బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–గృహ నిర్భంధం-a.k.a House Arrest!


    ఎప్పుడైనా ఓ కాలికో,చేతికో నొప్పొచ్చి సమస్యొచ్చిందనుకోండి,అప్పుడనుకుంటాం, ఇలా కాలికి రాకుండా, ఇంకోదానికేదైనా వచ్చినా బాగుండును,ఎలాగోలా ఓర్చుకోవచ్చూ అని.అలాగే పిప్పి పన్ను నొప్పెట్టిందనుకోండి, మరణ బాధ పడాలి.ఇప్పుడూ పళ్ళే లేవుకనుక,ఆగొడవే లేదు!ఉన్నప్పటి ఫీలింగులెండి ఇది.అందువలన మన శరీరంలో ఎక్కడ సమస్యొచ్చినా, ప్రతీవాడూ ఆలోచించే పధ్ధతి ఇదే.అయినా అనుకుంటాంకానీ, దేనికదే, కాళ్ళూ చేతులూ సరీగ్గా ఉన్నంతకాలమే, మనం వేసే వేషాలు.

    సంగతేమంటే, నిన్న మా అమ్మగారి ఆబ్దీకం పెట్టడానికి, రాఘవేంద్ర మఠానికి వెళ్ళాము,అక్కడ మూడు గంటలు క్రింద కూర్చునేటప్పటికి,ఆ తరువాత భోజనం చేసేటప్పుడు ఇంకో గంటా మొత్తం నాలుగు గంటల క్రింద కూర్చోడం ధర్మమా అని, అక్కడ ఉన్నంతసేపూ బాగానే ఉన్న మోకాళ్ళు, సాయంత్రానికల్లా pendown strike చేసేశాయి.ఇంక చూసుకోండి, రాత్రంతా కాలు వంచలేనూ, కదపలేనూ.ఇంట్లో వైద్యం-ఎవో పైన్ కిల్లర్లూ, వేణ్ణీళ్ళ కాపడం ( మరీ గిన్నెలో గుడ్డ ముంచి కాదనుకోండి, అదేదో హాట్ వాటర్ బ్యాగ్గులో)అన్నీ ప్రయత్నించాను.( మొన్న ‘సంచీ’ ల బ్లాగ్గులో దీనిగురించి వ్రాయడం మర్చిపోయాను, అందుకే గుర్తు చేసింది). అబ్బే ఏం ఫలితం లేదు, సరే అని ప్రొద్దుటే ఏ డాక్టరుదగ్గరకైనా వెళ్దామని,ఓ సారి మా దేష్ పాండే గారికి ఫోను చేశాను( భుసావల్ లో ఉన్నారు), ఆయనకి నా జాతక చక్రం అంతా తెలుసు, పాతికేళ్ళనుండి చూస్తున్నారు.ఆయన అక్కడినుంచే నా పరిస్థితి అడిగి, ఓ పైన్ కిల్లర్ మాత్రా,అదేదో క్రీమ్మూ రాసేసుకుని, క్రేప్ బ్యాండేజ్ కట్టుకుని 48 గంటలు, ఎక్కడకీ కదలకుండా, వెధవ్వేషాలెయ్యకుండా, ఓ మంచం మీద పడుక్కుని రెస్ట్ తీసికోమన్నారు.అదేదో, నాతో చెప్పి వదిలెయ్యొచ్చుగా, అబ్బే, మా ఇంటావిడకీ, మా అబ్బాయికీ కూడా చెప్పారు. పాత సినిమాల్లో చూస్తూంటాము,అలాగన్న మాట!

    ఇంక మా వాళ్ళిద్దరికీ ఎంత సంబడమో! చకచకా బయటకు వెళ్ళి కావలిసిన సామగ్రంతా తెచ్చేసి, నన్నో మంచం మీద పడేశారు. నేను కూడా సందర్భానుసారంగా ,ఓ పైజమా, చార్ల చొక్కా వేసేసికుని సెటిలైపోయాను! One must keep up with the times కదా మరి!చూసేవాళ్ళకీ అనిపించాలి కదా! కాఫీ,టిఫినీ, తిండీ అన్నీ అక్కడికే!’ తాతయ్య నిద్రపోతున్నారూ’ అంటూ, మా నవ్యతో చెప్పడం, డాడీ ఎలా ఉందీ అంటూ మా అబ్బాయీ, మామయ్యగారూ ఎలా ఉందీ అంటూ మా కోడలూ, డాడీ ఎలా ఉందీ అంటూ మా అమ్మాయీ, ఏమైనా కొంచెం తగ్గిందా అంటూ మా ఇంటావిడా ప్రతీ గంటకీ పరామర్శోటీ !ఇదంతా బాగానే ఉందనుకోండీ, అయినా అదేదో సామెత చెప్పినట్లుగా ‘తిరిగే కాళ్ళూ, తిట్టే నోరూ’ కట్టిపడేస్తే ఎలాగండి బాబూ,
తిరక్కుండా ఉండలేనూ, అలాగని నోరుమూసుకుని కూర్చోలేనూ. పోనీ ఎవరైనా వింటారా అంటే, 38 ఏళ్ళనుండి విన్నవే విని వాళ్ళకీ బోరుకొట్టేసింది!ఇంక ఇది కాదని, ఇలా బ్లాగ్గులోనైనా నా గోల వినిపిస్తే బావుంటుందని ఇలా సెటిలైపోయాను!

    మా ఇంటావిడకి ఓ ‘తీరని కోరిక’ ఉంది.అలాగని ఆవిడ కోరికలన్నీ తీర్చేశానని కాదు, ఎలాగోలా నా చేత శ్రీ విశ్వనాథ సత్యన్నారాయణ గారి Magnum Opus ‘వేయి పడగలు’ చదివించాలని.మా ఇంట్లో ఆ పుస్తకం లేదు.ఈవిడ గోల భరించలేక నెట్ లో డౌన్ లోడ్ చేసి ఉంఛాను ఆ మధ్య.తన ప్రయత్నం తను చేసింది, చదివేనా వినిపించాలని, అదేమిటో ఆవిడ చదవడం మొదలెట్టిన ఓ గంటలో నిద్రొచ్చేసేది!వచ్చిన గొడవల్లా ఏమిటంటే, నాకు ఆ పుస్తకం లోని భాష అర్ధం అయేది కాదు.నాది చాలా low IQ ! నేనేం చెయ్యను దానికి? నాకర్ధం అవదు మొర్రో అన్నా వదలదు.ఇప్పుడు ఛాన్సు దొరికింది. ఈ మధ్యనే, మా వియ్యపురాలు గారు 1986 లో ప్రచురించిన,14 th Edition మాకిచ్చారు.ఇంక మా ఇంటావిడ’ కాగల కార్యం గంధర్వులే చేశారు’ అన్నట్లుగా, నా మంచం ప్రక్కనో కుర్చీ వేసికుని, ‘ఎలాగా ఈ రెండురోజులూ కదలకూడదుగా, వేయి పడగలు చదువుతాను వినండి’ అంది.వామ్మోయ్ ఈవిడ వదిలేటట్టు లేదురా బాబూ అనుకుని, పైగా వింటున్నానో లేదో చూడ్డానికి మధ్య మధ్యలో ప్రశ్నలోటీ.ఈ గొడవంతా ఎందుకనీ, నేనే ఏదో తిప్పలు పడతాలే, చదవకపోతే తిండి పెట్టడం మానేస్తే,అమ్మో, బయటకు కూడా వెళ్ళలేను!అని ఆ పుస్తకం చేతిలోకి తీసికున్నాను.

    అసలు ఈయన దేనిగురించి వ్రాసేరా అని తెలిసికోవాలని, పుస్తకం చివరిలో ఉన్న ‘ వేయి పడగలలోని అంతరార్ధం’తో మొదలెట్టాను. వహ్వా వహ్వా ఏం వివరణ అండీ, అసలు నాలాటి పామరులకు అర్ధం అవాలనే శ్రీ విశ్వనాథ వారు,1955 లో ఆ వ్యాసం వ్రాశారేమో అనిపించింది.ఈ ‘గృహనిర్భంధం’ టైములో వేయి పడగలు పూర్తి చేసేస్తాను. దేనికైనా రాసిపెట్టుండాలంటారు!
భవిష్యత్తులో ఎప్పుడైనా ఇలా ‘గృహ నిర్భంధాలు’ వస్తే ఇదో డ్రెస్ రిహార్సల్ గా ఉపయోగిస్తాయి !!

Advertisements

6 Responses

 1. రెండు గ్లాసుల మంచినీళ్ళు త్రాగి పైన కిల్లెర్ వేసుకుంటే నాకు తగ్గింది. మీరు ట్రై చెయ్యండి. దీనిలో పోయేదంటూ ఏమి లేదు నొప్పి తప్ప.

  Like

 2. అయ్యో ఫణి గారు,
  మీ నొప్పి తొందరగా తగ్గాలని అభిలషిస్తున్నాను. నొప్పి తగ్గినా, తగ్గకపోయినా ఆ కల్పవృక్షం ఖతం చేయండి. నేను రాత్రికి ఒక సారి ఫోన్ చేస్తాను.
  take care
  Ramu
  apmediakaburlu.blogspot.com

  Like

 3. మంచి నారేషన్! మీరు చాలా బాగా రాస్తారు! మీ టపా చదువుతూ కూర్చున్నాను.. మా అమ్మాయి స్కూల్ బస్ వచ్చేసింది.. పరుగు పరుగున వెళ్ళి షూస్ వేసి.. బస్ ని స్కూటర్ తో ఓవర్ టేక్ చేయాల్సి వచ్చింది ఇవ్వాళ్ళ

  వేయి పడగలు.. 3 సార్లు చదివాను.. మొదటి సారి 15-20 రోజులు పట్టింది.. కానీ.. చదువుతున్నకొద్దీ.. నచ్చుతుంది. నారీకేళ పాకం! మీకు తప్పక నచ్చుతుంది. ఇంకో రెండు రోజులు బెడ్ రెస్ట్ తీసుకునైనా సరే చదివేయండి 🙂

  కృష్ణప్రియ/

  Like

 4. రావుగారూ,

  నిన్న చేసిన వైద్యానికి తొంభై శాతం తగ్గినట్లే అనిపిస్తోంది !!

  Like

 5. రామూ,
  Thanks for your concern. వేయి పడగలు పూర్తిచేసే దాకా ఇంకేమీ చెయ్యను!

  Like

 6. కృష్ణప్రియా,

  వచ్చే రెండు రోజుల్లోనూ పూర్తిచేసేయగలననుకుంటున్నాను.మరీ నాబ్లాగ్గులు చదువుతూ,పాప స్కూలు బస్సు మిస్సైతే ఎలాగా?.బ్లాగ్గులు అవీ నాలాటివాడివి, కాలక్షేపం కోసం ఎప్పుడైనా చదువుకోవచ్చు. బస్సు మిస్సై,స్కూలుకి ఆలశ్యంగా వెళ్తే, అందరూ నన్ను తిట్టుకుంటారు తల్లీ !!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: