బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-ఒప్పుకోవలసిన నిజాలు-2


   నేను నిన్న వ్రాసిన పోస్టు వలన కొంతమంది అపార్ధం చెసికున్నట్లు కనిపించింది.అవన్నీ మా ఇంట్లో జరుగుతున్న నా అనుభవాలు కాదండి బాబూ. హైదరాబాదునుండి వస్తున్నప్పుడు, నేను ఓ పెద్దాయనతో చెసిన సంభాషణలొని విషయాలు అని గమనించాలి దయచేసి. ఆయన తన వయస్సునుబట్టి ప్రపంచంలో చాలామంది ఇళ్ళల్లో, అదీ భార్యాభర్తలు కాక అత్తమామలైనా,తల్లితండ్రులైనా వారితో కలసి ఉండేటప్పుడు జరిగే విషయాలు.

ఇదివరకటిరోజుల్లో ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నప్పుడు, ఇంటి పెద్ద మాటే చెల్లేది.కారణాలు ఎన్నో కావచ్చు.మొదటిది, ఆ రోజుల్లో పెద్దవారంటే ఉండే గౌరవం కావచ్చు. ఆస్ఠి అంతా ఆ పెద్దాయనపెరునే ఉండిఉండొచ్చు.ఊరికే దెబ్బలాటలు పెట్టుకుంటే, ఆస్థి ఇవ్వరేమో అనే భయం అవొచ్చు.అప్పుడైనా ‘అండర్ కరెంట్స్’ ఉండేవి.ఓ కొడుకు బాగా సంపాదించేవాడయుండొచ్చు,ఇంకోడు సామాన్య ఉద్యోగి అయిఉండొచ్చు. ఓ కోడలు పేద్ద కట్నంతో వచ్చుండొచ్చు,ఇంకో కోడలు సామాన్య కుటుంబంలోంచి వచ్చుండొచ్చు.

కాలక్రమేణా రోజులు మారేకొద్దీ, ఎవరి కాపురాలు వాళ్ళు పెట్టుకున్న తరువాత అందరూ సుఖపడ్డారు. విడిగా ఉండడంలో ఉన్న సదుపాయాలు ఇటు తండ్రులకీ తెలిసింది, అటు కొడుకులకీ తెలిసింది.ఎవరి స్పేస్ వారికున్నప్పుడే అందరికీ హాయి. గ్రౌండ్ రియాలిటీస్ అర్ధం చేసికున్నంత కాలం, ఎవరు ఎక్కడున్నా ఒక్కటే. ఊరికే సొసైటీ కోసం ‘ఉమ్మడికుటుంబం’ లో ఉండి బి.పీ లు పెంచుకోవడంకన్నా విడివిడిగా ఉంటే, వారానికో,పదిహెను రోజులకో కలిసినప్పుడు, ఆత్మీయంగా ఉంటారు.మనవలూ,మనవరాళ్ళూ తాతయ్యా అంటూ పలకరిస్తారు.

అలాగని పిల్లలు అంటే కొడుకులూ,కూతుళ్ళూ రాక్షసులనీ, పెద్దవాళ్ళంటే గౌరవం లెనివారనీ కాదు. వారి కష్టాలు వారికీ ఉన్నాయి.ఉదాహరణకి ఇంట్లో చదువుకునే పిల్లలున్నాసరే, వారి వారి కార్యక్రమాలకి అడ్డుండకూడదు.టైమయ్యేసరికి
టి.వీ ముందర సెటిల్ అయిపోతారు.అందులో కథ ఎంతదాకా వచ్చిందో తెలిసికోకపోతే నిద్ర పట్టదు. పోనీ మర్నాడు పిల్లలు స్కూలుకి వెళ్ళిన తరువాత తీరికగా చూడొచ్చు కదా.కొడుకు ఇల్లూ, తమకి అధికారం ఉందీ అనే అనుకుంటారు. పిల్లలు చదువు మానేసి మామ్మ, తాతయ్యలతో టి.వి. చూస్తూకూర్చుంటానంటే ఎలా కుదురుతుందీ? అసలు గొడవలన్నీ ఈ టి.వీ ల వల్లే వస్తున్నాయి.పిల్లలకి కార్టూన్లూ, పెద్దవాళ్ళకి సీరియల్సూ, పెద్దాయనకి న్యూసూ కావాలి. మరి ఒకే ఇంటిలో ఇన్ని రకరకాల చాయిస్ లు అయితే, అక్కడ కొట్టుకోకుండా ఉంటారని ఎలా అనుకుంటాము?మరి కోడలుకి చిర్రెత్తిందంటే చిర్రెత్తదూ? ఈ పెద్దాళ్ళు మహా ఉంటే ఇంకో పదిహేనేళ్ళుంటారు, పిల్లల భవిష్యత్తు తల్లేకదా చూసుకునేది.

ఇంట్లో పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిందనుకోండి, ఈ పెద్దాళ్ళు తమకి తెలిసున్న కషాయాలూ, రసాలూ వాడితే చాలని ఊదరకొట్టేస్తూంటారు. పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అంటే ఎలాగ? వీళ్ళని నమ్ముకుని, డాక్టరు దగ్గరకు తీసుకెళ్ళకపోతే అంతే సంగతులు! ఈ మాత్రం తెలియదనుకోవడానికి వీల్లేదు, వాళ్ళ పెద్దరికం చూపించుకోడానికి ఉచిత సలహాలిచ్చేస్తూంటారు. పోనీ అలాగని వాళ్ళకేమైనా వచ్చిందంటే, డాక్టరుదగ్గరకు తీసికెళ్ళేదాకా ఇల్లు పీకి పందిరేసేస్తారు, అప్పుడు రసాలూ,కషాయాలూ మర్చిపోతారు, ‘తమదాకా వస్తే’ రూల్స్ మారిపోతాయి. పైగా ఎన్ని టెస్టులు చేయిస్తే అంత బాగా చూసుకున్నట్లు!లేదూ, ‘ మావాడికి పాపం వైద్యం చేయించాలనే ఉంటుంది, కానీ మా కోడలు సాగనివ్వదు’అంటూ అడిగినవాళ్ళకీ, అడగనివాళ్ళకీ చెప్పుకొస్తారు. కూతురు కూడా అదే ఊళ్ళో ఉంటే ఇంకా కాలక్షేపం!

ఈ రోజుల్లో నగరాల్లో అయినా పట్టణాల్లో అయినా, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తే, పిల్లలకి మంచి చదువులు చెప్పించొచ్చు,అన్ని సదుపాయాలూ సమకూర్చుకోవచ్చు. కోడలు ఉద్యోగానికి వెళ్తానంటే, ముందర అబ్జెక్షన్ పెట్టేది అత్తగారే!
‘నాకు ఓపిక లేదమ్మోయ్, నీ పిల్లల్ని చూడ్డానికి’ అని ఖరాఖండీగా చెప్పిన వారిని చూశాము.వీళ్ళు అవసరానికి పిల్లలకి ఉపయోగించకపోతే, వాళ్ళేదో వీళ్ళని చూడ్డంలేదూ అని ఏడవడం దేనికో? పోనీ అని పిల్లల్ని ఏ క్రెచ్ లోనో పెట్టి,ఉద్యోగానికి వెళ్ళడానికే డిసైడ్ అయిందా, ఇంక చూసుకోండి, ఈ అత్తగారనే ప్రాణి,తనకి వీలైనన్ని రకాల ‘థర్డ్ డిగ్రీ మెథడ్సూ’ ఉపయోగిస్తుంది.సాయంత్రం కోడలొచ్చేసరికి, ఓ గిన్నెతో అన్నం వండి, ఏ వేపుడో చేస్తే ఈవిడ సొమ్మేంపోదు,
అయినా సరే, తనకేం పట్టనట్లే కూర్చుంటుంది.అలాటి అత్తగార్లని ఛాన్సొస్తే ఏ కోడలు వదుల్తుందీ?ఇంట్లో ఉన్న మామగారు ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ తనకే తెలిసున్నట్లూ,అసలు తన సలహా లేనిదే, గ్రహాలు గతి తప్పుతాయన్నట్లూ ప్రవర్తిస్తారు.అడిగినా అడక్కపోయినా ఉచిత సలహాలు ఇచ్చేస్తూంటారు.ప్రస్తుత ప్రపంచం,తన రోజుల్లాలెదని ఓమారు జ్ఞాపకం చేసికుంటే ఎవరికీ ఏ సమస్యా ఉండదు. ఏదో ‘ ఆయనే ఉంటే…..’అన్నట్లు ఆమాత్రం ‘సంఝోతా’ ఉంటే ఈ గొడవలన్నీ ఎందుకు వస్తాయి?

కలిసే ఉండవలసిన పరిస్థితే వస్తే,ఎవరైనా అడిగితేనే కానీ సలహా ఇవ్వకూడదు. జరిగేవి జరక్క మానవు, ఊరికే కంఠ శోష తప్ప ఒరిగేదేదీ లేదు.ఎవరి పిల్లల్ని ఎలా పెంచుకోవాలో వాళ్ళకే వదిలేస్తే ఎంతో హాయి.మన పిల్లల్ని మనక్కావలిసిన పధ్ధతిలోనే పెంచుకున్నప్పుడు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళేం చేసికుంటే వీళ్ళకెందుకంట?

అందుకనే నేను నిన్న వ్రాసిన బ్లాగ్గులో మొదట్లోనే చెప్పాను- ఎవరి దృష్టికోణాన్ని బట్టి వారు ఆలోచిస్తారు.ఇలాటివాటికి పుస్తకాలు చదివితేనూ, బ్లాగ్గులు చదివితేనూ, కౌన్సెలింగులకి వెళ్తేనూ సొల్యూషన్సు రావు. వీధిన పడకూడదనుకుంటారా
హాయిగా విడివిడిగా ఉండాలి.అంతేకానీ, ఎదో పాయింటు ప్రూవ్ చేద్దామని కలిసే ఉండడానికి ప్రయత్నిస్తే ఎప్పుడో ఒకప్పుడు చిన చిన్న అపార్ధాలు తప్పవు. అలాగని ఒకే ఊళ్ళో, పిల్లలోచోటా, తల్లితండ్రులోచోటా ఉంటున్నారంటే వాళ్ళకేదో గొడవొచ్చిందనికాదు. దీన్ని ‘ ప్రివెంటివ్ మైంటెనెన్స్’ అంటారు.

Advertisements

12 Responses

 1. అవి మీ అనుభవాలు అనుకోలేదులెండి. కాని మీరు “పార్ట్ వన్” అని పెట్టకపోయేసరికి ఇంకా కధనం ఉందని తెలియక తొందరపడ్డాను. ఇవ్వాళ్ళ మీరు వ్రాసినది బావుంది…అన్ని కొణాలూ స్ప్రుసించారు. కనుక సంపూర్ణంగా అనిపించింది.

  భలే! మీరు రొజుకో టపా రాసేస్తారే. 🙂

  Like

 2. ఏరియన్,

  పార్ట్ 1 అని పెట్టకపోవడంవలన వచ్చిన చిక్కు ఇది. ఎనీవే నా బ్లాగ్గు నచ్చినందుకు సంతోషం. పని ఏమీలేదుగా మాకు( అంటే నాకూ, మా ఇంటావిడకూ!), ఎవరైనా శుభకార్యాలకి పిలిస్తే వెళ్ళడం, లేకపోతే ఇదిగో ఇలా రోజుకో బ్లాగ్గు వ్రాసుకోవడం. ఖర్చులేని హాబీ! ఊరికే మాట్లాడుతూంటే వినడానికి ఓపిక ఎక్కడుంటుందీరోజుల్లో, ఇలా వ్రాసుకుంటూంటే, చదివే వాళ్ళు చదువుతారు, లేకపోతే లేదు!

  Like

 3. బాగా చెప్పారు :).మీ ప్రెవెంటివ్ మెయింటినెన్స్ ఐడియా ని నేనూ సమర్ధిస్తాను.ఎవరికీ ఇబ్బంది ఉండదు,రిలేషనూ బాగుంటుంది. నాకు తెలిసిన ఒకళ్ళు ఇదే పద్ధతి పాటిస్తోంటే “శ్రేయోభిలాషులు” ఆ అత్త,కోడలి దగ్గర విశ్వప్రయత్నం చేస్తున్నారు వారి మధ్య విభేదాలున్నాయేమో అని తెలుసుకోవడానికి.

  Like

 4. రిషీ,(ఋషీ?),

  ‘శ్రేయోభిలాషులు’ ( సెల్ఫ్ స్టైల్డ్) మనకి ఎప్పుడూ తగులుతూనే ఉంటారు. టు హెల్ విత్ దెం అనుకోవడం, మన పనిఎదో మనం చేసికోవడం. ఇంట్లో వాళ్ళందరూ బాగానే ఉంటారు.వచ్చిన గొడవల్లా ఈ పక్షుల వల్లే.

  Like

 5. మీ టపాలు, విశ్లేషణలు బాగుంటాయి. ఎంతైనా అనుభవం నేర్పిన పాఠం కాదా. మీ పద్ధతి కూడా బాగుంది. రిటైర్ అయ్యి హాయిగా బ్లాగ్ వ్యాపకం పెట్టుకున్నారు. నాకు తెలిసి అత్తమామలు, కొడుకు కోడలు, పిల్లలు ఎవరైనా సరే ఎవరి హద్దులెరిగి వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. ఆజమాయిషీ బదులు ఆత్మీయత ఉంటే బాగుంటుంది.

  Like

 6. *ఒకే ఊళ్ళో, పిల్లలోచోటా, తల్లితండ్రులోచోటా ఉంటున్నారంటే వాళ్ళకేదో గొడవొచ్చిందనికాదు. దీన్ని ‘ ప్రివెంటివ్ మైంటెనెన్స్’ అంటారు.*
  ఈ ట్రెండ్ ఉత్తర భారత దేశం లోని మేట్రొ సిటిలలో బాగా ఎక్కువ గా ఉన్నాది. బాగా మల్టీనేషన్ కంపేనిలో డబ్బులు సంపదించే అబ్బాయిలు అమ్మాయిలు తల్లిదండ్రుల నుంచి విడి పోయి వారు స్వంతంగా అపార్ట్ మెంట్ల లను అద్దెకు తీసుకొని నచ్చిన విధంగా ఎవరికి నచ్చినట్టు వారు బాయ్ ఫ్రెండ్స్/గర్ల్ ఫెండ్స్ తో ఉంట్టున్నరు. తల్లిదండృలు కూడా వీటీని సాధారణం గా తీసుకుంట్టున్నారు. మనుషులకు డబ్బులు పెరిగె కొద్ది అవగాహన పెరిగి సామాజిక నీతి నియమాలను నుంచి బయట పడతారు. స్వేచ్చా జీవితం గడపటానికి ప్రాధన్యమిస్తారు. ఇందులో పెద్దగ తప్పు పట్టవలసిన అవసరం ఎమీలేదు.

  Like

 7. ఫణి బాబు గారు నమస్కారం

  నిజంగా ఏ విషయాన్ని అయినా మీరు చెప్పే విధానం చాలా బావుంటుంది
  ఇంట్లో అంతా మీ బ్లాగు చూస్తాం
  మీరు మాకు బ్లాగులోకంలో పరోక్షంగా మార్గ దర్శకులుగా నిలిచి ఆదర్శ ప్రాయులవుతున్నారు

  ధన్యవాదములు

  Like

 8. శ్రీవాసుకీ,
  ధన్యవాదాలు.మీరు చెప్పినది అక్షరాలా నిజం.నా బ్లాగ్గు వ్యాపకం విషయానికొస్తే, ఈ బ్లాగ్గులద్వారా ,నా అనుభవాలు, మీ అందరితోనూ పంచుకోవడానికి ఉత్తమమైన మాధ్యమం.

  Like

 9. శ్రీ,

  ఉత్తర భారతదేశంలోనే కానఖ్ఖర్లేదు. భారత దేశంలో ఎక్కడైనా ఈ ‘ప్రివెంటివ్ మైంటెనెన్స్’ వలన ప్రాణానికి హాయీ, సుఖమూనూ.

  Like

 10. హరేకృష్ణా,

  మీ ఇంట్లో అందరూ నా బ్లాగ్గులు చదువుతున్నందుకు సంతోషం. మీరు మరీ పెద్ద పెద్ద మాటలు ‘మార్గ దర్శకులు’ ‘ఆదర్శప్రాయులూ’ అంటున్నారు. ఏదో నాకు తెలిసినవీ, నా అనుభవాలూ, వీలైనంతవరకూ ఎవరి మనోభావాలు కించపరచకుండా వ్రాయాలని ప్రయత్నిస్తున్నాను.నచ్చుతున్నందుకు ధన్యవాదాలు.

  Like

 11. ఫణిబాబు గారు, మీ బ్లాగులు మీ ఇంట్లో వాళ్ళు కూడా చదువుతారా?
  మీ సమాధానాన్ని బట్టి ఇంకో ప్రశ్న అడగాలనుకున్నాను 🙂
  others any guess?

  Like

 12. పానిపురి,

  మా పిల్లలకి తెలుగు మాట్లాడడం వచ్చు. మా కోడలు తెలుగు అమ్మాయే. తెలుగు శుభ్రంగా వచ్చు.నేను వ్రాసిన ప్రతీ బ్లాగ్గూ మా పిల్లలకి చెప్తాను!మా కోడలు నా బ్లాగ్గులు చదివి మా అబ్బాయికి వినిపిస్తుంది.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: