బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–సంచీలు


    మా చిన్నప్పుడు స్కూలుకెళ్ళాలంటే పుస్తకాలు ఓ సంచీ లో పెట్టి తీసికెళ్ళేవాళ్ళం.కాలేజీకొచ్చేసరికి ఆ అలవాటు మానుకుని స్టైలుగా చేతిలో ఒకటో రెండో నోట్ బుక్స్ పెట్టుకుని వెళ్ళడం.పాపం అమ్మాయిలుమాత్రం, ఒబ్బిడిగా ఓ నాలుగైదు పుస్తకాలు తెచ్చుకుని వచ్చేవారు.సంత సంచీ అని ఒకటుండేది,దాంట్లో సంత ( కూరగాయల మార్కెట్) కి వెళ్ళేమంటే, దాన్నిండా కూరలు వచ్చేవి.ఇప్పుడలా కాదుగా, ఎంత ఖర్చుపెట్టినా ఓ జేబిరుమాల్లో కట్టుకుని తెచ్చేసుకోవచ్చు.లేకపోయినా కొట్టువాళ్ళిచ్చే పాలిథీన్ బ్యాగ్గులో,కొన్న కూరలన్నీ కట్టుకుని తెచ్చేసుకోవచ్చు! ఏమైనా అంటే ఇన్ఫ్లేషనో అదేదో అంటారు.ఏది ఏమైనా సంతకి సంచీపుచ్చుకువెళ్ళే concept మాత్రం అటకెక్కేసింది! పాపం మా తరం వాళ్ళు ఇంకా మార్కెట్టుకి వెళ్ళేటప్పుడు ఓ సంచీ తీసికుని వెళ్తూంటారు.మార్కెట్నుంచి ఇంటికివచ్చేటప్పటికి, ఎండాకాలంలో ఎండిపోయిన నూతుల్లో నీళ్ళలాగ, కూరలెక్కడున్నాయో వెదుకుతూండాలి,! పైగా మా ఇంటావిడలాటివారు,’ అదేమిటండీ మరీ పావు పావే తెస్తే ఎలా సరిపోతాయీ అందరికీ’ అంటుంది.కిలోల్లో కొనే రోజులు కావు ఇప్పుడూ అన్నా కానీ నమ్మదు.ఎప్పుడో ఓసారి తనని కూరలు తెమ్మని పంపిస్తే తెలుస్తుంది!పైగా ఏమైనా అంటే వరంగాంలో ఉన్నప్పుడు నేనే కదా కూరలు తెచ్చేదాన్నీ అంటూ సాగతీస్తుంది.అది 1983 వ సంవత్సరమమ్మా, నెలకి 1000 రూపాయొలొచ్చినా హాయిగా బ్రతికేవాళ్ళం,ఇప్పుడు వేలకి వేలు పెన్షనొచ్చినా,కూరలూ అవీ ‘అలంకారార్ధం గంధం సమర్పయామి’ అన్నట్లుగా ఉంది.దేముడిని ఉత్తి గంధం పెట్టేసి, అదే అలంకారం అనుకో అంటే ఆయనూరుకోవడంలేదూ,అలాగే, మనం కూడా వెరైటీకి తలో నాలుగు కూరలూ తీసికోవడం,అన్నీ కలిపి ఓ పావో,అర్ధకిలో తూపించి, ఇంటికి తెచ్చి ఏ అవియల్లో ఏదో చేసికొని తినడం.అలా కూరలసంచీలు extinct అయిపోయాయి!

యాయివారం బ్రాహ్మలని ఉండేవారు,వాళ్ళు ఇంటింటికీ తిరిగి,ఆ ఇంటివాళ్ళిచ్చే బియ్యం అందులో పోసుకుని,కొంపకి చేరి కుటుంబసభ్యుల ఆకలి తీర్చేవారు.ఆరోజుల్లో బియ్యం లాటివి సమృధ్ధిగా
దొరికేవి కాబట్టి, ఎవరైనా యాచకులు వస్తె, వాళ్ళకి దానం చేస్తే పుణ్యం పురుషార్ధం అనుకునే వారు.ఆఖరికి ఏ కరివెపాకు కొనాలన్నా బియ్యం ఇస్తే ఇచ్చేవారు!ఏ దేముడు ఊరేగింపు పల్లకీయో వచ్చినప్పుడు కూడా, బియ్యం అవీ ఇచ్చేవారు. అలాగే స్వయంపాకం అని, బియ్యమూ,ఓ అరటికాయో ఇంకేదో కూర ఎవరోఒకరికి ఇచ్చేవారు! ఇప్పుడు అలాటివన్నీbeyond our means అయిపోయాయి!

పళ్ళపొడి పొట్లాలు ఓ జోలాసంచీ లో వేసికుని అమ్మడానికి తెచ్చేవారు.అందుకే ఇప్పటికీ మనం ఎప్పుడైనా అలాటి సంచీ భుజానికి వేళ్ళాడతీసికుంటే, ‘పళ్ళపొడి అమ్మేవాళ్ళాగ ఆ సంచీ ఏమిటీ’అంటూంటారు.కానీ ఆ సంచీలు మాత్రం బలే convenient గా ఉంటాయి. నేనూ చాలాకాలం వాటినే వాడేవాడిని.జేబుల్లో పెట్టుకుంటే ఎవడైనా కొట్టేస్తాడని, అన్నీ అందులోనే పెట్టుకుని వెళ్ళేవాడిని.ఆ సందర్భంలోనే, తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు క్యూ కంపార్ట్ మెంట్ లో వెళ్తూండగా, అలా భుజానికి వేళ్ళాడతీసికున్న, నా జోలా బ్యాగ్గు నీట్ గా కోసేసి,అందులో ఉన్న డబ్బూ దస్కం,టిక్కెట్ట్లూ కొట్టేసి ‘తిరుక్షవరం’ చేసేసిన తరువాత మళ్ళీ ఆ జోలా బ్యాగ్గు జోలికి పోలేదు!

ఆ తరువాత ఎప్పుడైనా ఇంటికి ( అమలాపురం)వెళ్తే తిరిగి వచ్చేటప్పుడు, ఇంట్లో కాసిన కొబ్బరికాయలు ఓ సిమెంటు బస్తాలో వేసి ఇచ్చేవారు.,b>తీసికెళ్ళకపోతే అదో సెంటిమెంటూ,ఈ మూటలన్నీ మోసుకుని,అమలాపురంనుండి పూనా దాకా వచ్చేటప్పటికి తడిపిమోపెడయ్యేది!అమలాపురం నుండి తణుకు (అత్తారిల్లు) దాకా బస్సులో రావడం, అక్కడ మళ్ళీ మామగారిచ్చిన ఇంకో బస్తా తీసికోవడం,ఇవన్నీ తీసికుని హైదరాబాద్ బస్సులో రావడం, అక్కడ బొంబే వెళ్ళే ట్రైనెక్కడం. ఆరోజుల్లో డైరెక్ట్ కొణార్క్ ఉండేదికాదు.క్రమక్రమంగా సిమెంటు బస్తాలు మానేసి, కొబ్బరికాయలన్నీ, ఓ పురికోసతాడుతో దబ్బనంతో గుచ్చి, వాటిని తెచ్చుకునేవాళ్ళం.

&nbsp  ఇప్పుడు ఎవర్ని చూసినా ఓ నైకీ బ్యాగ్గో, ఓ రిబాక్ బ్యాగ్గో వేళ్ళాడతీసికుని వెళ్ళడం.దానికి సాయం Laptop పెట్టుకోడానికో బ్యాగ్గూ! ఎన్ని చెప్పండి, ఆ రోజుల్లోని ‘కూరలసంచీ’ కి మాత్రం ఇవి ఏమాత్రం సరితూగలేవు!ఇంకో రకం ఉండేవండోయ్,ఇప్పటికీ అరవ్వాళ్ళు ( ఏం అనుకోకండి అలా అన్నానని,ఇప్పటికీ తమిళులు కొంతమంది,’తెనుంగా’అంటూ అదేదో హీనపక్షమన్నట్టుగా పిలుస్తూంటారు,అందుకనే నేను వాళ్ళని ఎప్పుడూ అరవ్వాళ్ళే అంటాను!) ఓ గుడ్డసంచీ యే పట్టుకుని తిరుగుతూంటారు. ఏక్ దం ట్రేడ్ మార్కు పసుప్పచ్చ సంచీ.దాన్ని చూడగానే ఇతను అరవ్వాడే అని తెలుసుకోవచ్చు! మరి మనం కూడా అలాటిదో పెట్టుకుంటే ఎంత బాగుంటుందో! పోన్లెండి అలాటివేవీ వద్దు, ఏ రంగు బ్యాగ్గు పెట్టుకుంటే ఆ పార్టీ అంటారు, ఇదో గోల మళ్ళీ!

ఇప్పుడు లేటెస్ట్-బ్యాక్ ప్యాక్కో అదేదోట! ఏ బస్సులో చూసినా వీపుమీద ఓ బస్తా తగిలించుకుని చూస్తూంటాము.బస్సుల్లో నిజం చెప్పాలంటే, ఓ పాతిక ముఫై మందిదాకా నుంచోవచ్చు. కానీ ఈ బ్యాక్ ప్యాక్కు ప్రాణుల ధర్మమా అని, అందులో సగం అంటే పది పదిహేను మందికంటే ఎక్కువ నుంచోలేకపోతున్నారు.కారణం,నుంచున్నవాడు బక్క పక్షి లా ఉన్నా, వాడు వీపుమీద తగిలించుకునే బ్యాగ్గు, ఇంకో మనిషి నుంచునేటంత స్థలం occupy చేస్తుంది. ఇక్కడ బస్సులో కండక్టర్ पुढॅ चला पुढॅ चला అంటూంటాడు,అంటే ముందుకు జరగండి అని. ఎక్కడకెళ్తాం నా నెత్తిమీదికి! చీమకుట్టినైనట్లేనా ఉండదు ఆ బ్యాక్ ప్యాక్కు వీరులకి.వాడి పనైపోయింది, ఇంకోళ్ళు ఏమైతేనేం! ఏ గంగలో దిగితేనే? కొంతమంది ప్రయాణాల్లో అలాటి బ్యాగ్గులు పెట్టుకుని వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది.కూలీలఖ్ఖర్లేకుండా,వీపుమీద పెట్టుకుని లాగించేయొచ్చు,కానీ మరీ బస్సుల్లో కూడా ఇలాగైతే ఎంత కష్టమండి బాబూ/

Advertisements

27 Responses

 1. Very well written sir. Superb flow.
  Cheers
  Ramu
  apmediakaburlu.blogspot.com

  Like

 2. కూరల సంచీలు extinct అయిపోయిన సంగతి బాగా రాశారు. ‘ఎక్కడకెళ్తాం నా నెత్తిమీదికి!’ లాంటి తెలుగు పలుకుబడులు చదువుతుంటే ప్రాణం లేచొచ్చినట్టనిపిస్తోంది. మీ పాత టపాలన్నీ వరసగా చదివెయ్యాలి.

  Like

 3. నిజమేనండీ… “చలా చలా ఫుడే.. చలా” అన్నప్పుడల్లా నేన కాళ్ళు ఒక్కసారి ఎత్తిదించి సోల్జర్ మార్చిచేసినట్టు మార్చిచేసేవాడిని బస్సులోవున్నప్పుడు.. ఎక్కడికని జరుగుతాం.. జరగటానికిఖాలీవుండదూ ఏడవదూ.. జరిగినట్టు ఏక్ట్ చెయ్యకపోతే కండక్టర్ సీరియస్ అయిపోతాడు.. 🙂

  ఇక సంచిల గొడవంటారా.. నేను మొహమాటంలేకుండా.. ఇప్పటికీ కూరలు కొనడంకోసం రత్నమ్స్ క్లాత్ షోరూమ్, తణుకు, పశ్చిమగోదావరి జిల్లా అని రాసున్న సంచినే తీసుకెళతాను… ఇలా అయినా ఫూణేలో తెలుగువాళ్ళు పరిచయం అవుతారని.. 🙂

  నాచిన్నప్పుడు స్కూలుబ్యాగులు ఎన్ని కొన్నా.. నెలరోజులు కూడా వచ్చేది కాదు… నేను జాగ్రత్తగానే వుంచేవాడినికానీ రిక్షావాడు.. పక్కనున్నఇనప రింగుకు వేళ్ళాడదీసి.. మొత్తం నాలుగురోజుల్లో చింపేసేవాడు..
  అప్పుడు నాకు ఒక కొత్త బ్యాగ్ వచ్చింది.. నాలుగునెళ్ళవరకూ చిరగనేలేదు.. దేంతో కుట్టించారో తెలుసా… టార్పాలిన్ గుడ్డంటారే.. దాంతో.. 🙂

  Like

  • >>> నేను మొహమాటంలేకుండా.. ఇప్పటికీ కూరలు కొనడంకోసం రత్నమ్స్ క్లాత్ షోరూమ్, తణుకు, పశ్చిమగోదావరి జిల్లా అని రాసున్న సంచినే తీసుకెళతాను

   అద్గది…శ్రీనివాసరాజు గారూ! పూనే “సబ్జీ మండీ” లో సగర్వంగా “సంచట్టి జైకొట్టు తెలుగోడా…గతమెంతొ ఘనకీర్తి కలవాడా” అని పాడకనే పాడుతున్నారన్నమాట! 😉

   భవదీయుడు,
   అబ్బులు

   Like

 4. హహహ…కూరల విషయం భలే రాసారండీ!
  అవియలూ, మిక్స్డ్ వెజెటబుల్ భాజీ(నార్తిండియన్ స్టయిల్) తెలుగు కలగలుపు పప్పూ
  ప్రస్తుతం ఇవే మధ్యతరగతి మెనూ,కనీసం రోజులు ఇలాగ వెళ్లదీయగలిగినా చాలు.
  చూస్తూంటే ‘ఆభరణార్ధం అక్షతాం సమర్పయామి” రోజులు కూడా ఎక్కువ దూరం లేవేమోననిపిస్తోంది.

  Like

 5. వేణు,

  ధన్యవాదాలు.చదివి అభిప్రాయం చెప్పండి.మరీ వ్యాఖ్జ్యలరూపంలో అఖ్ఖర్లేదు.ఏమైనా తిడితే అదో తంటా!ఓ మెయిల్ ‘కొట్టండి’. మరీ ఏకేసినా, ఊళ్ళోవాళ్ళందరికీ ఎందుకులెండి!!!

  Like

 6. శ్రీనివాసూ,
  ఏదో నేను వ్రాసేనుకదా అని,వ్రాయడం కానీ, ఓ టూ వీలరూ, ఓ ఫోర్ వీలరూ పెట్టుకుని బస్సుల్లో ఎప్పుడు వెళ్ళావమ్మా!! ఈ బస్సులూ అవీ నాలాటి అర్భక ప్రాణులకి.

  Like

 7. సాహితీ,

  ఆ రోజూ దగ్గరలోనే ఉంది!

  Like

 8. మీ బ్లాగు పేరు “కాదేదీ బ్లాగుకనర్హం” అని పెడితే బాగుంటుంది ఫణిబాబుగారూ! ఎవ్వరూ ఊహించని చాలా సామాన్యమైన విషయాలని తీసుకుని, వాటి గురించి చాలా చక్కగా రాస్తారు మీరు. నేను ఇండియా వచ్చినప్పుడల్లా “సంత” సంచితో కూరగాయలు కొనుక్కుని రావడం నాకు చాలా ఇష్టం. నాకు చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఇంకోరకం సంచి ఉండేది. దేనితో కుట్టించారనుకున్నారు మా అమ్మగారు? చిరిగిపోయిన మడతమంచం గుడ్డతో!!!

  భవదీయుడు
  అబ్బులు

  Like

 9. అబ్బబ్బబ్బ! ఎంత బ్యూటిఫుల్ గా రాశారండీ!ఆవకాయ రోజుల్లో అమ్మ దగ్గరికెళితే వెళ్తే ఒక ఒక పాత టార్పాలిన్ గుడ్డతో కుట్టిన సంచీలో జాడిలు పెట్టి పాక్ చేసేది. ఆ సంచి గుర్తొస్తే ఒళ్ళు జల్దరిస్తుంది.

  “ఈ తుక్కు సంచీ నాకొద్దు!” అంటే అమ్మ అగ్గిరాముడైపోయేది. “పళ్ళు రాలగడతాను యావనుకున్నావో, నిక్షేపంలాంటి సంచీ అయితే తీసుకెళ్ళడానికేం రోగం? వెధవ స్టైల్స్ పడ్డారంటే పొయి లో చెమడాలెక్కదీస్తాను”అనేది.

  ఆ సంచీ ఎవరైనా చూస్తారేమో అని అవమానం!

  శ్రీనివాస్ రాజు గారూ,
  మీ అయిడియా బావుంది. దీన్ని నేను గుర్గావ్ లో ఉన్నరోజుల్లో అమల్లో పెట్టేదాన్ని! చందనా బ్రదర్స్, పాత బస్టాండ్ రోడ్డు, గుంటూరు ముద్ర ఉన్న కర్రల సంచీ పట్టుకెళ్ళేదాన్ని!

  గుర్గావ్ మార్కెట్లో ఈ సంచీతో వెళ్తుంటే అక్కడివాళ్ళు “మదరాసీ హో?”అనడిగితే భలే మండేది! “మదరాసీని కాదు, హైద్రాబాదీనీ, ఆంధ్రా వాలీని”అని చెప్దామనిపించేది. ఈ నార్త్ వాళ్ళకి సౌత్ వాళ్ళంతా మదరాసీలే, ఆవేశపడకు అని మా వారు చెప్పాక శాంతించాను.

  Like

 10. గురువుగారు..
  ఇప్పుడిప్పుడు ప్యాంటలేసుకున్నాంగానీ… మొన్నటివరకూ.. నిక్కర్లు.. చెప్పులు వేసుకుని.. ఎర్రబస్సులెక్కి తిరిగినోళ్ళమేనండీ.. ముంబయిలో రెండేళ్ళు.. పూణేలో ఆరునెళ్ళు బస్సులో తిరిగానండి.. ఆ తరువాత టూవీలర్. ఫోర్ వీలర్ వచ్చాయిగానీ.. :), అంటేమీరు చూసినప్పుడు అవున్నాయి కాబట్టి “బార్న్ విత్ గోల్డన్ స్పూన్” అనుకోకండి.. :).

  @అబ్బులు గారు
  ఏం చేస్తామండీ.. పరాయిరాష్ట్రం వస్తేనేగానీ తెలియలేదు తెలుగువిలువ అని బాధపడాలో.. లేక మీరన్నట్టు “సంచట్టి జైకొట్టు తెలుగోడా…గతమెంతొ ఘనకీర్తి కలవాడా” అని పాడుకుంటూ నే తెలుగువాడినని గర్వపడాలో తెలియటంలేదు.. 🙂

  @సుజాత గారు
  ఇక్కడా వుంది ఆ గొడవ.., కానీ మదరాసీ.. కన్నా మళ్యాలీ.. అని ఎక్కవంటారు.., ఇక్కడ కరళవాళ్ళు ఎక్కువేవున్నారు. ఏదో జోక్ చెప్పినట్టు.. చంద్రమండలంమీదకెళ్ళినా మద్రారాసీ ఛాయ్ దుకాణంపెట్టి ఛాయ్ అమ్ముతున్నాడంట.. అలాగ.. తమిళులు.. మళయాలీలు లేని చోటెక్కడుందిలేండి..

  Like

 11. సంచీ .. నా ఫేవరెట్ టాపిక్. వివిధ సంచుల్తో నా అనుబంధాన్ని నేనూ రాస్తా త్వరలో! ఫణిబాబుగారూ, ఇన్స్పిరేషన్‌కి నెనర్లు!

  Like

 12. అబ్బులూ,

  ఇందులో ఘనకార్యం ఏమీ లేదు.అదేదో ‘Idle man’s brain-devil’s workshop లాగ పనేం లేక వ్రాసే వ్రాతలివి!

  Like

 13. సుజాత,

  మాకు కొబ్బరికాయలు సిమెంటు బస్తాల్లో పెట్టి ఇచ్చినప్పుడు,మేము కూడా సణుక్కుంటే,మా నాన్నగారు కూడా అలాగే అనేవారు (మరీ అంతలా కాదు,ఎందుకంటే కోడలు ముందర తిడితే కొడుకు మరీ చులకనైపోతాడని!)

  Like

 14. శ్రీనివాసూ,

  కార్తిక్ మాత్రం Born with silverspoon కనుక, ఇలాటి సంచీలు(కర్రల సంచీలు, మడతమంచం గుడ్డల సంచీలు) అలవాటు చెయ్యకు !!

  Like

 15. కొత్తపాళీ,

  మీలాటి పెద్ద రచయితల్ని inspire చేయకలిగానంటే, అబ్బో !!!

  Like

 16. చాలా బావుంది బాబాయి.
  మా తాతయ్యగారింటికి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే వొలిచిన కొబ్బరికాయలు ఒక డజన్, ఊరగాయ్ జాడీలు నూని కారకుండా చక్కగా సీల్ చెసినవి, పెసలు, పొట్టు మినప్పప్పు మూటలు…ఇలా ఏమిటెమిటో మాతో పాటూ ట్రైన్ ఎక్కించే వారు. నగరాల్లో ఖరీదెక్కువ ఊళ్ళోవైతే మన పంటే కదా అని ఒక సెంటిమెంటు ఉండేది వాళ్ళకి.
  మా నాన్నగారు, అదే, మడతమంచం గుడ్డ సంచీలో కూరలు తెచ్చేవారు మేము కాలెజీకి వెళ్ళేవరకూ కూడా…చిన్నప్పుడైతే నేను కూరలు సద్దుతూ ‘కూరలమ్మీ ఆట ఆడుకునే దాన్ని…
  ఆ రొజులే హాయనిపిస్తుంది అప్పుడప్పుడు….

  Like

 17. ఫణి గారు,
  మీ పోస్టులు చదువుతుంటే…మా గురువు గారు బూదరాజు గారు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ‘మనం రాస్తే…చదవరికి ప్రాణం లేచి రావాలి. ప్రవాహం లా వుండాలి,’ అని ఆయన అనే వారు.
  ఇవన్నీ చదివి…చదివి…మిమ్మల్ని కలిసాక, ఆ తర్వాత మీ పోస్టులు చదివాక మిమ్మల్ని “సార్…” అనబుద్ది కావడం లేదు. ఇక నుంచి మీరు నాకు ‘బాబాయ్ గారు…” మీరు ఒప్పుకుంటే సంతోషం. లేకపోతే…మీ బాధ మీది.
  రాము

  Like

 18. హ హ హ చిన్నప్పుడు నాకు బడికి తీసుకెళ్లడానికి సంచీ యే ఉండేది. నా తరగతిలో పిల్లలు కొందరు పెట్టెలు తెచ్చుకుంటూ ఉంటే చూసి ఆ పెట్టె కావాలి కొనమని ఏడ్చేదాన్ని. కానీ అదేమిటో మా నాన్నాగారు ఎప్పుడూ సంచీయే కొనేవారు. ఆ గుడ్డ సంచీలోనే అన్ని పుస్తకలూ మోసుకుని వెళ్ళేదాన్ని.

  మేము డిల్లీ లో కూరగాయలకి చందనా బ్రదర్స్ విజయనగరం అని రాసున్న కర్రల సంచీయే పట్తుకెళతామండీ. మొన్న సొమవారమే కూరల బరువు మొయ్యలేక మధ్యలో ఆ కర్రలు విరిగిపోతే “J.K. సిల్క్స్ విజయనగరం” కర్రల సంచి తీసా పెట్లోంచి బయటికి. వచ్చే సోమవారం అదే మా కూరలు మోయబోతున్నాది.

  Like

  • > సొమవారమే కూరల బరువు మొయ్యలేక మధ్యలో ఆ కర్రలు విరిగిపోతే
   > వచ్చే సోమవారం అదే మా కూరలు మోయబోతున్నాది
   > ఈ సారి సంచీ కర్రలు అంత తొందరగా విరగవులే.మార్కెట్ లో సంచీ నిండేంత కూరలెక్కడొస్తున్నాయీ,
   ఈసారి కూడా ఆ కూరల బరువు మొయ్యలేక ఆ సంచి కర్రలు విరిగితే, incometax వాళ్ళు మీ ఇంటిమీద raiding చేస్తారేమో?

   Like

 19. ఏరియన్,

  పాతరోజులెప్పుడూ బాగానే ఉంటాయి.

  Like

 20. రామూ,

  తిట్టకుండా ఎలా పిలిచికున్నా సరే.నిన్న సుజాత ఫొను చేసినప్పుడు కూడా ‘బాబాయ్’ అన్నారు.మరీ విజయవాడలోని ‘బాబాయ్ హొటల్’ పెట్టమనకుండా ఉంటే చాలు.అంత స్థోమత లేదు!!

  Like

 21. సౌమ్యా,

  ఈ సారి సంచీ కర్రలు అంత తొందరగా విరగవులే.మార్కెట్ లో సంచీ నిండేంత కూరలెక్కడొస్తున్నాయీ, మరీ చిత్రం కాపోతే !!!

  Like

 22. పాని పూరి,

  ఈ మధ్యన ఇన్కం టాక్స్ లో శ్లాబ్బులు పెరిగాయి. మరీ అంత గొడవుండకపోవచ్చు!!

  Like

 23. అంటే కూరలొక్కటే కాదండీ, పళ్ళు, కొబ్బరి కాయలు అవీ ఇవీ అన్ని ఉంటాయి కదా..అందుకని సంచీ బరువెక్కింది….ఒక్క పెద్ద పుచ్చకాయ వేస్తే చాలదూ కర్రలు విరగడానికి 🙂

  Like

 24. సౌమ్యా,

  కర్రలు విరక్కొట్టి ఇంకో కర్రల సంచీ తీయాలని అంత determined effort పెట్టాలనే ఉంటే, all the best !!!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: