బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–పెళ్ళిచూపులు-1


    యుగయుగాలనుండీ జరుగుతూందనుకోండి ఈ పెళ్ళి సంబంధాల తతంగం, ఆ రోజుల్లో ఇంట్లో కూతురు పెళ్ళి చేయాలంటే ఆ తండ్రి ‘చెప్పులరిగేలా’ తిరిగేవాడనేవారు. మొత్తానికి ఏ పెళ్ళిళ్ళపేరయ్య ధర్మమో, పెళ్ళిళ్ళు చేసేవారు.ఒక్కొక్కప్పుడు, ‘మీ అమ్మాయిని అక్కడెక్కడో పెళ్ళిలోచూశామూ, మా వాడు ఆ పిల్లని తప్ప ఇంకోళ్ళని చేసికోనంటున్నాడూ’ అంటూ, మధ్యవర్తి ద్వారా కబురు పెట్టడమూ, ఆ తరువాత జాతకాలూ,వగైరా చూసేసికుని, లాంఛనాలూ వగైరా సెటిల్ చేసేసికుని పెళ్ళిళ్ళు చేసేవారు.అప్పుడు వీలైనంతవరకూ, దగ్గరలో ఉన్న సంబంధాలే చేసికునేవారు.పిల్ల మరీ దూరం వెళ్ళఖ్ఖర్లేకుండా, దగ్గరలోనే ఉండేటట్లు చూసుకునేవారు. మొదట ఆ పిల్లకో పిల్లాడికో మేనరికం వగైరాలకు ప్రయారిటీ ఉండేది.అలాటి మేనరికం ఏదైనా ఉంటే బయటి వాళ్ళెవరూ అక్కడ అడుగెట్టడానికి కూడా ధైర్యం చేసేవారు కాదు! ఇంకోటేమిటంటే ఆ రోజుల్లో ఉండే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మూలంగా, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు, పురిటి లోనే, వీళ్ళకి
సంబంధాలు ఫిక్స్ చేసేసేవారు. ‘ ఒరేయ్ నీకు పెళ్ళాం పుట్టిందిరా’ అంటూ!దానితో ఆ పిల్లకీ, పిల్లాడికీ అలాగే చేసుకోవాలి కామోసు అని వాళ్ళూ చేసేసికునేవారు.పాత సినిమాల్లో చూడ్డం లేదూ?

   బాగా డబ్బున్నవాళ్ళైతే ఇప్పటికీ కుటుంబంలోనే వరసైన వాళ్ళకెవరికో కట్టబెట్టేస్తూంటారు, ఆస్థి బయటకు వెళ్ళఖ్ఖర్లేకుండా!కాలక్రమేణా మనుషులు కూడా తెలివి తేటలు ఎక్కువై, మేనరికాలు చేసికుంటే, పుట్టే పిల్లలకి ఏవేవో సమస్యలొస్తాయీ
అనే సాకు మీద వీలైనంతవరకూ బయటి సంబంధాలకే వెళ్తున్నారు. మెడికల్ ఒపీనియన్ కరెక్టవచ్చు, కానీ పూర్వకాలంలో చేసికున్న దగ్గర సంబంధాల పిల్లలు హాయిగా కాపురాలూ చేసికున్నారు, వాళ్ళ పిల్లలూ లక్షణంగానే ఉన్నారు.వాతిలో ఉండే సుఖాలూ ఉన్నాయి.మేనత్తే అవడం వల్ల అప్పుడప్పుడు తప్ప, అత్తా కోడళ్ళ సంబంధ బాంధవ్యాలూ బాగానే ఉండేవి.ఏదైనా గొడవ వచ్చినా చుట్టాలందరూ కలిసి ఎలాగోలాగ వాటిని సెటిల్ చేసేవారు.వాటిల్లోనూ సమస్యలుండేవి. సమస్య ఉండకుండా ఉన్నది ఎప్పుడు?

   రోజులు గడిచేకొద్దీ మనుష్యులు తెలివి మీరేరు. కట్నం అదీ బాగా రాదని ముందే తెలిసుండడం వల్ల ఏదో కారణం చెప్పి బయటి సంబంధాలకే వెళ్తున్నారు. దానికి సాయం ఈ ‘జెనెటిక్ టెక్నాలజీ’ ఒకటీ.అమ్మాయికి 18-20 ఏళ్ళొచ్చేసరికి, ఇంట్లోవాళ్ళ ఒత్తిడి అనండి, ఇంకోదేదో అనండి, పాపం ఆ తండ్రి సంబంధాలు వెతకడం మొదలెడతాడు.ఈ లోపులో అమ్మాయి కాలేజీ చదువుకి వస్తుంది. అక్కడితో ఆగదుకదా వ్యవహారం, పోస్ట్ గ్రాడ్యుఏషన్ అంటుంది.ఎలాగూ చదివేనుకదా అని ఉద్యోగంలో చేరుతుంది.అయినా ఈ రోజుల్లో ఇదివరకటిలా కాదుకదా, చదువు అనేది ప్రతీ వారికీ ఉండవలసిందే. ఎటొచ్చి ఏమౌతుందో ఈ రోజుల్లో, ఎవరి కాళ్ళమీద వాళ్ళు నిలబడాలికదా!

    నూటికి 70 మందిదాకా ఈ రోజుల్లో ఇంజనీరింగుకే వెళ్తున్నారు. డిగ్రీ చేతికి వచ్చేక ఐ.టి రంగం ధర్మమా అని ఉద్యోగాలూ బాగానే వస్తున్నాయి.వచ్చిన తరువాత అక్కడితో ఆగదుగా, ఒంటరిగా ఉన్నప్పుడే బయటి దేశాలకోసారి వెళ్ళొస్తే బాగుంటుందీ అనుకుని, ఆన్ సైట్ ప్రాజెక్ట్ లో పనిచేయడానికి బయటి దేశాలకి వెళ్తున్నారు.ఒకసారి వెళ్ళినతరువాత తిరిగి రావడం వీళ్ళచేతుల్లో లేదుకదా, మూడో నాలుగో సంవత్సరాలు బయటే ఉండిపోతున్నారు.పోనీ ఉన్నారుకదా అని, అక్కడే ఎవరినో నచ్చినవారిని పెళ్ళి చేసేసికుంటారా, అబ్బే మళ్ళీ సెంటిమెంటూ అవీ అడ్డొస్తాయి, ఆడ పిల్లలకి. మరీ మొగ పిల్లలంత తెగించేయరు పాపం! ఏదో అమ్మా నాన్నా అంటూ ఉంటారు!

    ఇంక మగ పిల్లల సంగతి కి వస్తే ఈ ఫీల్డే వేరు!నూటికి 40 మంది దాకా ఐ.టి.లోనే ఉన్నారు.ఇంకా అమ్మా నాన్నా మాటవినేవాళ్ళైతే, వీళ్ళ గోల భరించలేక ‘సరే సంబంధాలు చూడండి, నేను ఫలానా టైముకి ఓ పదిహేను రోజులు శలవమీద వస్తున్నానూ, అప్పుడు చూస్తానూ’ అంటాడు. ఇంక చూడండి వీళ్ళు సంబంధాలు చూడడం మొదలెడతారు, అదేదో టెండరు ప్రాసెస్ లాగ, ముందుగా తెలిసినవాళ్ళందరికీ చెప్తారు. పెళ్ళికావలిసిన పిల్లలకేం లోటు మన ఆంధ్ర దేశంలో.

    పిల్లాడు అమెరికా నుండి రాగానే ప్రారంభం అవుతుంది ఈ పెళ్ళిచూపుల తతంగం-ఉన్న పది పదిహెనురోజులూ ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళడం, ఓ కర్సరీ గ్లాన్స్ వేయడం,నిజం చెప్పాలంటే, ఈ పిల్లాడు అమెరికా నుండి వచ్చేముందరే వ్యవహారాలు
‘ఫిక్స్’ అయిపోతాయి, మన మ్యూజికల్ రియాలిటీ షో లలో లాగ! మీరు ఏ కార్యక్రమం చూడండి, ముందుగానే జడ్జీల హావభావాలను బట్టి ముందే చెప్పేయొచ్చు చివరికి విన్నర్ ఎవరౌతారో అలాగ! మిగిలినదంతా మిమ్మల్నీ, మమ్మల్నీ వెర్రివెధవలు చేయడానికి మాత్రమే. ( ఈ సందర్భంలో కొంతకాలం క్రిందట ఒకానొక పాప్యులర్ కార్యక్రమంలో ఓ ఫేమస్ జడ్జి, ఒక అమ్మాయిని ముందరి రోజునుండీ సపోర్ట్ చేశారు. తనచేతిలోనే ఉంది కాబట్టి,ఓ రౌండులో, ఇంకో అమ్మాయి బాగా పాడినా సరే, ఆ పిల్లని కాదనితనకి కావలిసిన పిల్లని ప్రమోట్ చేశారు. కానీ ఫైనల్ లో బయటనుండి వచ్చిన జడ్జి అసలు ప్రావీణ్యత గుర్తించి, ఇంకో అమ్మాయిని విన్నర్ చేశారు. ఈ విషయం నేను, ఆ పెద్ద మనిషికి మెయిల్ ద్వారా జ్ఞాపకం చేస్తే ఆయనన్నారూ’ అవునూ నాకు ఫలానా అమ్మాయె నచ్చింది. ఆమెని ప్రమోట్ చేస్తే తప్పేమిటీ ‘అని జవాబిచ్చారు! ఈ మాత్రం దానికి ఇంతంత పెద్ద షోలూ అవీ అవసరమా?). ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే, వచ్చిన పది టెండర్లలోనూ ఈ తల్లితండ్రులు ఎవళ్ళో ఒకళ్ళని అప్పటికే సెలెక్ట్ చేసేసి ఉంటారు, అలాంటప్పుడు ఈ హంగామా అంత అవసరమా అనిపిస్తుంది. పోనీ అలాగని వెళ్ళి చూసొచ్చిన మిగిలిన తొమ్మిదిమందికీ రిజల్టు చెప్తారా అంటే అదీ లేదూ, మరి నెగోసిఏషన్సు ( కట్న కానుకలు) పూర్తి అవాలిగా!పాపం అప్పటిదాకా ఆ మిగిలిన తొమ్మిది మందీ వెయిట్ చేయాల్సిందే. చివరకి ఎప్పుడో అడగా అడగా చెప్తారు ఏదో కుంటి సాకు చెప్పి, ‘మావాడు ఓ రెండుమూడేళ్ళు ఆగమంటున్నాడండీ’ అంటూ. మరి ఈ మాత్రం దానికి ఈ హడావిడంతా ఎందుకంట? పెళ్ళికొడుకు వాళ్ళమనే ఒక ఫీలింగు.వాళ్ళకేది తోస్తే అది చేయొచ్చు. అడిగేవాడెవడు? పాపం ఇక్కడేమో ఈ పిల్ల ఇలా పెళ్ళిచూపుల కార్యక్రమంలో బలైపోతూంటుంది.

Advertisements

6 Responses

 1. భలే వ్రాసారు. బాగుంది.

  Like

 2. శ్రీవాసుకీ,

  థాంక్స్.

  Like

 3. మీ వ్యాసం బాగానే ఉంది. కాని, విషయం కాలదోషం పట్టేసినట్లు కనిపిస్తోంది నాకు. ప్రస్తుతకాలంలో అబ్బాయిలకంత సీను లేనట్లుగా తోస్తుంది. అమ్మాయిలే అబ్బాయిల్ని సెలక్టు చేసుకుంటున్నారని తెలుస్తోంది. పెళ్ళిళ్ళ బ్యూరోలవాళ్ళు కూడా యీ మాటే అంటున్నారట మరి.

  Like

 4. శ్యామలరావుగారూ,

  మీరన్నది కొంతవరకూ రైటే. కానీ ఈ మధ్యన ఇంకా నేను చెప్పిన పరిస్థితులు ఇంకా చూస్తున్నాము. పెళ్ళిళ్ళబ్యూరోవాళ్ళ మాటలకేముందిలెండి, వాళ్ళపని just ఒకళ్ళతో ఇంకొకళ్ళకి పరిచయం చేయడందాకానే పరిమితం. ( నాకు తెలిసిన ఒక బ్యూరోవారి ద్వారా తెలిసినదిది )

  Like

 5. @పూర్వకాలంలో చేసికున్న దగ్గర సంబంధాల పిల్లలు హాయిగా కాపురాలూ చేసికున్నారు, వాళ్ళ పిల్లలూ లక్షణంగానే ఉన్నారు

  అప్పుడంటే కొడుకులు కూడా పెద్దవాళ్ళ దయా దాక్షిన్యాలపై అధారపడ్డారు, వాళ్లకేలాటి పిల్లలు పుట్టినా ఆ పెద్దొళ్ళకి చింత లేదు. వాళ్ళ జరుగుబాటు వాళ్లకి చాలు. ఎల్లకాలం నడుస్తాయా ఏంటి 🙂

  ఇంకా నయమండీ, కొంతమంది కట్నం ఇచ్చే పని తప్పుద్దని ,పిల్లని వెతకడానికి పది జతల చెప్పులు కొనాల్సి వస్తుందని ప్రేమ పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు అనేయ్యలేదు

  @రోజులు గడిచేకొద్దీ మనుష్యులు తెలివి మీరేరు. కట్నం అదీ బాగా రాదని ముందే తెలిసుండడం వల్ల ఏదో కారణం చెప్పి బయటి సంబంధాలకే వెళ్తున్నారు.

  అవునండీ బాగా తెలివిమీరి పొలం పనులు నేర్పకుండా పిల్లల్ని చదివించి ఉద్యోగాలు కూడా చేయిస్తున్నారు. కలికాలం కాపోతే, దీనికి తోడూ కట్నం డబ్బులు ఆదా చేసికోడానికి ఆడపిల్లల్ని కూడా చదివిస్తున్నారు. ఆ పైన క్రీములు ,పవుదర్లు కొనిస్తున్నాఋ .అందం గా కనిపిస్తే ఖర్చు తగ్గుద్దని కదా 🙂

  @ఇంక మగ పిల్లల సంగతి కి వస్తే ఈ ఫీల్డే వేరు!నూటికి 40 మంది దాకా ఐ.టి.లోనే ఉన్నారు.ఇంకా అమ్మా నాన్నా మాటవినేవాళ్ళైతే, వీళ్ళ గోల భరించలేక ‘సరే సంబంధాలు చూడండి, నేను ఫలానా టైముకి ఓ పదిహేను రోజులు శలవమీద వస్తున్నానూ, అప్పుడు చూస్తానూ’ అంటాడు. ఇంక చూడండి వీళ్ళు సంబంధాలు చూడడం మొదలెడతారు, అదేదో టెండరు ప్రాసెస్ లాగ, ముందుగా తెలిసినవాళ్ళందరికీ చెప్తారు. పెళ్ళికావలిసిన పిల్లలకేం లోటు మన ఆంధ్ర దేశంలో.

  పిల్లాడు అమెరికా నుండి రాగానే ప్రారంభం అవుతుంది ఈ పెళ్ళిచూపుల తతంగం-ఉన్న పది పదిహెనురోజులూ ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళడం, ఓ కర్సరీ గ్లాన్స్ వేయడం,నిజం చెప్పాలంటే, ఈ పిల్లాడు అమెరికా నుండి వచ్చేముందరే వ్యవహారాలు
  ‘ఫిక్స్’ అయిపోతాయి, మన మ్యూజికల్ రియాలిటీ షో లలో లాగ! ////

  ఇలా కాక ఎలా చేస్తే సవ్యంగా ఉంటాడో చెప్పారు కాదు. అప్పట్లో అద్బుతం గా చేసిన పెళ్ళిళ్ళలో ముప్పావు వంతు ఆడకూతుర్ల గొంతు కోసినవే కదా, ఇప్పుడు పెళ్లి చూపులు చాలా నయం అనుకొంటున్నామే 🙂

  @పాపం అప్పటిదాకా ఆ మిగిలిన తొమ్మిది మందీ వెయిట్ చేయాల్సిందే. చివరకి ఎప్పుడో అడగా అడగా చెప్తారు ఏదో కుంటి సాకు చెప్పి, ‘మావాడు ఓ రెండుమూడేళ్ళు ఆగమంటున్నాడండీ’ అంటూ

  అమ్మాయిలూ కూడా భేషుగ్గా వెళ్లి అబ్బాయిల్ని చూసి రావొచ్చు , ఎవరొద్దన్నారు?

  ఏదో ఒక కారణం చెప్పక మీ అమ్మాయి నచ్చలేదు అని మొహాన్న చెప్పి ఆ పిల్లకి ఒక ట్రాక్ రికార్డ్ మెంటేయిన్ చేయించమన్నారా ఏంటి?
  అడగ్గా అడగ్గా చెప్పడానికి బోలెడన్ని కారణాలు ఉంటాయి, కుటుంబం లో ఏకాభిప్రాయం రావాలి కదా. కావాలనుకుంటే ఎదురుచూస్తారు. లేదంటే లేదు.

  Like

 6. మౌళీ,

  చాలా ఆలస్యంగా జవాబిచ్చినందుకు ఏమీ అనుకోకండి.

  1. “ఇంకా నయమండీ, కొంతమంది కట్నం ఇచ్చే పని తప్పుద్దని ,పిల్లని వెతకడానికి పది జతల చెప్పులు కొనాల్సి వస్తుందని ప్రేమ పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు అనేయ్యలేదు”– మీరన్నదీ నిజమే. అలాటి కేసులుకూడా చూశానంటే నమ్ముతారా? ప్రేమించానని కొడుకో,కూతురో చెప్పగానే, ” నీకూ, మాకూ ఏం సంబంధం లేదూ..” అన్నవారే, కొన్నేళ్ళకి అమెరికాలో ఉండే కొడుకుదగ్గరకో, కూతురి దగ్గరకో వెళ్ళడం. అదేదో ప్రేమించానని చెప్పగానే ఒప్పేసికుంటే ఏం పోయిందిట?

  2.”అప్పట్లో అద్బుతం గా చేసిన పెళ్ళిళ్ళలో ముప్పావు వంతు ఆడకూతుర్ల గొంతు కోసినవే కదా, ఇప్పుడు పెళ్లి చూపులు చాలా నయం అనుకొంటున్నామే “– నూటికీ కోటికీ ఎవరినో చూసుంటారు అలాగని ఆరోజుల్లో చేసిన పెళ్ళిళ్ళని generalise చేసేస్తే ఎలా?

  3. “అడగ్గా అడగ్గా చెప్పడానికి బోలెడన్ని కారణాలు ఉంటాయి, కుటుంబం లో ఏకాభిప్రాయం రావాలి కదా. కావాలనుకుంటే ఎదురుచూస్తారు. లేదంటే లేదు.”– ఆ కారణాలేవో చెప్పే ధైర్యం లేదు.ఏకాభిప్రాయం అంటే ఏమిటిట? కాపరం చేసేది ఆ ఇద్దరేకదా, ఇంక మిగిలినవారి అభిప్రాయాలతో పనేమిటీ? తప్పించుకోడానికి చెప్పేవి ఇవే.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: