బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–పూణె ఆంధ్ర సంఘం లో ఉగాది


    ఈ సారి పూణే ఆంధ్ర సంఘంలో ఉగాది ఎక్కడ జరుపుతున్నారో తెలిసికోవడానికి, ఓ రెండు రోజులముందర డెక్కన్ జింఖానా లో ఉన్న ఆంధ్ర సంఘానికి వెళ్ళాను.అక్కడ నాకు పరిచయం ఉన్న ఒకాయన, వివరాలు చెప్పి,వీలుంటే నాకు తెలిసిన మరికొందరితో కూడా చెప్పమన్నారు.అక్కడ కార్యక్రమాలు అయిన తరువాత ‘డిన్నర్ ‘ కూడా ఏర్పాటుచేసేమన్నారు.ఊరికే కాదు, పెద్దలకి 125 రూపాయలు,పిల్లలకి 75 రూపాయలు.

    ఆ మర్నాడు నాకు తెలిసిన వారింటికి వెళ్ళి చెప్పాను.ఇంకో అతను, అంటే మన బ్లాగ్గు మిత్రుడు శ్రీనివాసు,వద్దామని అనుకున్నా, కారణాంతరాలవల్ల రాలేకపోయాడు. మా ఇంటావిడ మనవడితో బిజీ గా ఉండి రాలేకపోయింది.సరే అని నేనే బయలుదేరి వెళ్ళాను.బాలగంధర్వ రంగమందిర్ లో ఏర్పాటు చేశారు.గేటులోనే, ఉగాది పచ్చడీ,పుచ్చకాయ జ్యూసూ ఇచ్చారు.అప్పటికే పంచాంగ శ్రవణం జరుగుతోంది.అప్పటికే ప్రొద్దుటనుండీ, టీ.వీ.ల్లో విన్నాము కదా అని దానిమీద అంత శ్రధ్ధ పెట్టలేదు. ఏదో మన సంతృప్తికోసం వినడంకానీ,వాటినే నమ్ముకుంటే కష్టం. ఆదాయం ఇంతా వ్యయం అంతా అంటారు. వ్యయం విషయంలోనే అది నిజం అవుతూంటుంది .

   ఆ తరువాత ఇద్దరు స్థానిక కళాకారులు, నాట్య ప్రదర్శనలిచ్చారు. బాగానే ఉన్నాయి.ఆ తరువాత హైదరాబాద్ నుండి వచ్చిన మిమిక్రీ శ్రీనివాసు ట, ఆయన ప్రోగ్రాం చాలా బాగుంది. ఆ తరువాత అతనెవరిదో ‘మైమ్’ ప్రోగ్రాం.అదేమిటో, ఆ కార్యక్రమం నాకెప్పుడూ బుర్ర కెక్కదు. బహుశా నా ‘ఐ.క్యూ ‘ తక్కువేమో !! ఆ తరువాత పూణే ఆంధ్రసంఘానికి ఎనలేని సేవలు చేసిన ఒకాయనని సన్మానించారు.ఆ మధ్యలో చెప్పారు--‘రుచికరమైన తెలుగు విందు తీసికొని మరీ వెళ్ళండి’ అని.

    చెయ్యక ఛస్తామా, భోజనం బయటే చేసివస్తానూ అని చెప్పివచ్చాను, ఎలాగూ 125 రూపాయల కూపన్ కొనుక్కున్నాగా సరే దీని సంగతేదో చూద్దామని బయటకి వచ్చి చూసేటప్పటికి అప్పుడే చాలా మంది అక్కడే ఉన్నారు!!అంటే నాలాటి ఆలోచన, ఇంకా చాలామందికి వచ్చేసిందన్నమాట !!అక్కడున్నవాడి చేతిలో ఆ కూపన్ పెట్టి,వాడిచ్చిన ఓ పళ్ళెం పుచ్చుకొని,సరే తెలుగు విందుభోజనం అన్నారుకదా అని రెడీ అయిపోయాను! ఎందుకంటే, ఈ మధ్యన, మెము మా మనవడు పుట్టిన సందర్భంలో, మా అబ్బాయి దగ్గరే ఉంటున్నాము.అక్కడేమో వాళ్ళు ఓ కుక్ ని పెట్టారు.ఆవిడేమో, అన్నీ పథ్యం వంటలే చేస్తుంది.దేంట్లోనూ పోపు అనబడే పదార్ధం ఉండదు, ఉడకబెట్టడం అంతే !!మా ఇంటావిడ చేతి వంట తినాలంటే ఇంకా మూడు నెలలు ఆగాలి !!

    సరే వెరైటీకి ఈ సో కాల్డ్ ‘తెలుగు విందు’ తిని నోటి జిహ్వ తీర్చుకుందామనుకున్నాను.అంత అదృష్టమా–ముందర ఏవేవోఆకులూ,అలమలూ ( అవేనండి శలాడ్లు ), ఆ తరువాత ఎవో రుచి తెలియని రెండు పచ్చళ్ళూ( అవి గోంగూరా, మామిడికాయా అని ఎవరో చెప్పగా విన్నాను!),పెరుగులో వేసిన వడలూ,ఆ తరువాత ఊళ్ళో ఉన్న కూరలన్నిటినీ కలిపి మసాళా వేసిన ఓ కూరా, ఉప్మా/పిండిపులిహార/ఉప్పుడుపిండీ ల అన్నిరూపాల్లో ఉన్న ఒక పదార్ధం,మర్చిపోయాను ఈ మధ్యలో పప్పు ( దాంట్లో మామిడికాయ వేశారన్నారు), ఉలవచారూ, అన్నం.ఇవండీ మెనూ. స్వీట్-జిలేబీ. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను–పూరీలు కూడా ఉన్నాయి.

   అవన్నీ ఓ ప్లేటులో పెట్టుకుని ఓ మూల నుంచొని తింటుండగా, ఓ ముగ్గురు అబ్బాయిలతో పరిచయం అయింది–శ్రినివాస్, శివా, ప్రదీప్–. వాళ్ళతో ఖబుర్లు చెబుతూ, తింటున్నవాటి రుచి గుర్తు చేసికోకుండా ఎలాగోలాగ పూర్తి చేశాను. నాకు ఒక విషయం అర్ధం అవలేదు-ఈ మాత్రం దానికి ‘రుచికరమైన తెలుగు విందూ’ అని అంత బిల్డప్పు ఇవ్వడం దేనికో! వాళ్ళు చెయాలంటే తెలుగు రుచితో చేసే కేటరర్లు పూణే లో కూడా ఉన్నారు.అలాగని వాళ్ళకు తెలియదా అంటే అదీ కాదు.ఎందుకంటే రెండు మూడేళ్ళక్రితం ఇలాటి ఉగాది భోజనానికి వెళ్తే అప్పుడు శుభ్రంగా, వంకాయ కూరా,పులిహారా బూర్లూ పెట్టారు.బహుశా ప్రతీసారీ అలాగే రుచికరమైన విందు దొరుకుతుందనుకోవడం అత్యాశెమో !

    ఏమైనా అంటే, బయట ఉండి క్రిటిసైజు చేయడం తేలికే, అందులోకి దిగి ఆర్గనైజ్ చేస్తే తెలుస్తుంది, దానిలో ఉన్న కష్టమేమిటో అని అనొచ్చు. కానీ ఎవరో ఒకరు చెప్తేనేకదా తెలిసేది. ఆ చివాట్లేవో నేనే తిందామని ఈ పోస్టు.

Advertisements

10 Responses

 1. సార్ ఐతే మీరు వీలు చూసుకుని , చేసుకుని ఒకసారి అమెరికా రండి. మా నగరం – అనగా కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని శాక్రమెంటోలోని కృతక కార్యక్రమాల్లో విందు భోజనం తినిపిస్తా. అది కాదనుకుంటే ఇక్కడికి దగ్గరలోని కప్పల బావి – బే ఏరియా లోని (సాంస్)కృతక కార్యక్రమాల్లో షడ్రుసోపే(ప్రే)తమైన విందు భోజనం వుండనే వుంది.

  బే ఏరియా జనానాలో ఐతే కొసరుగా మీకు “బైర్లు కమ్మే” కథా సంకలనాలు కూడా బహూకరించబడతాయి….వాటి పాలబడ్డాక, అదే అదే – విందు, భోజనం, సంకలనాల పాలబడ్డ తరువాత మీకు పునహా నగరమే ఇంద్ర లోకం…అక్కడి తెలుగు భోజనాలే ఐరావత/కామధేను/అక్షయపాత్ర ప్రసాదిత పరమాన్నం అని ఒప్పుకోకపోతే మీకేది కావాలంటే అదే ఇస్తాను…

  భవదీయుడు
  వంశీ

  Like

 2. వంశీ,

  నా బ్లాగ్గులో వ్యాఖ్య పెట్టినందుకు ధన్యవాదాలు.ఇప్పుడు అసలు సంగతికొస్తే–అక్కడ అంటె అమెరికాలో తెలుగు భోజనం అంత బాగా ఎరేంజ్ చేయలేదంటే వాళ్ళని ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ క్రింద క్షమించేయొచ్చు !!

  కానీ ఇక్కడ పూణే లో తెలుగు భోజనం అని పేరుపెట్టి, ఏదో ఓ గడ్డి పెట్టేస్తే సరిపోతుందిలే అనుకోవడం, జీర్ణించుకోలేకపోయాను! ఇవన్నీ చూస్తూంటే, ఊరికే అందరినీ విమర్శించడం కంటే,నేనే నడుం కట్టుకొని, ఈ రంగంలోకి దిగుదామా అనిపిస్తోంది! కానీ, అంత పెట్టుబడీ,పెట్టలేనే! పూణే లో

  4 లక్షలమంది తెలుగు వాళ్ళుంటున్నారుట. కానీ, ఎప్పుడైనా మనసు పడి తిందామంటే, మన రుచులూ,భోజనం దొరకదు!

  Like

 3. ఫణి గారు, మీ అంతగా మేము ఆ భొజనాన్ని వర్ణించలేము! మాకు అంత విషయ పరిజ్ఞానము లేదు.

  ఇంటికి వఛ్ఛిన మేము మీ గురించే ఎక్కువగా మాట్లాడు కున్నాము (ఆ భొజనం సంగతి మర్ఛిపోవటానికి ప్రయత్నిస్తూ…)

  మీతో పరిచయం కలగటం ఎంతో ఆనందం. అందుకు ఆ ఆంధ్ర సంఘం వారికి కృతజ్ఞతలు..!

  Like

 4. శివ, శ్రీనివాస్, ప్రదీప్,

  మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.పోన్లెండి ఆంధ్ర సంఘం వారి ధర్మమా అని నాకు కూడా ఒక మంచి పరిచయం అయింది. ఈ పరిచయం ఇంకా పెరుగుతుందని ( మీకు బోరు కొట్టకపోతే ) ఆశిస్తూ….

  Like

 5. వరంగాములో మీ స్నెహితుడి(పేరు మరచేను) ఇంటిలో నన్ను గౌరవించడనికి చేసిన విందు గుర్తుకొచ్చింది.నేను తెలుగు వాడినైనా, కారం తినలేను. ఆవేళ పులిహార గుడ్లల్లో నీరు కనిపించకుండా తిని చెమటలతొ దొరికిపోయాను. పూనేలొ ఉగాది నాడు నువ్వు వర్ణించిన భోజనము పెట్టుట తగదు అని నా అభిప్రయము. మూణ్ణెల్లు పోయేక, పూణె వచ్చినప్పుడు కందాబచ్చలి మీ ఆవిడచేత చేయించుకుని తిందాము

  Like

 6. రామం,

  మూడు నెలలదాకా ఎక్కడ ఆగుతానూ? ఈవేళ బచ్చలి కూరా, కందా తెచ్చాను. రేపు కూర చేస్తూందోచ్చ్ !

  Like

 7. మేము పూనె లో తెలుగు సభలకు వెళ్ళినప్పుడు ఈ భోజన కార్యక్రమాలు లేవు . ఏ దో తెలుగు సినిమా చూపించేవారు .

  Like

 8. మాలాకుమార్,

  మీరు చాలా అదృష్టవంతులు. బ్రతికిపోయారు!

  Like

 9. ఫణిబాబు గారు,
  అయితే నేను తృటిలో తప్పించుకున్నానన్నమాట..!, మేం చక్కగా ఉగాది పచ్చడి చేసుకున్నాం ఇంట్లో, ఓ నాలుగు రకాల పిండివంటలతో ఉగాది గడిపేసాం.. తరువాత రెండురోజులకు కొత్త సంవత్సరం బహుమతిగా మా బుడతడు ఇంటికి రావటం మీకు తెలిసిందే కదా!.

  ఆ ఉగాది పచ్చడికి కావలిసిన పదార్ధాలు ముఖ్యంగా వేపపువ్వు.. తేవటానికి నానా తిప్పలూ పడ్డాను.. కనబడ్డ ప్రతివాడికి హిందీలో.. చెప్పలేక చచ్చాను, అదేదో వింత వస్తువులాగా మొహం వెగటుగా పెట్టడం మొదలుపెట్టారు జనాలు.. (అసలే మన హిందిలో చేదుపాళ్ళు ఎక్కువ అందుకేనేమో మరి…).. ఎలాగైతే మా బావమరిది వాళ్ళ ఆఫీసులో తెలుగువాళ్ళు ఎక్కువంట.. అక్కడ ఉగాది పచ్చడి చేస్తారంట.. ఎవరినో చెట్టెక్కించి కోయిస్తే, మాక్కొంచెం పట్టుకొచ్చాడు.. 🙂

  Like

 10. శ్రీనివాసూ,

  ఈ ఏడాది బాబు వంకతో తప్పించుకున్నావు. చూద్దాం వచ్చే ఏడాది ఎలా తప్పించుకుంటావో !!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: