని చేసే వెధవ పనులు ఇవి (Penny wise pound foolish) !
ఇలా బయటకెళ్ళినప్పుడల్లా ఇరుకులో పెట్టేస్తున్నాయని, వీటి Area of usage మార్చేసి, ఇంట్లోకి తెచ్చేశాము.ముందుగా, టాయ్లెట్లకీ,బాత్ రూంలకీ, ఇప్పుడిప్పుడే వంటింట్లోకీ.ఎంతదాకా వచ్చిందంటే, ఇంట్లో ఉండే పెద్దవారు కూడా వీటికి
‘మడి చెప్పుల హోదా ‘ ఇచ్చేశారు! ఏదో మరీ చూసేవాళ్ళకి బాగోదని, దీపం పెట్టే టైములోమటుక్కి, వాటిని తీస్తున్నారు!!

    ఇంక స్త్రీల చెప్పుల విషయానికొస్తే అవేవో,హీల్డ్, హై హీల్డూ.ఆ హైహీల్డ్ చెప్పులతో కిందపడకుండా ఎలా మానేజ్ చేస్తారో ఎప్పుడూ వింతే నాకు.అంటాం కానీ,మనలాటి బడుధ్ధాయిలని సంవత్సరాలనుంచీ మేనేజ్ చేయడం లేదూ?అలాగే ఇదీను.
నిన్న బూట్లగురించి చెప్పినప్పుడు,బ్రౌన్ రంగులో ఉండే కాన్వాసు బూట్లగురించి మర్చిపోయాను.అవి వాడినంత కాలం బాగానే ఉంటాయి, కొద్దికాలానికి, ఓ చిరుగు పడి, దాంట్లోంచి బుల్లి వేలు తొంగి చూడ్డం మొదలెడుతుంది.

    ఇంక చెప్పుల దుకాణం లోకి వెళ్ళినప్పుడు,కొట్టువాడికీ, మన తో వచ్చిన ఇంటావిడకీ జరిగే డయలాగ్గు బలేగా ఉంటుంది. ఓ పది పదిహేను రకాల డిజైన్లు చూసేక ఒకటి ఫైనలైజు చేస్తారు.‘ఓసారి అటూ ఇటూ నడిచి చూడు, లేకపోతే, నా ప్రాణం తీస్తావు తరువాత’అంటూ భర్తా, కొద్దిగా టైట్టయినట్లనిపిస్తోందీ అంటూ భార్యా, ఫరవాలేదు మేడం, వాడగా వాడగా లూజవుతుందని కొట్టువాడూ, యుగయుగాలనుండీ చెప్తూనే ఉన్నారు. అయినా సరే అది లూజవదూ,అలాగని అవతల పారేయలేమూ.ఏమిటో వెళ్ళిపోతూంటుంది జీవితం !!!!

Advertisements

6 Responses

 1. Did you ever go to any IIT? From the dean of the IIT to the peon level everyone wears these hawaii slippers. To the class, to meetings and to every single damn thing. Even to international conferences. They wear tie but the shoes? No they wear slippers. Looks odd and stupid.

  Like

 2. ఫణిబాబు గారూ మీ టపాలో చోటిచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే ఒక చిన్న కోరిక! ఎలాగూ మీది అమలాపురం సైడ్ అంటున్నారు కాబట్టి “తరవాణీ” గురించి మీ మాటల్లో చదవాలనుంది. (అది ఈ పోస్ట్ లో అడగదగ్గ కోరిక కాదనుకుంటా అయినా మళ్ళీ మర్చిపోతానేమో అని అడిగేశా అంతే!)

  Like

 3. చెప్పుల ప్రకరణము బలేగా ఉంది. ఒక అనుమానము. బ్యాండైడు ఆ చెప్పులు కరిచే కాలంలొ ఉందా అని. చాప్టరు బాగుంది. ఇక తరవాణీ చాప్టెరా? మీ ఆవిడ కూడా దంచేస్తున్నారు. ఎప్పుడో పూణె రావాలి

  Like

 4. IEdu,

  I did not visit any of the IITs.

  Like

 5. సరస్వతుల ఉమాశంకర్ గారూ,

  ఎప్పుడో వీలు చూసుకుని వ్రాయడానికి ప్రయత్నిస్తాను.

  Like

 6. రామం,

  బ్యాండెయిడ్ అని ఇప్పటి రోజులు దృష్టిలో ఉంచుకుని వ్రాశాను. మరీ అలా డైరెక్షన్ మిస్టేకులు పట్టుకుంటే ఎలాగమ్మా!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: