బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–అవసరానికి ఒక్కటీ కనిపించదు


    చిన్నప్పుడు పాక బళ్ళోకి వెళ్ళేటప్పుడు పలకా బలపంతో లాగించేశాము. అందులోనూ కొంచెం ఖరీదయింది-పాల కణికో ఏదో అనేవారు. దానితో వ్రాస్తే అదో స్టేటస్ సింబలూ.మామూలు బలపం లా కాక ,తెల్లగా ఉండేది.నేలమీద వ్రాసుకోవడానికి చాక్ పీసులు (సుద్ద ముక్కలు) ఇచ్చేవారు. అందులో కొంచెం గొప్ప రంగు సుద్దలు.అవి ఓ ప్యాకెట్టులో రంపం పొట్టు తో ప్యాక్కు చేసేవారు. క్రమక్రమంగా పెన్సిళ్ళలోకి ప్రమోషన్ ఇచ్చారు.వాటిని చెక్కుకోవడానికి బ్లేడులు.ఎప్పుడు చెక్కుకోవాల్సినా, నాన్నగారిదో,అన్నయ్యలదో షేవింగు సెట్టులోంచి తీసేసికుని, పెన్సిల్ చెక్కుకోవడం, అవి తీసినందుకు ఆ తరువాత వాళ్ళచేత చీవాట్లు తినడం.

ఆ తరువాత ఇంకు పెన్నుల్లోకి -ఫౌంటెన్ పెన్ అని ఎందుకంటారో నాకు తెలియదు.పెద్దవాళ్ళదగ్గర ఉండేవి బాగానే ఖరీదైనవి ఉండేవి.మనకే, ఏదో ఒకటి అని ఇచ్చేవారు.మళ్ళీ వాటిలో రకాలు-ఎల్లాయ్ టిప్ప్, ఇరిడియం టిప్ అని.మనకిచ్చే పెన్నులు 50 శాతం దాకా ఎప్పుడూ లీక్ అయ్యేవి ( అంటే తెలుగులో కక్కేవి), వాటికి వైద్యం ఏమిటంటే సబ్బు ముక్కని,ఆ లీక్ అయ్యేచోట రాయడం. అయినా సరే జేబులో పెట్టుకున్నప్పుడు, దాని దారిన అది లీక్ అవుతూనే ఉండేది. చొక్కా జేబు దగ్గర అసహ్యంగా మరక అయ్యేది.ఆ పెన్నులో ఇంకు పోయడం ఓ కళ. ప్రాక్టీసున్నవాడైతే సరీగ్గా పెన్ను ఎడ్జ్ దాకా పోసి,దానిమీద పాళీ ఉన్న భాగాన్ని,ఇంకు బాటిల్ లోకి వంపి, ఎక్కువగా వచ్చిన సిరా దాంట్లోకి వంపేవాళ్ళం. ఆ తరువాత ఇంకు ఫిల్లర్లు వచ్చాయి. వాటితో కావలిసినంత ఇంకు తీసికొని నింపుకోవడమే!

ఇంట్లో పెన్సిళ్ళు చెక్కుకోవడానికి బ్లేడ్లు లేవనుకోండి, మన అమ్మలు కత్తిపీటతో చెక్కేసి ఇచ్చేవారు!!ఇంకో సంగతండోయ్, స్కూల్లో మాస్టారు పాఠాలు చెప్తూంటే, అవి వినకుండా పిల్లలు చేసే ఇంకో ఘనకార్యం ఏమిటంటే, బ్లేడుతో ఆ పెన్సిల్ మీద మన పేర్లు చెక్కుకోవడం!

రోజులు గడిచేకొద్దీ బాల్ పాయింటు పెన్నులు వచ్చేశాయి.అవికూడా అందరూ వాడేవాళ్ళు కాదు.వాటితో వ్రాస్తే హాండ్ రైటింగు బాగా ఉండదని ఇచ్చేవారు కాదు!ఈ మధ్యలో కొంతమంది, ఇంకు బాటిల్ లో కలం ముంచి వ్రాసేవారు.స్కూళ్ళలో బెంచీలమీద అవి పెట్టుకోడానికి విడిగా డిజైన్ కూడా ఉండేది.

మొత్తానికి ఈ దశలన్నీ దాటుకొని చదువులు పూర్తిచేసికొని,సంసారంలో పడి,పిల్లల్ని పెంచి పెద్దచేసి, ఏదో ఓ స్థితికి చేరుకున్నాము.పాతరోజులు గుర్తుచేసికుంటూంటే ఎంతో బాగుంటుంది.ఇంక ఇప్పుడో, ఇంటినిండా బాల్ పెన్నులే. అసలు ఇంకు పెన్నులనేవి ఉంటాయనికూడా చాలా మందికి తెలియదు. కనీసం ప్రతీ ఇంట్లోనూ 50-60 దాకా పెన్నులుంటాయి. అయినా సరే ఏ కొరియర్ వాడో, గ్యాస్ వాడో వస్తే, సంతకం చేయడానికి ఒక్క పెన్నూ కనబడదు. చివరకి ఆ వచ్చిన వాడే మన బాధ భరించలేక, వాడి పెన్ను (క్యాప్పు తీసేసి) ఇస్తాడు.బ్యాంకుల్లోనూ, రైల్వే రిజర్వేషన్ దగ్గరా చూస్తూంటాము,’ సార్ పెన్నొక్కసారి ఉంటే ఇవ్వండి’ అని.ఇచ్చేమా అది తిరిగి వచ్చేదాకా వాడివెనక్కాలే తిరుగుతూండాలి. అడిగితే ‘ ఏం తీసుకుపోతామనుకున్నారా, చుస్తున్నారుగా ఇంకా రాస్తున్నాము’ అని ఓ గదమాయింపొకటి! పుణ్యానికి వెళ్తే పాపం ఎదురవడం అంటే ఇదే !

ఈ కోవలోకే అంటే అవసరానికి కనిపించకపోయే అతి విలువైన సరుకుల్లో సూది పిన్నీసు ( సేఫ్టీ పిన్). దీనిల్లు బంగారంగానూ,దానితో ఎన్నిపనులండి బాబూ, చెవిలో దురద బెడితే ఓసారి చెవిలో తిప్పడం దగ్గరనుండీ, ఏ పైజమా కో, లేక ఆడవారి పెట్టీ కోట్లకో బొందు పెట్టడందాకా అన్నిచోట్లా ఈ పిన్నీసు అవసరం ఎంతైనా ఉంది.మామూలుగా అయితే ఆడవారు వాళ్ళ చెయిన్ లకి తగిలించేస్తారు. మొగాళ్ళకే కొంచెం కష్టం. జంధ్యాలున్నవారు హాయిగా వాటిని అక్కడ ఉంచుకోవచ్చు.

స్క్రూ డ్రైవర్లూ,ఫెవికాల్ ట్యూబ్బులూ,గం బాటిళ్ళూ,ఫ్యూజ్ వైర్లూ,స్కెచ్ పెన్నులూ, ఆఖరికి ఏదైనా నోట్ చేసికోవడానికి ఓ తెల్ల కాగితమూ,వ్రాయడానికి పెన్నో పెన్సిలో- అడక్కండి ఇలా వ్రాసుకుంటూ పోతే, మన జీవితంలో ప్రతీ రోజూ అవసరం అయ్యే ఏ వస్తువైనా సరే, అవసరానికి కనబడితే ఒట్టు. వాటిగురించి వెదికి తల పగలుకొట్టుకోవడంకంటె, బయటకు వెళ్ళి కొత్తది కొనితేవడం సులభం అని మనం డిసైడయిపోతాము.

ఇప్పుడంటే ఈమెయిల్స్ అవీ వచ్చాయి కానీ,కొద్దిరోజుల ముందుదాకా పోస్ట్ కార్డులూ, ఇన్లాండ్ లెటర్సే కదా.ఎవరికైనా వ్రాద్దామనుకొని కూర్చుంటే సమయానికి అవి కనబడేవి కావు. ఇలా కాదని పోస్టల్ స్టేషనరీ అంతా గుర్తుగా ఓ కవర్లో పెట్టి ఉంచేవాళ్ళం. ఆ కవర్ ఎక్కడ గుర్తుగా పెట్టామో మర్చిపోయేవాళ్ళం! వారానికో, పదిహేను రోజులకో ఇల్లంతా సద్దే కార్యక్రమంలో, పైన చెప్పిన వస్తువులన్నీ కనిపించేవి. పైగా ఒక్కొక్కటీ రెండేసీ, మూడేసీ. అయినా సరే పురిటి/శ్మశాన వైరాగ్యాల్లా మళ్ళీ మామూలే ! !

Advertisements

4 Responses

 1. ఆహా…ఆహా…ఆహా…ఆహా… అలా…అలా ఎక్కడికో – అంటే మా అమ్మమ్మవాళ్ళ ఊరు చల్లపల్లి తీసుకెళ్ళిపోయారు సార్…బోల్డు జ్ఞాపకాలు లటుక్కున లేచి కూర్చున్నాయి….

  Like

 2. బాబయ్యా !
  నీ బ్లాగ్ comment లాగ ,నేను కూడా అమలాపురం వెళ్ళాను – నీ బలప ఆలోచన తో !
  నీనూ అనుకుంటాను -, మేము అమలాపురం అంత అలవాటు లేక పోతే అసలు బలపమే తెలిసేది కాదేమో?
  ఇంకో బలపానికి 3-4 pastel colors ఉండేవి – ఇంకా చూసుకో దాని ఆకర్షణ!
  In a great coincidence. just this weekend we were describing the concept of a fountain pen to Ashwin -> in particular about the difficulties witht the “nibs” how some would write smooth and thick and others – thin / rough and scratchy. and how most would invariably break!

  Like

 3. వంశీ,

  నా బ్లాగ్గు వలన మిమ్మల్ని మీ అమ్మమ్మగారి దగ్గరకు చల్లపల్లి తీసికెళ్ళగలిగానంటే చాలా వరకూ కృతకృత్యుడినయ్యాననే అనుకోవాలి. నా బ్లాగ్గు నచ్చినందుకు ధన్యవాదాలు.

  Like

 4. అరుణా,

  నీ పెన్ నేం నాకు నచ్చేసింది!ఇలాటివన్నీ వ్రాయడం వలనే మన గతించిన మదుర జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ తాజా చేసికుంటున్నాము. ఇప్పటి మెకానికల్ లైఫ్ లో మనకు మిగిలినవి ఇవేగా! మనం చేసికున్న అదృష్టం ఏమంటే, మనకు ఆమాత్రమైనా ఉన్నాయి.ఇప్పటి తరం వారిని చూస్తూంటే, అప్పుడప్పుడు జాలి వేస్తుంది.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: