బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– వర్షాలొచ్చేశాయి !!!


    వర్షాలు మొదలెట్టడం,స్కూళ్ళు తెరవడం అదేమిటో ఎప్పుడూ ఒకేసారి మొదలౌతాయి.ప్రొద్దుటే 4-5 సంవత్సరాల పిల్లల దగ్గరనుండీ, పాపం రెయిన్ కోట్లు చుట్టబెట్టుకుని ఆ వర్షంలో
వెళ్తూంటే చాలా జాలి వేస్తుంది.ఈ రోజుల్లో అంత చిన్న వయస్సునుండీ స్కూళ్ళకి పంపకపోతే, ఆ తరువాత కష్టం అయిపోతుంది.

    ఈ వర్షాలు కూడా ప్రొద్దుటే స్కూలు మొదలెట్టే టైముకీ, మధ్యాన్నం/సాయంత్రం స్కూలు విడిచే సమయానికే వస్తూంటాయి! ఆ పిల్లలు ఇంటికి క్షేమంగా చేరేదాకా తల్లితండ్రులకి టెన్షనే.
కానీ ఏమీ చేయలేని పరిస్థితి.ఇవన్నీ చూస్తూంటే మేము ఎంత అదృష్టవంతులమో అనిపిస్తూంటుంది.మా రోజుల్లో మరీ ఇంత చిన్న వయస్సులో స్కూళ్ళకి పంపలేదు.గట్టిగా వర్షం వస్తే స్కూలు బందు చేసేవారు. స్కూలు జరుగుతున్న టైములో వస్తే ‘కంటిన్యూ’ చేసేవారు.ఇంటర్వెల్ లేకుండా, ఇంకో రెండు గంటలు కూర్చోపెట్టి, పెందరాళే అంటే ఏ రెండింటికో ఇళ్ళకు పంపించేసేవారు. హాయిగా ఉండేది.

    మా పిల్లలైతే ఈ కాన్వెంటులూ గొడవా లేకుండానే, కేంద్రీయ విద్యాలయాల్లో( అది కూడా మా క్వార్టర్ కి ఎదురుగా ఉండేది) లాగించేశారు.కానీ వాళ్ళిద్దరూ, వాళ్ళ పిల్లల్ని స్కూలుకి పంపడానికి చేసే కసరత్తులు చూస్తూంటే, ఏం చేయాలో తెలియడంలేదు.ప్రొద్దుటే 7.30 కి స్కూలు బస్సొచ్చేస్తుంది. టైముకి పంపడానికి వీళ్ళు పడే తిప్పలు చూస్తూంటే,నేను నా విషయంలో కానీ,మా పిల్లల విషయంలో కానీ అసలు కష్టపడ్డట్టే లేదు!

    ఈ వర్షాల్లో యూనిఫారంలు ఎన్ని జతలున్నా సరిపోవు.వాటిని ఉతికి ఆరేయడం,నెక్స్ట్ టు ఇంపాసిబుల్. పెద్ద పిల్లలైతే కొంచెం బాధ్యతతో ఉంటారు. చిన్నవాళ్ళు లోయర్ కేజీ నుండి,తర్డ్ క్లాసు వరకూ ఉండే పిల్లలతో పడే కష్టాలు పగవాడిక్కూడా ఉండకూడదనిపిస్తుంది. రైన్ కోట్లు ఇచ్చినా సరే, వాటిని వేసికోకుండా వర్షంలో తడవడమే వాళ్ళ జన్మహక్కనుకుంటారు. పైగా వీలుంటే ఆ రైన్ కోటు ని స్కూల్లోనో, బస్సులోనో డెలిబరేట్ గా మర్చిపోవడం ఒకటీ.ఇది పోతే మమ్మీ డాడీ కొత్తది కొంటారులే అని ఓ భరోసా! పైగా ఈ వర్షాల్లో చిన్న పిల్లలకి తప్పకుండా ఈ జలుబో, దగ్గో రాకుండా ఉండదు. డాక్టర్లకి ఈ వర్షాకాలం ఓ వరం లాటిది.

    ఏడాది కి కావలిసినంత నీరూ, నదుల్లోకీ, డాముల్లోకీ ఎలా సమకూర్చుకుంటామో, అలాగ ఈ డాక్టర్లు కూడా ఏడాది పొడుగునా సంపాదించేదానికన్నా, ఈ వర్షాకాలంలోనే మేక్ అప్ చేసేస్తూంటారు.ఇంటికి ఎంతమంది పిల్లలుంటే డాక్టర్లకి అంత ఆనందం.ఒక పిల్లకి వచ్చిన సమస్య ఇంకోళ్ళకి రాదు, పోనీ ఆ పిల్లకో పిల్లాడికో వచ్చినప్పుడు ఇచ్చిన మెడిసిన్, ఈ రెండో వాడికి ఇద్దామనుకుంటే, ఆ డాక్టరు ఒప్పుకోడు.పైగా సెల్ఫ్ మెడికేషన్ వల్ల వచ్చే నష్టాలమీద ఓ క్లాసు తీసికుంటాడు. ఇంతా చేసి, ఆ వర్షంలో తీసికెళ్ళినా, ఇంకో కంపెనీది అదే యాంటీ బయాటిక్క్ వ్రాసి, 100 రూపాయలూ వసూలు చేస్తాడు!

    ఈ వర్షాకాలంలో బస్సుల్లో చూడాలి, గొడుగులు తడిసిపోయి, నీళ్ళు కారుతూ ఉంటాయి.వీళ్ళ ధర్మమా అని, పొడిగా ఉన్నవాళ్ళు తడైపోతారు.బస్సుల్లో కిటికీ గ్లాసులు ఛస్తే క్రిందికి దిగవు.దాంతో, సీట్లన్నీ తడిసిపోతూంటాయి. మన వైపు ‘పల్లెవెలుగు’ బస్సులు అయితే, ఇంక చెప్పఖ్ఖర్లేదు.లోపలకి వర్షంనీళ్ళు కారుతూనే ఉంటాయి.
ఆఫీసుల్లోనూ, దుకాణాల్లోనూ, గొడుగులు బయటే పెట్టి రమ్మంటారు. ఎవడెక్కడ ఎత్తుకుపోతాడనే భయమే. ఇంక రైతుబజార్లకీ, సంత లకీ వెళ్ళేటప్పుడైతే, ఏదో ఓ కొట్లో మర్చిపోయే ఆస్కారం ఎక్కువ.

   ఇంక ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళని సోఫాల్లో కూర్చోమనాలంటే, అవి ఎక్కడ పాడైపోతాయో అని భయం.అన్నిటిలోకి, ఇంటికి వచ్చే పనిమనుషులతో వస్తుంది.చాలా మంది
గొడుగుల్లేకుండానే వస్తారు. ఆ పనిమనిషి వర్షంలో వెళ్తే ఏ రోగమో వచ్చి మర్నాడు రాదేమో అనే భయం తో, ఇంట్లో ఉన్న గొడుగు, దానికిస్తాము.మన అదృష్టమ్ బాగుందా, మర్నాడు వర్షం వస్తుంది, ఆ గొడుగూ తిరిగి చూసే భాగ్యం ఉంటుంది.

    వర్షాల్లొ మాత్రం చిన్నప్పటి జ్ఞాపకాలు పుంఖానుపుంఖంగా వచ్చేస్తూంటాయి.ఇప్పటిలా అగ్గిపెట్టెల్లాటి ఎపార్ట్మెంట్లు కాదుగా, ఇంటికి ఎదురుగా పెద్ద స్థలం,వెనక్కాల పెరడుతోటీ కలకలలాడుతూండేవి. పేద్ద వర్షం వచ్చిందంటే చాలు,మోకాలు లోతు నీళ్ళతో నిండిపోయేవి. ఆ నీళ్ళల్లో కాగితపు పడవలు చేసికుని ఆడుకోడం ఎంత బాగుండేదో. వర్షాకాలంలో, జలగల గొడవ
ఒకటి. ఆవులకీ, గేదెలకీ పొదుగులకి పట్టేసేవి.ఒక్కోప్పుడు మనల్ని కూడా పట్టుకునేవనుకోండి. నూతుల్లో నీళ్ళు ఎంతో పైకి వచ్చేసేవి. ఈ రోజుల్లో నూతులేలేవు.ఇంక నీళ్ళెక్కడినుండి వస్తాయి?.

   అయినా ఆరోజుల్లో వర్షాలుకూడా టైముకే వచ్చేవి. ఇప్పుడో ‘అదేదో గ్లోబల్ వార్మింగ్’ ధర్మమా అని వర్షాలూ, అప్పుడప్పుడు డుమ్మా కొట్టేస్తూంటాయి. చాలా మందికి ఈ వర్షాకాలం చాలా రొమాంటిక్ గా ఉంటుంది.బయట హోరున వర్షం పడుతూంటే,వేడీ వేడిగా చాయ్ త్రాగుతూ….ఇవన్నీ ఆరోజుల్లో ఉండేవి. ఇప్పుడో వర్షం వచ్చినా ప్రళయం వచ్చినా ఆఫీసులనుండి, ట్రాఫిక్ జాం లలో చిక్కుకుని, ఏ అర్ధరాత్రికో కొంపకు చేరేసరికి బాస్సు దగ్గరనుండి ఫోనూ, అదేదొ ప్రాజెక్ట్ ఏమయిందీ అంటూ- దేనికైనా రాసిపెట్టుండాలండి బాబూ.….

Advertisements

2 Responses

  1. మా చిన్నప్పుడు వర్షం అంటే చక్కగా స్కూలు ఎగ్గొట్టేసి కాగితం పడవలువేసుకుని ఆడుకోవచ్చు అనే ఆనందం ఉండేది.. ఇప్పుడు మీరన్నట్టు వర్షం వస్తుందంటే ఎక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేయవోనని టెన్సన్…. అవిపనిచేయకపోతే.. అంతే సంగతీ ట్రాఫిక్లో ఎవడు ఎటువెళతాడో తెలియని పరిస్ధితి….రెయిన్ కోటువేసుకుని తడుస్తూ టూవీలర్ పై ఆ ట్రాఫిక్ జామ్లో నరకమే.., ఫోర్ వీలర్ లో వద్దాం అంటే.. నాలుగైదు గంటలు ప్రయాణమే సరిపోతుంది…, అంత ఫేషెన్స్ చాలా కష్టం.

    ఏమాటకామాటే చెప్పుకోవాలి.. ఫూణే వర్షాల్లో ఉన్న అందం ఎక్కడా వుండదండీ… ఇక్కడ బీచ్ ఒకటే తక్కువ అంతే.. ముంబయిలో వున్నప్పుడైతే ఈ వర్షంరోజుల్లో జూహూ బీచ్ కి వెళ్ళేవాళ్ళం తడవటానికి.. 🙂 , ఇప్పుడు మేనేజర్ని.. డాక్టర్నీ కాసేపు పక్కనపెట్టేస్తే.. ఎంతైనా వర్షంలో తడవటం ఆ ఆనందమే వేరు..

    Like

  2. శ్రీనివాసూ,
    మరీ ఎక్కువ తడవకు! రేపు కార్తీక్ వర్షంలో తడుస్తానంటే కష్టం.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: