బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-దున్నపోతు మీద వర్షం కురిసినట్లు…


    మామూలుగా గ్రామాల్లో చూస్తూంటాము, రోడ్డుకడ్డంగా, ఆవులూ, గేదెలూ వగైరా జంతువులు మేతకి వెళ్ళేటప్పుడు, రోడ్డు అంతా ఆక్రమించేస్తూంటాయి. చచ్చినా కదలవు, అవి వెళ్ళేదాకా ఆగవలసిందే.మేకలూ గొర్రెలూ ఫర్వాలేదు, అదిలిస్తేనైనా కదులుతాయి.దున్నపోతులూ అవీ ఎవరిమాటా వినవు.అంతే వాటి ఇష్టానుసారం మనం నడుచుకోవాల్సిందే.

ఈ మధ్యన పట్టణాల్లోనూ, నగరాల్లోనూ కూడా చూస్తున్నాము. రోడ్డుకడ్డంగా పడుక్కునుంటాయి. ట్రాఫిక్కంతా ఆగిపోతుంది. పోలీసాడు మనుష్యులమీద దాష్టీకం చూపించకలడు కానీ, వీటి విషయంలో మాత్రం ‘ అట్టర్లీ హెల్ప్ లెస్’. గ్రామాల్లో అయితే వాటిని తోలుకెళ్ళడానికి ఓ పాలేరు లాటివాడైనా ఉంటాడు. కానీ నగరాల్లోనూ, పట్టణాల్లోనూ ఇవి మన రాజకీయ నాయకుళ్ళ లాగ అదుపూ ఐపూ లేకుండా ఉంటాయి !! చూడండి, ఏ పనీ లేకపోతే బందంటారు, ధర్నా అంటారు, లేకపోతే ఇంకోటేదో పేరుపెట్టి, జనజీవనాన్ని అస్థవ్యస్థం చేయడమే వీళ్ళ సదుద్దేశ్యం.

ఆవులూ, గేదెలూ ఫర్వాలెదు, పాలైనా ఇస్తాయి. కానీ ఈ దున్నపోతులూ,రాజకీయానాయకుల వల్లా అంత ఉపయోగంకూడా ఉండదు.ఇంట్లో ఉన్న గేదెకి పుట్టింది కాబట్టి భరించాల్సిందే, అలాగే మనం ఎన్నుకున్నాము కాబట్టి భరించాలి.
ఈ కోవకి చెందిన వాళ్ళే మరో రకం జనం ఉన్నారు! మీరు ఏ రోడ్డు జంక్షన్ (అంటే మెయిన్ రోడ్లు కాదు),సందులూ గొందులూ ఉన్న చోట చూడండి, ఓ నలుగురు ఏ పనీ లేని పరమ లుచ్చాగాళ్ళు, సైకిళ్ళు పట్టుకుని రోడ్డుకడ్డంగా నిలబడి కబుర్లు చెప్పుకుంటూ కనిపిస్తారు. పోనీ పక్కన ఎవడైనా వస్తున్నాడేమో వాడికి దారి ఇద్దామూ అనే ఇంగిత జ్ఞానం ఉండదు.ఆ మొహల్లాలో/లొకాలిటీ లో వీళ్ళు ఛోటా లీడర్లన్నమాట. పైగా ఇందులో ఎవడి బాబో కార్పొరేటరో, పోలీసో అయిఉంటే ఇంక వాడిని అడ్డేవాడే ఉండడు. వీళ్ళకేం పనీ పాటూ ఉండదు. లోకువగా కనిపించిన వాళ్ళని ఏడిపించడం, ఇదేమిటీ అని అడిగితే బెదిరించడం’ నీఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి చెప్పుకో’ అనడం.ఇవన్నీ సినిమాల్లో చూసి నేర్చుకున్న విద్యలు. ఆశుధ్ధం మీద రాయేస్తే ఏమౌతుందీ అనుకుని, పాపం మామూలు జనం వీళ్ళతో గొడవ పెట్టుకోలేక, తప్పించుకునే తమ మాన ప్రాణాలు కాపాడుకుంటూంటారు.

వీళ్ళ క్యాటిగరీకే చెందిన ఇంకో రకం ఉన్నారు. రోడ్డు సైడు పానీపూరీ,ఛాట్ కొట్లదగ్గర చూస్తూంటాము.ఫుట్ పాత్ అంతా వాళ్ళ స్వంతం అనుకుంటారు. అడ్డంగా నిలబడి, ఆవురావురుమంటూ తినడం, రోడ్ల మీద ట్రాఫిక్ ఎక్కువా అని, కార్పొరేషన్ వాళ్ళు ఈ ఫుట్ పాత్ కట్టించారు, అదేమో ఈ తిండిపోతుగాళ్ళ పరం అయిపోతూంటుంది. కొంచెం దారేపోయే వాళ్ళకి సౌకర్యంగా ఉండేటట్లు తినొచ్చుగా, అబ్బే, ఊళ్ళోవాళ్ళేమైపోతే మనకెందుకూ అనే కానీ,కొంచెం సంస్కారవంతంగా ఉండాలని ఉండదు వీళ్ళకి. అలాగే ఏ ఈవెనింగు వాక్కుకో వెళ్దామనుకుంటాం, ఆ ఫుట్ పాత్ ప్రక్కనే ఉన్న ఇళ్ళవాళ్ళందరూ ఆ ఫుట్పాత్ మీదే నుంచుని కబుర్లు చెప్పుకుంటూంటారు. అందులో ఆడవారు మరీనూ( క్షమించండి, నేను ప్రతీ రోజూ చూస్తున్నది వ్రాశాను), వాళ్ళని రాసుకుంటూ, తోసుకుంటూ వెళ్ళలెము, వెళ్తే ఏం గొడవో! అంతే భరించాలి వీళ్ళని.

ఇక్కడ రోజూ చూస్తూంటాను, ఫుట్ పాత్ ప్రక్కనే ఏవేవో కూరలూ, చేపల దుకాణాలూ ఉంటాయి. కారుల్లో వచ్చే ప్రబుధ్ధులు, ఆ కొట్ల పక్కనే కార్లు పార్కింగు చేసికోవడం, రోడ్లమీద ట్రాఫిక్కు జాం చెయ్యడం. కొంచెందూరంలో పార్కింగు చేసికోవడానికి ఖాళీ ప్రదేశాలుంటాయి, మళ్ళీ అంతదూరం నడవడానికి బధ్ధకం. వీళ్ళనీ భరించాలి.

మనవైపు చూడలేదు, శివాలయాల్లో అయినా సరే, గర్భగుడిలోకి మనల్ని రానీయరు. ఇక్కడ అలా కాదు, యూనివర్సల్ బ్రదర్ హుడ్- ఎవడిక్కావలిసిస్తే వాడు లోపలికి వెళ్ళి, శివలింగానికి కావలిసినంత సేపు అభిషేకాలూ పూజలూ చేసికోవచ్చు.ప్రతీవాడికీ దేముడంటే భక్తుండాలి, కాదనం. కానీ గంటల తరబడి ఒక్కళ్ళే పూజలూ, అభిషేకాలూ చేస్తూంటే మిగిలినవాళ్ళసంగతేమిటీ? వాళ్ళొక్కళ్ళకే ‘వీర భక్తి’ ఉందనుకుంటారు. మిగిలిన ‘మోర్టల్స్’ ‘టు హెల్ విత్ దెం’. అంతే.

అలాగే ప్రతీ సొసైటీ గేటుకీ ఓ బోర్డుంటుంది, ‘ప్లీజ్ డు నాట్ పార్క్ వెహికిల్స్’ అని. ఒక్క దరిద్రుడికీ పట్టదు. బోర్డు దారి బోర్డుదే. వాచ్ మన అనబడే ప్రాణి సాయంత్రం పూట ఎక్కడా కనిపించడు.మనం ఏమైనా అడిగితే ‘ఇదిగో ఇప్పుడే వచ్చేస్తాం,అని చెప్పి కారునో స్కూటరునో అక్కడ పార్కు చేసేసి ఎక్కడికో పోతాడు.పైగా ఏమైనా అంటే దెబ్బలాటోటీ, మేము రోడ్డు టాక్స్ కడుతున్నామూ అంటూ, అసలు ఆ సొసైటీలో ఉన్న కార్ల వాళ్ళకి ఇబ్బందౌతుందీ అని ఎందుకు ఆలోచించరో? కారుంటేనే సరికాదు, సంస్కారం కూడా ఉండాలంటాను.ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, మా సొసైటీ గేటు రోడ్డుమీదకుంటుంది. ఖర్మ కాలి రిలయెన్స్ వాళ్ళ స్టోర్ మా బిల్డింగు క్రిందే ఉంది.మాకు ప్రతీ రోజూ అయ్యే అనుభవం ఇది.

అందుకే ఈ బ్లాగ్గుకి శీర్షిక ‘ దున్నపోతుమీద వర్షం కురిసినట్లే’ అని పెట్టాను. వాటికీ , వీళ్ళకీ ఏం తేడాలెదు. వర్షం వచ్చినా సరే, ప్రళయం వచ్చినా సరే, ఇలాటి జనం మాత్రం మారరు, మారాలని ప్రయత్నించరు !!!

8 Responses

 1. ఫణిబాబుగారూ, మీరు చెప్పిన ఈ ‘దున్నపోతులు’ రోడ్డు మీదే కాదు,
  ఆఫీసుల్లో, షాపుల్లో కూడా అగుపిస్తారు.దారికి అడ్డంగా నిల్చుని చూసినా
  కదల్డు. చివరికి “ఎక్స్క్యజ్మే” అన్నా అర్ధమై చావదు. ఇక అయిష్టంగానే
  మీద చేయివెసి అడ్డంలే నాయనా అంటే అప్పుడు స్పృహలోకి వస్తారు.
  మా ఇంటికి ఎదురుగా వున్న హాస్పటల్కి వచ్చేవాళ్ళు బైక్ని స్టైయిల్గా
  గేట్కి అడ్డంగా పెడతారు.పేషేంట్స్ లోపలకు ఎలా వెడతారు అన్న ఇంగిత
  జ్ణానం వుండదు.ఇక ఈ యుగానికింతే !!

  Like

 2. గురువుగారూ,

  వీళ్ళొక్కళ్ళే మనకి ఎక్కడైనా కనిపించే ప్రాణులు.

  Like

 3. దున్నపోతునల్ను ఎందుకండి అవమానిస్తారు?

  Like

 4. ఇందు గలడు అందులేడు అన్న సందేహం వలదన్నట్టు ఈ తరహా జనాలు అన్నిచోట్లా ఉంటారు. దున్నపోతైనా ఒకటి, రెండు దెబ్బలకు తప్పుకుంటుంది. వీరు అలా కాదుగా. ఈ బోటి జనాలకు అక్కర్లేని అహంకారం, పొగరు ఎక్కువ.

  Like

 5. శివరామప్రసాద్ గారూ,

  బహుశా మీరన్నదీ రైటేమో. దున్నపోతులని అవమానించడం తప్పే !!!

  Like

 6. శ్రీవాసుకీ,
  ఏదో సామెత చెప్తారుకదా అని దున్నపోతులతో కంపేర్ చేశాను !!

  Like

 7. true !

  Like

 8. హ హా.. అన్నీ నిజలేనండీ… పాపం దున్నపోతుల్నెందుకు అవమానిస్తారు.. ఒకసారి కొడితే.. తరువాత దెబ్బగుర్తొచ్చైనా అవి మారతాయి..

  మీరు చెబుతుంటే మా ఆఫీసులో సంఘటన గుర్తొచ్చింది.. మా టూ వీలర్ పార్కింగ్ రెండు వరసలుగా వుంటుంది.. మా కంపెనీవాడు కాస్తడబ్బులు తక్కువకట్టాడో ఎంటోమరి.. అది బాగా ఇరుకుగా ఇచ్చాడు.. ఒకలైను పార్క్ చేసాకా దానివెనుకే వేరేది పార్క్ చెయ్యాలి.. అందరూ ముందు లైను ఖాలీ వదిలేసి.. వెనుక పార్క్ చేసేస్తుంటారు.. ఆ వాచ్ మెన్ అడిగితే…. సార్ ఎవరూ వినటంలేదండీ అందరూ పర్వాలేదులే అంటారండీ నేనేంచెయనండీ.. అంటాడువాడు…, అందరికీ బాగుండేలా ఒకరోజు దగ్గరుండి పద్దతిగా చేయించారు… అయినా ఎవరూ మారలేదు తరువాతరోజునుండి మామూలే.. పాపం వాచ్ మేన్ ఏం చేయగలడులే.. చదువుకుని జాబ్ చేస్తున్న మూర్ఖులదగ్గర అనుకుని.. మేమే జరపగలిగేవి జరిపి లోపలపెట్టుకుంటుంటాం..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: