బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-కొంపా గోడూ–2


    ఊరికిదూరంగా ఉండే ఖాళీ స్థలాల్లో, ఏదో అందరూ కలిసి కొనుక్కుంటున్నారు కదా,కొద్దిగా చీప్ గా దొరుకుతోందికదా అని,మన మామగారో,ఇంకోరో, కూతురూ,అల్లుడూ రిటైర్ అయినతరువాత దగ్గరలోనే ఉంటారూ అనే సదుద్దేశ్యంతో,ఆయన ఓ రెండు స్థలాలకి apply చేస్తారు.చేసినవాడూరుకోకుండా, కూతురికి ఓ ఇండెంటు పెడతారు.తరవాత ఏమౌతుందో చెప్పఖ్ఖర్లేదుగా,ఆ అల్లుడుగారు దీనికి బలైపోతాడు!ఓ స్వంతకొంప ఏర్పాటుచేసికోవడం,మంచిదేఅనుకోండి,ఇంట్లో మామగారి కూతురు అనబడే తన భార్య ప్రతీరోజూ,పగలనకా,రాత్రనకా పెట్టే ప్రెషర్ కి succumb అయిపోతాడు! సరేనంటాడు, ఇంకేంచేస్తాడూ?

ఇలా స్థలం కొనుక్కున్నానూ అనే విషయం,తన పుట్టింట్లో చెప్పడు ముందర.మామగారూరుకోరుకదా,ఎప్పుడో ఖబుర్లలో ఈ విషయం కాస్తా చేరతీస్తారు.మా అల్లుడు ఎంత ప్రయోజకుడయ్యాడో అనుకుంటూ.ఆయన సంబరం ఆయనదీ! కానీ ఇదంతా అల్లుడు గారి ప్రాణం మీదకొస్తుంది.ఏ శలవుల్లోనో ఇంటికి( అల్లుడుగారి) వెళ్ళినప్పుడు,ప్రారంభం అవుతుంది.ఆమాత్రం స్థలం తీసుకోవాలని ఉన్నప్పుడు, నాతో కూడా ఓ మాటనొచ్చుగా,ఇక్కడే ప్రయత్నం చేద్దుమూ అంటూ.పెళ్ళాం చేతిలో
కీలుబొమ్మైపోతున్నాడే అని భయం తప్ప,అక్కడ స్థలం తీసికున్నాడనికాదు
వాళ్ళ బాధ! అలాగని అక్కడోటీ,అత్తారి ఊర్లో ఓటీ తీసికునే ఓపిక అల్లుడుగారికి ఉండదు.ఏదో ఈ బాలారిష్టాలన్నీ దాటుకుని,స్థలానికి registration కార్యక్రమాలు పూర్తి చేస్తాడు. ఇంక మామగారు, కూతుర్నీ, అల్లుడినీ ఓ సైకిలు రిక్షాలో పడేసి, తను ఓ లూనా మీదో,ఇంకోదానిమీదో ఫాలో అయి, ఓ అరగంటా, నలభైఅయిదునిమిషాలు, ఆ సైకిలురిక్షాలో కుదుపులు భరించిన తరువాత ఓ పేద్ద ఇలాకాకి తీసికెళ్తారు.అక్కడ ఉన్నవన్నీ మనకి ఒకలాగే కనిపిస్తాయి. ఏదో ఓ తాటి చెట్టు ఉన్న ప్లాట్ చూపించి,నాలుగు వైపులా సిమెంటు రాళ్ళతో,డిమార్క్ చేసిన ఖాళీ స్థలం ఓటి చూపించి,ఇదేనమ్మా మీ ప్లాట్ అని కూతురికి చూపిస్తారు.
ఇంక ఆ కూతురు ఎంత సంబరపడిపోతుందో,అబ్బ మనంకూడా ఇక్కడో డాబా వేసేసికోచ్చు అనుకుంటూ,ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలో ఊహించేసికుని కలలు కనేస్తూంటుంది.
ఇక్కడ అల్లుడిగారికేమో అంతా అగమ్యగోచరంగా ఉంటుంది-ఇదేమిటీ మావగారు, ఓ తాటిచెట్టుచూపించి ఇదంతా మనస్థలం అంటాడూ అని.ఆ మామగారు ఊరుకోడు, ఆస్థలం మనకిప్పించడానికి ఎన్ని తిప్పలు పడ్డారో, రోడ్డుకి కార్నర్ లో ఉండేలా ఎలా చూశారో, అడ్డరోడ్లెన్నో, పార్కెక్కడొస్తుందీ,గుడెక్కడొస్తుందీ లాటివన్నీ అరటిపండొలిచిచ్చినట్లుగా చెప్తారు. ఎప్పటికిల్లు కట్టనూ, దానికి అప్పెలా వస్తుందీ,ఆ కట్టిన కొంపలోకి ఎప్పుడొచ్చుంటాడూ, తను రిటైరవడానికి ఇంకా 30 సంవత్సరాలుంటుంది. ఇన్ని గొడవలున్నాసరే ఏదో స్వంత గూడు ఏర్పాటు చేసికునే ప్రకరణంలో, ఓ స్థలం దాకా వచ్చాడు!

ఇల్లు ఎలాగోలాగ మామగారి ఆధ్వర్యంలో కట్టించేస్తారు.ఇంక అక్కడినుంచీ గృహప్రవేశం హడావిడీ. ఏదో ముహూర్తం బాగా బలంగా ఉంటుందని, ఏ శ్రావణ మాసంలోనో ఫిక్స్ చేస్తారు. అప్పటికి ఇల్లుకట్టడం అదీ పూర్తవదు.గోడలుంటాయి, రూమ్ముల షేప్పులుంటాయి,గచ్చూ వగైరాలేమీఉండవు, కిటికీలకీ,గుమ్మాలకీ ఖాళీలుంటాయి వాటికి తలుపులుండవు. ముహూర్తం టైముకి ఓ టెంపరరీ గా ద్వారబంధం ఓటి తెచ్చి పని కానిచ్చేస్తారు. ముహూర్తం అయినతరువాత, మూడు నిద్రలు చేయాలిట ఆ కొంప అనబడే ఏరియాలో.లేకపోతే ఇంటికి శుభం కాదుట.రాత్రంతా అక్కడ ఉండడానికి,ఇంకోళ్ళెవరూ ఉండరు.అలవాటు పడ్డాయి కాబట్టి దగ్గరలో ఉండే కుక్కలు తప్ప.మిగిలినవాళ్ళందరూ హాయిగా ఊళ్ళోనే ఉంటారు,వాళకేంపట్టిందీ ఈ అడివిలో ఉండడానికి!
రాత్రంతా నిద్దరెక్కడపడుతుందీ,ఎవడొచ్చి పీకనొక్కుతాడో అనే భయం.ఓ రాత్రివేళ చీకట్లో ఏ నేచర్ కాల్ కో వెళ్దామంటే, కుక్కలన్నీ కొంపలంటుకుపోయేట్లు మొరగడం.ఎలాగూ ఇల్లు పూర్తికాలేదు కదా అని,అక్కడే ఎక్కడో పనికానిచ్చేద్దామా అనుకుంటే, మధ్యలో పెళ్ళాం లేచి తిడుతుందేమో అని భయం ఓ మూలా!నరకమండి బాబూ,ఇళ్ళు కట్టడం పూర్తవకుండా సెంటిమెంటు కోసం గృహప్రవేశం చేయడం!ఇంకా తెల్లారకుండానే లేచిపోయి,వెళ్దామంటే,గృహప్రవేశ ముహూర్తానికి అద్దెకు తెచ్చిన జంబుఖానాలూ,టెంటులూ, గ్లాసులూ , సత్యన్నారాయణ పూజకి పెట్టిన దేముడూ, వాళ్లందరికీ కాపలా ఉండాలి.టెంటద్దెకిచ్చినవాడు వచ్చి వాడితో పాటు క్యాటరింగు చేసినవాడు వచ్చి వాడి సరుకులూ తీసికెళ్ళేదాకా యజమాని బాధ్యతే
( ఇక్కడ మనం అని అర్ధం చేసికోవాలి). గృహప్రవేశం అయినప్పటినుండీ మనం కదా యజమానీ.ఆ క్యాటరింగువాడికీ, మనకీ ఎప్పుడూ ఛస్తే లెఖ్ఖ సరిపోదు.ఎక్కడో ఓ చంచా, ఓ గ్లాసూ తక్కువయిందంటాడు. మావగారు ఊళ్ళోంచి ఓ ఫ్లాస్కులో కాఫీ ( కూతురూ,అల్లుడికోసం) తీసికొచ్చేదాకా అక్కణ్ణుంచి కదలాడానికి కుదరదు!

ఈ తతంగమంతా పూర్తిచేసికుని ఊళ్ళోకి బయలుదేరాలంటే ఓ రిక్షా కావాలంటే మళ్ళీ మెయిన్ రోడ్డుదాకా నడవాలి.ఇన్నితిప్పలూ పడి సాధించేమయ్యా అంటే ఇంకా పూర్తిచేయని ఓ ఇల్లులాటి పదార్ధమూ,క్యాటరింగు వాడిచేతిలో చివాట్లూ( ఓ చంచా, గ్లాసూ తప్పిపోయిన సందర్భంలో).మళ్ళీ రెండో రాత్రి నిద్రచేయాల్సొస్తుందేమో అనే భయంతో, ఒళ్ళంతా పులపరంగా ఉందని,ప్రొద్దుటనుండీ ఓ దుప్పటీ కప్పేసుకుని ముసుగెట్టేస్తాడు అల్లుడుగారు. కావలిసిస్తే, ఇల్లు భార్యపేరునైనా రాసేద్దామని డిసైడైపోతాడు,’యజమాని’ స్టేటస్ ఇచ్చేసి, రాత్రి మళ్ళీ అక్కడ పొడుక్కోవడం తప్పించుకోవచ్చని !
ఇప్పటికి గృహప్రవేశం అయింది. ఆ తరువాతి కష్టాలు ఇంకో టపా లో !!

Advertisements

4 Responses

 1. మొత్తానికి ఇదంతా స్వానుభవమే అంటారా??

  Like

 2. కళ్ళకు కట్టినట్టు వ్రాసారు…చాలా బావుంది…ఆ తరువాయి భాగం కొసం ఎదురుచూస్తున్నా…

  Like

 3. కొత్తపాళీ,

  నేనేది వ్రాసినా స్వానుభవం, లేదా స్వయంగా చూసినదీనూ !!!

  Like

 4. ఏరియన్,

  ఈవేళ్టిది మూడో భాగం.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: