బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–డబ్బుల దగ్గర మొహమ్మాటాలు


    చాలా మందికి డబ్బులదగ్గరకు వచ్చేసరికి,అవతలివాళ్ళమీద ఖర్చు చేసిన డబ్బు,అడగడానికి మొహమ్మాట పడిపోతూంటారు! ఆందరితో కలిసి ఏ సినిమాకో, హొటల్ కో వెళ్ళినప్పుడు ఇలాటి మొహమ్మాటాలు ఎదురౌతూంటాయి.ఎందుకంటే ఈ రెండింటికీ ఖర్చు కొంచెం ఎక్కువే.ముందర, ఏదో అతి ఉత్సాహానికి వెళ్ళి, టిక్కేట్లు అందరికీ కలిపి తీసేసికోవడం, ఆ తరువాత చూసుకుంటే తడిపి మోపెడయ్యేటంత ఖర్చు.అడిగితే ఏం అనుకుంటారో అని సిగ్గూ, మొహమ్మాటం! పోనీ మనతో వచ్చినవాళ్ళైనా, అడిగి,టిక్కెట్టుకి ఎంతయిందో తిరిగి ఇచ్చేస్తే బాగానే ఉంటుంది.అబ్బే వాళ్ళనుకుంటారూ, మనం అడిగితే ఇచ్చేద్దామనుకుంటారు,కానీ మనం అడగం!ఏదో నెలలోనూ ఏ మూడో, నాలుగో సినిమాలకి వెళ్ళి అందరూ తలోసారీ తీసికున్నా బాగానే ఉంటుంది.కానీ ఆ గుంపులో, అవతలివాళ్ళమీదే బ్రతికేసే ‘ప్రాణులు’ ఉంటారు!

ఇంకొంతమంది-వాళ్ళ పనిమీద ఎక్కెడెక్కడికో వెళ్ళవలసివస్తుంది.బస్సుల్లో వెళ్ళడానికి నామోషీ, ఓ ఆటో పిలుస్తారు.సరే బాగానే ఉందికదా,వెళ్ళేది అవతలి వాడి పనిమీదే కదా అని, ఎక్కుతాము.వాడు ఆటో దిగినప్పుడల్లా, ఓ అయిదువందల రూపాయల నోటో, వెయ్యిరూపాయల నోటో తీస్తాడు.అంత పెద్ద నోటుకి, ఆటో వాడిదగ్గర చిల్లరెక్కడుంటుందీ,ఇంకో దిక్కులేక, పోన్లే అని మనం ఇచ్చేస్తాము.మనవాడు రోజంతా ఆటోలో తిరిగి, మనచేతే ఇప్పించేస్తాడు. ఇలాటివారికి మందేమిటంటే,మనం జేబులో, వెయ్యి రూపాయలకి చిల్లర పెట్టుకుని, వీడు మొదటిసారి చిల్లర లేదనగానే, ఠక్కున తీసి ఇచ్చేస్తే, వాడికి తెలుస్తుంది , ‘ అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్నా’ అని! ఇక్కడ మనం ఏం మొహమ్మాట పడఖ్ఖర్లేదు!

పెళ్ళిళ్ళల్లో ఖర్చులన్నీ చూసుకోవడానికి, ఓ దగ్గర చుట్టానికి, ఈ బాధ్యతంతా అప్పచెప్పుతాడు. ఆయనేమో, ఓ బ్యాగ్గు పట్టుకుని అటూ ఇటూ తిరుగుతూంటాడు.ఎక్కడ డబ్బు అవసరం ఉన్నా ఆయన గురించే చూస్తారు.మరి అలాటప్పుడు, ఆ పెద్దమనిషి, కూతవేటు దూరంలో ఉండాలికదా. మన అదృష్టం బాగోకపోతే,అవసరానికి ఈయన కనిపించడు.కన్యాదాత పీటలమీదనుంచి లేవకూడదు, ఏం చేస్తాడు?
దగ్గరలో ఉన్న మీలాటివాడినో, నాలాటివాడినో అడుగుతాడు.ఇంక అలాటివాటిమీద ఆశ వదులుకోవాల్సిందే!మనం చేయవలసిన పని ఏమిటా అంటే,ఆ ఆర్ధిక సలహాదారుడి మూవ్మెంట్స్ కనిబెడుతూ,కన్యాదాత గారు అడగ్గానే ఈయనని పిలవడం !

ఇలాటిదే, ఎవరైనా పోయినప్పుడు, ఆసమయంలో అయే ఖర్చులు.తమ దగ్గరవాళ్ళు పోయినప్పుడు,పాపం ఆఇంటిపెద్ద ఎన్నని చూసుకుంటాడూ,
పోయినవారిని సాగనంపడానికి సవాలక్ష ఖర్చులుంటాయి. ఎవరో ఒకరు ముందుకు వచ్చి, కావలిసిన ఎరేంజ్ మెంట్స్ చేయడానికి, ముందర డబ్బు ఖర్చు పెడతాడు.ఆయన సంస్కారవంతుడైతే ఫర్వాలేదు. అంతా పూర్తయిన తరువాత, ఎంత ఖర్చయ్యిందో అడిగి అణాపైసలతో ఇచ్చేస్తారు. వచ్చిన గొడవల్లా,రెండో రకం వారితో. మనం అడిగితేనే కానీ, పైస రాల్చడు.ఆర్ధికంగా బాగుండని వారైతే వేరే విషయం.పైగా అలాటి సమయాల్లో, అడగడానికి కూడా మొహమ్మాటం. పదిరోజులూ ఈయన ఆ ఇంటికి వెళ్తూనే ఉంటాడు. అయినా సరే ఒక్కరోజు కూడా, మొదటి రోజున అంత్యక్రియల సమయంలో ఎంత ఖర్చు అయిందో, చచ్చినా అడగడు. అలాగని ఈయనా ఇంతయిందీ అని అడగా లేడు.ఆ పోయినాయనకేదో, మనం ఋణం ఉన్నామనుకుని దండం పెట్టడమే !( మా అమ్మగారు పూణే లో దివంగతులైనప్పుడు, మాస్నేహితుడొకరు,ముందుగా అన్ని ఖర్చులూ చేశారు.అదేరోజు రాత్రి, మా అబ్బాయిని, వాళ్ళింటికి పంపించి, అణాపైసలతో ఎంతయిందో అంతా ఆయనకిచ్చేశాను. చెప్పడానికి ముందర ఆయన మొహమ్మాట పడ్డారు. అయినా నాబలవంతంమీద, చెప్పించి, ప్రతీ స్టేజ్ లోనూ ఎంతంతయిందో అడిగి ఇచ్చేశాము.) ఇలాటివి చాలా సున్నితమైన పరిస్థితులు. అవతలి వాళ్ళు అడుగుతారులే అని ఊరుకోకుండా, మనమే బాధ్యతతో ఉండాలి.

ఇంకో సీన్ ఏమిటంటే, మన ఇంటి ఆడవారు ఏవేవో బిసీ పార్టీలనీ, చిట్ ఫండనీ , కిట్టీ పార్టీ అనీ నెలనెలా ఏదో కొంత డబ్బు వేసికుని,ఒక్కొక్క నెలా ఒక్కక్కరికి వచ్చేలా ఏదో వాళ్ళకి చేతనైనంత సేవింగ్ చేస్తూంటారు.ఏదో ఒకనెల ఒకావిడ రాలేదనుకోండి, మొహమ్మాటానికి ఇంకొకావిడ, తన డబ్బుతోపాటు, ఆవిడ డబ్బుకూడా ఇచ్చేస్తుంది.అంతదాకా బాగానే ఉంది, ఇంకో నెల వచ్చేదాకా, వీలున్నంతవరకూ, ఎవరో ఒకరి దగ్గర, ఈ టాపిక్కు తెస్తూండాలి. లేకపోతే,ఆ రెండో ఆవిడ మర్చిపోవచ్చు. ఆ గ్రూప్ లో ఒకళ్ళైనా ఉంటారు, ఈ సంగతి గుర్తుచేయడానికి!

2 Responses

  1. మా పెద్దమ్మాయి పెళ్ళిలో నేను ఎదుర్కొన్న యిబ్బంది యిలాటిదే. చక్కగావివరించారు.ఆ తరవాత కాలాలలోజరిగిన మిగతా పెళ్ళిళ్ళలో మాత్రం నా చేతికే ఒక బాగ్ కుట్టుకున్నాననుకోండి. ప్యారలల్ మనీ మానేజ్మెంటన్నమాట, నిండా చిల్లరతో సహా. పెళ్ళి పీటలమీదినుంచి లేవకుండా….. మీ రచనల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది?. …నూతక్కి

    Like

  2. రాఘవేంద్రరావుగారూ,

    బ్లాగ్గు నచ్చినందుకు ధన్యవాదాలు.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: