బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–భయాలు


    మా చిన్నప్పుడు తీర్థాలకి వెళ్ళినప్పుడు ‘రంగుల రాట్నం ‘ అని ఒకటుండేది. ఓ గుర్రం బొమ్మమీద కూర్చోడం,దాన్ని ఎవడో తిప్పేవాడు.ఆ రోజుల్లో ఇప్పటిలాగ ఎలెక్ట్రికల్ వి ఉండేవి కావు. మొత్తం అన్ని బొమ్మలమీదా పిల్లలందరూ వచ్చేదాకా, అది తిప్పడం మొదలెట్టేవాడు కాడు. అలాగే ఇంకోటి ఉండేది.ప్రస్తుతపు ‘జయంట్ వీల్ ‘ లాటిది. దాంట్లో వీలేమిటంటే, చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా కూర్చోవచ్చు. ‘రంగుల రాట్నం’ సంగతికి వస్తే దానిమీద కూర్చున్నప్పుడు బిగుసుకుపోయేవాళ్ళం! కానీ ప్రపంచాన్నంతా జయించేసిన ఫీలింగు వచ్చేది!

    ఇప్పుడంటే ‘పవర్ ఆపరేటెడ్’ జయంట్ వీల్సూ, అలాగే ఏవేవో వచ్చేయి.నాకు ఎప్పుడూ భయమే. కళ్ళు తిరుగుతాయి.ఎప్పుడో ఒక్కసారి ఉద్యోగంలో చేరిన తరువాత ఒక్కడినీ బొంబాయి వెళ్ళాను. అక్కడ ఓ ఎగ్జిబిషన్ లో ఎలా ఉంటుందో అని, ఆ జయంట్ వీల్ ఎక్కాను.పైకి వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది, వచ్చిన గొడవల్లా ఘూమ్మని క్రిందకి దిగుతుందే అప్పుడు- గుండెలు జారిపోతాయేమో అన్నంత భయం వేసేస్తుంది.ఖర్మ కాలి ఇక్కడ ప్రాణం పోతే ఎలాగా, మనం ఇక్కడ ఉన్నామనికూడా ఎవరికీ తెలియదూ, దిక్కులేని చావు ఛస్తామేమో అని ఓ భయం. ఇంక ఆ తరువాత ఎప్పుడూ జయంట్ వీల్ ఎక్కే ప్రయత్నం చేయలేదు. ఏదో బతికున్నంతకాలం, భూమ్మీదే ఉండి రోజులు గడిపేద్దామని ఉద్దేశ్యం!

    అదేమిటో నాకు ‘ఎత్తు’అంటే చాలా భయం.దాన్ని ‘వెర్టిగో ‘ అనో ఇంకేదో పేరుతోనో పిలుస్తారనుకుంటాను.మా ఇంట్లో అందరికీ నేనంటే వేళాకోళం. ప్రపంచం లో ఎంజాయ్ చేయడానికి ఇన్ని సాధనాలుంటే, ఒక్కటంటే ఒక్కటీ ఎంజాయ్ చేయరూ అని! ఏం చెయ్యనూ అది నా దురదృష్టం !అందుకనే ఎప్పుడూ ఏరో ప్లేన్ ఎక్కే ప్రయత్నం చేయలేదు. ఒకేఒక్కసారి సునామీ వచ్చినప్పుడు, చెన్నై నుండి ముంబై దాకా రావలసివచ్చింది. ఫ్లైట్ లో ఉన్నంతసేపూ కళ్ళు మూసుకునే కూర్చున్నాను. పాపం మా ఇంటావిడకి ఇవన్నీ కావాలి. తనకు ధైర్యం ఎక్కువే. చెప్పేను కావలిసివస్తే నిన్ను పంపుతాను కానీ, నెను మాత్రం ట్రైన్ లొనే ప్రయాణం చేస్తానూ అని. ఇదివరకు మా అమ్మాయి ఢిల్లీ లో ఉన్నప్పుడు ఫ్లైట్ లోనే వెళ్ళేది. ఇప్పుడు వాళ్ళుకూడా పూణే వచ్చేసరికి, ఆ ఛాన్స్ పోయింది.

    నేను జీవితంలో ఎక్కువగా భయపడేది కుక్క అనే ప్రాణి. ఈ మధ్యన నేను ప్రతీ రోజూ గుడికి వెళ్ళే దారిలో ఓ పెద్దమనిషి, ఓ కుక్కని తీసికుని మార్నింగ్ వాక్కు కి వస్తూంటాడు. ఆ కుక్కకి ఓ చైన్ వేయొచ్చుగా, అబ్బే తన కుక్క ఎంత డిసిప్లీన్డో అందరికీ తెలియొద్దూ. అదేమో భయంకరంగా ఉంటుంది.బహుశా ఎవరినీ ఏం చేయదేమో,కానీ ఇవతలివాళ్ళకు దాన్ని చూసేసరికి,కాళ్ళూ చేతులూ ఆడవాయె. పైగా దీన్నీ చూస్తూనే ఆ ప్రాంతంలో ఉన్న కుక్కలన్నీ భౌ భౌ మంటూ దీని వెనక్కాల పడతాయి. అదేమి సంబరమో ఈ కుక్కల ఓనర్లకి, కుక్కలకి చెయిను లేకుండా వీధుల్లోకి తీసికెళ్ళడం. బయటి వాళ్ళందరూ భయపడుతూంటే చూడ్డం వీళ్ళకి ఓ పైశాచికానందమేమో ! ‘ కుఛ్ నహీ కర్తా ‘ అంటూ ఓ వెధవ డయలాగ్గొకటీ. వాడికి వాడి కుక్క అంటే ప్రేమౌచ్చు, అలాగని వీధిలో వెళ్ళే ప్రజానీకాన్ని హింస పెట్టే అధికారం వీడికెవడిచ్చాడూ?

    భూతదయా అవీ వినడానికి బాగానే ఉండొచ్చు. అందరికీ ఉండాలని లేదుగా. ఇంక మా ఇంట్లో అబ్బాయికీ, కోడలికీ పక్షులంటే ఆపేక్షా! వరండాలో ఓ గూటిలో పావురాలు గుడ్లు పెట్టాయి, అవేమో ఊళ్ళో ఉన్న పుల్లా పూచికా తెచ్చి ఓ గూడు కట్టేశాయి. ఇంక వాటిని ఎవరూ డిస్టర్బ్ చేయకూడదూ.

    ప్రపంచంలో ప్రతీవాళ్ళకీ ఏవేవో అంటే భయాలుంటాయి. కొంతమందికి చీకటంటే భయం, బొద్దింకలంటే భయం, బల్లులంటే భయం. ఏమైనా అంటే అసహ్యం అంటారు, భయం అని ఒప్పుకోడానికి నామోషీ ! మా ఇంటావిడ గోడమీద బల్లిని చూస్తే దాన్ని బయటకు తోలేసేదాకా ఆ గదిలోకి వెళ్ళదు. నాకు చెప్పానుగా కుక్కకి తప్ప ఇంకే ప్రాణికీ భయపడను.అందుచేత ఆ బల్లిని తోలేయడానికి నేనే కావాలి.ఆ మాత్రందానికి పేద్ద ధైర్యవంతురాలిలా, బయట ఎప్పుడైనా కుక్క కనిపిస్తే దానిమీద అంత పేద్ద ప్రేమ చూపించేయడం ఎందుకంట ! మా అబ్బాయీ అంతే బయట ఏదైనా కుక్కకి ఏ కాలికైనా దెబ్బ తగిలి కుంటుతూ కనిపించిందో, వాళ్ళెవరో ‘బ్లూ క్రాస్’ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు వచ్చేదాకా చూస్తూంటాడు.ఏదైనా కుక్క కనిపిస్తే ఓ విజిల్ వెయ్యడం ఒకటీ. ఇవన్నీ నా ప్రాణం మీదకి వస్తూంటాయి!

    పిల్లల తండ్రులైన తరువాత ప్రతీ వాళ్ళకీ తమతమ భయాలు పబ్లిగ్గా చెప్పుకోవడానికి భయ పడుతూంటారు. మనకే భయం అని అంటే పిల్లలింకా భయపడిపోతారూ అని. నాకైతే అలాటి సిగ్గూ శరమూ లేదు.నేను భయపడే ఏ విషయమైనా చెప్పేస్తాను. అవతలివాళ్ళకి భయంలేకపోతే వాళ్ళిష్టం. నెత్తిమీద పెట్టుకోమనండి, ఒళ్ళో కూర్చోపెట్టుకోమనండి. అంతేకానీ భయపడేవాళ్ళని ఇంకా భయ పెట్టకూడదు. ఒక్కొక్కప్పుడు రోడ్డుమీద వెళ్ళేటప్పుడు చూస్తూంటాను, అక్కడ కుక్క ఉంటే, కొంచెం పెద్దవాళ్ళైనా సరే ( ఆడా మగా) భయపడుతూంటారు.అలాటప్పుడు నాలాటి వయస్సులో ఉన్న వాడి దన్ను చూసికొని, వెళ్ళడానికి చేసే ప్రయత్నం చూస్తే నవ్వొస్తూంటుంది, వాళ్ళకేం తెలుసూ నేనెంత ధైర్యవంతుడినో !

Advertisements

7 Responses

 1. మా యింట్లో ఎంచక్కా 3 తెల్ల కుక్కలుండేవి. వాటిలో పెద్దవి రెండూ ఆడకుక్కలు, చిన్నదేమో మగ కుక్కాను. ఆ మధ్యన అన్నింటికంటే పెద్దది ఆడకుక్క (ట్రిక్సీ) రెండురోజులు సుస్తీ చేసి చనిపోయింది. ఎంతగా ఏడ్చామో దానిగుఱించి. ఈ చనిపోయిన ట్రక్సీ ప్లేసులో ఇంకోటి కావాలని చెప్పి రెండో ఆడకుక్కని క్రాసింగ్ చేయించాము. ఇప్పుడు దానికి 4 పిల్లలు పుట్టాయి. నాకూ మా ఆవిడకూ మా పనిపిల్లలకూ అందరికీ ఇప్పుడు ఆ కుక్కపిల్లల తోడిదే లోకము. వాటిలో 2 మగవి రెండు ఆడవీను. అన్నిటికంటే చిన్నదైన ఆడకుక్కపిల్లని మేము పెంచుకోడానికీ మిగిలినవాటిని ఎవ్వరికైనా పెంచుకోడానికి ఇవ్వడానికీ నిర్ణయమయిపోయింది. మాకు కావాలంటే మాకు కావాలని పెద్ద డిమాండ్లు వస్తున్నాయి. అన్నీ బుక్కయిపోయాయి అని మా ఆవిడ అంటోంది. కాని మా ఫేక్టరీలో వాళ్ళు మా క్కూడా ఇవ్వాలండీ అని ఒకటే డిమాండు. ఏంచేయాలో మరి తెలియటం లేదు.

  Like

 2. ఇలామీరు వుడుక్కోవడం బాగుంది. బాగున్నాయ్ మీ అనుభవాలు….గిజిగాడు.
  “అవతలివాళ్ళకి భయంలేకపోతే వాళ్ళిష్టం. నెత్తిమీద పెట్టుకోమనండి, ఒళ్ళో కూర్చోపెట్టుకోమనండి. అంతేకానీ భయపడేవాళ్ళని ఇంకా భయ పెట్టకూడదు. “

  Like

 3. నరసింహరావు గారూ,

  మీరు ఇంట్లో నాలుగు కానీ నలభై కానీ పెంచుకోండి, వద్దనడానికి నేనెవడిని? నేను చెప్పేదల్లా రోడ్డుమీద వెళ్ళే నాలాటి అర్భకుడిని హింస పెట్టకూడదని మాత్రమే!

  Like

 4. రాఘవేంద్రరావుగారూ,
  చూశారా కుక్కలగురించి ఏమైనా వ్రాస్తే, మా నరసింహరావుగారి లాటి వారికి కోపాలొస్తాయి. నాకేమో అవంటే భయం. చెప్పకపోతే అవతలివాళ్ళకి ఎలా తెలుస్తుందండి బాబూ.ఎప్పుడైనా నరసింహరావుగారి వద్దకు పెద్దాపురం వెళ్ళాలంటేనే భయం!

  Like

  • ఫణి బాబు గారూ, నాకు బల్లులూ,పిల్లులూ,కుక్కలూ,పాములూ,ఆఖరికి త్రాచుపాములూ వంటి జీవులంటే భయం లేదు కానీండి, మనుష్య జీవులంటేనేభయమండీ, ఎటునుంచి ఎప్పుడు విషం వెదజల్లుతారోనని. …నూతక్కి రాఘవేంద్ర రావు.

   Like

 5. >>నాకు చెప్పానుగా కుక్కకి తప్ప ఇంకే ప్రాణికీ భయపడను.

  ఒకవేళ పులి ఎదురొస్తే అప్పుడు.

  Like

 6. శ్రీవాసుకీ,

  ఏదో రోజూ చూసే పిల్లులూ, బల్లులూ లాంటివండి బాబూ ! పులులూ,సింహాలగురించి అడిగి నన్ను వీధిన పెట్టేస్తారెందుకూ !!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: